లోతైన భావాలు – ఆధునిక వ్యక్తీకరణల ‘జెన్నీ’!
వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
*******
మనిషి సంఘజీవి. సమాజంలో జరుగుతున్న పరిణామాలు మంచిగానో, చెడుగానో మనుషులను ప్రభావితం చేస్తాయి, ఆలోచింపజేస్తాయి. కాలం మారుతున్న కొద్దీ సమాజంలోనూ మార్పులు వస్తున్నాయి. సమాజమంటే వ్యక్తుల కలయిక. సమాజంలో మార్పు అంటే, మనుషులలో మార్పులే! స్నేహాలు, బంధాలు, ఆశలు, ఆశయాలు, నిస్పృహలు, వెతలు, సంతోషాలు.. ఇలా మనిషిలో ఉద్వేగాలు పెల్లుబికినప్పుడు తొలుతగా పంచుకునేది తన తోనే! అంటే తన అంతరంగం తోనే! ప్రతీ మనిషికీ అతని/ఆమె అంతరంగం ఒక మంచి నేస్తం! అవసరమైనప్పుడు ప్రోత్సహిస్తూ, తప్పుటడుగులు వేస్తుంటే హెచ్చరిస్తూ, ముందుకు నడుపుతుంది.
అంతరంగంతో పంచుకున్న భావాలను సమహృదయులతో పంచుకునేందుకు వాటికి అక్షర రూపమిస్తారు రచనాభినివేశం ఉన్నవారు. ఆ విధంగా కవిత్వమో, కథో, లేదా ‘expression of thought in any form’ వెలుగు చూస్తాయి.
అలా తనలో కల్గిన గాఢమైన భావాలను అంతరంగంతో మథించి, ఆధునికంగా వ్యక్తీకరిస్తూ – కవితా రూపం కల్పించారు అపర్ణ తోట. తన అంతరంగానికి ‘జెన్నీ’ అని పేరు పెట్టి – ఆ పేరుతోనే పుస్తకాన్ని వెలువరించారు.
ఈ జెన్నీ ఎవరనేది తన ముందుమాటలో స్పష్టంగా చెప్పారు అపర్ణ. “జెన్నీ నా ఆల్టర్ ఇగో. ‘నేను’ తెలిసినప్పటి నుండే నాతో ఉంది. నేనే గుర్తించడం ఆలస్యం చేశాను. అనుభవాల చిక్కదనం పెరుగుతున్నప్పుడో, లేక ఆమె గొంతుక మరికాస్త గట్టిపడినప్పుడో, లేక అనుభూతించడం నేర్చుకుంటున్నప్పుడో నెమ్మదిగా గుర్తించి అక్షరాల సాయంతో ఆమెను నాతో అట్టేపెట్టుకున్నాను.” అన్నారు.
“జెన్నీకి మనుషులు కావాలి. మాటలకి, ఆటలకి, పాటలకి అన్నిటికీ తోడు కావాలి. కానీ ఆమెకు రాజీపటడం రాదు. మొహమాటమూ, మెరమెచ్చుతనము ఇంకా నేర్చుకోలేదు. బల్లలు గుద్దటము, కుండలు పగలగొట్టటము అంటే భలే సరదా పడుతుంది. పట్టుకుని వేలాడడంలోనూ, పోతో పొమ్మనటంలోనూ సమానంగా సాధనగల మనిషి. ఆమె ప్రేమించే పద్ధతి మనం ఇదివరకు చూసింది కాదు, ఆమె పోట్లాడే తరీకా మనకి అంత పరిచయం ఉన్నది కాదు.” అన్నారు బండ్లమూడి స్వాతికుమారి జెన్నీ గురించి తన ముందుమాటలో.
మరి జెన్నీతో అపర్ణ ఏం మాట్లాడారో చూద్దాం.
~
తన మనసులో జరుగుతున్న మథనాన్ని అక్షరాల్లోకి బదలాయించటం ఎంత కష్టమో, ‘నిజమే, రాయాలిక’లో ఇలా చెప్తారు – ‘ఈ అక్షరాల అల్లికెంత తేలికో, వాటి వెనుక ఆలోచనలు అంత బరువు’. కళ్ళే కలవని మనిషి గురించి, ఎదురుగా లేని సమయాల్లో, రాయడం మరింత కష్టమని అంటారు. ఆ వ్యక్తి సబ్ధుగా ఉండిపోతుంటే, తాను ప్రశ్నల పరంపరగా ఉంటే – ఏం రాయగలరు? వ్యక్తుల మధ్య రిలేషన్ ఏకపక్షం కాదని చెప్తారీ కవితలో.
అభిప్రాయాలు కలవని వ్యక్తుల మధ్య పేరుకి స్నేహం ఉన్నా, నిజానికి వారు పరిచయస్థులే తప్ప మిత్రులు కాలేరు. దగ్గరగా ఉంటున్నా, సాన్నిహిత్యం లేని వ్యక్తుల మధ్య కనబడని ఎంతో దూరం ఉంటుంది. ఒకరు ఎడారయితే, మరొకరు సముద్రం అవుతారు. కాలక్రమంలో అటువంటి వారి మధ్య ఉన్న స్నేహమో/పరిచయమో పలచనై మసకబారిన జ్ఞాపకంగా మారిపోతారని అంటారు ‘After all you are a faded memory’ కవితలో.
కొన్ని పరిచయాలు, స్నేహాలు, కలయికలు తాత్కాలికమే అవుతాయి. కొన్నిసార్లు అయిష్టంగానైనా కొనసాగించాల్సి వస్తుంది. అప్పుడది నికార్సైన నటన అవుతుంది. వాళ్ళతో జరిపిన సంభాషణలు, జరిగిన సంఘటనలు, ఎదురైన అనుభవాలు అన్నీ స్వల్పకాలికమైన అనుభూతులుగా మిలిగిపోతాయి. ‘ఒక్కోసారి కారణమే మరిచిపోయేంతగా కోపం మిగిలిపోతుంది’ అంటారు‘Temporary Files’ అనే కవితలో.
పరిచయాలు స్నేహాలయ్యే క్రమంలో.. కొన్నిసార్లు.. తెలియనితనంలోకి జారిపోతాయి. ‘కరచాలనాల కత్తిరింపులతో, వెక్కిరింతల పట్టుపోగులు అల్లినప్పుడే’ ఆ ఇద్దరి మధ్య ఉన్న పరిచయమో/స్నేహమో చెదిరిపోతుంది. ‘Control+Alt+Delete’ కవిత ఇదే చెబుతుంది. కంప్యూటర్ పరిభాషలో ‘కంట్రోల్+ఆల్ట్+డిలీట్’ అంటే ఒక ఫైల్‍ని సిస్టమ్ నుంచి శాశ్వతంగా తొలగించడం. మనుషుల మధ్య ‘కంట్రోల్+ఆల్ట్+డిలీట్’ అంటే ఆ వ్యక్తిని పూర్తిగా దూరం పెడుతున్నట్టే! ఈ కవితలోని చివరి వాక్యాలు.. ‘తప్పు కదూ/వేరు జాతి అయినందుకు/గాయపరుచుకు తీరాలా?’ అనేవి సమాజంలోని పెడధోరణులను ప్రశ్నిస్తాయి.
నిజమైనవి కాని అభిమానాలూ, ప్రేమలు – వినోదాల వంటివనీ, నిర్ధారిత సమయం పూర్తయ్యాకా, ముగియక తప్పదని అంటారు ‘Wonder Rides’ కవితలో. ఈ కవితలో చాలా తేలిక పదాలతో, లోతైన భావాలని వెలిబుచ్చారు అపర్ణ. పెద్ద పెద్ద ఎమ్యూజ్‍మెంట్ పార్కుల్లో రకరకాల రైడ్స్ ఉంటాయి. ఉవ్వెత్తున పైకి తీసుకెళ్తాయి, అంతే వేగంగా క్రిందకీ దింపుతాయి. పైకెళ్ళినప్పుడు తేలిపోతాం, మనసూ, శరీరం తేలికైనట్టు తోస్తుంది. కానీ కిందకు దిగగానే లేదా ఇంటికొచ్చాకా బాధ్యతల బరువులు తలకెత్తుకోక తప్పదు, వినోద ప్రక్రియ తాత్కాలికమే అనిపిస్తుంది. ‘మూసిన కొట్టు ముందు పిప్పర్మెంట్లు ఎవరిస్తారు’ అనడంలో, దొరకని చోట ఆత్మీయతని ఆశించడం వృథా అని చెప్తున్నట్లనిపిస్తుంది,
నగరం ఎలా ఉంటుందో, ఎందరో కవులు పలు రకాలుగా వర్ణించారు. పేపర్ కప్‍ని ప్రతీకగా తీసుకుని, నగర దర్శనం చేయించారు అపర్ణ ‘పేపరు కప్పుల కబుర్లు’ కవితలో. చీకటి చిక్కబడడం, జనం పలచబడడం, ఒంటరి టీ స్టాల్ కూలీలా మారడం, డిస్పోజబుల్ కప్పుల ఊసులాట, కప్పులలో నలిగిన మాటలు – నగర దృశ్యాన్ని కళ్ళకు కట్టారీ కవితలో. బహుశా మీరు, నేనూ కూడా ఈ దృశ్యంలో దాగి ఉన్నామేమో!
సముద్రంలో వెడుతున్నప్పుడు చుట్టూ నీళ్ళు కాని దాహం తీరదు! అలాగే మన చుట్టూ జనాలున్నా, హృదయం లోకి రాలేరు. వేల సాగరాలను దాటి అద్భుత ద్వీపానికి చేరుకోవాలనే ఆశకి పాట ఆలంబన అవుతుంది. పాట మధురంగా సాగుతున్నప్పుడు మన ‘ఉనికి’ – ‘నీదైన పాట’ కవితలోని నావలా కరిగిపోతుంది.
ఆధునిక జీవనమంతా కృత్రిమమేననీ, పరిస్థితికి తగ్గట్టుగా వేషాలు వేయాల్సిందేనని చెబుతుంది ‘ట్రాఫిక్ రొదలు – కాపీ కప్పులు’ కవిత. ఈ కవితలో నిజమైన నేస్తం కోసం చేసే సైకిల్ ప్రయాణం – మనని మనం చేరుకోడానికి చేయే ప్రయత్నమని గుర్తించాలి. మనతో మనం గడిపే స్వల్ప సమయమే నేటి ఒత్తిళ్ళ కాలంలో మనకి ఊరట అని ఈ కవిత సూచిస్తుంది. ఇష్టమైన మిత్రులతో, ఉదయం పూట పరిమళ భరితమైన కాఫీ తాగడం ఎంత విలువైనదో కదా!
‘నిద్ర వర్సెస్ రాత్రి’ కవిత విశేషమైనది. నిదురలో మసలే రాత్రులు, నిదురపోయే రాత్రులు, నిదుర రాని రాత్రుల మధ్య ఉన్న వైవిధ్యాన్ని చక్కని పదాలతో వెల్లడించారు. కాలం చేసిన గాయాలకి కలత రాత్రులే చల్లని లేపనాలవుతాయంటారు అపర్ణ. శరీరం నిద్ర లోకి దూరిన నత్త అయితే, ఆత్మ – విప్పారిన రాత్రుళ్ళలో వికసించిన కలువ అని అంటారు. వాహ్! What an expression అనిపిస్తుంది పాఠకుడికి.
ఇష్టమైన వ్యక్తులతో గడిపేటప్పుడు భేషజాలు లేకుండా, మనం మనలా ఉండడం ఎందుకు ముఖ్యమో ‘నీతో… నేను నాలానే ఉంటాను’ కవిత చెబుతుంది. దగ్గరైన మనిషి వద్ద కాపట్యం లేకుండా మసలుకోవడం ఎలా ఉంటుందో ఈ కవిత చెబుతుంది. ‘నా గుండె వేగపడుతున్నప్పుడు/ఏంటి సంగతని నువు కళ్ళెగరేస్తే/సిగ్గులేకుండా సిగ్గుపడతాను’ అనడంలోనూ, ‘ఆ చందమామని చూసి/చెప్పీచెప్పలేక నువ్వు సతమతమైనా/అర్థమయినప్పుడు అర్థమయిందనే చెబుతాను’ అనడంలోనూ దాగిని ప్రేమ భావం మనసును తాకుతుంది.
ఆనందాలను అన్వేషిస్తూ అంతరిక్షంలోకి ఎగరాలనుకుంటున్నా, సమస్యలు/ఒత్తిళ్ళు నేల వదలని కాళ్ళవుతున్నాయంటారు ‘ఈ రాత్రి!’ కవితలో. ఇష్టమైన వ్యక్తి పక్కనున్నా – ఒక్కోసారి మాటల కన్నా, కళ్ళు కలపడాల కన్నా – రాత్రిలో ఉండడమే బావుంటుందంటారు. రాత్రిని ఆస్వాదించడం తెలిసినవారికి ఈ అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. తమదీ అదే అనుభూతి అని తలచుకుంటారు.
‘ముద్దుపాట’ కవితలో చిన్న ప్రయాణం ఉంది, ఒకరికొకరు చేరువయ్యేందుకు చేసిన ప్రయాణమది. పాటలు ఇష్టమైన వాళ్ళకి ప్రణయం ఓ నాదం అవుతుందని చెప్తుందీ కవిత.
క్రుంగుబాటు ఎలా ఉంటుందో ‘Into Depression’ కవిత చెబితే, ఆ క్రుంగుబాటు నుంచి బయటపడే క్రమం ఎలా ఉంటుందో ‘Outing with Depression’ అనే కవిత చెబుతుంది. మొదటి కవితలో ‘స్నేహితులంతా తప్పిపోయారు/ప్రేమికులు చెల్లా చెదురైయ్యారు/ఇక అపరిచితులతో మర్యాద తప్పదు’ అంటారు. రెండో కవితలో, ‘ఇక్కడో పూలతోట ఉంటుందని చెప్పారు/ఆ సుగంధం కోసం ఊపిరి నిలుపుకుంటూనే ఉన్నా’ అంటారు. ఈ రెండు కవితలూ, ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి.. క్రుంగుబాటు ఎదుర్కుంటున్నప్పుడు మనసులో కలిగే భావాలు, దాంట్లోంచి బయటపడేందుకు చేసే యత్నాలను చక్కగా చెప్పారు కవయిత్రి.
ఇష్టమైన వ్యక్తితో ఉన్నప్పుడు – మోడైన మనసు పచ్చటి చెట్టవుతుందంటారు ‘నీతో ఉన్న ఆ కాసేపు’ కవితలో. ఇష్టమైన వ్యక్తి సమక్షంలో ఉండడంలో తనివి తీరదు. ఇంకొంత సేపు, కాసేపు అని ఒత్తిడి చేసి మరికొంత సమయం గడపాలని ప్రయత్నిస్తే, అందులోని quality పలచబడుతుంది. దాన్నే పువ్వులు వాడిపోవడం లాంటి పోలికతో చెప్పారు.
నమ్మిన మనిషి మోసం చేసి తప్పుకుంటే, తనని తాను సంబాళించుకుంటూ, ఆ రిలేషన్ లోంచి బయటపడాని ప్రయత్నించడాన్ని ‘ఆప్ కీ కసమ్’ కవిత చెబుతుంది. ఉద్వేగపు తీవ్రతని వ్యక్తం చేయడానికి హిందీ, ఇంగ్లీషు భాషలలోని పదాలను ఊతంగా చేసుకున్నారు కవయిత్రి. తాను నెగ్గుకురాగలనన్న విశ్వాసం అడుగడుగునా గోచరిస్తుందీ కవితలో.
‘దేహం దేవత దెయ్యం’ కవితలోని ఆవేశం వెనుక ఏళ్ళకేళ్ళుగా స్త్రీలు అనుభవిస్తున వ్యథ పట్ల ఆక్రోశం, ఆవేదన ఉన్నాయి. ‘ఇట్లు’ కవిత deepest anguish కి expression లా అనిపిస్తుంది. కవితలోని భావ తీవ్రతకి నప్పేలా పేజ్ మేకప్ చేశారు!
బాలిక యువతిగా, యువతి ప్రౌఢగా, ప్రౌఢ ముదుసలిగా మారే క్రమంలో స్త్రీలకి పదే పదే వారి వయసును గుర్తు చేయడం, హెచ్చరించడం వాళ్ళకి ఎంత చిరాగ్గా ఉంటుందో ‘వయసొస్తోందని’ కవిత వెల్లడిస్తుంది.
జీవితంలో మంచి స్నేహితులు ఉంటే ఎంత ప్రయోజనం ఉంటుందో ‘ఇంద్రధనస్సులు’ కవితలో చెప్తారు అపర్ణ. ఈ కవితనిtribute to friendship గా పరిగణించడం అతిశయోక్తి కాదంటాను.
ఎప్పుడో చనిపోతే, నివాళి వ్యాసాలు రాసేవారికి, జీవచ్ఛవం లాంటి బ్రతుకులోని వేదన పట్టడం లేదంటుంది ‘ఇప్పటి నీ చావు’ కవిత. బేల అంటే స్త్రీలింగం మాత్రమే కాదని ఢంకా బజాయించి చెప్తుంది ‘మకుటధారులు’ కవిత.
మూసిన తలుపుల వెనుక ఏముందో తెలుసుకోవాలనుకోవడం ఎందుకు? అసలు మూసిన తలుపులని తెరవలానుకోవడం అవసరమా? ప్రతీకాత్మకమైన ‘తలుపులు’ కవిత చదివితే ఎన్నో భావాలు ముసురుకుంటాయి.
~
లోతైన భావాల ఆధునిక వ్యక్తీకరణ అని అన్నాను కదా, నిజమే ఈ పుస్తకంలోని కవితలు – poems are of deepest feelings of love, pain, happiness and sorrows; are of modern expression; but not complicated అని కూడా చెప్తాను. ఇలాంటి అనుభవాలో, అనుభూతులో చాలామందికి ఉంటాయి. అందుకే వైయక్తికమైన ఇలాంటి భావాలు సమహృదయులని చేరినప్పుడు సార్వజనీనమవుతాయి. ‘జెన్నీ’ సాధించిన ప్రయోజనం ఇదే!
ఈ పుస్తకం గురించి చెప్తున్నప్పుడు పేజ్ లేవుట్, డిజైన్ చేసిన బంగారు బ్రహ్మం గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతీ కవితకీ, తగ్గ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ లేదా ఇమేజెస్ ఉపయోగించడం ద్వారా, కవితా శీర్షికలకి చేసిన స్టైలింగ్ వల్ల పుస్తకానికి గొప్ప అందం వచ్చింది. కవర్ పేజీ ముందు అట్ట మీద ‘అపర్ణ గోడకి కాళ్ళాన్చి పుస్తకం చదవుకుంటున్న’ బొమ్మ – ఇష్టమైన పుస్తకం చదవడం, మనసుకి నచ్చే సంగీతం వినడంలోని ఆనందాన్ని కాప్చర్ చేసింది. అలాగే, వెనుక అట్ట మీద నవ్వుతూ, కెమెరాతో ఫోటో తీస్తున్న అపర్ణ బొమ్మ – మళ్ళీ చిన్నపిల్లై, బాల్యంలోని ఆనందాన్ని చేజిక్కించుకున్నట్టుగా ఉంది. So, no need to judge the book by its cover 😊, హాయిగా చదువుకునే పుస్తకం ఇది!
***
జెన్నీ (కవిత్వం)
రచన: అపర్ణ తోట
ప్రచురణ: బోధి ఫౌండేషన్, హైదరాబాద్
పేజీలు: 90
వెల: ₹ 100
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్ 90004 13413
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
Leave a Reply