ఆదూరి సత్యవతీ దేవి కవిత్వం, 1968 – 2008

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
************
వెన్నెల మొగ్గలు
ఎన్నెన్నో రూపాల్ని సంతరించుకునే సాహిత్యంలో కవిత్వానికున్న ప్రాధాన్యత మాటల్లో చెప్పలేనిది. కాస్త పరికించి చూస్తే రోజువారీ జీవితంలో దాదాపు ప్రతివారి నోటా కవిత్వాన్ని వింటూనే ఉంటాం. అది కవిత్వం అని వేరే చెప్పరు. కానీ ఆ మాటల్లో ఒక లయ, ఒక అనుభూతి, ఒక సౌందర్యం మనసును తట్టక మానదు. దైనందిన జీవితపు పరుగులో దానిని పట్టించుకోం. అయితే అది కవిత్వం కాదనలేం.
ఉదాహరణకి ఒక నాలుగేళ్ళ బాబు ఒక వెన్నెల రాత్రి తల్లి ఒడిలో కూర్చుని చుట్టూ పరుచుకున్న వెన్నెలలో తడుస్తూ,
“అమ్మా, ఆకాశం నుంచి పాలు ఒలికిపోతున్నాయి.” అన్నప్పుడు వాడి బుల్లి మనసును ఆ వెన్నెల తాలూకు వెలుగు, పరిమళం ఎంత ఉత్తేజపరిచాయో అర్థమవుతుంది. ఇది కవిత్వం కాదనలేం.
భౌతికావసరాల్ని దాటి మానసికావసరాల్ని కూడా సంతృప్తి పరచినప్పుడే మనిషి సంపూర్ణ మానవుడవుతాడు. తనలోని అసంతృప్తులకి, అశాంతులకి సాంత్వననిచ్చే దారి కోసం వెతుక్కుంటాడు. సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం వంటి ఎన్నో కళారూపాలు మనిషి మనసును సేద తీరుస్తాయి. మనసులోని మార్దవాన్ని తట్టిలేపి, మానవత్వాన్ని పరిమళింపచేసి మనిషిని ఉన్నత స్థానం వైపుగా నడిపిస్తాయి. మనుషులందర్నీ దగ్గర చేసి, ప్రపంచాన్ని మరింత అందమైన ప్రదేశంగా మార్చేందుకు దోహదపడేవి ఇవే.
వెన్నెల మొగ్గలు ఆదూరి సత్యవతీ దేవి గారి సమగ్ర కవితాసంపుటి. 1948 లో జన్మించిన సత్యవతీ దేవి 1968 – 2008 మధ్య సృజించిన భావచిత్రాలే ఇవి. పుస్తకంలో వీరి మొదటి కవిత పరతత్త్వం నుంచి చివరి కవిత వరకు ఉన్నాయి.
ఈ పుస్తకంలో 182 ముద్రిత, అముద్రిత కవితలున్నాయి. వీరు గీతం, కవిత, కథ, వ్యాసం, రేడియో నాటిక, సంగీత రూపకం, పుస్తక సమీక్ష వంటి అనేక సాహిత్య ప్రక్రియలలో రచనలు చేసారు. తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి ప్రతిభా పురస్కారం, కృష్ణశాస్త్రి పురస్కారం, యునెస్కో లిటరరీ అవార్డు, రామవృక్ష బేణీపూరీ జన్మశతాబ్ది సమ్మాన్ వంటి అనేక పురస్కారాలను పొందారు.
వెన్నెల్లో వేణుగానం, రెక్కముడవని రాగం, జలపాత గీతం, వేయిరంగుల వెలుగురాగం కవితా సంపుటాలను 1998 – 2006 మధ్య ప్రచురించారు.
ఆత్మరాగం పేరుతో కవిత్వ పరిశీలన, అంతర గాంధారం పేరుతో ఆధ్యాత్మిక భక్తిగీతాలు, వెన్నెల పారిజాతాలు పేరుతో సాహితీసౌరభం, రెక్కముడవని రాగం కవితాసంపుటి హిందీ అనువాదం పంఖ్ న మోడ్ నే వాలా రాగ్, ఒక వేణువు పలికింది పేరుతో లలిత గీతాలు ప్రచురించబడ్డాయి.
వీరి కవిత వేయి రెక్కల పావురం ఆంగ్లానువాదం Myriad Winged Bird 2008 సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని విశ్వవిద్యాలయాల డిగ్రీ తరగతులకు పాఠ్యాంశంగా నిర్ణయించబడింది. వీరి కవితలపై 2010 సం. లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఎం. ఫిల్. పట్టా కోసం పరిశోధన జరిగింది.
సత్యవతీదేవి జీవనసహచరులు, రచయిత ఆదూరి వెంకట సీతారామమూర్తి ఆమె కవితా ప్రస్థానం గురించి విపులంగా ముందుమాటలో చెప్పారిలా,
“పాట నా పుట్టుక – కథ నా ఎదుగుదల – కవిత్వం నా చలనం” అని చెప్పే సత్యవతీదేవి కవిత్వ రచనకు ప్రకృతే ప్రేరణ. వెండి మబ్బులూ, సెలయేళ్ళూ, జలపాతాలు, పక్షులు, చెట్లు, పువ్వులు, నవ్వులు కవితా వస్తువులయ్యాయి. వాటితో పాటు క్రమంగా దైవభక్తి, దేశభక్తి, స్నేహం, వాత్సల్యం, మానవత, తాత్త్వికత వంటి లక్షణాలూ వారి కవితల్లో చోటు చేసుకున్నాయి. తన నిష్క్రమణ ముందుగానే తెలుసునన్నట్టు అంతవరకూ శలవామరి అన్న శీర్షికతో ఆఖరి కవితను రాసుకున్నారామె.
ముందుగా,
పుస్తకం ఆఖరి పేజీల్లో సత్యవతీదేవి కవితా సంపుటాలకు ప్రముఖులు రాసిన ముందుమాటలు, ఆమె కవిత్వం గురించి మరెంతోమంది ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే చూద్దాం…
డా. తుర్లపాటి రాజేశ్వరి
సత్యవతీ దేవి భావకవితా మార్గంలో పయనించిన కవయిత్రి. ప్రకృతి ప్రీతి – అత్యంత నిరాడంబరంగా జీవనం సాగించే సాధారణ శ్రమ జీవులపై ప్రేమగా పరిణామం చెందటం కాల్పనిక కవుల్లో కనిపించే లక్షణం. ఉదాహరణకి,
ముగ్గుబుట్ట కవిత-
“సగం విరిగిన కొండపై వెన్ను వంగిన ముసలమ్మ …
ముగ్గురాళ్ల కొండముందు పిడికెడు ఆకలై శ్రమిస్తుంది.”
ముగ్గుఅమ్మి దీనస్థితితో పాటు,
“మహానగరాల్లో సైతం వీధివాకిళ్ళు…
అభ్యంగన స్నానాలు చేసి తెల్లవారే సరికల్లా పాలకెరటాలు పరిచినట్లు,
అందులో రంగుల హంసలు విహరిస్తున్నట్లు…” అంటూ ఇంటిముంగిళ్ళల్లో సంప్రదాయం, సంస్కృతులను సూచించే ముగ్గుల సౌందర్యం కనిపిస్తుంది.
ఉప్పు అమ్ముకునే అబ్బాయి శ్రమైక సౌందర్యం గురించి నిరాడంబరంగా కళ్ళకు కట్టినట్లుంటాయి కర్మవీరుడు కవితా పంక్తులు.
డా. పాపినేని శివశంకర్ – అనుభూతుల అన్వేషణ
ఆమె కవితా పంక్తి చెప్పినట్టుగానే
“కళ్ళలో కవిత్వం నలుసుపడి ప్రాణం తియ్యగా జిలార్చుతున్న” కవయిత్రి ఆమె!
ఆమె అనుభూతుల అన్వేషణలో సాఫల్యంతో పాటు వైఫల్య వేదనా ఉంది. కానీ వేదనలోనే కూరుకుపోకుండా భగ్నమయ్యే కలని బ్రతికించుకుందుకు
“జీవితం కళపెళల్లోంచి మరిగొచ్చిన సారబీజం” అంటూ రెక్క ముడవని రాగాన్నాలపించారు.
అనుభూతుల సామాజికత్వాన్ని సత్యవతీదేవి గుర్తిస్తే, వ్యవస్థ చలన సంచలనాల కారణ మూలాల్లోకి చూపు సారిస్తే తన అవగాహనకి మరింత లోతూ, వ్యక్తీకరణకి పదునూ కలుగుతాయి.
ఆమె కవితా వస్తువులో ప్రత్యేక లక్షణం కంటే సాధారణ లక్షణం ఎక్కువ. స్త్రీ అనుభవాల్ని పెద్దగా కవిత్వీకరించ లేకపోయిన కారణం బహుశా సంప్రదాయసంకోచాల పరిమితి ఒక కారణం! మధ్యతరగతి భద్ర వలయాలు దాటి ప్రపంచానికి నిస్సంకోచంగా expose అవుతూ ఆమె కవిత్వం వర్తమాన జీవిత సంక్లిష్టతలోకి ప్రయాణించాలి!
త్రిపుర – సారాంశపు రహస్యం
సత్యవతీదేవి కవితలు చదువుతున్నప్పుడు ఒక జలపాతం కింద స్నానం చేస్తున్నట్టూ, కొత్త కాంతిలో ఓలలాడిన పరిశుభ్రతేదో మనసుకి పట్టి హాయిగా ఉన్నట్టు, ఎప్పుడో చదివి మరిచి పోయిన ఒక early Words worth పదేపదే జ్ఞాపకం వస్తున్న అనుభూతి కలుగుతుందంటారు.
మునిపల్లె రాజు – ఒక చిద్రూప లక్ష్మి కవితలు
తమిళ భాషలో ‘’ఊమనార్ కండకన్” (మూగవాడు కన్నకల) అనే ఒక వినమ్రమైన పదబంధం ఉంది, ‘’మా పెద్దమ్మాయిలాటి సత్యవతీదేవి కవితా సంపుటి చదివినప్పుడల్లా నేను పడే కృత్యాదవస్థ – మూగవాడు కన్నకలే.’’
హిమాలయ ఊర్ధ్వ శిఖరాల మధ్య …వేలాది సంవత్సరాల వయసుగల దారువృక్షాలు దాచివేసిన ఒక కుండలో ఎవరి పూజకో వికసిస్తున్న బ్రహ్మకమలం – ఆమె కవితా చరణం!
“కన్నీరు తుడిచేది కవిత్వం” అన్నాడు ఖలీల్ జిబ్రాన్. “పోయెట్రీ ఈజ్ ప్రేయర్” అంటారు వడలి మందేశ్వరరావు. ఒకటి మాతృధర్మం అయితే రెండవది శాంతి స్థాపనకు కెటాలిక్ ఏజెంట్.
ఈమె కవితాత్మ కేవలం ఊహాశిల్ప నైపుణ్యమో, సౌందర్య సునిశత్వ వ్యక్తీకరణో కాదు. ఈ మహాసృష్టి అంతరార్థాన్ని, మార్మిక పొరల్లో దాగిన అర్థతాత్పర్యాల్ని, సత్యప్రియత్వాన్ని శిల్ప సౌందర్యంతో, అద్వైత వేదాంతంతో మధురంగా గానం చేయటమే!
ఈ పుస్తకంలో నేను చూసిందంతా వెన్నెలే. నేను చదివిందంతా ఉషఃకిరణాల చైతన్యమే!
సౌభాగ్య – అమృతం తొణికే అక్షరాలు
సత్యవతీదేవి అక్షరాలు సౌందర్య దర్పణాలు. దానిలో సమగ్రత, అర్థవంతమైన జీవితమిచ్చే ఆత్మవిశ్వాసం, ప్రకృతి విన్యాసం, విలాసం ఉన్నాయి. ఒక నిశ్శబ్ద నిర్మల సంగీతం, ఒక ప్రశాంత పరిమళ పవనం మనసుని తాకి జీవితం ఇంత మనోహరమైనదా అన్న ఆశ్చర్యాన్నిస్తుంది.
అసలు కవిత్వం రాయడమంటేనే బతుకు రహస్యపు పొరలలో చిక్కుకున్న నిగూఢ వ్యక్తిత్వాన్ని సాక్షాత్కరించుకునే దాకా పడిపోకుండా నడవడమే…
“జీవితాల్ల్ని రసం పిండి రెండు సిరా చుక్కలు చేసి పద్యం పక్కన పద్యంగా నిలబెట్టేదాకా ఎన్ని మరణాలనైనా దాటుకు పోవాల్సిందే.”
“ఎంత కష్టమైనా అవమానమైనా, ప్రేమ రాహిత్యమైనా జీవితాన్ని నిజాయితీగా మోస్తున్న అనుభవం గొప్పది కదా.” జీవితానుభవాలు ఎలాటివైనా గొప్పవే!
జీవనలోకాన్నీ, బాహ్య లోకాన్నీ వేరుగా చూడక, ఆత్మసౌందర్యంతో బాహ్య జగత్తుని ఆకళించుకునే అనుభూతినే కవితలుగా వెలువరిస్తారంటారు ఆర్. ఎస్. సుదర్శనం.
“కవిత్వాకాశపు గాలిపటానికి సూత్రపు పట్టుగా ఈ జీవితాన్నిచ్చుకోవడం” అన్న విద్య తెలియకపోతే ఈ కవితలు రాయలేరు – ముదిగొండ వీరభద్రయ్య.
“ఏది పలికినా అనుభూతి స్పర్శతో పాటు ఆలోచనా ముద్ర ఈ కవితల్లో ఉంటుంది – సి. నారాయణరెడ్డి.
సొంతముద్రగల కవయిత్రులలో సత్యవతీదేవి అగ్రశ్రేణిలో ఉంటారు – అద్దేపల్లి.
పరిమళపు శ్వాస వాయులీనంగా వ్యాపించడం, గాయాలు రసజ్వలిస్తుండడం వంటి సుందరాభివ్యక్తులు, అమ్మతనంతో, ఆప్యాయించడం వంటి కొత్త coinage, కవికి ఉండాల్సిన లోచూపు సత్యవతీదేవి ప్రత్యేకత – శీలా వీర్రాజు.
తన కవితా గమ్యమూ, పరమావధీ వేయిరంగుల వెలుగు రాగమేనని నమ్రతతో వివరిస్తోంది – ఆవంత్స
…జీవనతాత్త్వికత లోని సమతౌల్యాన్ని ఒక నిర్లిప్తభావనతో తిరిగి అంతే జీవనలాలసతో తన స్వంత కవితాముద్రను వదిలి వెళ్ళారామె – నిఖిలేశ్వర్
సాహిత్యంలో ఎంత పాండిత్యం, కల్పనా చాతుర్యం ఉన్నాయో సంగీతంలోనూ అంత అభినివేశం ఉందీ రచయిత్రిలో. ఆధునిక సాహిత్యంలో ఇలాటి సమచాతుర్యం అరుదైనది. – చేరా
ప్రకృతినంతనూ హృదయంలో పొదువుకొన్న – హృదయమంతటినీ ప్రకృతిగా చేసుకున్న అరుదైన కవయిత్రి సత్యవతీదేవి – పోరంకి దక్షిణామూర్తి
ఇందర్ని చదివిన తరువాత ఎవరికైనా సత్యవతీదేవి కవిత్వం గురించి చెప్పేందుకు భాష, భావం కరువైపోతాయి. నేనూ దానికి మినహాయింపు కాదు. సత్యవతీదేవి కవిత్వంలో సాధించిన అరుదైన పట్టు, చేరిన స్థాయి ఇంతకంటే చెప్పటం సాధ్యం కాదు. ఇందరిని స్మరించుకున్నాక,
కవిత్వాన్ని ప్రేమించే ఒక సాధారణ పాఠకురాలిగా నేనేం చెప్పినా సత్యవతీదేవి గారి దీపతోరణ చలనోత్సవాన్ని గుడ్డి లాంతరు వెలుతురులో చూపించ బోయినట్టుంటుంది. అయినా, ఆమె చూపిన ఆశావహదృక్పథాన్ని అనుసరిస్తూ…
పుస్తకంలోని 182 కవితలలో కొన్నింటిని చెప్పుకుందాం.
పాపాయితో పంచుకున్న బాల్యం ఇంట్లో పుట్టిన పాపాయిని చూసేందుకు ఆహ్వానాన్ని అందుకుని ఎక్కడెక్కడినుంచో వచ్చివాలారందరూ. అమ్మ కొంగుచ్చుకుని పేరంటానికొచ్చిన పసివాళ్ళు ఐస్క్రీ కప్పులూ, చాక్లెట్లూ పలకరించేసరికి డిసిప్లిన్ గీతని దాటి ప్రాంగణమంతా ఇంద్రచాపాలైపోయారు. అప్పుడంటారు కదా కవయిత్రి,
“అప్పుడప్పుడు కొన్ని సాయంత్రాలు ఇలా
జవం, జీవంతో తొణికిసలాడటం ఎంత బావుంటుంది!”
వీడ్కోలు పాట “స్నేహాలు శలవడిగి, వీడ్కోలు పాట పాడినపుడల్లా, గాయాలు రసజ్వలిస్తుంటాయి.”
అయితేయేం, చిరునవ్వులూ, కన్నీళ్ళూ ఉత్తరాల రూపం సంతరించుకుని స్నేహితుల మధ్య వెచ్చని జ్ఞాపకాలై మిగిలి ఓదార్పునిస్తాయి.
వేయిరెక్కల పావురం బడిలో పలకకీ బలపానికీ మధ్యనపడి నలిగే అక్షరం ఒక బాల్య క్రీడ అంటారు కవయిత్రి. అదే అక్షరం కాశీమజిలీ కథల ఉయ్యాలలూగే వేళ లాలిపాటవుతుందట. జీవితంతో పాటు నడుస్తూ అక్షరం ఒక పూల రుతువవుతుందట.
జీవితంలోని వివిధ సన్నివేశాల్లో అక్షరం భిన్న రూపాల్ని సంతరించుకుంటూ అంతిమంగా ఒక విశ్వభావనల క్షేత్రమవుతుందట! అక్షరం పట్ల ఆర్తిని, అక్షరానికున్న శక్తిని సున్నితంగా, స్పష్టంగా చెప్పారు.
ఆకాశం కింద ఎప్పుడో ఓ సాయంకాలం నాలుగురోడ్ల జంక్షన్ రద్దీలో ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ సంగీతం పెట్టెలా వస్తుందట ఒక కాన్వెంటు బస్సు! పిల్ల భారతదేశంలా కళ్ళు జిగేల్మని పించి రోడ్డు దాటి వెళ్ళిపోతుందట! అసలు ఈ పిల్లలే ఇంత! భలే మాయ చేసిపారేస్తారు.
నిలువెత్తు మనిషి మురికి వాసనతో, ఒళ్ళంతా మట్టితో, తట్టెడు పేడతో అలా తోటలోకొస్తాడతను. అతని శ్రమదానంతో తోటంతా కూనిరాగాల సంగీతాన్నాస్వాదిస్తుంది. పొద్దంతా ఎండకాగి బిందెడు దాహమై నీళ్ళడుగుతాడు. స్టీలుగిన్నెతో నీళ్ళు అందించేందుకు ఇబ్బందైపోతే దోసిలొగ్గి గటాగటా తాగేసి చిరునవ్వై సాగిపోతాడు! మరుగుజ్జులై మిగిలిపోతాం ఆ నిలువెత్తు మనిషి ముందు. ఎందుకో మనం అలా…
కవిత్వపు తేనెవానలో… “హృదయం రణమైనప్పుడూ, రణమే జీవితంగా మారినప్పుడూ” వెలుతురై ఎదురొచ్చే కవిత్వాన్ని స్మరిస్తూ, కవిత్వాకాశపు గాలిపటానికి సూత్రపు పట్టుగా ఈ జీవితాన్నిచ్చుకోవడం తెలుసుంటే బావుంటుందంటారు కవిత్వాన్ని శ్వాసించి, జీవించిన సత్యవతీదేవి.
రెక్క ముడవని రాగం “అనునిత్యం ఎదురయ్యే వైరుధ్యాల బరువుతో, బ్రతుకు పరాయితనపు కొత్త పోకిళ్లలో నలుగుతూ బండబారిపోయేవేళ, లోలోపలి దీపకాంతిని ఎగసనదోసి ఖడ్గమందించేదీ కవితా ప్రపంచమే.” కవిత్వాన్ని ఆవాహన చేసుకున్నందునేమో కవిత్వమూ, సత్యవతీదేవి పర్యాయపదాలై పోయాయి!
చినిగిపోయిన పచ్చల కేన్వాసు కొండవారగా బారులుతీరిన ఆకుపచ్చని చెట్ల మీద సంగీత వాయిద్యాలైన పిట్టలు ఆమె ఉదయాల్ని రాగరంజితం చేస్తూండేవి ఒకనాడు. ఇప్పుడా ఉదయపు నడక దారి పొడవునా రుతువులు మాయమై భూమిలోంచి కర్మాగారాలు పుట్టుకొస్తున్నాయి. ఆమె నడకలో ప్రాకృతిక లయా, ధ్వనీ మాయమైపోయాయి.
పలుచనైపోతున్న పచ్చదనం ప్రకతిలో భాగమైన మనిషికి మనిషికి మధ్య స్వచ్ఛమైన స్నేహం కనుమరుగవుతున్న వేళ చుట్టూఉన్న కొండలు, చెట్లు, పిట్టలు కూడా ఆవాసాన్ని కోల్పోయి విలపిస్తున్నాయి. ప్రకృతి కేన్వాసు చిన్నాభిన్నమైపోయిందంటున్నారీ ప్రకృతి ప్రేమి.
ఎన్నెన్నో జన్మలు – ఒకటే జీవితం రైతునాగలి, రైలు బ్రిడ్జి, పిల్లల స్కూలు బస్సూ, బాలికపై అత్యాచారం… సమస్త దైనందిన జీవనపోరాటాలు కవితావస్తువులే అవక తప్పదంటూ ఇంత దుఃఖమూ, ఇంత వేదనా మొయ్యకుండా కవిత్వంగా బయల్పడటం సాధ్యం కాదంటారు.
ఈ పాఠం మాకొద్దు
“మొన్నమొన్నటివరకూ అమ్మిచ్చిన లంచ్ బాక్సుల్లోని తాయిలాల్ని కాకెంగిళ్ళుగా మార్చుకు తినేవాళ్లం…”
ఇప్పుడు ఒకరిని ఒకరం అనుమాన దృష్టితో కానీ చూడలేని సందర్భంలో బతుకుతున్నాం! మాయమైపోతున్న మనిషి గురించి దిగులు పడుతున్నారు సత్యవతీదేవి.
ఎన్నాళ్ళిలా? తరాలుగా ఆమెనలా అవమానిస్తూనే ఉంది సంఘం. చెయ్యని తప్పుకి శిక్షిస్తూంది. దుఃఖసముద్రమైన ఆమెను గుండెకు పొదువుకుని ఓదార్చక ఆ మూలింట చీకటిగదిలో కూర్చోబెట్టి ప్రదర్శన బొమ్మను చేస్తున్నారు. ఇలాటి ఆచారం ఇకపై సాగదని కచ్చితంగా చెపుతూ, ఇదేనా మన ప్రగతంటూ నిలదీస్తున్నారు.
శాపాలా? బహుమానాలా? విజ్ఞానం పెరిగి మనిషిని అందలాలెక్కిస్తూంది. అది పోగుచేసే కాలుష్యం చిన్న చిన్న ఉయ్యాలలకి నాగుపాము నీడవుతూంటే పసివాళ్ళకి భవిష్యత్తేదని దుఃఖపడతారు.
ఆకాశపు నీలిమను, హాయిగా ఎగిరే పక్షులను, దారివెంట పచ్చగా నిలబడి ఊపిరినందించే చెట్లను, నీటిపాయల తేటదనాన్ని, సంతోషంతో ఆటలాడే పాపాయిల్ని కాపాడుకోవాలన్నదే అనుక్షణం సత్యవతీదేవి ధ్యానం!
పచ్చనిగీతం మనిషికి మనిషికి మధ్య పలకరింపులోని ప్రేమాదరాలకు కడుపులో చలివేంద్రం చేరినట్టుండాలనే కవయిత్రి
“మిత్రమా, నీకైనా నాకైనా చెమరించే గుండే కదా అసలు ధనం” అంటారు.
కవితలన్నీ సార్వజనీనమైనవే అయినా కవయిత్రి మనసు మనవడి తలపుతో కాస్త మాయలో పడింది.
హరివిల్లు “వాడొక నవ్వుల మాంత్రికుడు… ఇంట్లో అందర్నీ వాడి చుట్టూ రంగుల రాట్నంలా తిప్పుకుంటాడు.” అంటూ మనవడు కౌశిక్ మీద ముద్దుగా ఫిర్యాదు చేస్తూనే, నడక నేర్చిన వాడి చైతన్యాన్ని నడుస్తున్న పూలతోటతో పోలుస్తారు. నానమ్మకెంత ప్రేమాతిశయం!
అప్పుడనుకోలేదు ముందుగా ఏమీ తెలియనేలేదట. ఆనక అవగాహనకొచ్చిందట!
“ఇది బహుభార ధరామండలమే కాదు… రవంత సారగంథాన్నిచ్ఛి నాలోని నన్ను శుభ్రపరచి
ఇంత కరుణని పొంగిస్తుందని తెలిసాకే జీవితమొక రసప్రయాణమైంది!”
వెన్నెల మొగ్గలు సత్యవతీదేవి కవిత్వమంతా పోగుచేసుకున్న ఈ పుస్తక శీర్షిక ఇదే.
“కవిత్వపు వెన్నెల మొగ్గలు… రంగుల పడవలేసుకుని పయనిస్తుంటాయి…
వాకిలి ఓరగా తెరిచే ఉంచాలి, మెల్లగా ఒక గంధర్వ స్వర రాగమేదో చొరబడాలి…
లోలోపల ఒక వన మహోత్సవ వసంత లాస్యం జరగాలి, నిలువెల్లా ఆ సౌరభంలో తడవాలి!”
పాఠకుల మనసుకు చందన పూతనిచ్చే ఈ సౌకుమార్యం నిండిన పదాలు సత్యవతీదేవికే స్వంతమనిపిస్తాయి.
ప్రతి కవితనూ పరిచయం చేసేద్దామన్న నాది అత్యాశే! కవిత్వాన్ని ప్రేమించేవారంతా ఆస్వాదించవలసిన పుస్తకం ఇది. అందుకే మిగిలిన కవితలను వారికి వదిలిపెడుతున్నాను. ఆఖరుగా సత్యవతీదేవి తల్లిని స్మరించుకున్న కవితను చెప్పుకుందాం.
నివాళి “అమ్మా, ఈ లోకానికి నన్ను పరిచయం చేయటానికై నువ్వెంత అమరికగా అనురాగరాగంగా … ఒక తన్మయత్వంతో ఒదిగిపోయావో కదా!…
నన్ను ప్రపంచ పాఠశాలలో పెట్టి నన్ను నన్నుగా ఎదగమన్నావు! నిన్ను చదువుకుంటూ ఆ బాటలో నేనడవటమే నీకిచ్చే నివాళి!”
పుస్తకం చదివాక సత్యవతీదేవి ఎన్నేళ్ళుగానో పరిచయమున్నంత ఆత్మీయురాలైపోయారు. కవితల్లోని భాష, అభివ్యక్తి సౌకుమార్యంతో నిండిపోయి ఆమె ఏమిటన్నది పట్టిస్తున్నాయి. ప్రకృతిని, మనుషుల్ని ప్రేమించిన ఆమె ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సామాజిక మార్పుల్లోని అవకతవకలకి, అన్యాయాలకి తన దుఃఖాన్ని, ప్రతిఘటనని కూడా మృదువుగానేనైనా కచ్చితంగా చెప్పారు. సమస్త ప్రాపంచిక రాగాల్ని వదిలి 2008 లో ఆమె ప్రకృతితో తాదాత్మ్యత చెందటం తీరని లోటు.
కవయిత్రిని నేను కలుసుకోనే లేదు. కానీ ఒక్క విషయం చెప్పుకోవాలన్న లాలస నన్ను వదలటం లేదు.
అప్పుడెప్పుడో సత్యవతీదేవి కవిత, నా కవిత రచన మాసపత్రికలో ఒకేసారి ఎదురెదురు పేజీల్లో వచ్చిందన్నది నాకు మిగిలిన గొప్ప జ్ఞాపకం.
సత్యవతీదేవి కుటుంబ సభ్యులు ఆమె రచనల సంగ్రహాన్నిలా భద్రపరచి కవిత్వ ప్రేమికులకి, తెలుగు సాహిత్యానికి అందించటం అభినందించదగ్గది. ఇది ఆమెకు ప్రేమతో వారిచ్చిన నివాళి!
కవిత్వాన్ని స్వప్నించి, సాక్షాత్కరింపజేసుకుని,
సౌందర్యపు సొగసుల్ని చేర్చి, దైనందిన రహదారుల వెంట నిరాడంబరంగా నడిచింది.
విశ్వంలోని సుఖసంతోషాలకి సుగంధపు రంగులద్ది వెలుగుపూలు పూయించింది!
లోకంలోని దుఃఖానికి సహానుభూతి స్పందనల బలాన్నిచ్చింది!
తనలో రగిలిన రసజ్వలనను, రసానుభూతులను మధించి కవిత్వపు ప్రవాహమైంది!
ఇంత సంపదా మనకు ప్రేమతో ధారాదత్తం చేసి, ప్రకృతి కుహూరాగాల మధ్య స్వర్గపు దారుల్లోంచి అలా ఆకాశం నీలిమలోకి నడిచెళ్ళిపోయింది! ఆమె సత్యవతీదేవి!
పుస్తకం కవర్ డిజైన్: హేమ శంకర్ ఆదూరి, ధర: రూ. 225/- ప్రింటింగ్: శ్రీశ్రీ ప్రింటర్స్, విజయవాడ.
Leave a Reply