తాత చెప్పిన కథలు
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
******
చుట్టూ ఉన్న విశాల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ జీవితానికి కావలసిన ఉత్సాహాన్ని, మెలకువల్ని అందించే కథలంటే పిల్లలకే కాదు పెద్దలకీ ఇష్టంగా ఉంటుంది. వినోదాన్ని పంచేవి కొన్ని, వింతవింత విషయాల్ని చెప్పేవి, అద్భుతమైన వ్యక్తుల్ని గురించి, కొత్త కొత్త ఆవిష్కరణల గురించి, సాహస యాత్రల గురించి చెప్పేవి మరికొన్ని. అసలు కథలు పిల్లల హక్కు. పిల్లల నుంచి విడదీయరాని బంధం కథలకుంది. ముఖ్యంగా పిల్లల్లో ఉండే ఊహాశక్తిని మరింత విశాలం చేసి, వారి సంపూర్ణ పెరుగదలకు కారణమయ్యేవి కథలే. అమ్మానాన్నలు కథలు చెప్పినా వారికంటే సమయం, అనుభవం ఉన్న అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు చెప్పే కథలు మరింత ఆసక్తికరంగా ఉండి పిల్లల్ని వారికి దగ్గర చేస్తాయి. అందుకే వారు చెప్పే కథలు మరింత విలువైనవి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథల పుస్తకం తాత చెప్పిన కథలు.
సాహిత్యంలో ఎన్నో ప్రక్రియల్ని చేపట్టిన సుధామూర్తి బాల సాహిత్యం పట్ల మరింత శ్రద్ధ, ఇష్టం చూపిస్తూనే ఉన్నారు.
ఈ పుస్తకంలో 19 కథలున్నాయి. అన్నీ కూడా వినోదాన్ని, తోడుగా ఒక మంచి విషయాన్ని పిల్లలకి చెపుతాయి. పిల్లల్లో మంచి అభిరుచులు, అలవాట్లు నేర్పేందుకు ఒక నీతిపాఠంగా కాక కథగా చెప్పటం అనేది వారిని మరింత ఆకర్షిస్తుంది. వాటిని అనుసరించేందుకు స్ఫూర్తినిస్తుంది.
ఒక చలికాలం అవ్వ, తాత ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతమైన మాయావతి వెళ్ళాలని అనుకుంటారు. అవ్వ సోదరుడు శ్యాం తాత ప్రతి సంవత్సరం ఆ సమయంలో మాయావతిలోని ఆసుపత్రిలో స్వచ్ఛంద వైద్యసేవ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఢిల్లీ, ముంబై లలో ఉన్న మనవలకి కూడా సెలవులు దొరకటంతో వారిని కూడా తమతో మాయావతికి తీసుకువెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు అవ్వ, తాత.
ఢిల్లీ విమానాశ్రయంలో విమానం కోసం ఎదురుచూస్తూ తాత అందరినీ పుచ్చకాయ జ్యూస్ తాగమంటాడు. పిల్లలు అది ఇష్టపడకపోయినా తాత పుచ్చకాయల కథ చెపుతానని అనటంతో ఉత్సాహపడతారు. అలా మొదలెట్టి వాళ్ళు మాయావతిలో గడిపిన రోజుల్లో తాత ఎన్నో కథలు చెపుతారు.
తోటమాలి – పుచ్చకాయ కథ మనిషికి అవకాశాలు వచ్చినా వాటిని గుర్తించి, తెలివిగా సద్వ్వినియోగం చేసుకున్నప్పుడే జీవితంలో ఎదుగుదల సాధ్యం అవుతుందని చెపుతుంది. ఢిల్లీ నుండి పంత్ నగర్ చేరిన తాత, అవ్వ, మనవలను మాయావతి కి తీసుకెళ్ళేందుకు కుక్రి అనే డ్రైవర్ కారు తీసుకువస్తాడు. తనను శ్యాం తాత పంపాడని పరిచయం చేసుకుంటాడు. ఆ ఆరు గంటల కారు ప్రయాణం కుమావూన్ పర్వతాల గుండా అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య సాగుతుంది. దారిలో లోహవతి నది, భీమతాళ్ లను దాటి వెళ్తూ మధ్య ఒక చోట కాస్సేపు విశ్రాంతి తీసుకుని, కూడా తెచ్చుకున్నఫలహారాలను తింటారు. అవ్వ అందరికీ కాకరకాయ చిప్స్ పెడుతుంది. అవి చేదుగా ఉన్నాయన్న పిల్లలకి తాత చేదు కాకర అనే కథ చెపుతారు. ఈ కథ పిల్లలు తప్పు చేసినప్పుడు మందలించి సరైన మార్గంలో పెట్టాలన్న విషయం చెపుతుంది.
శ్యాం తాత ఇంటి చుట్టూ ఉన్న అరుదైన పూల తోట, జలపాతాలు, ఎత్తైన గిరిశిఖరాలు, పక్షుల కిలకిలారావాలు పిల్లలకి ఎంతో నచ్చుతాయి. శ్యాం తాత ఆ ప్రదేశాన్ని భూలోక స్వర్గం అని చెపుతూ ఆ రాత్రి పౌర్ణమి కనుక మరింత అందంగా ఉంటుందంటాడు. ఆ రాత్రి వెన్నెల్లో కూర్చుని చందమామ లో కుందేలుందని, కాదు చందమామలో లేడి ఉందని పిల్లలు వాదులాడుకుంటారు. వారి వాదనలు విన్న తాత చందమామలో కుందేలు, లేడి కూడా ఉన్నాయని రెండు కథలు చెపుతారు.
నిజానికి 1969లో చందమామ మీద అడుగుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అక్కడ కేవలం బండరాళ్ళున్నాయని కనుక్కున్నాడని అవ్వ చెపుతుంది. అయితే కల్పించిన కథలు ఎందుకు వినాలంటారు పిల్లలు. కథల్లో ప్రజలు ఒకరితో ఒకరు మంచిగా ఉండటం గురించి చెప్పుకున్నామని, చందమామ గురించి ఒఠ్ఠి నిజాలే చెపితే పిల్లలకి విసుగ్గా ఉంటుందని, ఊహను జోడించి చెప్పిన కథలు పిల్లల ఊహాశక్తిని విశాలం చేస్తాయని అవ్వ సమాధానం చెపుతుంది.
ఒకరోజు పొద్దున్నే పిల్లలు లోహఘాట్ చూసేందుకు వెళ్దామంటారు. మాయావతి నుంచి రోడ్డు ద్వారా అయితే పది కిలోమీటర్లనీ, కాలినడకన వెళ్తే రెండు, మూడు కిలోమీటర్లే అని తాత చెప్తారు. పిల్లలంతా దారిపొడవునా ప్రకృతిని చూస్తూ ఎదురైన గొర్రెల్ని, పొడవాటి చెట్లను, అడవిపూలను చూసి సంబరపడతారు. ప్రవహించే నదీ సంగీతాన్ని వింటారు. మనవైపులాగా బలమైన రావి చెట్లవంటివి కనిపించటం లేదేమని తాతని అడుగుతారు. సమాధానంగా రావిచెట్టు కథ చెపుతారు తాత. ఈ కథ ద్వారా ఇతరులు బాగుండాలని కోరుకునే వారి జీవితం బావుంటుందని పిల్లలకి అర్థమవుతుంది.
పిల్లలు దేవదారు చెట్ల గుండా నడిచి వెళ్తుంటే కుక్రి దేవదారు కథ చెపుతూ ఆ చెట్టు వల్ల ప్రయోజనాలు చెప్తాడు. మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాల మధ్య ఉన్న ఎత్తైన దేవదారు వృక్షాల ఒడిలో ఉన్న పురాతన పట్టణమే లోహఘాట్ అని తాత వివరిస్తారు.
కుక్రి భార్య కుసుమ్ తమ ప్రాంతంలో జరిగే పెళ్ళిని చూపించేందుకు తన స్నేహితుల ఇంట్లో జరిగే పెళ్లికి అవ్వ, తాతలను, పిల్లలను తీసుకెళ్తుంది. పెళ్ళి విందులో పిల్లలు జిలేబీని ఇష్టంగా తిన్నారని కుసుమ్ వారికి మరిన్ని జిలేబీలను డబ్బాలో పెట్టి ఇస్తుంది. తాత చెప్పిన జిలేబీ కథలో పిసినారి చేతన్ పంచుకోవటంలో ఉండే ఆనందాన్ని తెలుసుకుంటాడు.
శ్యాంతాత పిల్లలకి మౌంట్ చర్చ్ చూడమని చెప్తాడు. శ్యాం తాత పరిచయం చేసిన కల్నల్ జాన్ ఆ చర్చ్ గురించి వివరంగా చెప్తాడు. ఆ చర్చ్ తో పాటు మరికొన్ని శిథిల భవనాలను చూపిస్తాడు. కుమావూన్ పర్వతాల తూర్పు నుంచి చూస్తే గంగోత్రి నుండి ధవళగిరి యొక్క శిఖరాలు కనిపిస్తాయని, అవి భారతదేశంలోని అద్భుతమైన, అరుదైన ప్రదేశాలని చెపుతాడు.
పిల్లల మాటల్లో రాణిలక్ష్మీబాయి ప్రస్తావన వచ్చినప్పుడు ఆమెలాగా నిస్వార్థంగా జాతికి సేవ చేసినవారు అమరులవుతారంటూ తాత అమరత్వ ఫలం అన్న కథ చెపుతారు.
కథలో రాజు ప్రజల మనసుల్లో తాను అమరుడవ్వాలనుకుంటాడు. తన కోరికను తన రాజ్యానికి వచ్చిన ఒక సన్యాసితో చెప్పుకుంటాడు. ఆ సన్యాసి కొన్ని విత్తనాల్ని ఇచ్చి, వాటి ద్వారా పొందిన ఫలం రాజుకు అమరుడన్న పేరు తెస్తుందంటాడు. ఆ విత్తనాల్ని రాజ్యమంతా నాటి అమరత్వ ఫలం పొందాలనుకున్న రాజు ఆ ప్రయత్నంలో సన్యాసి చెప్పిన మాటల్లోని అసలు అర్థాన్ని తెలుసుకుంటాడు. రాజ్యంలో ప్రజలందరి గుండెల్లో అమరుడవుతాడు.
కల్నల్ జాన్, ఎలిజబెత్ ల ఇంట టిఫెన్ తినేందుకు అవ్వతాతలతో కలిసి పిల్లలంతా వెళ్తారు. ఆతిథ్యం ఇస్తున్న ఎలిజబెత్ కు సహాయం చెయ్యమని పిల్లలను, ముఖ్యంగా మీను ను అవ్వ హెచ్చరిస్తుంది. తన చిన్నప్పుడు విన్న కుమావూన్ ప్రాంతపు జానపద కథను ఎలిజబెత్ పిల్లలకు చెపుతుంది. అది పిల్లల్ని మంచి నడవడికతో ఎలా పెంచాలో చెప్పే ఎవరిచేతా తిట్లు పడనివాడు కథ. అప్పుడప్పుడు తిట్లు తినటం జీవితంలో మంచిదని, అప్పుడే మనిషి క్రమశిక్షణతో మంచి జీవితం గడపగలడని ఆ కథ చెపుతుంది.
ఒకరోజు కుసుమ్ అవ్వాతాతలను, పిల్లలను తమ ఇంటికి భోజనానికి పిలుస్తుంది. వారి జీవిత విధానం గురించి వివరిస్తూ, ఊళ్ళో ఆడ, మగ అందరూ కలిసి పనులు చేసుకుంటామని చెపుతుంది. అందరూ కలిసికట్టుగా ఉండటం వల్ల విజయాన్ని సాధించగలమంటూ తాత అయిదువేళ్ళు కథ చెపుతారు.
ఇలా ప్రతి సందర్భాన్ని పురస్కరించుకుని తాత మనవలకి ఎన్నో కథలు చెపుతారు. ఎన్నో మంచి విషయాల్ని వాళ్ల మనసులకి హత్తుకునే కథ రూపంలో చెప్పటంతో పిల్లలు సంతోషంగా వాటిని అమలు పరచాలనుకుంటారు.
పిసినారి కానూ కానూ పిసినారితనం అతని జీవితాన్ని గందరగోళ పరుస్తుంది. తమాషా అయిన కథ. తన దగ్గరున్న చిల్లు పడిన రాగి చెంబును ఉదారంగా విరాళం ఇవ్వబోతాడు. అది తిరిగి తిరిగి అతన్నే చేరటంతో కానూకి కనువిప్పవుతుంది.
రాజుగారి జ్యోతిష్కుడు ఇద్దరన్నదమ్ముల కథ. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిజమే చెప్పాలని, నిజాయితీయే విజయానికి దారి అని చెపుతుంది.
రూపాయి ఆదాచేస్తే రూపాయి సంపాదించినట్టే కథ పిల్లలకు పొదుపు విలువను తెలియజేస్తుంది. వాస్తవానికి దూరంగా పుకార్లు పుట్టించటం వల్ల కలిగే గందరగోళాన్ని పుకార్ల గందరగోళం, ఏదైనా అతిగా చేస్తే అది వ్యసనంగా మారే ప్రమాదాన్ని చెప్పే అతి మంచిది కాదు వంటి అనేక కథలు ఈ పుస్తకంలో తాత చెపుతారు. ఇవన్నీ పిల్లలకి ఆనందాన్నీ, ఆలోచననూ కూడా కలుగజేస్తాయి.
ముఖ్యంగా ఈ కథలన్నీ మన దక్షిణాది ప్రాంతానికి దూరంగా ఉన్న ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతమైన మాయావతి లో చెప్పుకోవటం చాలా ఆసక్తి కలిగిస్తుంది. కొత్త ప్రదేశాల్ని చూసి, అక్కడివారి జీవన విధానాల్ని, ఆయా భౌగోళిక స్థితిగతుల్ని, వారి భోజన అలవాట్లు, సంప్రదాయాలు వంటివన్నీ తెలుసుకోవటం పిల్లలకే కాదు పెద్దలకీ విజ్ఞానాన్ని, వినోదాన్ని సమపాళ్లలో అందిస్తాయి.
ఇలాటి విహారాలకి పిల్లల్ని తీసుకెళ్ళటం ద్వారా వాళ్ళకి విలువైన కొత్త అనుభవాల్ని ఇచ్చినట్టవుతుంది. అది వారి మానసిక పరిణితికి దోహదం చేస్తుంది.
దాదాపు 150 పేజీలున్న ఈ పుస్తకం చదువుతుంటే మనం కూడా ఉత్తరాఖండ్ లో మాయావతి ప్రాంతంలో ప్రత్యక్షంగా తిరుగుతున్న అనుభూతికి లోనవుతాం. అనువాద పుస్తకమన్న సందేహం ఎక్కడా తోచదు.
పిల్లలకి అందమైన పుస్తకాన్ని అందించిన రచయిత్రి సుధామూర్తికి, అనువాదకురాలు ముంజులూరి కృష్ణకుమారికి అభినందనలు.
తెలుగు అనువాదం ప్రచురణః అలకనంద ప్రచురణలు, సెప్టెంబరు 2024
ముఖచిత్రం, లోపలి చిత్రాలుః ప్రియా కురియన్
వెలః Rs. 175/-
Leave a Reply