‘తూరుపు గాలులు’ కథల ఇంగ్లీషు అనువాదం: నా అనుభవాలు

వ్యాసకర్త: ఉణుదుర్తి సుధాకర్

ఈ వ్యాసంలో కొంత భాగం సెప్టెంబరు 23-24 తేదీలలో జరిగిన కథా ఉత్సవం-2023లో చర్చలో ప్రస్తావించారు. ఇది పూర్తి పాఠం. పుస్తకం.నెట్ లో పబ్లిష్ చేసేందుకు అనుమతించిన రచయితకి ధన్యవాదాలు – పుస్తకం.నెట్

********

తెలుగు కథలు, నవలలు, కవిత్వం ఇతర భాషలలోకి, ముఖ్యంగా ఇంగ్లీషులోకి అనువాదం కావాల్సిన అవసరం ఉందని అందరూ గుర్తిస్తున్నారు. ఇదే లక్ష్యంతో సౌత్‌సైడ్ బుక్స్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్‌కి అనుబంధ సంస్థగా స్థాపించిన సౌత్‌సైడ్ బుక్స్ వారు, తమ మొదటి మూడు పుస్తకాలలో ‘తూరుపు గాలులు’ కథల అనువాదం కూడా ఉండాలని భావించారు. 13 కథల్లో ఐదింటిని విడిచిపెట్టారు, రెండు కథల్ని చేర్చారు. మొత్తం పది కథలను ఎంపిక చేసారు. ఆ ఎంపిక వారిదే. కథల్ని అనువాదకులకు పంచాలని నిర్ణయించుకున్నారు. అనువాదకుల ఆసక్తిని బట్టి, ఎవరు ఏ కథని చేస్తే బాగుంటుందనే ఎంపిక జరిగింది. రెండు కథల్ని అనువదించి ఉన్నాను. మూడవ కథని పూర్తిచేశాను.ఇతర అనువాదకుల, సంపాదకుల సహకారంతో పూర్తిచేసిన ఈ ప్రాజెక్టు అందరికీ మార్గదర్శకం అని భావించడంలేదు. దీన్ని ఇంకా మెరుగు పెట్టవచ్చనే అంటాను. ఈ ప్రాజెక్టులో నా అనుభవాలను మీతో పంచుకుంటాను. ఇప్పుడు చెప్పబోయే అంశాలకు ‘ఈస్ట్ విండ్’ కథలనుండే ఉదాహరణలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను.

గుణపాఠాలు

ఈ పనికి అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సమయం పట్టింది. సుమారు రెండు మూడేళ్లపాటు ఈ ప్రాజెక్టు నడిచింది. కారణాలు అనేకం. ఒక దశలో ఎందుకీ పని మొదలుపెట్టానా అని కూడా అనుకున్నాను. అనువాదాల పని కన్నా కథలు వ్రాసుకోవడమే సులభం అనిపించింది. మొదటి దశలో అనువాదాలు ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. కానీ అది సరిపోలేదు. సరైన మార్గాన్ని తెలుసుకోవడం చాలా పెద్ద ప్రయత్నమే అయింది.

పెద్ద ప్రశ్న: పాఠకులెవరు? తెలుగు చదవలేని తెలుగు వాళ్లా? ఇతర రాష్ట్రాల భారతీయులా? ఎన్నారైలా? అంతర్జాతీయ పాఠకులా? పైన చెప్పిన వాళ్లందరూనా?

తెలుగులో వ్రాసేటప్పుడు (ముఖ్యంగా సృజనాత్మక రచనల విషయంలో) పాఠకులు ‘తెలుగు చదివేవాళ్లు’ అనే అనుకుంటాం. స్థానికత, మాండలీకాలు ఎంత ఎక్కువ పాళ్లలో ఉన్నప్పటికీ తెలుగు పాఠకులందర్నీ చేరుకోవాలనే అనుకుంటాం. ఇంగ్లీషు దగ్గరకొచ్చేసరికి అది సరిపోదు. మనం ఏ పాఠకులను చేరుకోవాలనుకుంటున్నామనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉండాలి. ఈ స్పష్టత మనకు దారి చూపిస్తుంది.

ఎవరి భాష? ఎప్పటి భాష?

కథాకాలమే భాషను నిర్దేశిస్తుంది. అలాగని ప్రాచీన భాషను వినియోగించడం సాధ్యం కాదు. అవసరం అనిపిస్తే, సందర్భానుసారంగా ఇంగ్లీషు మాటలు వాడవచ్చు. చారిత్రక సాహిత్యంలో (కథాకాలం బ్రిటిష్ పాలనకు ముందు అయిఉంటే) వాడకూడదు. తెలుగుని ధ్వనింపజేయాలి. ఉదాహరణకి, The Broken Weft (‘తెగిన నూలుపోగు’) కథలో బందర్ (మచిలీపట్నం), అరియా, అబీస్ అనే పెర్షియన్ మాటల్ని యథాతథంగా (తెలుగులోనూ, ఇంగ్లీషులోకూడా) వాడడం జరిగింది. అదే కథలో, గురవయ్య మాటల్ని అనువదించేటప్పుడు అతడు తెలుగులో వాడిన పదాల్ని ధ్వనింపచేసే ప్రయత్నం చేశాము (అతడు ఫ్రెంచ్, పోర్చుగీస్, అని పలికే అవకాశంలేదు. పరాసులు, బుడతకీచులు అని ఉంటాడు – బహుశా. అవి అప్పటికే తెలుగులో ప్రాచుర్యం పొంది ఉన్నాయి):

“Who are these men, father? Are they Valendulu (Hollanders), Parasulu (Frenchmen), Angleyulu (Englishmen) or Budatakeechulu (Portuguese)?” Guravayya was showing off his knowledge of various European nationalities.

తెలుగు మూలం:”నాయినా, వాళ్లే దొరలంటావు? వాలెండు దొరలా, పరాసులా, అంగ్లీలా, లేకపోతే బుడతకీచులా?” తన లోక ఙ్ఞానాన్ని ప్రదర్శిస్తూ గురవయ్య ప్రశ్నించాడు.

వివరణలు ఇవ్వాలా, వద్దా?

బ్రాకెట్లు వాడాలా, వద్దా? ఇటాలిక్స్ వాడాలా? ఫుట్‌నోట్స్ అవసరమా?

For a Bagful of Salt (‘మూడుకోణాలు) కథలో ఇప్పసారా అనే మాట ఉంది. విప్పపూలతో గిరిజనులు తయారుచేసే సారా అని చాలామంది తెలుగువాళ్లందరికీ తెలుసు. దాన్ని ఎలా అనువదించాలి? ఆ మాటను యథాతథంగా ఉంచి, వెంబడే వివరణను ఇవ్వడం జరిగింది: The Muli Savara, an old tribesman called Dumbri was fast asleep after his daily dose of ippa saaraa or country liquor brewed locally from mahua flowers. మహువా పూలు ఏమిటనేవి తెలుసుకోవాలని (ఇంగ్లీషు) పాఠకుడు ఉబలాటపడితే తన ప్రయత్నం తాను చెయ్యాల్సిందే! గూగుల్‌లో మహువా పూలు, విప్పపూలు – సర్వం దొరుకుతాయి.వివరణలను వీలైనంతవరకూ తగ్గించుకోవాలనీ, అవసరాన్ని బట్టి ఇటాలిక్స్, బ్రాకెట్లు, అత్యవసర పరిస్థితుల్లో ఫుట్‌నోట్స్ ఇవ్వాలని నిశ్చయించుకున్నాం. ఇంగ్లీషు పాఠకుడికి అర్థమవుతూనే ఆటంకం కారాదని మా కోరిక.

ఒకే త్రాటిన

ఒకరి కన్నా ఎక్కువ మంది అనువాదకులున్నప్పుడు, ఏకరూపత, లేదా సమరూపతను సాధించేదెట్లా? గమనిక: రచయిత జీవించే ఉన్నాడు! అనువాదకులకు ఇదొక వెసులుబాటు – ‘కవి హృదయం’ తెలుసుకొనేందుకు!

అనువాదకులకు ముందుగానే కొన్ని సూచనలను ఇవ్వాలి. కొన్ని పేరాలు, లేదా ఒక పేజీ మొదట అనువదించి చూపమని అడగాలి. దాన్ని విస్తృతంగా చర్చించాలి. వాక్యాల్ని యథాతథంగా అనువదించడం ముఖ్యంకాదనీ, భావమే ప్రధానం అనీ (ఈ కథలకు సంబంధించి) తెలియజెయ్యాలి.

తెలుగు వాక్యాల్ని విడదీయడానికీ, జోడించడానికీ అంగీకారం తెలపాలి. ఒక్కొక్క పేరా చదివి, ఇంగ్లీషులో స్వతంత్రంగా వ్రాయమని అనువాదకుల్ని కోరాలి. ఈ విధమైన అంగీకారం కుదరడానికి కొన్ని వారాలు పడుతుంది. సహనం ముఖ్యం!

కొంతమంది అనువాదం చేస్తాం అని ఉత్సాహంగా ముందుకి వస్తారు గానీ ఉత్సాహం ఒక్కటే సరిపోదు. అటువంటివారి అనువాదంలోని లోపాల్ని ఎత్తిచూపితే చిన్నబుచ్చుకొనే ప్రమాదం ఎక్కువ! అంచేత, ఈ ప్రక్రియ సాగుతున్నంతసేపూ అనువాదానికి భావం ఎంత ముఖ్యమో, అనువాదకులికి (మూల రచయితకీ కూడా) భావోద్వేగాలను దూరంపెట్టడం అంతే ముఖ్యం! అహంకారం ఏ పాళ్లలో, ఎక్కడున్నా ఈ పని ముందుకి సాగదు.

ఈ ప్రాజెక్టులో అనువాదకులందరితోనూ ముందుగా పంచుకున్న ఒక సూచన ఏమంటే, తెలుగు-ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను, ముఖ్యంగా ఆంధ్ర భారతి డాట్ కాం (www.andhrabharati.com)ను విస్తారంగా వాడమని. దీని వలన మాకు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరికాయి.

సృజనాత్మకంగానా, లేక యథాతథంగానా?

మొదటి అడ్డంకి శీర్షికల వద్దనే వస్తుంది. శీర్షికలు యథాతథంగా అమరిపోవు (చాలా సందర్భాల్లో). అనువాదం పూర్తయ్యకే శీర్షిక గురించి ఆలోచించడం ఉత్తమం. ఇక్కడ కూడా సంప్రదింపులు, నాలుగైదు ప్రత్యామ్నాయాలు అవసరం. పైన చెప్పినట్లుగా భావ ప్రాధాన్యత విషయంలో ముందుగానే అంగీకారం కుదరాలి. అనువాదకులు చేసే సూచనలను, మార్పులను చర్చించి ఒక నిర్ణయానికి రాగలిగితే అది చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది. అలాగే రచయిత లేదా ప్రచురణకర్త నియమించిన సంపాదకులు చేసే సూచనలను అనువాదకులు పెద్ద మనసుతో స్వీకరించాలి, కనీసం కూలంకషంగా చర్చించాలి.

బౌద్ధం నేపథ్యంగా నడిచిన మొదటి రెండు కథలను (‘తూరుపు గాలులు’, ‘పూర్ణచంద్రోదయం’) అనువదించిన రాణీ శర్మగారి పాత్రను ఇక్కడ ప్రస్తావించాలి. ‘తూరుపు గాలులు’ కథలో, మొదట్లోనే ఒక సన్నివేశం ఉంటుంది. సాధువులు కొందరు వర్షంలో తడుస్తూ, గుండ్రంగా తిరుగుతూ ఒక తత్వం పాడతారు. (ఆ సన్నివేశం, తత్వం నాకొక కలలో కనిపించి, వినిపించాయంటే కొంతమంది మిత్రులు నమ్మకపోవచ్చు; అది వేరే విషయం). ఆ తత్వం అందించే స్ఫూర్తితో, స్వతంత్రంగా చెయ్యడం వల్ల దాని అనువాదం చాలా చక్కగా కుదిరింది. అలాగే దీపాంకరుడు తన ఆఖరి రోజులలో ధాన్యకటకానికి చేరుకున్నప్పుడు అతనిలోని సంఘర్షణను మరింత వివరంగా చెప్పాలని రాణీ శర్మ అన్నారు. కొన్ని సూచనలు కూడా చేశారు. కథ నిస్సందేహంగా మెరుగుపడింది.

‘పూర్ణ చంద్రోదయం’ కథలో చంద్రావతి తన అత్తగారిని విడిచిపెట్టి సింహళ దేశానికి ప్రయాణం కడుతుంది – మూలంలో. అది అసహజంగా ఉందని రాణీ శర్మ నాతో వాదించారు. అత్తగారి మరణాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అలాగే అత్తా-కోడళ్ల సంవాదాన్ని ఆమె ఎంతగానో మెరుగుపరిచారు. పురుషుడిని కావడం మూలాన ఆమె సూచించిన కొన్ని అంశాలు నాకు తట్టనేలేదు. అప్పటికింకా తెలుగు మూలం అచ్చు కాలేదు గనక మూలంలో కూడా ఆయా మార్పులు చేసాను.

ఐదు దశల్లో మెరుగులు

తెలుగు, ఇంగ్లీషు రెండూ తెలిసిన వారి చేతుల నుండి, తెలుగు కన్నా ఇంగ్లీషు బాగా వచ్చిన వారి చేతులమీదుగా, ఇంగ్లీషు మాత్రమే తెలిసిన వ్యక్తి చేబట్టిన ఎడిటింగ్. చివరి దశలో అనువాదాల్ని సరిచూసిన తెలుగు రాని (భారతీయ) వ్యక్తి/ప్రొఫెషనల్. ఐదవ (చివరి) దశలో సరిచూసేది భారతీయేతరులై ఉండాలి. అన్ని దశల్లోనూ, రచయిత, ఆయా సంపాదకులతో సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉండాలి. ఈ ప్రాజెక్టులో ఐదవ దశని (స్వయంగా అనువదించిన) మూడు కథల్లోనే చేరుకోగలిగాం. మిగతా ఏడు కథలూ నాలగవ దశను మాత్రమే చేరుకున్నాయి.

అనువాదకుల పాత్ర

అనువాదకుడు స్వేచ్ఛను చేజిక్కించుకోవాలి. పంటి క్రింద రాళ్లు తగలకుండా జాగ్రత్త వహించాలి. అవసరమైన చోట్ల వాక్యాలను విడదీసి తిరిగి జోడించాలి. ఒక పేరాను చదివి మూల రచనలోని భావాలను తన భాషలో ప్రకటించాలి, ఆవిష్కరించాలి. భిన్న సంస్కృతులమధ్య వారధిని నిర్మించాలి. మూలం అనువాదకులలో ఉత్సాహాన్ని కలిగించకపోతే మంచి అనువాదం అసాధ్యం; అలాగని ఉత్సాహం ఒక్కటే సరిపోదు.

ముగింపు

(నా దృష్టిలో) సృజనాత్మక రచనల అనువాదం పాఠ్యప్రధానం కాదు, భావప్రధానం. మెరుగులు దిద్దుతూ ముందుకిపోయే సమిష్టి కృషి, పునః సృష్టి. మళ్లీ మళ్లీ సరిదిద్దుకోవడమే అత్యంత కీలకం! చివరిగా ఒక మాట: ఈ అనువాద యత్నంలో ఉభయ భాషల్లోనూ నాకున్న పరిమితులు బహిర్గతం అయ్యాయి.

తాజాకలం: మాండలికాలను ఎట్లా అనువదించాలని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. వాటి జోలికి పోవద్దని నా సలహా. వర్గాన్ని బట్టి, జాతీయతను బట్టి (సంభాషణల్లో) కొన్ని మార్పులు చేర్పులు అవసరం. అంతవరకే. ఉదాహరణకి నిజంగా విద్యావంతుడైన సౌత్ ఇండియన్ ప్రొఫెసర్, పంజాబీ భార్య, యూపీకి చెందిన అతని ముస్లిం డ్రైవర్, నేపాలీ వంటవాడు ఉన్నారనుకుందాం. వాళ్లందరిచేతా ఒకే ఇంగ్లీషు మాట్లాడించలేం కదా? అలాగని వాళ్ల జాతీయాలు, సామెతలు, మాండలికాలు జొప్పించలేము. దీన్ని మన పరిమితిగా అంగీకరించాలి. ఒక్కోసారి ఆయా పాత్రల మాటలను మూల రూపంలో ధ్వనింపజేయడం సాధ్యపడుతుంది. ఈ సంగతి నేను రావిశాస్త్రి రచనలనుండి, రోహింగ్‌టన్ మిస్త్రీ నవల ‘A Fine Balance’ నుండి తెలుసుకున్నాను.

మళ్లీ తూరుపు గాలులు కథలనుండి ఉదాహరణ ఇవ్వాలంటే – Entangled and Strangled (‘వార్తాహరులు’) కథలోని ముస్లిం యువతి మరియం మాటలను చూద్దాం:

“Our sepoys will win. Insh Allah! Mughal hukoomat (rule) will be restored.”But what if our people lose?”.“If something like that happens, we will leave for Deccan. We will marry and settle there”.

తెలుగు మూలం:“మనవాళ్లు గెలుస్తారు, ఇన్ష్అల్లాహ్! మళ్లీ మొఘల్ హుకూమత్ వస్తుంది. మనకి ఎక్కడో ఒకచోట పని దొరికిపోతుంది…..”ఒకవేళ ఓడిపోతే?” “తోబా, తోబా! నిజంగా మన కిస్మత్ అలా రాసిపెట్టి ఉంటే దక్కన్ వెళిపోయి పెళ్లిచేసుకొని అక్కడే ఉందాం.”

You Might Also Like

Leave a Reply