కేవలం కథలే కాదు, మన చరిత్ర కూడా

వ్యాసకర్త: ప్రసాద్ చరసాల
ఎండపల్లి భారతి గారు రాసిన “జాలారి పూలు” కథల పుస్తకానికి ప్రసాద్ చరసాల గారి ముందుమాట.

*******

కథలంటే దేవుళ్ళు, దేవతలు, రాజులు, రాణులు, మంత్రులు.. అదీ కాదంటే జమిందారులు, అందగత్తెలు, వీరులు, యుద్దాలు.. లేదూ అంటే పరాక్రమశాలి అయిన బీదవాడు, వాడు ప్రేమించిన సంపన్నురాలైన అందగత్తె. ఏ కథ చదివినా, ఏ నవల చదివినా అందులో సామాన్యుడి జీవితం భూతద్దం పెట్టి వెతికినా కనపడదు. కొండకచో కనపడినా అది మగాడి కథై వుంటుంది, వాడి అగచాట్ల వగపై వుంటుంది. పోనీ అది ఒక సామాన్య స్త్రీ కథే అయిందనుకుందాము.. అప్పుడది ఒక మగాడు రాసిందై వుంటుంది. కానీ ఒక సామాన్య స్త్రీ తన తోటి సామాన్య స్త్రీల వెతలను, సామాన్యమైన భాషలో రాస్తే అది ఎండపల్లి భారతి కథ అవుతుంది. ఈమె రాసిన “ఎదారి కథలు” కథా సంకలనం మొదటిసారి చదివినప్పుడు నాకు చిన్నప్పుడు పోగొట్టుకున్న వస్తువేదో అకస్మాత్తుగా దొరికినట్టనిపించింది. ఏ కథ చదివినా, “ఇది మా అమ్మ కథ, ఇది మా అవ్వ కథ” వెరసి ఇది మా వాళ్ళ కథ, మా పల్లె కథ అనే స్వంత భావన కలుగుతుంది! ఏ కథా పేజీలకు పేజీలు పాఠకుల్ని తరమదు. ఏ కథా గుప్పెట కాస్తా మూసి, మరి కాస్తా తెరిచి అర్థమయీ అర్థమవనట్టు పాఠకుల్ని తికమక పెట్టదు. ఏ కథా ఎక్కడో మొదలయ్యి ఎక్కడో ముగిసి ఏ పాత్రకు ఏ పాత్ర ఏమవుతుందో తెలియని సంశయాల్ని పాఠకులకు కలిగించదు. అమ్మో, అక్కో తన జతగత్తెలతో మాట్లాడుకుంటుంటే మనం అదేదో పసరు మహత్యాన అదృశ్యరూపంగా వాళ్ళ మధ్యే సంచరిస్తూ వింటున్నట్టు వుంటుంది ఏ కథ చదువుతున్నా. కథలన్నీ పల్లె పలుకులే, పల్లె పలుకుబళ్ళే. పరుషాలు లేని, సంయుక్తాక్షరాలు లేని సరళమైన, సహజమైన తీయటి తెలుగు తేటే కథల నిండా. తెలుగు భాషా సౌందర్యం ఓ వైపు, పల్లె మనుషుల సహజ సంబంధ బాంధవ్యాలు మరోవైపు. ఇవి కేవలం కథలు కాదు. ఒకానొక కాలాన, ఒకానొక పల్లెన నడిచిన మనుషుల మనుసుల చిత్రాలు, వాళ్ళ కన్నీళ్ళ దోసిళ్ళు. 

మొగుడితో తన్నులు తిని తినీ ఎదురుతిరిగి స్వంత కాళ్ళ మీద నిలబడి మొగున్నే తిరిగి తన్నిన చంద్రిక కథ ఒకటైతే, నానా అనుమానాలతో భార్యను వేయించుకుతిని తీరా ఆ అవమానాలు పడలేక పుట్టింటికి వెళితే భర్త వురేసుకుని చనిపోయిన జయ కథ మరొకటి. భర్త చనిపోయాక చేసే వైధవ్యం ఆచారాల్ని తిరస్కరించిన ఓ అవ్వ కథ ఇంకొకటి. 

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా కథల్లోకి మాత్రం రాకుండా వుంటుందా? “కడుపు కొట్టిన కరోనా” కథలో కరోనా ఒకరి బతుకు తెరువు మీద ఎలా సమ్మెట పోటు వేసిందో చెబుతుంది. కథ ఆ ఒకరి గురించే చెబితే ఏమి బావుంటుంది, కథ నిండా కరోనా నాటి పల్లె పరిస్థితులు, భయాలు, ప్రభుత్వాల అనాలోచిత నిర్భంధాలు అన్నీ కనిపిస్తాయి.

భూమి మీద ఆధారపడి బతికే సన్నకారు రైతుల వెతలు మరికొన్ని కథల్లో. “పండిచ్చినోన్ని నేరంచేసినోన్ని జూసినట్టు చూస్తా ఉండారు. వ్యాపారస్తున్ని దేవున్ని చూసినట్టు చూస్తుండారు. పంట మార్కెట్‌కు పోతే సవితి బిడ్డను చూసినట్టు చూస్తావుండారు.” అనే మాటల్లో రైతు గోస అంతా బయట పడుతుంది. మరో కథలో వర్షాలే అరుదైన సీమ పల్లెల్లో తుఫాను వానకు కొట్టుకు పోయిన పంటలు, వాటితో పాటే కొట్టుకుపోయిన ఆశలు మనుసుల్ని ద్రవింపజేస్తాయి. రోజులుగా విడవని వానతో మేతలేని మూగజీవాలు పడే బాధని “ఈ బిడ్డతల్లుల కర్మ ఇంతా అంతా కాదు. వాటి బిడ్డలు అరస్తా రొమ్ములకు మూతి పెట్టి గుద్దతా వుంటే పాలు రాక అవి కన్నీల్లు కార్సినాయి, వాటిని సూసి నేను గిన్నిలో అన్నం పెట్టుకుంటే నోటి కాటికి సేయిపోదు అరకడుపు తిని లేసేది.” అని ఆ గొర్రెల యజమాని నాగన్న వాపోతాడు. ఈ కథంతా పల్లె మనుషులకు, మూగ జీవాలతో, చెట్టు పుట్టలతో వున్న అనుబంధమే కనిపిస్తుంది. “ఎలకల రావిడి” కథలో వరి పంటను నాశనం చేస్తున్న ఎలుకలు గురించి చెబుతూనే, అవి పట్టే విధానంతోబాటు మరెన్నో వివరాలు తెలుస్తాయి. అందుకే ఇవి కేవలం కథలు కాదు, మన చరిత్ర కూడా.

“రుసిగాడు” కథ గురించి ముందే చెప్పగూడదు. రుసిగాడు ఎవరో చదివి తెలుసుకుంటేనే చదువరికి మజా. 

పల్లెల్లో మూఢనమ్మకాలు ఎక్కువ అనుకుంటాం గానీ అక్కడే హేతుబద్దంగా ఆలోచించేవాళ్ళు వుంటారు. “సూరేగ్యానం” కథలో సూర్య గ్రహణం రోజున పల్లెల్లో జరిగిన ముచ్చట్లు వుంటాయి. “గోత్రాలు బతుకు” కథ  మనిషి జీవితాలను గోత్రం ఎన్ని విధాలుగా ప్రభావితం చేస్తుందో సరదాగా చెబుతుంది. “గంగమ్మ కన్నంతా దున్నపోతు మిందే” కథ దున్నపోతులను బలిచ్చి వూరంతా వేడుక చేసుకునే సంగతిని వివరిస్తుంది. 

“బాన గొర్రెలు” కథ పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎల్లవేళలా చేతిలో సెల్లు పట్టుకొని ఆటలు ఆడే కుర్రకారు మీద, తల్లుల బెంగ మీద. “ఒరేయ్ మచ్చా మన వాళ్ళను అందర్నీ ఏసేసినారురా నువ్వే ఉండేది. ఇదిగో  వాడు ఈడ దాక్కొని ఉండాడు, ఆ పొదకింద అట్లరా,  ఇట్లారా, వానెక్క తప్పించుకునే రా ఒరేయ్ నన్ను కూడ చంపి ఈడ పడేసి పోయినారు. నేను చచ్చిపోయిన నువ్వు బద్రం”  అని అరుస్తా ఆడే పిలగాన్ని మనం చూసినట్టే వుంటుంది. ఈ తరం తప్పుతున్న దారిని చూసి ఏడుపుతో కూడిన నవ్వు వస్తుంది. 

ప్రతి కథా ఓ సందర్భంలోని పల్లె చిత్రం. “నింద లేందే బొంది పోదు” కథ.. రెండు నెలల్లో ఏడు మంది చనిపోయిన విషయం చెబుతూ.. పల్లెను ఆశ్రయించుకొని సోది, జోస్యం, మంత్రం అంటూ అడుక్కునే బుడబుడకలు, మల్లయ్య కుక్కలు, బైరేగులు లాంటి నాన రకాల వారి గురించి చెబుతుంది. అంతేకాదు.. మనిషి చనిపోయాక, దినానికి పల్లెల్లో చెప్పే “సాసవలచిన్నమ్మ కత”, “దేశంగురాజు కత”లు లాంటి పలు కథల గురించి తెలుస్తుంది.  

ఏ కథను చూసినా కమ్మటి తెలుగు పలుకుబళ్ళు గిలిగింతలు పెడతాయి. మచ్చుకు ఇవి చూడండి.

“యెముకలకి మెడ ఏసుకోని ఉండాది”

“ఉరి బోసుకోనైనా తనకంటూ జానెడు తాడుండాలని”

“గుర్రం గుగ్గిళ్ళు తింటే గాడిదికి కడుపు ఊదిందంటారే”

“పిండి బీము ఎత్తుకొని పిన్నంమింటికి పోయినట్టు”

“కలిగినోని సిన్నిల్చూసి లేనోని పానంపాయి నంట”

“ఏలికి గోరేంటికి అడ్డం”

“కులానికి నాసాడు అంటే తలా గెంటుడు పోసినట్టు”

“గాలి తోలినపుడే తూరుపు ఎత్తాలంటారు”

చెబుతూబోతే చాటడు. ఇలాంటి చిన్ని చిన్నికథలతో పల్లె పరిమళాల్ని నింపి మరిన్ని కథల పుస్తకాలతో భారతి గారు వస్తే నేను మరింత మురిపెంగా చదువుకుంటా మున్ముందు. ముందుమాటలు రాసేంత ప్రతిష్టా నాకు లేదు, రచనలూ నేను చేయలేదు. ఆమాటే అంటే “లేదు, మీరు రాయాలి సారు” అంది. నాకిష్టమైన కథల గురించి నాలుగు మాటలు నన్ను చెప్పుకోనిచ్చినందులకు థ్యాంక్సమ్మా! 

You Might Also Like

Leave a Reply