ఒక్కొక్క తలకూ ఒక్కొక్క వెల
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
2022లో అత్యుత్తమ నవలా పురస్కారం పొందిన కృతి – కన్నడ మూలం: ఎం. ఆర్. దత్తాత్రి, అనువాదం: రంగనాథ రామచంద్రరావు
********
నవల ప్రారంభంలో కథానాయకుడు అరవై రెండేళ్ల శివస్వామి బెంగళూరు లో మెట్రో రైల్లో ప్రయాణిస్తూ కనిపిస్తారు. రిటైర్మెంటు తర్వాత రెండేళ్లకి ఒక ఇంటర్వ్యూకి బయలుదేరతారు. ఎం. జి. రోడ్డు మెట్రో స్టేషన్ లో దిగి, తను వెళ్లవలసిన డి. టి. కంపెనీ ఆఫ్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ఆఫీసు వెతుక్కుని గమ్యాన్ని చేరతారు. ఇంటర్వ్యూ చేసిన ముగ్గురిలో ఒకరు కంపెనీ యజమాని కొడుకు రవి థక్కర్. మిగిలిన ఇద్దరు ప్రభు, శ్యామల అతని స్నేహితులు, కంపెనీలో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నవారు. అధునాతనంగా ఉన్న అంత పెద్ద కంపెనీలో ఉద్యోగానికి తానెంతవరకు తగినవాడనని శివస్వామి ఆలోచనలో పడతారు.
ప్రభుత్వరంగ సంస్థ బిఇఎల్ లో హెచ్. ఆర్. డిపార్ట్మెంట్ లో ముఫ్ఫై ఐదు సంవత్సరాల తన ఉద్యోగానుభవం, ఆలోచనాధోరణి పట్ల ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులు అసంతృప్తితో ఉన్నట్టు గ్రహిస్తారు శివస్వామి. అయినా ప్రశ్నలన్నిటికి ఓపిగ్గా సమాధానాలు చెపుతారు.
ఏ సంస్థకు సంబంధించిన మానవవనరుల విభాగంలోనైనా ‘మానవ వనరు అనేది కేవలం మానవ వనరు మాత్రమే’ అని నొక్కి చెపుతారు. ఎటూ తాను ఎంపిక కావడం అయ్యేపని కాదని నిశ్చయంగా అనుకుని, తాను నమ్మిన నైతిక విలువలననుసరించి నిర్మొహమాటంగా ఇంటర్వ్యూ ముగిస్తారు.
ఉద్యోగ జీవితమంతా ఘజియాబాద్ లో గడిపిన శివస్వామి రిటైర్మెంట్ కి ముందుగానే ఘజియాబాద్ లో ఉన్న కన్నడ మిత్రులతో కలిసి బెంగళూరు లో ఒక అపార్ట్మెంట్ ను బుక్ చేసుకుంటారు. అది అనుకున్న ప్రకారం పూర్తవకపోగా అదనంగా ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించమని బిల్డర్ నుండి నోటీసు రావటంతో, అది తలకు మించిన భారం అవుతుందాయనకు. కనీసం ఆ నిర్మాణం వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయన్న ఆలోచనతో అపార్ట్మెంట్ బుక్ చేసుకున్న ఎ. పి. లఖానీ బిల్డర్స్ నిర్మిస్తున్న అనూప్ గార్డేనియా వెనుక ఒక అద్దె ఇల్లు తీసుకుని బెంగళూరు వచ్చేస్తారు శివస్వామి దంపతులు.
చిన్ననాటి స్నేహితుడు శంకర్ మరి కొన్నాళ్లు ఏదైనా ఉద్యోగం చెయ్యమని సలహా ఇచ్చి, డి.టి. సాఫ్ట్వేర్ కంపెనీ లో హెచ్. ఆర్. మ్యానేజర్ పోస్టుకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తారు. మళ్లీ ఉద్యోగం చెయ్యాలన్న ఆలోచన లేకపోయినా ఆర్థిక అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని శివస్వామి ఇంటర్వ్యూకి వెళ్లటంతో కథ ప్రారంభం అవుతుంది. భార్య అమెరికాలో ఉన్న కూతురి ప్రసవ సమయానికి ఉండాలంటూ వెళ్లటంతో శివస్వామి ఒక్కడే ఉంటారు.
ఇంటర్వ్యూ అసంతృప్తిగా ముగిసినందున ఉద్యోగపు ఆలోచన ఆయనలో వెనకపడుతుంది. రెండో రోజు ఆ ఆఫీసు నుంచి కంపెనీ ఎం.డి. శివస్వామిని కలవాలనుకుంటున్నట్టు, హెచ్. ఆర్. డైరెక్టర్ ఉద్యోగం పట్ల ఆసక్తి ఉంటే వచ్చి కలవమని పిలుపొస్తుంది. ఆయన ఆశ్చర్యపోతారు.
ఉద్యోగానికి పంపిన శంకర్ తో తన ఇంటర్వ్యూ అసంతృప్తిగా ముగిసిందని, కానీ ఇప్పుడొచ్చిన ఫోన్ కాల్ చిత్రంగా ఉందని చెపుతారు. ‘మిగిలిన వాళ్లు ఇంటర్వ్యూలో ఏం చెప్పారో నీకు తెలియదు, వాళ్లు వదిలిపెట్టిన వాటిని నువ్వు చెప్పి పై స్థాయి ఉద్యోగాన్ని గెలుచుకుని ఉంటావని’ చెప్పి, తప్పక వెళ్లి కలవమంటారు శంకర్.
సందిగ్ధంతోనే వెళ్లిన శివస్వామి తనకంటే పెద్దవాడైన ఎం.డి. ధావల్ థక్కర్ ని మొదటి సమావేశంలోనే ఆసక్తిగా గమనిస్తారు. ఒక అధికారిగా కాక అతి మామూలు వ్యక్తిగా మనసులో మాటలను పంచుకున్న ఆ పెద్దమనిషి కూడా తనలాగే నైతిక విలువలకే ప్రాధాన్యత ఇస్తారని అర్థం అవుతుంది. ఇంటర్వ్యూ చేసిన ఆయన కొడుకు రవి కంటే ధావల్ భిన్నమైన వ్యక్తి అనుకుంటారు. ఉద్యోగంలో చేరతారు.
కంపెనీ వ్యవహారాల నిర్వహణలో తండ్రి, కొడుకుల మధ్య ఒక గ్యాప్ ఉందని అనేక సందర్భాల్లో తెలుస్తుంటుంది. ధావల్ తను కష్టపడి ప్రారంభించి, పెంచి పోషించిన కంపెనీ మీద అధికారాన్ని వదులుకుందుకు ఇష్టపడరు. అంతేకాక కొడుకు తీసుకోదలచిన తొందరపాటు నిర్ణయాలకు, కొత్త పద్ధతులకు అనుమతి ఇచ్చేందుకు సుముఖత చూపరు. వ్యాపార లావాదేవీలన్నీ తన కనుసన్నల్లో జరగాలని తండ్రి ఆలోచన. కొడుకు తన సామ్రాజ్యాన్ని కాపాడగల సామర్థ్యం ఉన్నవాడు కాడని సందేహంతో ఉంటారాయన.
ఒక పక్క శివస్వామి పెరిగిన దిగువ మధ్య తరగతి వాతావరణం, ధావల్ ఎదిగి వచ్చిన అతి సాధారణ నేపథ్యం చెపుతూనే కార్పొరేట్ ఆఫీసుల్లో జరిగే లావాదేవీలు, వ్యాపార కుటుంబాల్లో ఉండే అంతర్గత సమస్యలు వివరంగా ఆసక్తికరంగా చెప్పుకొస్తుందీ నవల.
శివస్వామి పధ్నాలుగేళ్ల వయసులో తన దూరపు బంధువు, స్నేహితుడు అయిన నీలకంఠంతోనూ, తమ ఊళ్లోని మరి కొందరితో కలిసి సిద్ధగంగ మఠంలో గురువు శంకర లింగదేవులు దగ్గర చదువు కోసం చేరతారు. అక్కడ విద్యాభ్యాసం ముగిసాక పై చదువునూ మఠం సాయంతోనే పూర్తి చేస్తారు.
శివస్వామిని అమితంగా ప్రభావితం చేసిన గురువు శంకరలింగ దేవులు పరిచయం చేసిన అల్లమ ప్రభువు వచనాలను తన దైనందిన జీవితంలో నిత్యం పారాయణ చేస్తూ ఒక నిబద్ధత కలిగిన జీవితాన్ని గడుపుతుంటారు. నవల మొదటి నుంచీ చివరి వరకూ అల్లమ దేవుల ప్రస్తావన, ఆయన ప్రవచన వాక్యాలు పదే పదే కనిపిస్తాయి.
చదువు ముగిసిన తరువాత జీవితంలో ఏం చెయ్యాలన్న వెదుకులాటలో మరొక గురువు ‘కెరెదండె’ స్వామికి దగ్గరవుతారు శివస్వామి, నీలకంఠం. శివస్వామి మనసు ఆధ్యాత్మికత వైపు పూర్తిగా మళ్లదు. “ఏం చెయ్యాలి? పెళ్ళి చేసుకుని సంసారమార్గం చేపట్టనా?” అని కెరెదండె స్వామిని ప్రశ్నించినపుడు “ఈ ద్వంద్వం వచ్చిందంటే సంసార మార్గాన్ని పట్టండి.” అంటారు స్వామి.
శివస్వామి క్లుప్తంగా వివాహం చేసుకుని, సంసార జీవితంలో మునిగిపోతారు. చెల్లెలి పెళ్లి చేస్తారు. ఆమె భర్త మరణించినపుడు ఆమె కుటుంబ బాధ్యతలను కూడా తీసుకుంటారు. నీలకంఠం మాత్రం ఎవరికీ చెప్పకుండా హిమాలయాలకు వెళ్లిపోతున్నానని కాగితం రాసిపెట్టి వెళ్లిపోతారు.
బిల్డర్ నిర్మాణం పనులు నెమ్మదిగా చేస్తూండటంతో ఒకటి రెండు కుటుంబాలు మాత్రం అపార్ట్మెంట్ ల్లోకి వచ్చినా ఎలాటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటారు. తమకు జరుగుతున్న జాప్యానికి బిల్డర్ మీద ఒత్తిడి తెచ్చేందుకు అపార్ట్మెంట్ ఓనర్లందరూ కలిసి రకరకాల చర్చలు చేసి, లీగల్గా వెళ్లాలా అన్నది ఆలోచిస్తుంటారు. శివస్వామి నిస్పృహకు గురవుతారు.
స్నేహితునిలా ఆదరించే ఎం. డి. ధావల్ తో శివస్వామి సమావేశాలు నవలలో ఆసక్తిగా నడుస్తాయి. వారిద్దరు పూర్వ స్నేహితులై ఉంటారన్నది కంపెనీలో అందరూ అనుకుంటూంటారు. ధావల్ శివస్వామితో మొదటి సమావేశం నుంచీ ఆత్మీయంగా మాట్లాడతారు. కంపెనీ వ్యవహారాల్లో కొడుకు రవి ఆధ్వర్యంలో ఉన్న సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి ఎక్కువ తలనొప్పులు వస్తున్నాయని, శివస్వామి అనుభవం తన సమస్యలను పరిష్కరిస్తుందన్న ఆశాభావాన్ని తెలియజేస్తారు ధావల్. శివస్వామి నెమ్మదినెమ్మదిగా ఆఫీసులో తన పనితీరుతో రవి థక్కర్, అతని మిత్రుల నమ్మకాన్నీ గెలుచుకుంటారు.
ఆయన ఆలోచనలెంత నిర్మలమైనవో కొన్ని సంఘటనలు చెపుతాయి.
అపార్ట్మెంట్ ఓనర్లందరూ కలిసి సాధ్యమైనంత తొందరలో బిల్డింగ్ పనులు పూర్తి చెయ్యమని బిల్డర్ మీద ఒత్తిడి తెచ్చేందుకు లాయర్ నోటీసివ్వాలని నిర్ణయించి, సంతకాలు పెడతారు. బిల్డర్ కొత్త ప్రాజెక్టులను మొదలుపెట్టి పగలు పూట ఆ పనులు చేస్తూ, రాత్రిపూట అనూప్ గార్డెనియా లో పనులు చేయిస్తుంటాడు. ఆ శబ్దాలు చుట్టుపక్కల వారిని నెలల తరబడి నిద్రకు దూరం చేస్తుంటాయి. అందువల్ల వారంతా సమిష్టిగా సంతకాలు చేసి పోలీస్ రిపోర్ట్ ఇస్తూ శివస్వామిని కూడా సంతకం చెయ్యమంటారు. కాలనీ వారికి విషయం వివరించలేక సంతకం పెట్టకుండా శివస్వామి దాటవేస్తారు. ఒకపక్క బిల్డింగ్ పనులు తొందరగా ముగించి అపార్ట్మెంట్లు చేతికివ్వమని బిల్డర్ కు నోటీసు ఇస్తూ, ఇప్పుడిలా బిల్డింగ్ పనులు ఆపివెయ్యమంటూ పోలీస్ రిపోర్ట్ ఇచ్చేందుకు సంతకం పెట్టటం సరికాదని ఆయన మనస్సాక్షి చెపుతుంది.
ఒకసారి డి.టి. కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ను కొన్న కంపెనీవారికి నష్టం వస్తుంది. ఆ కంపెనీవారిని వ్యక్తిగతంగా కల్సి సమస్యను పరిష్కరించుకోవాలని, అవసరమైతే నష్టపరిహారం ఇవ్వాలని ధావల్ చెపుతారు. అంతే కానీ కొడుకు, అతని స్నేహితులు ఆలోచిస్తున్నట్టు లీగల్ గా వెళ్ళటం పరిష్కారం కాదంటారాయన. శివస్వామిని అభిప్రాయం అడిగినపుడు ఆయన కూడా అదే చెపుతారు. శివస్వామి అభిప్రాయాన్ని రవి, అతని మిత్రులు తీవ్రంగా ఆక్షేపిస్తారు.
శివస్వామి రెండురోజులు జ్వరంతో సెలవు తీసుకుంటారు. దైనందిన జీవితంలో అల్లమ ప్రభు ప్రవచనాలను మననం చేసుకునే అలవాటున్నందున వాటితో సాంత్వన పొందుతారు.
“కదళియ బనవ హెక్కు…” అన్న వచనం చదివి, దాని తాత్పర్యాన్ని ఈ విధంగా చెపుతారు,
“అరటి వనంలో ప్రవేశించిన తరువాత, మీరు బయటపడే మార్గం తెలుసుకోవాలి. మాయామోహాల సంసారంలో దూరిన తర్వాత బయటపడే మార్గాన్ని కూడా వెతుక్కోవాలి.”
ధావల్ మరొకసారి శివస్వామితో సమావేశాన్ని కోరి ఆయనను తనకు ఇష్టమైన కృష్ణభవన్ కు తీసుకెళ్తారు. అక్కడి పకోడీల రుచి చెప్తూ, తన కంపెనీ స్థాపించినప్పుడే గోవిందు కృష్ణభట్టు కృష్ణభవన్ ను మొదలుపెట్టాడని, ఇప్పుడు అతని కొడుకు చేతికి వ్యాపారాన్ని వదిలేసాడని చెపుతూ ఇలా తను తన కొడుక్కి కంపెనీ అధికారాన్ని ధారాదత్తం చెయ్యలేక పోతున్నానంటారు. తన అనుభవం, సలహా కొడుక్కి అక్కర్లేని విషయాలుగా ఉన్నాయని బాధపడతారు.
ఇక్కడ బీతోవెన్ గురించి చెప్తారు. బీతోవెన్ తన ప్రధాన రచనలను రాసే సమయానికి పూర్తిగా చెవిటివాడయ్యాడట. కానీ మ్యూజికల్ కంపోజిషన్ కు అంతర్గత ప్రపంచంలోని సంగీతం చాలు, చెవులతో పని లేదని అన్నాడట. అతని పరిపక్వత అలా ఆలోచించేందుకు కారణమైందని చెపుతూ, తనలోని పరిపక్వత అర్థం చేసుకుందుకు బాహ్యప్రపంచంలో కొడుకుతో సహా ఎవరికీ తగిన మెచ్యూరిటీ లేదని విచారపడతారు. కారణం ఏమిటని శివస్వామిని అడుగుతారు. జనరేషన్ గ్యాప్ అంటే ఇదే అంటారాయన.
ఆ తరువాత లంచ్ కి కలిసినపుడు క్రితం సారి జరిగిన సంభాషణ కి కొనసాగింపుగా పిల్లల పట్ల ఎంత పొసెసివ్నెస్ ఉన్నా వాళ్లు పెద్దైన తర్వాత వారితో దూరాలు తప్పవని శివస్వామి చెపుతారు. కంపెనీకి ప్రాధాన్యత ఇచ్చి కుటుంబానికి దూరమయ్యానని, ప్రాణంలా పెంచుకున్న కంపెనీ పై ఆధిపత్యాన్ని కొడుక్కి ఇచ్చేస్తే తన అస్తిత్వానికి అర్థం పోతుందని ధావల్ అంటారు. ఆనాడు మనసు చెప్పినట్టు చేసి కంపెనీకి ప్రాముఖ్యత నివ్వటం తప్పుకాదని, ప్రాముఖ్యతలు మారుతుంటాయని, ఇప్పుడిక కంపెనీ తరువాతి తరానికి అప్పజెప్పటం సరైనదని శివస్వామి చెపుతారు.
ఒక సందర్భంలో ‘ధావల్ ఇక రిటైర్ కావాలని, వారు తప్పుకుంటేనే తరువాతి తరానికి అవకాశం దొరుకుతుందని’ ప్రభు శివస్వామి తో అన్నప్పుడు, ‘పండుటాకు ఇంకా చెట్టునంటిపెట్టుకుని ఉందంటే ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. ప్రకృతిలో ప్రతిదీ టైం కంట్రోల్డ్. కనుక వేచి ఉండాల్సిందే’ అని చెపుతారు శివస్వామి.
ధావల్ కోడలు (రవి భార్య) ధృతి శివస్వామిని కలిసి మాట్లాడుతుంది. శివస్వామి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకుని తమ వ్యాపార కుటుంబాల్లో కుటుంబ సభ్యుల మధ్య అంత ఆత్మీయత, దగ్గరతనం కనపడదని చెపుతుంది. పెరిగే వయసులో రవి తండ్రిని మిస్ అయ్యాడని విచారంగా చెప్పినప్పుడు, అంతమాత్రాన తండ్రికి కొడుకు పట్ల ప్రేమ లేదని చెప్పకూడదని, ప్రేమను వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా చూపిస్తారని శివస్వామి సమర్థిస్తారు. తన మామగారు రిటైర్ అయ్యేందుకు శివస్వామి ఆయనను ఒక మంచి స్నేహితుడిగా ప్రోత్సహించాలని, తద్వారా కంపెనీ తో పాటు తామందరికీ సహాయపడినవారవుతారంటుంది ధృతి.
ధావల్ కోరిక మీద ఆయనను వారి ఇంట్లో కలిసినప్పుడు అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసి శివస్వామి ఆశ్చర్యపోతారు. అస్తిత్వానికి ఇల్లు కావాలి. కానీ విచిత్రంగా అసిత్వానికీ, ఇంటికీ విలోమ సంబంధం ఉంది. ఇల్లు పెద్దదైనకొద్దీ అస్తిత్వం కుంగిపోతుంది అనుకుంటారాయన.
కూతురి కోసం చేసుకున్న మొక్కుబడిని తీర్చుకుందుకు ‘ధర్మస్థలి’ వెళ్లిరమ్మని భార్య కోరటంతో శివస్వామి మూడు రోజులు సెలవు తీసుకుని వెళ్లాలనుకుంటారు. అది విన్న ధావల్ తానూ ఆయనతో వస్తానని, ఒక తండ్రి బిడ్డను తీసుకెళ్లినట్టు తనని తీసుకెళ్లమని కోరతారు. ఎప్పుడూ ఎలాటి తీర్థయాత్రలకూ వెళ్లని ధావల్ కోరిక ఆయన కొడుకును ఆశ్చర్యపరుస్తుంది.
శివస్వామి ఎలా ప్రయాణించదలచుకున్నారో అలాగే తానూ వస్తాననీ, ఆయన బస చేసిన చోటే ఉంటానని నిశ్చయంగా చెప్పి బయలుదేరిన ధావల్ ఆ రెండు రోజులు శివస్వామితో పాటు నేత్రావతిలో నదీస్నానం చేసి, దేవాలయంలో సాధారణ భక్తుల మధ్య క్యూలో నిలబడి దేవుడి దర్శనం చేసుకుంటారు. కావేరి గెస్ట్ హౌస్ లో నాన్ ఎ.సి. గదిలో బస చేస్తారు. గోమటేశ్వరుని దర్శించుకుని, ధ్యానం చేసుకుంటారు. ధావల్ అక్కడ ఒక రోజు జ్వరపడతారు. శివస్వామి సేవలతో తేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో తను కంపెనీ వ్యవహారాలనుంచి తప్పుకుని, కొడుక్కు పూర్తిగా బాధ్యత అప్పజెప్తానని శివస్వామితో నిశ్చలంగా చెపుతారు. ఆయన ముఖంలో ప్రశాంతతను శివస్వామి గమనిస్తారు.
యాత్ర ముగించి వచ్చిన ధావల్ నీరసంగా ఉన్నారని రవి హాస్పిటల్ లో చేరుస్తాడు. శివస్వామికి పిలుపు అందుతుంది. కలిసేందుకు వచ్చిన శివస్వామితో ధర్మస్థలకు తీసుకు వెళ్లినందుకు మరోమారు కృతజ్ఞతలు చెపుతారు ధావల్. శివస్వామితో తన రెండు కోర్కెల్ని చెపుతారు.
ఉద్యోగం వదిలి అమెరికాలోని తన కుటుంబం దగ్గరకి వెళ్లమని, కుటుంబంతో ఆత్మీయతను దూరం చేసుకోవద్దని ముందుగా కోరతారు. రెండవది శివస్వామి బిల్డర్ తనకు తెలిసిన వ్యక్తేనని, ఆయనతో మాట్లాడానని, అదనంగా కట్టవలసిన ఎనిమిది లక్షలు శివస్వామి కట్టనవసరం లేదని చెపుతారు. పైగా లఖానీ గ్రూప్ ప్రాజెక్టుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ మూడు బెడ్ రూమ్స్ అపార్ట్ మెంటును పొందే ఏర్పాటు జరిగిందని ధావల్ చెపుతారు. తన కోరికలు కాదనవద్దని, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దని కోరతారు.
శివస్వామి మెట్రోలో ఇంటికి బయలుదేరుతారు. ఆలోచనలు ఆయనను వివశుణ్ణి చేస్తాయి. ధావల్ చెప్పిన మాటలు ఆయనకు అంగీకారం కాదు. అనూప్ గార్డేనియాలో మిగిలిన అపార్ట్మెంట్ ఓనర్లను వదిలి తానొక్కడు మాత్రమే ఈ విధంగా సమస్యను వేరొకరి సహాయంతో పరిష్కరించు కోవటం ఆయనకు సమ్మతం కాదు.
“మనిషిని ధర్మభ్రష్టుడిని చేయడానికి మాయ ఆవరించే విధానం అనంతమైనదని, ప్రతి ఒక్క తలపై దాని ధర్మాంతరపు వెల కూడా ముద్రించబడి ఉంటుందనే ఉద్ఘోష మాయదని, ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండి మనల్ని రక్షించుకోవాలని” చెప్పే బోధను గట్టిగా నమ్మారు శివస్వామి. ఆలోచనల ఒత్తిడితో ఆయన అల్లమ ప్రభును తలుచుకుని ఆయన ప్రవచనాలున్న పుస్తకాన్ని బ్యాగ్ లో వెతుక్కుంటారు. అది కనపడక దిగులు పడతారు. మెట్రో ఇంటి దారి పట్టింది. నవల సమాప్తమవుతుంది.
నవల మొదలు పెట్టిన దగ్గర్నుంచి చదువరిని తనతో పాటు లాక్కెళ్లిపోతుంది. ఈ పుస్తకానికి చాలా పెద్ద పరిచయమే ఇచ్చేసేనేమో! ఇంకా ఎన్నెన్నో విషయాలు చదివి అనుభూతించవలసినవి ఉన్నాయి. అవన్నీ మన జీవితాల్లోనూ జరిగినవో, జరుగుతున్నవో అనిపించే ఘట్టాలు. కథ మొత్తం నేల మీద అతి సహజంగా నడుస్తుంది.
అల్లమ ప్రభు ప్రస్తావన చూసి గూగుల్ ద్వారా కొన్ని సంగతుల్ని తెలుసుకున్నాను. వారు 12వ శతాబ్దిలో వీరశైవమతానికి చెందిన బసవన్న, అక్కమహాదేవి ల సమకాలికులు. కులవ్యవస్థను, అర్థంలేని పూజావిధానాల్ని నిరసించారు అల్లమ ప్రభు. నైతిక విలువలను, తోటి మనిషి పట్ల ప్రేమను బోధించారు.
నవలలో శివస్వామి కొడుకు కళ్లజోడు ప్రహసనం, ఆయన కూతురి చిన్ననాటి దోమతెర సంసారం అనే తమాషా ఆట, శివస్వామి కూతురు జీవితంలో జరిగిన దుస్సంఘటన, ధావల్ చెప్పిన ‘డార్క్ అవర్ విజ్డం’, గోమటేశ్వరుని కథ…ఇంకా ఎన్నో చిన్నచిన్న, పెద్దపెద్ద ఆసక్తికరమైన విషయాలను నవల చదివే వారికోసం వదిలేస్తున్నాను. నవల ఆసాంతం ఒక తాత్త్వికమైన ధోరణి కనిపిస్తుంది. శివస్వామి, ధావల్ పాత్రలు గుర్తుండిపోతాయి.
ఈ మధ్య కాలంలో చదువుతున్నంత సేపూ కట్టిపడేసిన పుస్తకం ఇదే అని వందశాతం చెప్పగలను.
అనువాదం రంగనాథ రామచంద్ర రావు. కొన్ని పదబంధాలు మన తెలుగులో వాడుకలో లేనివి కనిపించాయి. ఉదా: కాలు దారి (నడక దారి)
అచ్చుతప్పులు సరి చూసుకోవలసిన అవసరం రెండో ముద్రణకి చాలా ఉంది. కానీ చదువుకుందుకు, కథకి అవి అడ్డురావు.
ముద్రణః ఛాయ పబ్లికేషన్స్, ముద్రణ: సెప్టెంబరు 2023, పుస్తకం డిజైన్ : కిరణ్ మొదలు, వెలః 275 రూపాయలు.
Prasadarao
Best one