కామం పై Tolstoy యుద్ధము, అశాంతి
వ్యాసకర్త: సూరపరాజు పద్మజ
(ఇటీవలే “ఆంధ్రజ్యోతి” లో వచ్చిన వ్యాసం, కొద్ది మార్పులతో, రచయిత పంపగా పుస్తకం.నెట్ లో)
*****
‘వార్ అండ్ పీస్‘, ‘అన్నా కెరనీనా‘, ‘రిసరక్షన్‘ ల రచయిత 1889 లో వ్రాసిన నవలిక ‘The Kreutzer Sonata‘. పై మూడు నవలలకూ, ‘మై కన్ఫెషన్‘ అనే రచనకూ ఈయన్ను సంశ్లాఘించిన ప్రపంచ వ్యాప్త పాఠకులు ఈ నవలిక విషయంలో తీవ్రంగా విమర్శించారు. పుస్తకం రష్యాలో బహిష్కరాజ్ఞను ఎదుర్కుంది.
కారణం, ఈ కథలో వైవాహిక అనైతికత ఉన్నందుకు కాదు, వివాహవ్యవస్థలోనే అనైతికత అశ్లీలత ఉన్నాయని అన్నందుకు. వివాహం చట్టబద్ధమైన వ్యభిచారం అన్నందుకు.
‘‘వివాహ ఉద్దేశ్యం, ప్రయోజనం, ధర్మబద్ధ సంసారం! అలాంటి ఒక సంసారం స్వర్గం కాగలదు. అలా కాక, ఆ పథబ్రష్టులైన వారికి ఇహంలోనే నరకం‘‘ అనే నిగూఢ సందేశంతో, గొప్ప రచనాశిల్పంతో వచ్చిన ‘అన్నా కెరనీనా’ వ్రాసిన కలం నుంచే ఈ పుస్తకం రావటం అప్పట్లో అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఆశ్చర్య పడవలసిన అగత్యం ఏంలేదు నిజానికి. ఈయన రచనలలో ఎప్పుడూ జరిగే కామవిషయంలోని ధర్మవిచారణే ఉంది ఇందులోనూ.
కథ స్థూలంగా, ఒక రైలు ప్రయాణంలో, తను చేసిన హత్యానేరానికి శిక్ష ముగిసి బయట పడ్డ ఒకడు తన తోటి ప్రయాణీకుడికి “నా కథ ఇదీ” అంటూ చెప్తాడు, ఒక ఒప్పుకోలు లా, దైవం ఎదురుగా చేసే అపరాధాంగీకారం లా! దాపరికం లేకుండా అలా చెప్పేందుకు పసివాడికీ, ఋషికీ, పిచ్చివాడికే సాధ్యం. ఈ పాత్ర ఋషీ, బాలుడూ కాడు, కథలో ఎక్కడా స్పష్టం గా ఉద్ఘాటించకపోయినా ఈ పాత్ర కాస్త మతి స్థిమితం తప్పినవాడు అనటానికి పట్టివ్వగల గుర్తులు కావలసినన్ని ఉన్నాయి. ఇది కథనానికి అవసరమైన ఉపకరణం కూడా.
ఇతని కథలో లోకోత్తర విశేషాలు ఏమీ లేవు. ప్రేమ, పెళ్ళి, సంసారం తద్వారా ఆలుమగల ద్వేషం, పగ. చివరకు హత్య! అదీ అప్పట్లోనైనా మరీ చెదురుమదురు సంఘటన కాదు, ఇప్పుడైతే అసలేకాదు.
మతి తప్పినట్లు వాగే కథానాయకుడి ఆసరా తీసుకుని టాల్ స్టాయ్ వివాహ వ్యవస్థ లోని లోపాల గురించి ఉపేక్షించలేని ప్రశ్నలు విసిరాడు పాఠకుడికి.
ఇష్టపడుతూ దిగిన కాపురంలో ఇంతలో పలచబడే భార్యాభర్తల అనురక్తి , వారి వివాహేతర ఆకర్షణలు మాట్లాడేటప్పుడు అక్షరమక్షరం చలం మాటలే ప్రతిధ్వనిస్తాయి.
చలం ‘ప్రేమ‘ లో కామం అంతర్గర్భితం.
‘అమలిన శృంగారం’ వంటి విరోధాభాసలు చలం, టాల్ స్టాయ్ అంగీకరించరు. ‘Platonic love’ అర్థం లేని మాట.
సరే, ఈ రచయిత వాదనలు; ఆడా మగల మధ్య ఉండేది మోహం, కామం! అమాయకమైన వయసు దాటిన వాళ్ళ మధ్య కలిగేది ప్రేమ కానేరదు. ధర్మబద్ధ కామార్థం అంటూ మొదలైన వివాహం కూడా ఎల్లకాలమూ అదే పీఠం మీద నిలబడలేదు. (కథలో చూస్తాము). అందువల్ల కామం మనిషికి ఎప్పుడైనా పతనకారణమే అంటాడు. Tolstoy పూర్తి క్రైస్తవ ఆస్తిక్యాన్ని ఆలింగనం చేసుకున్న సమయంలో చేసిన రచన ఇది.
కథలో వివాహం, వ్యక్తిత్వం, చివరకు ఆత్మ పతనాల గూర్చి చదువుతుంటే అనివార్యంగా శ్రోతల ఆలోచన, మానవాళి ఆరంభహేతువు దగ్గరకు వెళుతుంది.
The first ‘credulous mother’ ఈవ్, సర్పం మాటను నమ్మి జ్ఞానఫలం అనుకుని సంసారఫలం రుచి చూస్తుంది. ఆమె దాన్ని తినేముందే మిల్టన్, ఈవ్ ను ‘mother’ అనడం, కొనసాగపోబోతున్న మానవజాతికి సూచన. సృష్టి, తను కొనసాగేందుకు స్త్రీ పురుషుల పై అలా కామం అనే నాగాస్త్రం ప్రయోగించింది. దాన్ని ఒక క్రమపద్ధతిలోకి మళ్ళించడానికి పటిష్ట వ్యవస్థొకటి అవసరం అయింది సంఘజీవనంలో. ఆదిమ కాలం నుంచీ ఎన్నో రకాల స్త్రీ పురుషులు జతకట్టే పద్ధతులూ, తర్వాత ఆ పద్ధతుల నాగరీకరణలు, వాటితో కొన్ని కట్టుబాట్లు వచ్చాయి.
ఒక పురుషుడికి ఒక స్త్రీ, వారి పిల్లలు, ఒక కుటుంబం గా మనడం సామాజికంగా నాగరిక లక్షణమని ఎంచి వివాహ వ్యవస్థ వచ్చింది. తమ తమ మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకుంటూ దాన్నొక పవిత్ర ఒడంబడిక గా స్వీకరిస్తూ భార్యాభర్తలు చేసే, ‘‘ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి‘‘ వంటి ప్రమాణాలు, ‘‘ప్రజాయై గృహమేధినాం‘‘ అనే సూక్తులు ఒక సంస్కృతం లోనే కాదు! గ్రీకు లాటిన్ యూరప్ ఆసియా, ట్రైబల్ భాషలన్నిటిలో ఉంటాయి, మంత్రం లేకపోయినా భావన అదే!.
కానీ, మెల్లిగా స్త్రీ కి మాత్రమే నీతి కట్టుబాట్లు పరిమితం చేసి, పురుషుడు తనకు (భౌతిక, కళాసౌందర్యాత్మిక, ఆధ్యాత్మిక) అవసరాలు ఎక్కువ అనీ, తనకు నియమాలు అవసరం లేదు, అని తదనుగుణంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. వాస్తవానికి, స్త్రీ, పురుష భేదం లేదు ‘మనసు‘ విషయం లో. ‘కోరిక‘ స్వరూపము అంతే, జెండర్ ఏదైనా.
ఆస్తిక్య ఉన్నతికి బలమైన ప్రతిబంధకం కామం, దానిపై స్వనియతి సాధన మనిషికి అవసరం, అని నమ్మే ఈ రష్యన్ రచయిత రసజ్ఞత తెలియని చాదస్తుడనటానికి వీల్లేదు. ‘Resurrection’ లో కాథరీనా మస్లోవా, నెఖ్ల్యూడెవ్ ల లేత యవ్వనపు ముగ్ధ ప్రణయం, వాళ్ళ నిష్కల్మషమైన తొలి చుంబనాన్ని చూసినవారికి తెలుస్తుంది ఆ రచనా సౌందర్యం! కానీ, ‘అనాకెరనీనా‘ లో కెరనీనా, వ్రోన్స్ కీ లది మోహం. ప్రస్తుత ‘ది క్రట్జర్ సొనాటా‘ లోది అచ్చమైన కామం, దానివల్ల అసూయ.
ఆకర్షణ ప్రేమ మోహ కామాలు అనేవి విడి విడి లక్షణాలా, ఒకే లక్షణం తాలూకు తీవ్రతా స్థాయిలలోని వ్యత్యాసాలా అనే పరిశీలనలు, ఈ విషయం గా స్త్రీ, పురుషుల దృక్పథ భేదాలు ఈయన కథల విషయం. వివాహం లో శీలం, నీతి వర్తనం అంటే ఏంటి? దైహికమైతే చాలా ఆ నీతి? ఆడా మగా ఇద్దరికీ ఒకటే రకంగా ఉండాలా నడత? వివాహాత్పూర్వం స్త్రీ కి ఉండాలని ఎదురుచూసే విశుద్ధత మగవాడికి అవసరం లేదా? పెళ్ళి న్యాయబద్ధంగా జరిగే వ్యభిచారం కాక మరేమిటి?ఆడది నడత తప్పితే మటుకు కులం, వంశం, సంఘం అధోగతికి పడిపోతాయా? ‘‘Woman, she’s a leaky vessel!” నవలిక లో ఒక వృద్ధపాత్ర. ఇవన్నీ మళ్ళీ చలం వాదనలే!
ఈ చర్చల కొస పట్టుకుని ప్రస్తుత సమాజంలో మనకు తారసపడుతున్న సమస్యలు చూడటం ఉపయుక్తమే గానీ అధికప్రసంగం కాబోదు. అదే యే చదువుకైనా సార్థకత!
ఆ ప్రయత్నంలో తోచే కొన్ని ఆలోచనలు; ఇలా చట్టం, శాస్త్రం ఆమోదించిన వివాహాల్లో నీతి, నియతి అదృశ్యం అయిపోవడం చూస్తున్న నేపథ్యంలో, పరస్పర ప్రేమ గౌరవాలతో నియమబద్ధంగా కలిసి జీవించుదాం అనుకునే వారికి బాహాటంగా ఒక వివాహమనే ఒడంబడిక అవసరమా? అవసరం లేదని నమ్మి జీవిస్తున్న ఇప్పటి జంటలలో ఎవరో ఒకరో, ఇద్దరూనో ఆ గౌరవం, నమ్మకం కూలదోస్తున్నారేం ? ప్రేమో, మోహమో, ఏ అవసరం అయితే ఇద్దరు మనుషుల్ని బంధంలోకి దించుతున్నదో అదే కేవలం కామంగా మారిపోయి, ఆ ఒడంబడిక జైలుశిక్షలా అనిపించడానికి ఎక్కువ వ్యవధి ఉండటం లేదేం? కామం ఒక మనిషితో ఆగదు అని, ప్రేమైనా ఎల్లకాలమూ ఒక మనిషి పైనే నిలవలేదు అని అనుభవమౌతోంది ఎందుకు?
బహుభార్యాత్వం, బహుభర్తుత్వం, వివాహం నిలబెట్టుకుంటూనే అందులో తీరని కొన్ని అవసరాల కోసం వేరే తాత్కాలిక, చిన్న చిన్న సంబంధాలు నెరపవలసి రావడం, ఆ అవసరాన్ని అర్థం చేసుకుని మన్నించడం అనే ఈ ఎత్తులకు ఎదుగుతున్నాం అనుకుంటున్న ఇప్పటి కాలాల్లో కూడా విడిపోవడాలు, హత్యలూ జరుగుతునే ఉన్నాయి కదా. స్వలింగ సహజీవనాలలో కూడా అచ్చం ఇవే అసూయా ద్వేషాలు, విడిపోవడాలు, హత్యలు! కథలూ, సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా, Wong Kar Wai సినిమా ‘Happy Together’ లో ఇటువంటి ఇతివృత్తమే.
మరి, అసలు పొరపాటు ఎక్కడుంది? సమస్య స్వరూపం ఏమిటి?
ఆ ప్రయత్నం గానే, ఒక పురుషుడిగా పూర్తి నిజాయితీతో తన ఆంతర్యాలలోకి పోయి చూసి అక్కడ మొదలైన తన ‘కామం‘ కథ చెపుతాడు ‘The Kreutzer Sonata’లో కథానాయకుడు.
“నా పతనం ఎప్పుడు మొదలయిందో తెలుసా? మన దేశంలో అందరు మగపిల్లలకూ లాగే! లైంగిక స్పృహ కలిగిన మొదటి పాపక్షణాన! నా పదహారో ఏట” అంటూ ఆరంభించి, “చివరకు పదహారేళ్ళ కాపురం తర్వాత నా భార్యను ఇలా చంపాను” అంటూ కథను ముగిస్తాడు. మధ్యలో నూటరవై పేజీల ‘ఇతిహాస‘ వృత్తాంతం మొత్తం వీడి మోహం, కామం, అసూయ, భయం, క్రోధం , మతిభ్రంశం, వినాశనం.“
హత్య కు పాల్పడిన భర్తకు, పదహారేళ్ళ కాపురం లో భార్య నైతికత తప్పినట్లు ఎక్కడా సాక్ష్యం లేదు, అనుమానం అసూయ తప్ప. ‘‘కానీ ఇది నా ఒక్కడి నేరం కాదు‘‘ అంటాడు.
‘‘ఎన్ని పెళ్లి ప్రమాణాల సూత్రాలు, వశీకరణ మంత్రాలు బంధించినా, మగవాడి ప్రేమ అటూ ఇటూ మర్లకుండా భార్య పైన ఎంతసేపు ఉంటుంది? అలాగే భార్యకైనా! పరిపూర్ణ ప్రేమ అంటే సంవత్సరాల తరబడి ఉంటేనేనా?, నెలలా, వారాలా, రోజులా పోనీ ఒక గంటా? గంట కూడా కుదరని పని‘‘ అంటాడు Pozdnyshev, కథానాయకుడు. ఎందుకంటే, పెళ్లి అయిన క్షణం నుంచీ ప్రతి మగవాడికీ ‘‘పరాయి ఆడది నిర్మల గంగాజలాల రాయంచ, తన భార్య కటిక చేదు మాచుపత్రి‘‘.
కథ మొదట్లో బైబిల్ వాక్యం, ‘పర స్త్రీని చూసే చూపులో కామం ఉందా! అయితే భౌతికంగా పాల్పడకపోయినా అది వ్యభిచారమే‘! ‘‘జరిగే పనేనా? ఒకసారి పతనమయ్యాక అకళంకిత నేత్రాలతో యే స్త్రీ నైనా చూడగలడా మగవాడు! నేను ఎంత ఖేదపడ్డానో మొదటిపాపంతో నా పరిశుద్ధాత్మ పతనమైన క్షణాన!‘‘
అదే మొదలు అతని పాపభీతితో పాటు, తను చూసిన అన్నిటిమీదా, అందరి మీదా ఆఖరుకి తన మీద తన ద్వేషం పెరగటానికి.
ద్వేషం పగ గా మారింది మటుకు ఒక సాయంకాలం జరిగిన ఒక చిన్న విషయానికి.
ఒక తేనెరంగు బాదంకాయ కళ్ళ యువకుడూ, మిడిసిపడే అందంతో చూసిన అందర్నీ ఆకర్షించేట్లుగా ఉంటూ, కొన్నాళ్ళుగా తనను దగ్గరకు రానీయకుండా కళ్ళాలు విప్పిపారేసి చెలరేగిన గుర్రం లా ఉన్న భార్య, కలిసి చేస్తున్న పియానో వయొలిన్ జగల్బందీ సంగీత సాయంకాలం అది.
Beethoven’s symphony Kreutzer sonata no: 9 వాయించుతారు ఇద్దరూ జతగా. “అద్భుత ప్రణయ యుగళ గీతం! శ్రోతలను అనాయాసంగా మరో లోకానికి తీసుకెళుతోంది”.
అప్పుడు, ఆ జంట సంగీతకారుల కళ్ళూ కళ్ళూ కలుసుకోవడం ఇతని కళ్ళలో పడుతుంది. ఇతనెరుగని ఒక మార్ద్వీక ఈక్షణం లో కాసేపు వాళ్ళిద్దరూ ఉండిపోతారు. కాసేపే! కానీ భర్త కదా! ఎంత అశనిపాతం లా తగిలిందో ! తను రుచి ఎరుగని పారవశ్యం వాళ్ళ కళ్ళల్లో! అది క్షణికమైనా, ఆ అసూయ వాణ్ణి హంతకుడిగా మార్చింది.
‘‘చూపులో కామం ఉంటే వ్యభిచారమే! ఆడదైనా అంతేగా!‘‘ అనుకునుంటాడు. “మొగుడిని ద్వేషిస్తూ, ప్రేమించడానికి వేరే మగాడిని వెతుక్కుంటుంది ఆడది, సంగీతం, సాహిత్యాల సాకుతో‘‘, ఇదీ అతని కక్ష.
చనిపోతున్న భార్య మొహం చూసి చలించిపోయాడు,‘‘క్షమించు‘‘ అనేలోపే ఆమె క్రోధంతో జ్వలిస్తూ‘‘చంపావుగా చివరకు‘‘ అంటుంది. చివరకు ఆమె దీనమైన మృతకళేబరాన్ని చూశాక కానీ వాడిని పూనిన దెయ్యం దిగిపోలేదు.
‘‘పెళ్ళి అంటే రెండు ఆత్మల సమ్మేళనం! కేవలం శరీరాల కోరికలో అది మునగడం హేయం‘‘ అనే ఇతనికి ఈరకం puritan philosophy ని, లోక రీతిలో భౌతికావసరాలకు చేసుకునే పెళ్ళితో సమన్వయ పరిచే పరిపక్వత లేదు.
చివరికి, ‘‘అసలు మానవజాతి సృష్టి మాత్రం ఎందుకు కొనసాగాలి? పుట్టకుండా ఉండటం కదా మనిషి అంతిమ ఆధ్యాత్మిక లక్ష్యం‘‘!
ఇది మనోవైక్లబ్యమా? ఒక పరాజితుడు చేసే నేరారోపణమా? మనిషితత్వం తో విసిగి చేస్తున్న సత్యాన్వేషణమా?
‘కామం‘పైన పరిశోధనా వ్యాసం ఈ నవలిక.
రచయిత దృష్టిలో ‘అన్నా కెరనీనా’ లోని లెవిన్, కిట్టీలది ఆదర్శ వివాహబంధమేమో.
‘‘నన్ను క్షమించు‘‘ అంటాడు, తన కథను వెక్కిళ్ళ మధ్య పూర్తి చేసి ఒకసారి, కథకుడు రైలు దిగి వెళ్తూ శెలవు తీసుకుంటున్నప్పుడు, మరోసారి
క్షమాభిక్ష అడగడం ఎవర్ని! క్షమించవలసిన అవసరమో, శిక్షించే అర్హతో అధికారమో లేని తోటి రైలు ప్రయాణీకుడినా?!
తన చేతుల్లో నిస్సహాయంగా చనిపోయిన భార్యను, ఏ నేరం చేయకుండా తల్లిదండ్రులిద్దరికీ దూరమై అనాథలుగా మరొకరి పంచలో పెరుగుతున్న తను కన్న పిల్లలని, ఇంకొక మనిషిని హత్య చేయగల రాక్షసత్వం లేని తనలోని అసలు మనిషినీ, దైవాన్నీ ఏమో!
ఈ లౌకిక, పారలౌకిక ప్రశ్నలకు రైల్లో శ్రోత జవాబూ చెప్పడు. శిక్షా వేయడు.
మహా ఐతే జాలి పడతాడు!
దైవం లాగా!
*****
[ఈ పుస్తకం ఆంగ్లానువాదం ఈ బుక్ గా గుటెంబర్గ్.ఆర్గ్ వెబ్సైటులో ఉచితంగా చదవవచ్చు.]
Leave a Reply