తులసి గారి కవితా హృదయం
వ్యాసకర్త: విన్నకోట రవిశంకర్
******
కథలు రాసేవారందరూ కవిత్వం రాయగలరని, కవిత్వం రాసేవారు కథా రచనకు సైతం ప్రయత్నించవచ్చని అనుకోవటానికి లేదు. కాకపొతే, కథకులకు కవితా హృదయం, కవులకు కథలు, నవలలు చదివి ఆస్వాదించగలిగే ఓర్పు ఉండటం వారికి తప్పక ఉపయోగపడుతుంది. ప్రసిద్ధ కథకురాలు, సాహితీవేత్త చాగంటి తులసి గారికి మంచి కవితా హృదయం ఉంది. “రంగంటే ఇష్టం” అనే వ్యాససంపుటిలో అమృతా ప్రీతమ్ గురించి రాసిన వ్యాసం, పూర్ణమ్మ గేయం గురించి చేసిన విశ్లేషణ, రావిశాస్త్రి కథలు, చాసో మాస్టర్ ఆర్టు, పతంజలి రచనా ప్రస్తానం లాంటి అంశాల మీద రాసిన వ్యాసాలు, మహాదేవి వర్మ హిందీ కవితలకు ఆవిడ చేసిన హృద్యమైన అనువాదం మొదలైన రచనలు చదివినప్పుడు మనకీ విషయం స్పష్టంగా తెలుస్తుంది. తులసి గారు ఇప్పుడు తనవైన స్వీయ కవితలతో కూర్చిన సంపుటిని మన ముందుకు తెస్తున్నారు. దీని పేరు “కూనలమ్మ పదాలు – మరికొన్ని కవితలు”. తులసి గారి రేఖా చిత్రంతో అందంగా రూపొందించిన కవర్ డిజైన్ కలిగిన ఈ పొందికైన పుస్తకం చూడగానే ఆకట్టుకుంటుంది.
కూనలమ్మ పదాల గురించి నాకొక ప్రిజుడిస్ ఉంది. అవి ఆరుద్ర మాత్రమే సాధించ గలిగిన అసమానమైన ప్రక్రియలో భాగమని, అనితర సాధ్యమైనవని. ఆరుద్ర రాత, బాపూ గీత కలిసిన ఒక పత్యేక సందర్భంలో అవి రాణించాయని నాఉద్దేశం. నా విశ్లేషణకు ఈ ప్రిజుడిస్ సహకరించదు కాబట్టి, వాటిని వదిలిపెట్టి, కేవలం ఈ సంపుటిలో రెండవ భాగమైన వచన కవితలకు మాత్రమే పరిమితమౌతాను.
కవిత్వం సామాన్యమైన జీవితానుభవాల్ని నిత్య నూతనంగా ఆవిష్కరించాలని, సున్నితమైన సౌదర్యం దృష్టి, చేతనా సౌకుమార్యాలతో మనసుని రంజింపజేయాలనేది నా అభిప్రాయం. అభ్యదయవాదిగా చిరపరిచితులైన తులసి గారు బహుశా సాహిత్యం ఒక విస్తృతమైన ప్రజా పయోజనాన్ని నెరవేర్చాలని భావిస్తారు. అంతమాత్రం చేత ఒకరి కవిత్వాన్ని మరొకరు ఆస్వాదించటానికి అభ్యంతరమేమీ లేదు. ఒక సంపుటి చదివినప్పుడు నన్ను ఆకర్షించేవి నా రచనా దృష్టికి దగ్గరలో ఉండేవేనని వేరుగా చెప్పనవసరం లేదు. సంతృప్తి కలిగించే విషయమేమిటంటే, అటువంటి కవితలకు ఈ పుస్తకంలో కొదవలేదు.
తల్లి కాబోయే ఒక ఇల్లాలు తనకు పుట్టబోయే బిడ్డతో మాట్లాడుతూ పొందే అనుభూతిని చిత్రిస్తూ రాసిన “సీమంతపు తల్లి” కవిత తులసిగారిలో ఉన్న అనేక కోణాల్ని అందంగా ఆవిష్కరిస్తుంది . ఇందులో కథనం ఉంది, ఆ సీమంతపు తల్లి మీద ప్రేమ, తరువాతి తరం మీద ఆశాభావం, నెరవేర్చవలసిన బాధ్యత గురించిన ప్రస్తావన – ఇలా ఎన్నో కలగలిసి ఉన్నాయి. అన్నిటినీ మించి, తల్లి అనుభూతిని, హృదయ స్పందనని తెలుసుకొని, దానికి రూపం ఇచ్చే మంచి మనసు, అందుకు కావలసిన నేర్పు కవయిత్రికి ఉన్నాయని మనకు తెలుస్తుంది.
తులసి గారి సౌందర్య దృష్టి ఎన్నో కవితలలో వ్యక్తమౌతుంది. చినుకుల ఆగడపు ఆటలకు జలదరించే ఆకుల్ని, గేటు కడ్డీ మీద నీటి బొట్లనే వెండి మువ్వల తళతళల్ని, అమ్మ నుదిటి మీది గుండ్రటి కుంకుమబొట్టు లాంటి సాయంత్రపు సూర్యుణ్ణి, టెలిఫోను స్థంభం మీద ఉల్లిపాయ పిట్టల బుల్లి గిరికీల్ని, హరిత పత్రాల ఛత్రం విప్పి నిఠారుగా నిల్చున్న అడుగన్నా పొడుగులేని సింగపూర్ చెర్రీ పసి వీరత్వాన్ని ఈ కవితలలో ఆవిడ చూడగలిగారు. ప్రకృతి మీద, చిన్న జీవుల మీద అనురాగం, వాత్సల్యంతో కూడిన సమభావం వీటిలో నిండుగా ఉన్నాయి.
ఏకాంతం గురించి ఇందులో ఒక మంచి కవిత ఉంది. ఒంటరితనం గుండె చెలమల విషాదాన్ని దోసిళ్ళతో ఎత్తిపోస్తుందని, ఎండుటాకుల గలగల శృతులను ఏడుపుతో ఎగరేస్తుందని చెప్పటం ఎంతో ప్రభావవంతంగా ఉంది. ఐతే, కవితను అదే టోన్ లో ముగించకుండా, ఏకాంతం ఆకులు రాలు కాలం కాదని, దాని మరోపేరు భావి భావనల నిత్య వసంతమని చెప్పటం వారి అభ్యదయ, ప్రగతిశీల స్వభావానికి అనుగుణంగా ఉంది. అలా కాకుండా, నిరాశ ధ్వనించినా సరే, అది ఒక సందర్భంలో, ఒక మానసిక స్థితిలో చెప్పినది కాబట్టి, దానికి కొనసాగింపుగానే ముగింపు కూడా నడిపిస్తే మెరుగ్గా ఉండేదని నాకనిపిస్తుంది.
వయసుతో నిమిత్తం లేని తాజాదనం, ఊహా వైచిత్రి, జీవితంలో ఎదురయ్యేవాటిని ఒక అనుకూల దృక్పథంతో స్వీకరించటం ఈ సంపుటిలో చేర్చిన అనేక కవితల్లో కనిపిస్తుంది. ఒక కవితలో అన్నట్టు నీడల వెంట పరిగెత్తటం అందరూ చేసే పనే. ఐతే, మనసులో కదలాడే మన గత అనుభవాల, ఊహల, ఆలోచనల నీడలకు అక్షరరూపం ఇచ్చే పనిని కొందరు మాత్రమే చెయ్యగలరు. అందువల్ల, అది కథైనా, కవితైనా రచన చెయ్యటమన్నదే మనలో ఆరిపోని చైతన్యానికి గుర్తుగా నిలుస్తుంది.
“దళసరి మొద్దు చర్మాల
భీభత్సపు బ్రతుకు దృశ్యాలు
చూసి చూసి
బండబారిపోలేదు!!
నయం!
నేను బతికే ఉన్నాను!!”
అనే భరోసా కల్పిస్తుంది. తులసి గారు ఇదే విధమైన చైతన్య స్పూర్తితో నూరేళ్లూ తమ రచనలు కొనసాగించాలని కోరుకుంటాను.
Leave a Reply