మృచ్ఛకటికం : శూద్రక

(నోట్: భండార్కర్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్‍స్టిట్యూట్ (BORI) వారి యూట్యూబ్ ఛానల్ లో “సంస్కృత డ్రామా” లెక్చర్ సీరీస్ వింటూ రాస్తున్న వ్యాసాల వరుస ఇది. వీటిని పుస్తక పరిచయాలగానో, సమీక్షలగానో ప్లాన్ చేయడం లేదు. సంస్కృత డ్రామా థియరీ, నాటకకర్త పుట్టుపుర్వోత్తరాల వైపుకి కూడా ప్రస్తుతం పోదల్చుకోలేదు. కేవలం, కథ, కథని నాటకంగా మలచిన తీరు మీద మాత్రమే శ్రద్ధ పెట్టబోతున్నాను. ఇవి, లెక్చర్లు వింటున్నప్పుడు నాటకాలు చదువుతున్నప్పుడు నా రన్నింగ్ నోట్స్ అనుకోవచ్చు.

సీరీస్‍లో ఇది నాలుగో వ్యాసం. అన్నింటినీ ఈ లింక్ లో చూడవచ్చు )

*****

“మృచ్ఛకటికమ్” పేరు చాలానే సార్లు విని ఉన్నాను. కథ ఏమిటో మాత్రం తెలీదు. హిందీ సినిమా “ఉత్సవ్” ఈ రచన ఆధారంగా తీసిందని తెలిసినా, అది గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో వచ్చిందని తెలిసినా చూడడం అవ్వలేదు ఇప్పటి వరకూ. ఎట్టకేలకు ఈ సీరీస్ పుణ్యమా అని పూర్తిగా చదవగలిగాను.

కథా, నాటకీకరణ వివరాల్లోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు:

  1. నాట్యశాస్త్రం ప్రకారం “మృచ్ఛకటికమ్” నాటకం కాదు, ప్రకరణ. అంటే, కథ నాటకకర్త సొంతంగా రాసింది. పురాణాలు, ఇతిహాసాలనుంచి తీసుకున్న కథాంశం కాదు.
  2. ఇందులో నాయకుడు క్షత్రియుడు కాడు, రాజు కాడు. బ్రాహ్మణుడు గానీ, మధ్య తరగతికి చెందిన సామాన్యుడు గానీ కథా నాయకుడు. కథ సామాజిక, సాంఘిక అంశాలని సృశిస్తుంది.
  3. ప్రకరణలో నాయిక పాత్రను బట్టి మళ్ళీ రెండు రకాలు. వేశ్య పాత్ర నాయిక అయితే “సంకీర్ణ ప్రకరణ” అనిపించుకుంటుంది. కాకపోతే “శుద్ధ ప్రకరణ” అవుతుంది.

కథా కమామిషు

“ఈ ప్రకరణ కథని సంక్షీప్తకరించి రాయండి” అని పోటీ పెట్టి బహుమానం ఇవ్వచ్చు. అంత సంక్లిష్టంగా సాగుతుంది. ఎన్నెన్నో పాయలు కలిసిన కథా స్రవంతి ఇది. అయినా ప్రయత్నిస్తాను.

ఉజ్జయిని నగరంలో చారుదత్త అనే బ్రాహ్మణ వ్యాపారుడు, బాగా బతికి చెడ్డవాడు. కటిక పేదరికాన్ని అనుభవిస్తుంటాడు. ఉదార స్వభావుడు. దాత. అతనిపై ఆ నగరంలోని పేరెన్నిక గన్న, అందమైన వేశ్య వసంతసేన మనసు పారేసుకుంటుంది. ఆమెపై రాజుగారి బావమరిది కన్నేస్తాడు కానీ, వసంతసేన ససేమీరా ఒప్పుకోదు. వీళ్ళ ముగ్గురి మధ్య కథలో కొంత భాగం గుడుగుడుమంటూ తిరుగుతూ ఉండగానే రాజుగారి దుష్టపరిపాలన మీద నిరసన వ్యక్తమవుతుంటుంది ప్రజలల్లో. అతనికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తుంటాయి. వారికి కొన్ని సందర్భాల్లో చారుదత్త సాయం చేస్తాడు.

కటిక దరిద్రంలో ఉన్నా వసంతసేన చారుదత్తకి దగ్గరవుతుంది. అయినా రాజుగారి బావమరిది ఆమె వెంటపడుతూనే ఉంటాడు. ఒకసారి తగాదా ముదిరి వసంతసేనని అతడు పీక పిసికి చంపేస్తాడు. చారుదత్తే ఆ చోటుకి పిలిపించాడు కాబట్టి నేరం అతని మీదకు తోసేస్తాడు. న్యాయస్థానంలో కూడా తన హుకుం చలాయించి చారుదత్తకి మరణశిక్ష పడేలా చేస్తాడు. శిక్షని అమలు పరుస్తుండగా వసంతసేన బతికి ఉందని తెలుస్తుంది. రాజుగారిని చంపి ఉద్యమకారుల్లో ముఖ్యడైనవాడు రాజు అవుతాడు. ఈ రెండు పరిణామాల వల్లా చారుదత్తపై శిక్ష రద్దు అవుతుంది.

*****

నాటకీకరణలో మహాద్భుతాలు

శూద్రకుడు ఎవరో, అసలు ఈ ప్రకరణ రాసింది శూద్రకుడేనా? అన్న ప్రశ్నలకి అనేకానేక థియరీలు ఉన్నాయట. భాసుడు రాసిన “దరిద్రచారుదత్తం”లో ఇదే కథ అని, కాకపోతే అది నాలుగు అంకాలు మాత్రమే ఉంటే, ఇది పది అంకాలతో సవివరంగా ఉంటుందట. అందులో చారుదత్త, వసంతసేనల ప్రణయమే ప్రధాన కథాంశం, కానీ ఇందులో రాజకీయాంశాలు భాగం. అందుకని భాసుడే రెండూ రాశాడా, భాసుడు చిన్నగా రాస్తే శూద్రకుడు పొడిగించి రాశాడా, లాంటి అనేక వాదాలు ఉన్నాయట. వీటన్నింటిలో నాకు ఆసక్తికరంగా అనిపించింది: బహుశా శూద్రకుడు నిమ్నకులాలకి చెందినవాడు అయ్యుండచ్చు, అందుకని ఇది నిజమైన పేరు అయ్యుండకపోవచ్చు అని.

ఎంతటి భిన్న వర్గాలు, నేపథ్యాలు, భావజాలాల నుంచి రచయితలు వస్తే సాహిత్యం అంత విభిన్నంగా, సుసంపన్నంగా ఉంటుందని ఇప్పుడు వినిపిస్తున్న మాట. నిజంగానే ఒక శూద్రుడు ఈ ప్రకరణ రచించి ఉంటే ఆ మాటకి ఇదో గొప్ప ఉదాహరణ. భాసుడు, కాళిదాసుని చదివాక దీన్ని చదవడం ఒక గొప్ప అనుభవం, నాకైతే.

వసంతసేన, చారుదత్త ప్రేమ కథ, అధికారక వృత్తాంతం (మెయిన్ ప్లాట్). ఉజ్జయని దుష్ట రాజు పాలకని పడగొట్టడం ప్రాసంగిక వృత్తాంతం (సబ్-ప్లాట్).

మృచ్చకటికమ్ వసంతసేన చారుదత్తలది ఎంతో, అంత జూదగారులు, చోరులు, చండాలులది కూడా! రెండు వేర్వేరు వాటిని దగ్గరకి తీసుకొచ్చి పక్కపక్కగా కూర్చోబెట్టి ఒక్కటే అనిపించేలా చేయడంలో శూద్రకుని జీనియస్ అంతా ఉంది. కథలో ప్రేమకథలోని సున్నితత్వమూ ఉంటుంది, రాజవిద్రోహంలోని హింసా ఉంటుంది. అంగరంగ వైభవోపేతమైన భవనాలూ ఉంటాయి, పాడుబడ్డ గుళ్ళూ ఉంటాయి. ధనం ఉంటుంది, పేదరికం ఉంటుంది. చారుదత్త ఉదారత్వమూ ఉంటుంది, రాజుగారి బావమరిది కపటమూ ఉంటుంది. సంగీత సాహిత్యాలలో పాండిత్యమూ ఉంటుంది, “ద్రౌపదిని ఎత్తుకుపోయిన రావణుడు”లాంటి పామరత్వమూ ఉంటుంది. నోరారా పొడగడమూ ఉంటుంది, నోటికొచ్చినట్లు తిట్టుకోవడమూ ఉంటుంది. చీకటిలో వెళ్ళడానికి భయపడే మగవాళ్ళుంటారు, ధైర్యంగా ఎదురు తిరిగే బలమైన స్త్రీ పాత్రలూ ఉంటాయి. ఇన్ని ద్వంద్వాలున్నా కథ మొత్తం ఏకతాటి పై నడుస్తుంది. ఒక వ్యక్తి కథ చెప్పినప్పటికీ, ఒక నగరం కథ చెప్పినప్పటికీ తేడా అదే అనుకుంటా. నన్నడిగితే, ఇది ఉజ్జయనీ నగరం కథ. ఉజ్జయినీయే ఇందులో అసలైన హీరో.

ఇంకో తమాషా ఏంటంటే… భాస, కాళిదాస నాటకాల్లో కూడా పద్యాలుంటాయి. కానీ అవి మామూలు మాటలే పాట రూపంలో అనుకోవచ్చు. “మృచ్ఛకటికమ్” లో మాత్రం విపరీతంగా వర్ణనలు ఉంటాయి, ఏదో కావ్యంలోనో నవలలోనో ఉన్నట్టు. పేజీలకి పేజీలు వర్ణనలే. దరిద్రాన్ని, వర్ష ఋతువుని, న్యాయశాస్త్రాన్ని అన్నీ వివరంగా, నింపాదిగా వర్ణిస్తూ పోతుంటారు. ప్రదర్శనలు చేసేటప్పుడు నటీనటుల, ప్రేక్షకుల అనుభవం ఎంత అద్భుతంగా ఉండేదో గానీ, చదువుకుంటుంటే మాత్రం కొన్ని చోట్ల గగుర్పాటు కలిగించేంత గొప్ప సాహిత్యం.

ఇందులో పాత్రలు ఏడురకాల ప్రాకృతులు మాట్లాడతారట, తమ స్థాయిని బట్టి. ఒక పాత్ర చేత అప్పటిలో భాషల్లో ఉన్న వైవిధ్యం గురించి ఇలా చెప్పిస్తాడు.



శృంగారం, క్రౌర్యం, భీభత్సం, వీరత్వం, భయానంకం, అద్భుతం అన్నీ ఉండి శాంతంగా ముగుస్తుంది. కానీ అవ్వన్నీ ఒక ఎత్తు, ఇందులో హాస్యమొకటీ ఒకత్తు. ఇంగ్లీషులో చదవడం వల్ల ఆ చిన్నచిన్న గమ్మత్తులన్నీ ఎటూ పోగొట్టుకుంటాం. అయినా కూడా, కడపు ఉబ్బ నవ్వించే సన్నివేశాలు ఎన్నో. ఇందులో జూదగారుల మధ్య పోట్లాటలు, దొంగతనానికి వచ్చినవాడికి నగల గురించి చెప్పి ఇవ్వడం లాంటి సీన్లు మాస్టర్ పీసెస్, కామెడీ రాయడంలో.

ఇందులో ఇంకో గొప్ప అంశం, న్యాయవ్యవస్థ పనితీరు గురించి వ్యాఖ్య. చారుదత్తపై నేరం మోపబడి, విచారణ మొదలై, శిక్ష ఖరారై, దాన్ని అమలుపరిచేవరకూ ఉన్న భాగం, లీగల్ బ్యూరోక్రసీ మీద వచ్చిన ప్రపంచ సాహిత్యమంతటిలోనూ పైన నిలవవలసినది. ఇందులో నన్ను బాగా ఆకర్షించిన మరో విషయం, శిక్ష అమలు పరిచే నిమ్నవర్గాల పాత్రలు, వారి నైజమూ, నియమనిబద్ధతలూ.

వాళ్ళల్లో ఒకడు “శిక్ష అమలుపర్చడంలో తొందరపడకూడదు. నిదానంగా చేయాలి. ఏమో ఏ క్షణంలో ఏమి మారబోతుందో…” అంటూ ఇలా వివరిస్తాడు.

ఇది చదువుతుంటే నాకు జర్మన్ కథా రచయిత, హెన్రీక్ వోన్ క్లీస్ట్ (కాఫ్కాపై ప్రభావం చూపిన రచయితల్లో ఒకరు) రాసిన కథ ఒకటి గుర్తొచ్చింది. “Earthquake in Chile” అనే కథలో ప్రేమించుకున్నందుకు గానూ ఒక యువకునికి ఉరిశిక్ష వేస్తుంది చర్చి. ఉరి తీయబోయే రోజు అతనే జైలు గదిలో దొరికిన తాడుతో ఉరి వేసుకోబోతాడు. అంతలోనే ఆ నగరంలో భయంకర భూకంపం వచ్చి అతను వేలాడబోయిన దూలం విరిగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తక్కిన కథ. ఒక క్షణంలో ఎంత మార్పులు సంభవించచ్చన్నది శూద్రకుడు గుర్తు చేయగానే ఈ కథే మెదిలింది.


అనువాదాలు

నేను మళ్ళీ ఎం.ఆర్.కాలే గారి ఆంగ్లానువాదం మీదే ఆధారపడ్డాను. కొన్ని చోట్ల టైపోలు కనిపించినా, కథని అర్థం చేసుకోవడంలో ఈయన అనువాదాలు బాగా పనికొస్తున్నాయి. Horace A Wilson అనే ఆయన చేసిన అనువాదం 1826 నాటిది. ప్రధమాంకం మాత్రమే చదివాను. అప్పటి భాష కాబట్టి కొంచెం ఇబ్బంది పెట్టింది. పైగా రచన కూడా సంక్లిష్టమైంది కాబట్టి కొంచెం అర్థం కాలేదు. ఇప్పుడు కథతో పరిచయం పెరిగింది కాబట్టి ఆనాటి వారు ఎలా అనువాదం చేశారో చూడ్డానికి బాగుంటుంది. చదవాలి ఎప్పటికో.

తెలుగులో రెండు అనువాదాలు కనిపించాయి. తిరుపతి వేంకటీయంగారి అచ్చ తెలుగు పద్యాలతో చదువుకోడానికి చాలా బాగుంది. ఇది కూడా ఒకట్రెండు అంకాలే చదివాను. తీరిగ్గా చదవాలి.

తెలుగులో మరో అనువాదం, నేలటూరి రామదాసయ్యంగారిది కూడా ఉంది. దాని జోలికి పోలేదు నేను.

బేతవోలు రామబ్రహ్మం గారిది తెలుగు అనువాదం 2005లో వచ్చిందట. ఇప్పుడు దొరుకుతుందో లేదో మరి.

ముఖ్యమైన లింకులు

అనువాదాలు:

మృచ్ఛకటికమ్ ప్రకరణ గురించి తెలుగులో వచ్చిన వ్యాసాలు:

నెమలికన్ను బ్లాగులో

పొద్దు.నెట్ లో నాలుగు భాగాలలో విశ్లేషణ

“మట్టి బండి” పేరుతో ఆకాశవాణిలో వచ్చిన నాటకం : యూట్యూబ్ లో మొత్తం నాటకం ఉంది.

You Might Also Like

One Comment

  1. బొల్లోజు బాబా

    thank you
    మన పూర్వీకులు రాక్ స్టార్స్ అని మీరన్నమాట భలే పట్టుకొంది.
    భాసుని గురించి చదూతున్నాను. కృష్ణ రాయభారం (దూతవాక్యం) లోని కొన్ని వాక్యాలు నేడు మనం రాయలేం. భక్తులు చంపేయగలరు.
    నాకెందుకో ఆరోశతాబ్దానికి ముందు రచనలన్నీ ప్రాకృతంలో వ్రాసిన జైన రచనలు. బౌద్ధ రచనలున్నప్పాటికీ అవి ఎక్కువగా మతబోధనలుగా అనిపిస్తాయి. జైన రచనలు అలాకాదు. శాస్త్ర, సాహిత్య, తత్వ విషయాలు ఉన్నాయి.
    సంస్కృతం పైకి వచ్చాకా ఈ జైన రచనలు మరుగునపడ్డాయి. కొన్నింటిని సంస్కృతంలోకి తీసుకొచ్చారు. చాలా ప్రాకృత గాథలు (నాలుగువేలకు పైగా) లాక్షణిక గ్రంధాలలోకి ఉదాహరణలుగా పట్టుకొచ్చేసారు. ఇది నాకు ఒకరకంగా ఒక అంతరించిపోతున్న భాషలోని సంపదను కాంటెంపరరైజ్ చేయటం లా అనిపిస్తోంది. ప్రస్తుత డిజిటైజ్ చేసినట్లు.
    అలా అప్పటి సంస్కృత రచనల మూలాలు జైన రచనలు కావొచ్చు. ప్రాకృత రచనలలోనే సమాజపు సామాన్యజీవనం ప్రతిబింబించింది. ఈ మృచ్చకటికానికి మూలాలు కూడా జైనం కావొచ్చు.

Leave a Reply