The Stories of Ethos Pathos and Logos – గరికపాటోడి కతలు

వ్యాసకర్త: లిఖిత్ కుమార్ గోదా

*********

Perhaps they were right put love into books. Perhaps it could not live anywhere else.-William Faulkner

ప్రేమలు-  తెలిసిన వ్యక్తులపై అనేక రకాలుగా, అనేక విధాలుగా ఉండొచ్చు. మనకి తెలిసినంతవరకు యువతి యువకులకు మధ్య, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య, స్నేహితునికి తన ప్రియమిత్రుడుకి మధ్య, పెంచుకునే జంతువుల మధ్య అలివిగాని ప్రేమ ఉంటుంది. అవన్నీ మనం చూస్తూనే ఉంటున్నాం. ఆ అనుబంధాల మీద వెలువడిన కతలెన్నింటినో చదివి పరవశించిపోతున్నాం. అలాగే “గరికపాటోడి కతలు” రాసిన గూండ్ల వెంకట నారాయణకి తను పుట్టి పెరిగిన గరికపాడు పల్లె మీద, ఆ పల్లెలో బతికీడుస్తూ; బతుకీడ్చి జ్ఞాపకాలుగా మిగిలిపోయిన తన మనుషుల మీద అలివిగాని ప్రేమ ఉంది. అందుకనే వాళ్లందర్నీ జ్ఞాపకం తెచ్చుకొని కన్నీళ్లు కారుస్తూ రాసుకున్న రాతలివి. వాళ్ల మీద దాచుకున్న ప్రేమ ఒక్క పుస్తకంలోనే బతికుండగలదని నమ్మి నిక్షిప్తపరిచిన కతలు.

ఇవి ఎలాంటి కతలు అని మీరు అడిగితే: కారు చీకట్లో కురిసిన కుండపోత వాన చినుకులు టపటపమని తాటాకుల గుడిసె పైన పడి తాటాకుల మీదగా టపటపమని నేలకు తగిలి చప్పుడు చేస్తున్నప్పుడు ఒక్కో చుక్కా మనసుని నిద్ర లేపి చెప్పిన కతలు. జ్ఞాపకాల దొంతర్లు.
మనకి బాగా తెలిసినంతవరకు పల్లెటూరి కతలంటే అగ్ర-దిగువర్గాల దైనందిన జీవితాల గురించి, దిగువ వర్గం పైన అగ్రకులాల దోపిడీ గురించి చదివి ఉంటాం. కులాలు మతాలు కేంద్రంగా రాయబడ్డ కతల్ని చదివే ఉంటాం. కానీ వాటన్నింటికీ భిన్నంగా ఇవి ఒక పల్లీయుడు అందులోనూ పాతికేళ్ళు కూడా నిండని యువకుడు ఆ ఊరికి దూరంగా జరిగాక, కోల్పోయిన మనుషుల్ని, తను మళ్లీ చూడలేని చెమట దేహాలని, వాళ్ల బ్రహ్మాండమైన జీవనతీరును తలుచుకుని లోకానికి చాటింపు వేసి చెప్పాలనుకుని రాసుకున్న కతలు. ఈ వరకాడదాకో పొలం దున్ని వచ్చి గట్టుమీద అన్నం ముద్దలు తింటున్నప్పుడు పొలమారి, నేలలో కలిసిపోయి తనని తలచుకున్న మనుషులు ఎవరైవుంటారోనని పొగిలిపొగిలి ఏడుస్తూ రాసుకున్న కతలు. మట్టి ముద్రలతో గరికిపాటోడు గరికపాడు పల్లె గురించి లోకానికి చెప్తున్న శాత్రాలు.

ఇందులో మొత్తం 16 బతుకులు. రకరకాలుగా Ethos Pathos and Logos దాగి ఉన్న బతుకులు. క్షుణ్ణంగా చదివి క్లుప్తంగా అర్థం చేసుకోవాల్సిన బతుకులు. పరిస్థితుల వల్ల బతుకులు రూపాంతరం చెందిన విషయాల్ని అవగాహన చేసుకోవాల్సిన బతుకులు. ఆ పల్లీయుల పోలేరు జాతరుంది, పిచ్చమ్మ అవ్వ చెప్పే శాత్రాల తాలూకా జ్ఞాపకముంది, నిండుగా ఆమెతో రాతగాడికి గోరుముద్దుల తీపిరుచిలాంటి స్మృతులున్నాయి, అత్తని సరిగ్గా చూసుకోలేని కోడలుంది, ఆగం బట్టిపొయ్యిన పెదగోపాల్ ఉన్నాడు, కన్నీళ్ళ పర్యంతం చేయగల పసిదూడ… ఇలా మట్టి బతుకులను మన అరచేతుల్లోకి కుప్పగా పోసున్నాయి.
•••

“Telling stories is a way of surviving and continuing to live”Orhan Pamuk, Turkish Novelist

ఈ రాత గాడు మంచి Raconteur. అంటే మంచి Storyteller అని. కతను ఎక్కడ లేవనెత్తి, ఎక్కడ ముగించాలో ఏ మాటలతో ముగించి పాఠకుడిని కట్టిపడేయాలో ఆ నాడీ వ్యవస్థ ఇతనికి తెలిసినట్టుంది. తనూరి యాసని: ఎక్కువగా ప్రాచుర్యం కానీ చారిత్రాత్మక గుర్తింపున్న పల్నాడు జిల్లా యాసతో కతలు చెప్పడం ఇంకో ఆసక్తికరమైన విషయం. తన యాసలో తన వాళ్ల కతలు చెప్పటం ఈ కతలకి బలాన్నిచ్చింది. ఈ పల్లీయుడి నిజాయితీ తన యాసలోనే అర్థమవుతుంది.
★★★

“A being from a planet that no longer existed. The tales which were suspect.” (The Road)Cormac McCarthy 
తన కతలు గాని, తనతో బతికి గతించిపోయిన మనుషులు గురించి గాని, తన పల్లెటూరి లోకపు పోగడ గురించి కానీ ఆ జీవి  రాయకపోతే ఎవురో కల్పనలు జోడించి రాసిన కతలనే నమ్మాల్సి వస్తుంది. అసలు ఆ జనాలు నిజంగా ఉండివుంటారా అనే అనుమానం కూడా కలుగుతోంది.  ఆ కథలన్నీ ఒకోసారి అనుమానాస్పదంగా మారొచ్చును కూడా.     

పల్లీయుల గొప్ప జాతరగా చెప్పుకునే “పోలేరు జాతర” ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించడం లేదు. తరాలు దాటిన జరగని పోలేరు జాతరని తెలిసిన ముదసళ్ళు తమ జ్ఞాపకాలతో జరిపిన విధానాన్ని, ఊరి జనం హడావుడిని మొదటి కతలో నిక్షిప్తం చేశాడు. దీన్ని నేను డాక్యుమెంటేషన్ అంటాను కత కంటే ఎక్కువగా. పోలేరు జాతర తీరుతెన్నులు గురించి లోకానికి పరిచయం చేసిన కత. ఇంకా ఈ కత పైన రచయిత రాజకీయ దృక్పథం కూడా ఉండి ఉండొచ్చు. బ్రాహ్మణుల విగ్రహారాధన, పూజ, భక్తి విధానాల సంస్కృతి ఇక్కడిది కాదని, ఇక్కడి అసలైన జానపదుల జీవ సంస్కృతి ఏదో చెప్పాలని రచయిత ఈ కత రాసి ఉండొచ్చు.

కతలన్నింటిలో రాతగాడి ధైర్యాన్ని మెచ్చుకునేటట్టు చేసినది – “ఎల్లుటూరి సీనుమామ జచ్చిపొయ్యాక మత్తగతి అట్టయ్యింది” అన్న కత. ఊర్లో భర్త చనిపోయిన భార్య స్థితి ఎంత దుర్భరంగా ఉండి ఇంకో మగాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న సంఘటన స్వయంగా ఆమె కూతురు కళ్ళారా చూస్తే ఆ కూతురికి తల్లిపై కలిగే జుగుప్స, అసహ్యం మనకి కతలో మనీషాలో కనిపిస్తుంది. అలాగే కాస్త హాస్యబద్దంగా, ఊరి ప్రజల అక్రమ సంబంధాలు, వాటిని కప్పిపుచ్చుకునేందుకు వాళ్ళు సృష్టించే కట్టు కతలలో ఒకటి- “ఊళ్ళోకి కొండ సిలువొచ్చింది”.

అతనికి తన నాన్నమ్మకి మధ్య అల్లుకుపోయిన రక్తసంబంధప్రేమని పసివాడి అమాయకత్వపు కోణంలోంచి చూపెట్టిన కత- “మా పిచ్చమ్మవ్వ జెప్పే శాత్రాలు”
సినిమాల్లో హీరోల నుండి విలన్లుగా మారే కాల్పనిక కతలను చూసుంటాం. “ఆగం బట్టిపొయ్యిన మా పెదగోపాల్ మావ” చదువుతున్నప్పుడు ఊరిలో కొందరి జీవన పరివర్తన ఎలా దిగజారి చివరికి కాటికి చేరుతుందో చెప్పే సస్పెన్స్ లాంటి కత.

ఇవి టెక్నిక్ని ఎత్తుగడని బేస్ చేసుకుని రాసిన కతలు కాదు. కాసేపు నవ్వుకోడానికి ఇందులో గాసిప్లు ఉండవు. మనుషుల కన్నీళ్ళ చెమటచుక్కల ఘోష. మొక్కుబడిగా రాసుకున్న కతలు కావు. పరిపూర్ణంగా తెలిసిన పల్లీయుల మనోగీతపు జీవన ఆంతర్య-బాహ్య రేఖలు. సబాల్టర్న్ కతలు.

•••

“Find the key emotion this may be all you need now to find your short story”- F. Scott Fitzgerald 
ఈ రాతగాడు కతకిచ్చే ముగింపు స్థాణువయ్యేలా చేస్తుంది మనసుని. నిజానికి కతకి చాలాసార్లు ముగింపే ఆయువుపట్టు‌. ఆయువుపట్టుని బలంగా పట్టుకుని ఏ రీతికి తగ్గట్టు ఆ రీతికి ముగింపు మాట్లాడతాడు. 

నచ్చిన కొన్ని ముగింపు వాక్యాలు:

“మా గోయిందమ్మవ్వ జచ్చిపొయ్యాక ఊళ్లో జనం అత్తని జంపిందని మా పెదమ్మని మవ్వ పేరుతో గోయిందమ్మని బిలవడం మొదలుపెట్టింరు.ఇప్పుడు ఎవ్వురైన మా పెదమ్మ పేరు తిరుపతమ్మ అంటే ఎవ్వురికి దెలీదు.” (మా గోయిందమ్మవ్వకు ఎట్టాడి సావొచ్చిందో)

“మవ్వ మంచవులో పండుకొని నిదరబొయ్యాక, మవ్వ బొంద సుట్టూ పిచ్చి మొక్కలు పెరిగుంటే, నే నవ్వా ఒక శాత్రాం జెప్పవా అని ఏడుత్తా దిరుగుతున్నట్టు కలొచ్చింది ఆ రెయ్యి” (మా పిచ్చమ్మవ్వ జెప్పే శాత్రాం)

“ఊరోళ్ళ నోళ్ళల్లో నానీనానీ వాళ్ళ నోళ్ళల్లోనే పొద్దు బొడిసిండు మా పెద గోపాల్ మావ” (ఆగం బట్టిపొయ్యిన మా పెదగోపాల్ మావ)

ఒక్క ముగింపులోనే కాదు, కళ్ళకు కట్టినట్లు ఏకధాటిగా ఎక్కడ కించిత్ సందేహం కలగకుండా జీవిత పార్శ్వాలను తడుముకుంటూ రాసిన కతలివి. కతలకి పెట్టిన శీర్షికల్లో కొన్నిచోట్ల సోలొమోన్ విజయ్ కుమార్, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రభావితం ఉందేమో అని అనిపించింది. ఇది అనుకరణ అనుకోలేము గాని కత యొక్క పూర్తి సంగ్రహ విషయాన్ని ఒక వాక్యంలో చెప్పాలని ఈ శీర్షికలు ఎన్నుకొని పెట్టి ఉండొచ్చు. పల్లెటూరోళ్ళు మాట్లాడే పచ్చిబూతులు ఉన్నాయని ఈ జీవితాలున్న కతలని పక్కన పెడితే పల్లెటూర్లో తిరిగాడుతూ పొందే అనుభూతులను పోగొట్టుకున్నట్లే. బూతులు జానపదులు రాయని కావ్యాలు.

సోలొమోన్ విజయ్ కుమార్ ‘మునికాంతపల్లి కతలు’, నామిని కతలు, సం.వె రమేశ్ ’కతల గంప’, ఎండపల్లి భారతి ‘ఎదారి బతుకులు’ కతకులలాగా వాళ్ళ కతల్లాగా, తీసుకున్న తన మనుషుల బతుకుని చెక్కుచెదరకుండా రాసిన కతలివి. మట్టికాళ్లతో గుడిసెలోకి వచ్చినంత సంబరం కలుగుతుంది ఈ గరికిపాటోడు చెప్పిన కతలు విన్నప్పుడు. 

“There is no greater agony than bearing an untold story inside you”-Maya Angelou
వేదనాపూరితమైన బతుకుల్ని ఎన్నో ఏళ్లుగా గుండెల్లో మోస్తూ కతల్లాగా ఫేస్బుక్లో సిరీస్ గా రాసిన రాతగాడికి, కతల్ని BUL BUL BOOK CAFE నుండి పుస్తకంగా వెలువరించిన Vijay Kumar SVKకి ఇద్దరికీ నెనర్లు.

లిఖిత్ కుమార్ గోదా. ఇంటిగ్రేటెడ్ యంఏ తెలుగు -2వ సంవత్సరం,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.ఫోన్: 9640033378

For copies:Contact: +91 6302 500 028 (శ్రీనిధి)గూగుల్ పే/ ఫోన్ పేవెల: ₹150(including the postal charges)

You Might Also Like

Leave a Reply