మోహనస్వామి: వసుధేంద్ర

వ్యాసకర్త: ప్రసాద్ చరసాల

మోహనస్వామి చదివి ఏడాది పైనే అయింది. చదివినప్పుడూ, ఆ తర్వాతా కూడా ఆ కథలు నన్ను వెన్నాడుతున్నాయి. ఈ కథలు చాలావరకూ రచయిత జీవితమే. రచయిత తన్ను తాను “గే”గా ప్రకటించుకోక ముందునాటికే రచయితగా కన్నడనాట ప్రసిద్దుడు. ఈ కథా సంపుటాన్ని అతని స్వీయచరిత్రగా అనుకోవచ్చును.

మన సాహిత్యమూ, సినిమాలూ, సంబాషణలూ అన్నీ కూడా స్త్రీ-పురుష సంబంధాల మీదే. మన చుట్టూ గేలు, లెస్బియన్లు తదితర పలు రకాల సెక్స్ ఓరియెంటేషన్ వున్నవారు వున్నారని తెలిసినా మనం ఆ విషయాలు మాట్లాడము. పరిపూర్ణమైనదేదీ లేదు, రంగులన్నీ కేవలం తెలుపూ, నలుపూ కాదు. నలుపూ, తెలుపుల మధ్య ఎన్ని వర్ణాలో మనుషుల లైంగిక అవస్థలూ అన్ని రకాలు. కేవలం స్త్రీ-పురుషుల సంగమమే సక్రమం, సహజం అనుకునే సమాజంలో స్త్రీ-పురుషుల బంధాలనే సరిగ్గా అర్థం చేసుకోలేని దశలో ఇక పలువిధాల లైంగికతలని అర్థం చేసుకొనే అవకాశమేది? అలా అర్థం చేయించేందుకు దోహదపడే సాహిత్యమేది? ఆ లోటులోకి ఒక మహా ప్రవాహంలా వుదృతంగా దూసుకొచ్చింది ఈ వసుధేంద్ర రచన- “మోహనస్వామి”. ఇది చదవక ముందు స్వలింగ సంపర్కులంటే ఎలాంటి అభిప్రాయాలున్నా, చదివిన తర్వాత కొంతైనా మారకుండాపోరు.

“చిక్కుముడి” అనే కథలో మోహనస్వామి తన ప్రియుడు కార్తీక్ తో కలిసి వుంటాడు. ప్రియుని పట్ల అతని ఆరాధన, ప్రేమ, అతనితో శృంగార సుఖం, అతని పట్ల విరహం… ఎంత అందంగా, హృద్యంగా వర్ణించబడ్డాయంటే “గే” అంటే అదో భయపడే పీడకల కాదు, దూరంగా పారిపోయి చీదరించుకునే అసహ్యం కాదు అని పాఠకులు అనుకుంటాడు. స్త్రీ-పురుష సంబందాలలో స్త్రీ అయినా, పురుషుడయినా తమ ప్రేమను పదిమందికీ తెలిసేలా చెప్పుకుంటారు, తమ కష్టాన్నో, నష్టాన్నో మరొకరితో పంచుకుంటారు. వారికి ఏదో ఓ చోటునుండీ ఓదార్పు దొరికే అవకాశం వుంటుంది. కానీ గే ఎవరితో చెప్పుకోగలడు. ఇదే కథలో శోభా ఆంటిని ఆమె భర్త చేయి మెలితిప్పి గాయపరిస్తే “బోడిముండాకొడుకు, చేయి మెలి తిప్పేశాడు. ఎంత నొప్పెడుతోందా తెలుసా” అంటుందామె మోహనస్వామితో. అదే ముట్టుకోబోయిన తనను ముట్టుకోవద్దని కార్తీక్ చేయి మెలి తిప్పి గాయపరిస్తే ఎవరికి చెప్పుకోగలడు మోహనస్వామి! కేవలం ఇంట్లో వున్న కృష్ణుడి విగ్రహం ముందు కూర్చుని, తన ఎడమచేతిని అతని తలమీద పెట్టి (కుడిచేయి నొప్పెడుతోంది గనక) “కృష్ణా! ఇదిగో చూడు శపథం చేస్తున్నాను-ఇక ఎన్నడు ఆ దుష్టుడైన కార్తీక్‌ను నేను మాట్లాడించను. అతన్ని తాకను. అతని గురించి ఆలోచించను.” అని శపథం చేస్తాడు. కానీ అది జరిగిన మూణ్ణాళ్లకే కార్తీక్ పుట్టినరోజుకు బహుమతి తీసుకెళతాడు.

“సైకిల్ సవారి” అనే కథలో వృద్దాప్యంలో కన్నందుకే తనబిడ్డ ఇలా అయ్యాడని కోపంలో తల్లి తనను “ఆడంగివెధవా” అని తిట్టినందుకు మోహనస్వామి, అతని తల్లి ఎలా రోదిస్తారో చూసి చదువుతున్న మనకు కన్నీళ్ళు రాకమానవు. నన్నలా ఎందుకు పిలిచావంటాడు తల్లితో మోహన స్వామి.

“నువ్వు మగపిల్లాడిలా ప్రవర్తించాలి నాయనా… అప్పుడు అలా పిలవరు” అంటుంది తల్లి.

“మగపిల్లాడిలా అంటే ఎలాగమ్మా?” అతడి ప్రశ్న.

“మాట్లాడే స్వరం, కాళ్ళు చేతులూ, కళ్ళు తిప్పడం, ఆడే ఆటలు అన్నీ మగ పిల్లల్లా వుండాలి కదా?”

“వాళ్లకు అదంతా ఎవరు నేర్పిస్తారమ్మా? నాకెందుకు ఎవరూ నేర్పించరు?”

“ఎవరైనా వాటిని ఎందుకు నేర్పిస్తారు నాన్నా?… ఆ దేవుడే అవన్నీ నేర్పి పంపుతాడు.”

“అలాగైతే నాకెందుకు ఆ దేవుడు వాటిని నేర్పి పంపలేదు? నేనేం తప్పు చేశాను?” అని అడుగుతాడు మోహనస్వామి.

ఇది మనక్కూడా వేసిన ప్రశ్న. ఏమని చెబుతాం సమాధానం?

కులం వల్ల బాధితులు అయినవారికి తన స్వకులం అయినా అండగా నిలబడుతుంది. లింగవివక్ష ఎదుర్కొన్నవారికి అదే సమూహంలో మరొకరితో చెప్పి బాధను పంచుకోవచ్చు. కానీ ఒక దేహంలో మరో కోరికతో పుట్టినవారికి ఏ వుపశమనమూ లేదు. వారు తమ బాధను, కోరికనూ, అవమానాన్ని, దోపిడినీ ఎవరితోనూ పంచుకోలేరు. ఎవరికీ చెప్పుకోలేరు. చివరికి స్వంత తల్లికీ, తండ్రికీ, సోదరులకూ చెప్పుకోలేరు. ఈ వొంటరితనం భయంకరమైనది. గే అని చెప్పుకుంటే తన కుటుంబమే తనను కడతేర్చవచ్చు కూడాను. “అనఘ” అనే కథలో కల్లేశి అనే గే అబ్బాయిని వాళ్ళ నాన్న కాలికి తాడుకట్టి తలకిందులుగా పాడుబడిన బావిలోకి వేలాడదీస్తాడు. అంతటితో ఆగక కొడుకును ఆ వూరిలో వేశ్య దగ్గరికి తీసుకెళ్ళి మగతనం వుందేమో చూడమంటాడు. ఆమె అతనిలో “కాముడు” లేడని చెప్పగానే… అగ్రహోదగ్రుడై లోపలికి దూరి, విప్పిన బట్టలు ఎదకు ఒత్తుకొని నగ్నంగా కూర్చుని వున్న కొడుకును ఒక్కమాటా మాట్లాడకుండా కాళ్ళతో తంతాడు. కాళ్ళమీదికి ఎక్కిన చీమలను జాడించినట్లు ఎగిరెగిరి వాడిని తొక్కుతాడు. ఆ దెబ్బలకు తాళలేని కల్లేశి “కొట్టొద్దు నాయనా” అని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తాడు. చివరికి ఆ వేశ్యనే వాడిమీదపడి వాడిని కరచుకొని “మరొక దెబ్బవేస్తే నామీదొట్టు. ఇది పరమాత్మ చేసిన సృష్టి. మనిషి చేసింది కాదు. వాన్ని కొట్టి దైవాన్ని అవమానించకు.” అంటుంది.

“నల్లి” అనే కథలో లింగమార్పిడి చేయించుకొని ఇంటికి తిరిగివచ్చిన బిడ్డను ఇంట్లోవాళ్ళే చంపేసి “ఆత్మహత్య” నాటకం ఆడతారు. వూరంతా ఆ చంపిన వాళ్ళమీదే సానుభూతి చూపిస్తుంది తప్ప ఆ చనిపోయినవాడి పట్ల ఏ బాధనూ చూపించదు. ఆ వూర్లో కొమ్మి అనే  చంపబడిన వ్యక్తి గురించి ఇలా అంటాడు మోహనస్వామితో, “”ఎన్నాళ్ళని అవమానాన్ని భరిస్తూ జీవించడానికి సాధ్యం? ఎంతో గౌరవంతో బతికిన వంశం గౌడగారిది. ఆయనకూ ఓర్పు నశించింది. ఒక రోజు ముగ్గురూ కలిసి గొంతు నులిమేశారు. ఊళ్ళో ఇప్పుడు అందరికీ మనశ్శాంతి.” 

ఇలా ప్రతికథా “గే” వైపు నుండి మనకు వాళ్ళ సుఖాన్ని, కష్టాన్ని, శృంగారాన్ని, విరహాన్ని చూపిస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం.

మోహనస్వామి

రచన: కన్నడ మూలం – వసుధేంద్ర 

తెలుగు అనువాదం: రంగనాథ రామచంద్రరావు

ఇదివరకు పుస్తకం.నెట్ లో మోహనస్వామి ఆంగ్లానువాదం గురించి పరిచయ వ్యాసం ఇక్కడ.

You Might Also Like

Leave a Reply