ఈస్తటిక్ స్పేస్: పద్మాకర్ దగ్గుబాటి

వ్యాసకర్త: పద్మజ సూరపరాజు

వదులుకోగలగడం అనే ఒక గుణం అసలు ఒకటి ఉందని తెలియడానికి ఒక పెద్ద మనిషికి  ఒక చిన్న పిల్ల చేతి దెబ్బ కావలసి వచ్చింది, బలపాలతో మొహం మీద కొట్టి మరీ చెప్పింది ఈ పాఠం, తనకు ఉదారంగా హుషారుగా చదువు చెప్పడానికి వచ్చిన సారు కు. ఆ సారు కు ఐక్యూలు , ఆస్తులు, అక్షరవిద్యలు  కూడా ఆ పిల్ల ఉండే ఊరు లాంటివి ఓ నూరు ఊర్ల జనానికి సరిపడేంత ఉన్నాయి. 

‘‘సాహిత్యం సాహిత్యం కోసమే‘‘ అనే  సావకాశ దృక్పథంతో సుఖం గా luxury couch లో ఉందామనుకున్న రచయితల్ని, పాఠకుల్ని కూడా కొంచెం ఆ సీట్లోంచి కదిలి నిలబడి కొంచెం ఆలోచించండనే కథలు ఇవి.

నిజానికి ‘‘ఏదో ఒక సందేశం ఇవ్వటానికి కాదు నేను వ్రాసేది ‘‘ అనుకునేవారిని కూడా వ్రాయడానికి ప్రేరేపించే సంగతేదో, అదొక, బాధే, భావమే అయినా అది కచ్చితంగా తన చదువరిలో ఒక ఎఱుకను కలిగించి తీరుతుంది. కథలో సంగతికి కార్యకారణాలూ, అందుకు వ్యక్తులు గా, సమాజం గా తమ తోడ్పాటు , దానిని సరిదిద్దుకోవాలసిన తమ ఆవశ్యకత పాఠకుల దృష్టికి రాకుండా ఉండవు.

 “Moral in the story” అంటూ కథలను ఎద్దేవా చేయలేం. బండగానో, సన్నగానో అనివార్యంగా ఒక సూచన, మంచి ఆలోచన ఉంటాయి కథలన్నిటిలో. 

 ఆ సూచన ఎంత సున్నితంగా, తెలివిగా, ఎవరితో ఎవరికి, కథలో ఏ stage లో చేయాలో  చేయడం లోనే  రచన నాణ్యత కనిపిస్తుంది. అటువంటి నాణ్యత ఎక్కువ, నాటకీయత తక్కువా ఉన్న కథలు పద్మాకర్ గారి ‘ఈస్తటిక్ స్పేస్‘ లోని 17 కథలు. పాపులర్ పద్దెనిమిది సంఖ్య అందుకుందామని పోనీ ఇంకోకథ ఏదోటి వ్రాసిపారేద్దాం అనుకోకుండా తీసుకొచ్చిన ఈ సంకలనం, ఇరవై ఐదేళ్ల వ్యవధిలో, కనీసం ఏడాదికొకటి  కూడా లేకుండా, రచయిత చేసిన నిదానమైన సృష్టి. 

మనమూ చాలా నిదానం గా చదవవలసిన కథలివి. వీటి భాష, శిల్పం కష్టమై కాదు, నిజానికి, to be simple is extremely difficult కదా , చాలా సులభంగా చెప్పిన మామూలు కథలను కుని  వీటిని చదివే వారికి మయసభలో సుయోధన అనుభవమవగలదు.

కథలు చెప్పవలసిరావడం వాస్తవానికి శోచనీయం, అందులో ఇంకా ఇప్పుడు కూడా,  ఆర్థిక అసమానతల గురించి , కాపురాల గురించీ, రకరకాల అణచివేతల గురించి!

కానీ కాలమెంత సాగినా , ఎవరో అన్నట్లుగా, మళ్ళీ మళ్ళీ అడవులన్నీ కొట్టి కలాలు చేసి సముద్రాలు ఇంకే దాకా అందులో ముంచి వ్రాస్తున్నా లోకంలో కష్టాలు ఆఖరవడంలేదు.

చర్చించక తప్పని సమస్యలను తిరిగి ప్రస్తావిస్తూ, పదే పదే అదే చెప్తున్నారనే వెక్కసం కలగనీయకుండా కథ చెప్పేందుకు  ఆ చెప్పే కళ  ఎప్పటికప్పుడు పదునౌతుండాలి. అందుకు, చెప్పే విషయం లో ప్రత్యక్షంగా నో , పరోక్షంగా నో స్వానుభవం కొంత, సానుభూతి మరింత, సంయమనం కావలసినంత , కలిగి ఉండడమే ఏకైక అర్హత, బాధ్యత కూడా.

ఆ మూడు పుష్కలంగా ఉన్న కథారచయిత పద్మాకర్ గారు.

ఈ పుస్తకం లో మొదటికథ ‘ యూ టర్న్‘ స్థూలం గా, ఒక సంపన్నుడు అనుకోని విధంగా తనకు ఎదురులేని ముందుకెళ్తున్న ప్రయాణంలో ‘తగిలిన‘,  కలిగిన కాదు , ఒక కుదుపుకు వెనక్కి మార్గం వెతుక్కోవడం. ఇంతదాకా చేసిన ప్రయాణం లో డబ్బు, పేరు పోగేసుకోవడమే విజయాల పరంపర అనుకుంటూ ఇంకా అదే దిశలో ముందుకు వెళ్ళబోయేవాడికి వెనక్కు మళ్ళడంలోనే ఇప్పుడు తన పురోగమనం ఉన్నది అని గ్రహింపు కు వచ్చిన విధాన్ని కొత్తగా చూపించాడు రచయిత. 

ఒక చిన్నపిల్ల తనకు కేవలం నాలుగు ముక్కలు చదువు ఓ నాలుగు రోజులపాటు చెప్పిన (అది నిజానికి, ఆయనకు , తన తలకెక్కిన వ్యాపారలాభాల నిషాను దించుకునే వేసవి విడిది, ఆయన ఔన్నత్యంగాకనిపించే ఆటవిడుపు లాటి వ్యాపకం) సారుకు తను పదిలంగా తనకే ప్రత్యేకంగా దాచుకున్న, తన దృష్టి లో తన సర్వస్వమైన బలపాల కట్టలు తెచ్చి కృతజ్ఞత గా ఆయన ముందు కుప్ప పోస్తుంది తృప్తిగా.

ఆ చర్య కు ఆ పసిపిల్లను ప్రేరేపించిన ఒక మానవ అవలంబనీయ సూత్రం ఏదో దాన్ని అతను అంత సులభంగా చూడగలగడం కూడా విశేషమే, అది జీర్ణం చేసుకోవడానికి తర్వాత ఒక డాక్టర్ సాయం అవసరమైనా. ఆ మార్పు నాటకీయంగా కనిపించకుండా ఉండేందుకు, పాఠకులకూ  కొన్ని ముఖ్యమైన మాటలు స్పష్టం గా వినిపించేందుకు సైకో అనాలసిస్ లాంటి సంభాషణలు కథలో అవసరం అయ్యాయి, కానీ అవి అక్కడ అసందర్భంగా నో, కథారూపాన్ని చెడగొట్టినట్టుగానో లేవు.

‘S/O అమ్మ‘ కథ ఎంత మంచి పరిణామానికి దారి తీసిందో! తమిళనాడు ప్రజలు ఎప్పటికీ కృతజ్ఞులై ఉండవలసిన కథ ఇది.

 ఒకడి జన్మకు, కేవలం అందుకే కారణం అయి, ఆతర్వాత వాడికి, వాడి తల్లికి మొహం కూడా చూపించకుండా తన పేరు మాత్రం మోసుకుతిరగమని కొడుకును వదిలేసి పోయిన తండ్రిని, వాడి పేరును వదిలించుకోగలను అనే ధిక్కారం తో రోసిన ఒక యువకునికి జీవితం అంతాను, చావు తర్వాత కూడా ఆ తండ్రి పేరు భేతాళుడి శవం లాగా భుజాన బరువుగా వేలాడుతునే ఉంది, చికాకు పెట్టే ఒక చిక్కు ప్రశ్నగా వెక్కిరిస్తునే ఉంది. ఆ శోకం తాలూకు తీవ్రత పాఠకులకు తగిలేందుకా అన్నట్లు అతను పాపం సగం ఆయుర్ధాయంలోనే పోతాడు. కానీ ఆ త్యాగం తమిళరాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక కొత్త చట్టం చేయనిచ్చింది, ‘‘ఇకపై పిల్లలు కావాలంటే వాళ్ళ అమ్మ బిడ్డలుగా నే మనవచ్చు గవర్నమెంట్ రికార్డ్ లలో‘‘ అని. రచయిత తీసిన ప్రాణం వృధాగా పోలేదు.

భార్యాభర్తల బంధం  పాతబడి ముతక కంపు కొట్టే లోపల ఒక పిడికెడు sensitivity, ఓ గుప్పెడు patience వొంపుకుంటే కాపురం మల్లెల తీరం చేరవచ్చు అనే కథ ‘ఒక భార్య  – ఒక భర్త ‘, .  

‘ఇనుపతెర‘, పిల్లల్ని బొమ్మలతో ఐస్క్రీం తో ప్రేమిస్తున్నామని బెత్తం తో పూజించే అమ్మాఅయ్యలారా మీ పిల్లలు పెట్రోల్ పోసి రోడ్ మీద నడపే మీ స్టేటస్ సింబల్స్ అయిన మోటర్బండ్లు కాదు, క్రమశిక్షణ పేరుతో రకరకాల సైజుల్లో ఇనపపళ్ళ చక్రాలలో నలుగుతున్న వాళ్ళ వేదన కాస్త చూడండి అంటుంది. ఈ రచయిత కు యావత్ ప్రపంచంలోపిల్లలొకటే భద్రపరచుకోవలసిన నిధులు, జాగ్రత్త గా పెంచుకోవాల్సిన మొక్కలు. పిల్లల మనస్తత్వాన్ని ఆయన అర్థం చేసుకున్న తీరు చాలామంది సైకలాజికల్ కౌన్సిలింగ్ కు గంటకు వేలు దోచేవాళ్ళ దగ్గరకూడా చూడలేం. 

ఈ ఒక కథే కాదు సందర్భం ఉన్నచోటల్లా పిల్లలను పిల్లలుగా చూస్తూనే వారి పెద్దపెద్ద సమస్యలను మాత్రం చిన్నవిగా చూడకండి అనే ఈయన ఆక్రోశం వ్యక్తమవుతుంది.

కళలకు , వాటి కర్తలకు కండిషన్స్ పెట్టే సదరు కళాపోషకులను నవ్వుతూనే వివస్త్రలను చేసే కథ ‘ లక్షరూపాయలకథ‘.

 ఈ రచయిత మనిషి మనసు పొరలన్నీ సున్నితంగా ఒలిచి వైనంగా ఎండగట్టి, వాటి ఓనర్ను కాలర్తో లాక్కెళ్లి , ఓ చెత్త పనిచేసిన కుక్కని గుంజుకెళ్ళి దాని ముక్కును అది చేసిన రొచ్చులో పెట్టినట్టు పెడతాడు.

‘సెవెన్త్ సెన్స్‘ కుక్కల గురించే, మొరిగే కుక్కల సాటి కూడా మనుషులం బాధ్యతగా ఉండడంలేదే, వేడి వేడి వార్తలు కావాలి తెల్లవారిందనడానికి గుర్తుగా, పేపర్ తో తుడిచిపడేస్తాం పౌరులుగా మనకుండవలసిన జాగరూకతను మటుకు. వార్తాహరులారా పేపర్ మాత్రం చదివేసి పిమ్మట గాంధీగారి కోతులు కాకండి అంటుంది ఈ కథ.

‘పరిధులు, ప్రమేయాలు‘ లో  పతితులకు, బాధాసర్పద్రష్టులకు లీడరైన శంకరయ్య ‘‘ముందు నీవు ఇంట్లో అణగద్రొక్కడం మానేయ్ నాయనా ‘‘ అని కూతురు తో చెప్పించుకుంటాడు. ‘‘నీవు yes or no  ప్రశ్నలు వేసి చాలా స్వేచ్ఛ ఇచ్చాను జవాబులిచ్చేవాడికి అనుకోకు, ఆ పరిధి దాటి ప్రశ్నలు వేసే ధైర్యం నీకు వచ్చిన నాడే నీ చుట్టూ మనుషులకు స్వాతంత్రం వచ్చినట్టు అని స్ఫటిక సదృశం అయిన తెలివిడి ఇస్తుంది ఒక ఇంట్లో డిక్టేటర్ బయట అంబేద్కర్ లాంటి తండ్రికి కూతురు. అంటరానితనం నిర్మూలించే నిచ్చెనలో హైయరార్ఖీ లు: కులం, జాతి, ధనం, లింగభేదం, ఇందులో అట్టడుగున మళ్ళీ ఓ ఇంట్లో పెళ్ళామే.

‘ఈస్తటిక్ స్పేస్‘ లో రచయిత, రెండు పాత్రల ద్వారా చేసిన intellectual discourse ఒక ముఖ్యమూ సున్నితమూ అయిన human problem ను చాలా sensitive గా polite గా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుంది. మనిషి వాంఛ లో అవసరం, నీతి, నియతి, కృతజ్ఞత, ప్రేమ , గౌరవం, జాలి ఇన్ని మిళితం అయి ఉంటాయి, పశువుల సాటి చేయలేమా మనం, నియంత్రణ భౌతికంగా కాదు మానసికంగా చేసుకోగలగాలి అని చక్కగా చెప్పిన కథ. శరీరాల మేళనం కాదు ఆత్మల సమ్మేళనం కోరుకోవలసినది, అందుకు ఒక చూపు, కరచాలనమైనా చాలు అంటాడు మిత్రుడితో కథలోని గడుసు రచయిత.

ప్రేమకు పూర్తి అనుభూతిని ప్రాప్తం చేయగలిగేవి తలకొక రకం అవవచ్చు , కొందరికి రూపం, కొందరికి విదేశీ ధూపం, అలా. చాలా కొద్దిమందికే ఆతృప్తి నిజాయితీ నిండిన స్వేదగంధంలో దొరుకుతుంది. ధనరాశులలో  దొరకని జీవవాయువు కంపకొయ్యల్లో మలయమారుతం లా వీచింది ‘ఒయాసిస్’ లో పరితపించే ఒక  ప్రేమనిర్ధనుడికి.

ఆనందం తో పాటుగా ఆలోచననూ, తగుమోతాదులో ధర్మాగ్రహాన్నీ పాఠకకుడికి కలిగించే మరికొన్ని ఇలాంటి కథలున్న ‘ఈస్తటిక్ స్పేస్‘ పుస్తకం జనం ఆనందం గా మర్చిపోయిన పలువిషయాలను తల్లిలా వాళ్ళ కు చురుగ్గా ఒక వెన్ను చరుపు చరిచి స్పృహ , సిగ్గు కలిగించి మళ్ళీ కొంచెం ఆశ కలిగిస్తుంది, ‘‘మనుషులం కదా మనం మెరుగవగలిగే అవకాశం కలిగినవాళ్ళం‘‘ అని భుజం తట్టి స్నేహితుడిలా చెప్తుంది. అందమైన వాక్యాలవెంట పరిగెత్తకుండా, అర్థం, ఆలోచనలతో నిండిన నిదానంగా చెక్కిన వాక్యాలతో జీవితం లోతుల్లోకి వెళ్లి చూసొచ్చే కాగడాల వంటి కథలివి.

కావలసినంత మేత, వ్యాయామం మనిషి మేధకూ, హృదయానికీ గ్యారంటీ ఇచ్చే పుస్తకం ఈ ‘ఈస్తటిక్ స్పేస్’. 

You Might Also Like

Leave a Reply