అభిజ్ఞాన శాకుంతలం: కాళిదాసు

(నోట్: భండార్కర్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్‍స్టిట్యూట్ (BORI) వారి యూట్యూబ్ ఛానల్ లో “సంస్కృత డ్రామా” లెక్చర్ సీరీస్ వింటూ రాస్తున్న వ్యాసాల వరుస ఇది. వీటిని పుస్తక పరిచయాలగానో, సమీక్షలగానో ప్లాన్ చేయడం లేదు. సంస్కృత డ్రామా థియరీ, నాటకకర్త పుట్టుపుర్వోత్తరాల వైపుకి కూడా ప్రస్తుతం పోదల్చుకోలేదు. కేవలం, కథ, కథని నాటకంగా మలచిన తీరు మీద మాత్రమే శ్రద్ధ పెట్టబోతున్నాను. ఇవి, లెక్చర్లు వింటున్నప్పుడు నాటకాలు చదువుతున్నప్పుడు నా రన్నింగ్ నోట్స్ అనుకోవచ్చు.

సీరీస్‍లో ఇది మూడో వ్యాసం. అన్నింటినీ ఈ లింక్ లో చూడవచ్చు )

*****

శకుంతల కథ వినిపిస్తూనే ఉంటుంది. ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా సినిమాలు, సీరియళ్ళు, కార్టూన్ పుస్తకాలు ఈ కథ ఆధారంగా తీస్తూనే ఉన్నారు. మహాభారతంలో ఉన్న దుష్యంత శకుంతల ప్రస్తావన కన్నా కాళిదాసు నాటకం రాయడం వల్లనే, అందులో తప్పొప్పుల, నైతికానైతిక ద్వంద్వాలని తీసేసి అంతా “విధి యాడు వింత నాటకమ్ము” అని కథని కవి re-imagine చేసుకోవడం వల్లనే అనీ చెప్తుంటారు.

వినీ వినీ ఉన్న కథని కాళిదాసు సృష్టించిన పాత్రల నోట వెంట వినడం మహానుభూతి. గంగను సీసాలో సిటీకి తెప్పించుకుని బకెటీడు బోరు నీళ్ళల్లో కలుపుని తలస్నానం చేస్తే పుణ్యపాపాల ఖాతా మారవచ్చునేమో కానీ, అచ్చంగా గంగా నది ఒడ్డుకెళ్ళి అక్కడ మునక వేస్తే కలిగే మనసూ, శరీరం రెండూ పులకరింపు రాదు కదా?! కాళిదాసు ఫలానా చెప్పాడని వినడం, కాళిదాసునే వినడం రెంటికీ పొంతన లేదు, రసానుభూతిలో.

******

కథా కమామిషు

మేనక, విశ్వామిత్రులకి పుట్టిన శకుంతల కన్వ మహర్షి ఆశ్రమంలో పెరుగుతుంటుంది. ఒకనాడు, హస్తినాపుర రాజైన దుష్యంతుడు వేటకని వచ్చి ఆ ఆశ్రమాన్ని దర్శించుకుంటాడు. అక్కడ శకుంతలని చూస్తాడు. మోహిస్తాడు. ఒకరి పట్ల ఒకరికి పరస్పర అనురాగం ఏర్పడుతుంది. కన్వ మహర్షి యాత్రలో ఉండడంతో, గాంధర్వ వివాహం చేసుకుంటారు. “ఈ ఉంగరం మీద అక్షరాలు లెక్కపెట్టేలోపు నేను తిరిగొస్తా” అని తన ఉంగరాన్ని ఇచ్చి రాజు రాజ్యానికి వెళ్ళిపోతాడు.

ఎదురుచూపుల్లో ప్రపంచాన్ని మరిచిపోయిన శకుంతలని దుర్వాస మహార్షి శపిస్తాడు, “ఎవరి ఊహల్లో నువ్వు తేలుతున్నావో వాళ్ళు నిన్ను మర్చిపోతారు” అని. అది కూడా ఆమె వినిపించుకోదు. చెలికత్తెలే బతిమాలుకుంటారు. ఆయన కాస్త కరిగి “ఏదన్నా వస్తువు చూపిస్తే మర్చిపోయిందంతా గుర్తొస్తుంది” అని వెళ్ళిపోతాడు. దుష్యంతుడు ఎంతకీ ఏ కబురూ పంపడు. విషయం తెలుసుకున్న కన్వ మహర్షే అత్తారింటికి పంపిస్తాడు.

అక్కడ దుష్యంతుడు శకుంతలని నిరాకరిస్తాడు. గుర్తుగా చూపెట్టబోయిన ఉగరం ఎక్కడో పడిపోవడంతో శకుంతల దగ్గర జ్ఞాపకాలు తప్ప మరో ఆధారం ఉండదు. అటు తండ్రి దగ్గరికీ వెళ్ళలేక, ఇటు భర్త ఇంట్లో స్థానం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను తల్లి మేనకే ఆదరించి మరో మహర్షి ఆశ్రమంలో ఉంచుతుంది.

చేపలు పట్టేవాడికి ఒక చేప పొట్టలో రాజుగారి ఉంగరం దొరికి, అది రాజుగారికి చేరుతుంది. దాన్ని చూసీ చూడగానే అంతా గుర్తొచ్చిన రాజు ఎంత వగచినా శకుంతల మాత్రం కనపడు. చివరికి ఎప్పటికో కలుస్తారు అంతా. అప్పటికి కొడుక్కి మాటలు కూడా వచ్చేస్తాయి. అలా కథ సుఖాంతం అవుతుంది.

*****

నాటకీకరణలో అద్భుతాలు

నాందీ శ్లోకం

నాందీ శ్లోకంలోనే శివశక్తులని స్మరణ ఉంటుంది. తర్వాత సూత్రధారుడు వస్తాడు స్టేజీ పైకి.  “అభిజ్ఞాన శాకుంతలం” వేయబోతున్నామని చెప్పి అని భార్యని పిలిచి చెప్పి, ప్రస్తుత ఋతువు గురించి ఓ పాట పాడమంటాడు. ఆమె పాడడం అయిపోయాక, “ఇంతకీ ఇవ్వాళ ఏం నాటకం వేయబోతున్నాం?” అని మళ్ళీ అడుగుతాడు. ఆమె నాటకం పేరు గుర్తుచేయగానే, “ఓహ్, నీ పాటలో పడి మునిగిపోయి వేస్తున్న నాటకమే మరిచాను” అంటాడు. 

ఆనాటి భారతీయ నాటకాల్లో, ఈనాటికీ ఆ నాటి కథలను ఆధారంగా చేసుకునే నాటకాల్లో ఈ సూత్రధారుల మాట, పాట నన్ను భలే అబ్బురపరుస్తాయి. పోస్ట్ మాడర్న్ ఫిక్షన్‍లో ఊపందుకున్న meta-fiction (కథ కథ గురించి మాట్లాడ్డం) అన్నది మనకి అసలు ఎప్పటినుంచో ఉందనిపిస్తుంది. ప్రేక్షుకులున్న వాస్తవానీకి, నాటకంలో చూపించబోయే లోకానికీ మధ్య వారధిగా, అనుసంధాన కర్తగా ఉంటూ ఆ కథ మీద వ్యాఖ్యానం చేస్తూ ఉంటాడు సూత్రధారుడు.

శాకుంతలం నాటకంలో “మరుపు” అన్నది కీలకం. మనిషికి జ్ఞాపకమెంత సహజమో, మరుపూ అంతే సహజం. దానిని సూత్రధారుని నోట చెప్పించడమంటే మనల్ని సంసిద్ధులని చేయడమే. పైగా, మహాభారతంలో శకుంతల కథకీ కాళిదాసు శకుంతల కథకీ ముఖ్యమైన తేడా, దుష్యంతుడు శాపకారణాన గతాన్ని మరిచిపోవడమే. 

అభిజ్ఞాన శాకుంతలం : A Lover’s discourse

నాటకంలో రెండు అంకాలు దుష్యంతునికి మాత్రమే ప్రత్యేకించి ఉంటాయి. ఒక దాంట్లో శకుంతలని చూసి మనసు పారేసుకుని చెప్పలేక, తప్పుకోలేక పడే బాధని విదూషకునితో పంచుకుంటాడు. రెండో దాంట్లో ఉంగరం చూసి ఆమె గుర్తొచ్చాక బెంగకీ, పశ్చాత్తాపానికీ మధ్య నలిగిపోతుంటాడు. ఈ అంకాల్లో ఉండడానికి వేరే పాత్రలు కూడా ఉన్నా, దుష్యంతుని మానసికావస్థని, అతని ద్వారా ప్రణయంలో తీపి బాధని, విరహంలో వేడి సెగలని అద్భుతంగా ఆవిష్కరిస్తాడు కాళిదాసు.

నాకు ఈ భాగాలు చదువుతున్నంత సేపూ Ronald Barthes రాసిన A Lover’s Discourse: Fragments అనే పుస్తకమే గుర్తొచ్చింది.


The lover’s fatal identity is precisely this: I am the one who waits.

శాకుంతలం కథ మొత్తానికి ఈ వాక్యాన్ని సమరీగా చూపించచ్చు. ముందు దుష్యంతుని కోసం శకుంతల ఎదురుచూస్తుంది. ఆమె గుర్తొచ్చాక దుష్యంతుడు ఎప్పటికి కలుస్తామో అని ఎదురుచూస్తాడు. అతనికి గుర్తొచ్చిందన్న సంగతి తెలీక ఆమె ఎదురుచూస్తూనే మనసు చంపుకుంటుంటుంది.


“This endured absence is nothing more or less than forgetfulness. I am, intermittently, unfaithful. This is the condition of my survival.”

స్వప్నవాసవదత్తమ్ లో మనిషి చనిపోయిందని తెలిసినా ఉదయనుడు మరిచిపోలేకపోతాడు. శాకుంతలంలో దుష్యంతుడు శాపవశాత్తూ అన్నీ మరిచిపోయినా కూడా “ఆమె అంత గట్టిగా చెప్తుందంటే, బహుశా నాకు తెలుసునేమో” అన్న అనుమానం అతణ్ణి పీకకుండా ఉండదు. అసలు శకుంతల ఏమాత్రం intermittently unfaithfulగా ఉన్నా (తన పరిసరాల ధ్యాస ఉండుంటే) దుర్వాసుని శాపానికి ఆస్కారమే లేదు. అప్పుడు కథే ఉండేది కాదు.

“I can’t get to know you” means “I shall never know what you really think of me.” I cannot decipher you because I do not know how you decipher me.”

శకుంతలా, దుష్యంతుల మధ్య ఈ మీమాంశను కాళిదాసు మహా గొప్పగా చూపించాడు. తనది ప్రేమే అని తేలాక, దుష్యంతుడు ఆమె ఏమనుకుంటుందో, అది ఎలా కనుక్కోవాలో అని తెగ మదనపడుతుంటాడు. అక్కడ శకుంతలకి రాజుకి ఇష్టమో లేదో అని అనుమానం. చెలికత్తెల ప్రోద్బలంతో ఉత్తరం రాయడానికి పూనుకుంటుంది. “నీ మనసేంటో నాకు తెలీదు కానీ, నన్ను మాత్రం మధనుడు దపింపజేయుచున్నాడు” అని అంటే, చాటుగా ఉండి ఇదంతా గమనిస్తున్న దుష్యంతుడు ముందుకొచ్చి “నిన్ను దపింపజేస్తుంటే నన్ను దహించేస్తున్నాడు” అని చెప్పేస్తాడు. (తెలుగు పద్యాలు కింద “అనువాదాలు” సెక్షన్ లో ఇచ్చాను.)

రాజమందిరానికి వెళ్ళే దారిలోనూ శకుంతలకి అనుమానమే, రాజుగారు గుర్తుపడతారో లేదోనని. మనసు కీడు శంకిస్తూనే ఉంటుంది. ఈ శంక స్వప్నవాసవదత్తమ్ లోనూ స్పష్టంగా ఉంటుంది. అక్కడ వాసవదత్త మాటిమాటికి ఒక validation కోసం (ఉదయనుడి మదిలో నేనింకా ఉన్నానా? అన్న ప్రశ్నకి జవాబులు) వెతుక్కుంటూ ఉంటుంది, ఉదయనుడు అతని పరిజనం చుట్టూనే ఉన్నారు కాబట్టి ఆమె అనుమానాలు నివృత్తమవుతాయి. శకుంతలకి అలాంటి ఆస్కారమే లేదు.

“I can do everything with my language but not with my body. What I hide by my language, my body utters. I can deliberately mold my message, not my voice. By my voice, whatever it says, the other will recognize “that something is wrong with me”. I am a liar (by preterition), not an actor. My body is a stubborn child, my language is a very civilized adult…”

దీన్ని కాళిదాసు ఎంత గొప్పగా చూపెట్టాడంటే, అదీ నాటకంలో! శకుంతల తనని ప్రేమిస్తుందో లేదో అని ఇంకా తేల్చుకోలేని దుష్యంతుడు ఆమె ప్రతి మాటనీ, చేష్టనీ ఎంత సున్నితంగా పరిశీలిస్తాడో. ఉదాహరణగా ప్రధామాంకంలోని ఒక పద్యం:

గీ. కలిసి మాట్లాడకున్న నా పలుకులను
వీను లొగ్గెడ అభిముఖియై నెలంత;
వెలఁది నా మోముననె చూడ్కి నిలుపకున్న,
నన్యవిషయంబులకుఁ బోవ దతివదృష్టి
(నాతో మాట్లాడకపోతున్నా నా మాటలన్నీ శ్రద్ధగా వింటోంది. నా మీదే చూపులు నిలపకపోయినా వేరే వాటిపైకీ పోవడం లేదు ఆమె దృష్టి.)

శకుంతల భాషా, వ్యవహారం ఎంత సంస్కారంతో కూడి ఉన్నా ఆమె శరీరం (మొండుపట్టు పట్టిన పిల్లవాడిలా) మనసులో భావాలు దుష్యంతుకి చేరవేస్తూనే ఉంటుంది.

******

భాసుడు కాళిదాసూ

భాసుని చదవగానే గాప్ ఇవ్వకుండా కాళిదాసుని చదివాను కాబట్టి పోల్చుకోవడం అనివార్యంగానే జరిగింది. ఎవరు గొప్ప, ఎవరు కాదు అన్న చర్చ కోసం కాదు, ఒక్కో కవి చెప్పే కథని చదివేటప్పుడు aesthetics లో అనిపించిన తేడాలు. అంతే.

  • భాసునితో పోల్చుకుంటే కాళిదాసు నాటకంలో వర్ణనలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో చిక్కని వచనం చదువుతున్న అనుభూతి. భాసుని నాటకాల్లో వర్ణనలు తక్కువ. డైలాగులూ పొడుగ్గా ఉండవు.
  • భాసుని నాటకాల్లో కనిపించే కొన్ని డివైజులు, చాటుగా ఉండి ఒకరి మాటలు ఒకరు వినడం, అవతలి వారికి జవాబు ఇచ్చే ముందు తమలో తాము మాట్లాడుకోవడం వంటివి కాళిదాసు నాటకంలోనూ ఉన్నాయి.
  • నాటకం నిడివి కూడా ఎక్కువ అనిపించింది. ముఖ్యంగా ముగింపు. స్వప్నవాసవదత్తమ్ లో అందరూ కలిసి కథ సుఖాంతమయ్యే సన్నివేశం ఎంత త్వరగా ముగుస్తుందో, శాకుంతలంలో అంత నిదానంగా అవుతుంది. అయితే, ఎదురుగా ఉన్న పిల్లవాడు తన కొడుకేనని అంచెలంచెలుగా దుష్యంతుడు నిర్థారించుకోవడం, శకుంతల కాళ్ళపై పడి క్షమాపణలు వేడుకోవడం, అతనికి శాపం గురించి తెలీడం అన్నీ ఉంటాయి.
  • ఇద్దరి నాటకాల్లో ఆడపిల్లల తండ్రుల వేదన మనసుని తాకుతుంది. ప్రతిజ్ఞాయౌగంధరాయణంలో మహాసేనుడు కూతురి పెళ్ళి గురించి ఎంత హైరానాలో పడతాడో మామూలు డైలాగులతో భాసుడు బయటకు తీసుకొస్తే, శకుంతలని అత్తారింటికి పంపేటప్పుడు కన్వ మహర్షి పడే కనీకనిపించిన ఆవేదన అంతే బలంగా తాకుతుంది.

అనువాదాలు

ఇంగ్లీషు అనువాదం కోసం వెతుక్కుంటుంటే ఎమ్.ఆర్. కాలె గారి పుస్తకం కనిపించింది. సంస్కృత నాటకంతో పాటు, సంస్కృత వ్యాఖ్యానం, ఇంగ్లీషు అనువాదం కూడా ఉన్నాయి. మొత్తం 650 పేజీల పుస్తకం. నేను నాటకం మట్టుకే చదివాను. ఏ.పి.ఎస్ అయ్యర్ గారి భాసుని అనువాదంలా కాకుండా ఈ అనువాదం మొత్తం వచనంలో ఉంది.

కాళిదాసు వర్ణనలు గొప్పగా, చిక్కగా ఉన్నాయన్నాను కదా? ఉదాహరణగా, దుష్యంతుడు వేటాడుతున్న జింక పరిగెత్తే వర్ణన చూడండి. స్టేజి మీద జింకని పరిగెత్తించి నాటకం వేయడం అవ్వదు. కానీ వేటలోని ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలగాలి. ఇట్లా వర్ణిస్తే ఎట్లా కలగకుండా ఉంటుంది?

తెలుగు అనువాదాల కోసం చూస్తే కందుకూరి వీరేశలింగం గారి అనువాదం దొరికింది. దానితో పాటు దుర్భా సుబ్రహ్మణ్య శర్మ గారిది కూడా. నాకు వీరేశలింగం గారి అనువాదం నచ్చింది. పైన నేను ఉదహరించిన “నీ పరిస్థితి ఏమో గానీ…” అన్న పద్యాలు వీరేశలింగం గారి అనువాదంలో:

ఇహ, లెక్చర్లో ఒక పద్యాన్ని ప్రొఫసర్ గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు. అది శకుంతలని తొలిసారి చూశాక దుష్యంతుని అవస్థ, ఆమెకి దూరంగా వెళ్ళలేక. దాని ఇంగ్లీషు, తెలుగు అనువాదాలు ఇస్తున్నాను. ఆసక్తి ఉన్నవారి కోసం.

విరేశలింగం గారి అనువాదంలో
దుర్భా సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదంలో

ముఖ్యమైన లింకులు

MR Kale’s English Translation along with Sanskrit text and commentary in Sanskrit: archive.org

కందుకూరి వీరేశలింగం తెలుగు అనువాదం

దుర్భా సుబ్రహ్మణ్య శర్మ గారి తెలుగు అనువాదం

BORI వారి యూట్యూబ్ ఛానల్‍లో సంస్కృత డ్రామా లెక్చర్ సీరీస్ కి లింక్

You Might Also Like

2 Comments

  1. grkmurty

    Kālidāsa, the brilliant portrayer of human values, makes Dushyanta, a man, a husband, a sovereign —a great king honoured by Indra, King of Gods — touch the feet of a woman, a wife, a citizen (Act VII), in sorrow and emaciation, a revolutionary scene indeed, all perhaps to highlight how important it is for anyone to accept his failures and be a Purusha (a full man).
    The significance of this ideal act of Dushyanta can be better appreciated if it is contrasted with the scene where Sharadwata, who having escorted Śakuntala to the king’s court, leaves her with these parting remarks: “Śakuntala is certainly thy bride; receive her or reject her, she is thine […] the husband o’er the wife is absolute” (Act V.26), that reflects the then prevailing social value-system.
    And in a matching compliment, if not more to the king’s falling at her feet, Śakuntala offers her self-condemnation: “Utthista, … Rise, my Lord, rise! I must have done something in a former life to prevent my own happiness, and it was working itself out at that time, or someone so compassionate as you would not have acted as you did” (Act VII.155).
    What a stunning display of mastery over her emotions! Ignoring the humiliation that she has suffered at his hands earlier, Śakuntala, distancing herself from her surging emotions, saying, “Utthista tutthista (Rise, my Lord, rise!)”, all in her exceptional lordliness, prefers to blame her fate for all that has happened and all that she is to suffer.
    This beauty of power of her character that she exhibited in responding to her supplicating husband indeed runs all through, dominating the play. For instance, this becomes apparent when she could not refrain even in that veiled shyness from asking the King: “But what brought back the memory of your suffering wife?”
    And again, on hearing Mārēcha’s revelation about Durvāsā’s curse as the chief cause of the King’s unfortunate loss of memory, when she says to herself: “Thank God! My Lord has not been without real reason for his rejection of me […]”, the sublimity of her love and the power of her character leaves a distinct impression on the viewer.
    No wonder Goethe was in raptures about the exquisite harmony between the power of beauty and beauty of power of Śakuntala which led him to proclaim: “And all by which the soul is charmed; enraptured, feasted, fed? Wouldst thou the earth and heaven itself in one sole name combine? I name thee, O Śakuntala”.

  2. ఎ. కె. ప్రభాకర్

    ‘భాసో హాసః కవికులతిలకః కాళిదాసో విలాసః’
    అన్నారు. వీళ్ళిద్దర్లో కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఎవర్ని ఎవరు అనుకరించారు అన్నది పెద్ద చర్చ.

Leave a Reply