The Poison of Love: KR Meera

ప్రేమ పాల లాంటిది. సమయం గడిచే కొద్దీ, అదీ పులుపెక్కుతుంది. విరుగుతుంది. ఆఖరికి, విషమవుతుంది. 

చావు బతుకుల మధ్యనున్న తల్లిని, బాధ్యతగా పెంచి చదువులు చెప్పించిన తండ్రిని, ఉన్న ఫలాన వదిలేసి, రేపో మాపో పెళ్లి అనగా ఇంటి నుంచి పారిపోయి, ప్రేమిస్తున్నాని చెప్పినవాడిని పెళ్లి చేసుకుని, వాడి ఇద్దరి బిడ్డలకి తలై, చిత్రవధకి గురై, ఘోరంగా అభాసుపాలై భంగపడిన ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ కథ చెప్పాలనుకుంటే దాన్ని పై వాక్యాలతో మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. 

కానీ కె ఆర్ మీరా రాసిన “మీరా సాధు” (ఇంగ్లీషులో The Poison of Love) అచ్చంగా ఇవే వాక్యాలతో మొదలవుతుంది. “అతను నాకా విషాన్ని ఇచ్చాడు. నేను చావలేదు, కానీ అతణ్ణి చంపేశాను” అంటూ కథ కొనసాగుతుంది. ఎప్పుడెప్పుడో రాసినా, కథగా చూసుకుంటే, ముఖ్యంగా #metoo మూవ్మెంట్ తర్వాత చదివితే, ఇది ఏ ఎమ్.జె అక్బర్ కథలానో అనిపిస్తుంది. ఒక పేరుపొందిన జర్నలిస్ట్. డబ్బూ, హోదా, పరపతి అన్నీ ఉన్నవాడు. ముందు నుంచీ స్త్రీలోలుడు. ఒక ఐఐటి గ్రాడ్యువేట్‍ని ఇంటినుంచి పారిపోయేలా చేసి పెళ్ళి చేసుకున్నాక కూడా అక్రమ సంబంధాలని విడిచిపెట్టడు. భార్య అమాయకపు మాయాపొరలని చేధించుకుని అతని వ్యవహారాలని నిలదీసినా అంతులేని gaslighting చేసి, ఆమె మీదకే నింద తోస్తాడు. ఐఐటిలో “రికార్డ్” మార్కులు వచ్చినా, ఇద్దరి పిల్లల తల్లి, భర్త మోసం చేశాక చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఏం చేస్తుంది? 

ఒక ఫెమినిస్ట్ రచయిత ఎంచుకోదగ్గ కథాంశమే. అదే లెన్స్ నుంచి చూస్తే కథ నడిచే విధానంతో పేచీలు మొదలవుతాయి. ఎంతమంది ఆడవాళ్ళు మోసపోవడం లేదు, రోజూ? ఎంతమంది ఆడవాళ్ళని భర్తలు వదిలేయడం లేదు, రోజూ? వాళ్ళంతా ఎదురుతిరగడం లేదా, నిలదొక్కుకోవడం లేదా? కోర్టుకి ఈడ్వడం లేదూ? ఒంటి చేత్తో పిల్లల్ని పెంచి ప్రయోజకులని చేయడం లేదా? మరలాంటి ధీరవనిత కథ రాయక, ఎందుకు దారుణంగా చిత్తుచిత్తైపోయిన జీవితాన్ని గురించి చెప్పడం? అదేం స్ఫూర్తినిస్తుందని? 

 కె.ఆర్.మీర రచనలని ఇలాంటి తక్కెట్లో వేస్తే మాత్రం అవి ఎటూ తూగవు అని చదివేకొద్దీ నాకు అర్థమవుతుంది. ఆమెతో ఒక తిరకాసు ఉంది. కథ చెప్పడానికి మెటఫర్‍ని సాయంగా తీసుకుంటుందా? కొన్నిసార్లు ప్రేమ విషమైపోతుంది, ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది, అలా ఒక మాయలోడి వలలో పడిన అమాయకురాలి కథా ఇది అనుకోవాలా? లేక, బలంగా పాతుకుపోయిన ఒక mythని పెకిలించడానికి మెటఫర్లని అస్త్రాలుగా వాడుతూ మధ్యమధ్యన కాలక్షేపానికి కథ కూడా చెప్పుకొస్తుందా? 

కథకి దగ్గరగా తీసుకెళ్ళడానికి మెటఫరా? మెటఫర్ లోతుల్ని చూడగలగడానికి కథా? 

ఇట్లా ఆలోచించినప్పుడు కథ తల్లకిందులవుతుంది. అసలు ఎవరిని ఎవరు ప్రేమించారు, మోసగించారు, పాత్రలన్నీ చివరికి ఏమయ్యాయి, కథేమైంది అనేవి అడుక్కి వెళ్ళిపోయి మెటఫర్లే పైకి తేలాడుతాయి. 

ప్రేమ పాలలాంటిది, అదెంత పౌష్టికాహారమే అయినా, దానికి విషమయ్యే గుణం కూడా ఉంటుంది. ప్రేమలో పెనవేసుకునిపోయే దేహాలు ద్వారా ఆత్మల కలయిక ఏమో గానీ, రానురానూ ఈ దేహాల మధ్యే గోడలు (గ్లాసువో, గ్రానైటువో) పుట్టుకొస్తాయి. ప్రేమ పూతనలాంటిది, పాలిండ్లకి విషం పూసుకుని పాశాన్ని హతమార్చగలదు. ప్రేమంటే ఆరాధన, రాధలానో, మీరలానో కృష్ణుని ధ్యాస తప్ప మరోటి లేకుండా చేస్తుంది, కృష్ణుడు వదిలిపెట్టి వెళ్ళిపోయినా, అసలు ఎప్పుడూ కృష్ణుడు తారసపడకపోయినా.  ప్రేమ పాములాంటిది, దాన్ని విషకోరలు పీకి ఒక బుట్టలో పెట్టనూ వచ్చు, దాని విషాన్ని ఒళ్ళంతా నింపుకుని నీలిమేని ఛాయ పొందచ్చు.  

ప్రేమ ఫలానా, ఫలానా అని చెప్పి ఊదరగొట్టిన లోకం, కవిత్వాల్లోనూ సినిమా పాటలలోనూ ఊకదంపుడుగా ప్రేమ గురించి లెక్చర్లు దంచిన లోకం, ప్రేమే జీవితం, అది లేకపోతే జీవితం దుర్భరం అని మార్కెటింగ్ నస పెట్టిన లోకం. అది పుట్టిచ్చిన ప్రతీకలకి, ఉత్పేక్షలకి, రూపకాలకి, అన్యాపదేశాలకి మూలం ఎక్కడుంది? ఎలాంటి gaze వాటిని సృష్టించింది? ఎవరికి favourableగా అవి పనిజేశాయి, చేస్తున్నాయి? అవి సృష్టించిన వలలో ఇరుక్కుని ఎలాంటి మనసులు చితికిపోయాయి? ఎలాంటి బతుకులు ఛిద్రమైపోయాయి?

ఒక ఆడదాని పాలలాంటి ప్రేమ పులుపెక్కి, విరిగిపోయి, విషమవుతే కథ ఆ ఒక్క ఆడదాని గురించే అవుతుంది. కానీ ఈ ప్రేమ అనే పాలు యుగయిగాలుగా, తరతరాలుగా పులుపెక్కుతున్నాయి. విరిగిపోతున్నాయి. విషసమానమయ్యాయి. ఆ విషం ప్రాణాంతకం కాదు. కానీ ఎవరినీ ఆరోగ్యంగా, హాయిగా బతకనివ్వనూ లేదు. అది తాగాకే మళ్ళీ వెనకటిగా ఉండలేరు. చంపదు, చావనివ్వదు, చంపించదు. అందుకే బృందావనం కాలి బూడిదవ్వదు. 

A stench arose from that imagery—as though from soured milk. A sigh emerged from my heart. Like a poisonous flame, it scalded my chest. It seemed to me that a devastated woman’s grief-stricken sigh had the potential to burn down a house. However, on reaching Vrindavan, I realized my mistake. Had my surmise been right, Vrindavan would have turned into a city of ashes a long time ago.

అందుకే, ఇలా మాట్లాడేవాళ్ళని లోకం, “పాపం, పిచ్చిది” అని కొట్టిపారేస్తుంది.  

‘You poor thing!’ Nabaneeta’s emaciated body shook as she laughed bitterly. ‘Open your eyes and look around—everyone you see is a Meera. Those who ran away from the luxurious palaces of their husbands for love, those who wandered insane through the streets … Thief, brute—all women are the same to Krishna. He will steal any woman’s clothes, eat anyone’s butter … I am telling you, do not worship him! Beat him off if he comes near you … He will pretend to be in love with you, utter sweet words to entice you … He will kiss you slyly … Beti, he just wants your body. Only your body.’

అవును, పాపం, పిచ్చోళ్ళే వీళ్ళు. ఈ కథ చెప్పే ఆమె కూడా ఎంత నిజం చెప్పిందో మనకేం తెలుసు? ఆమె కూడా Unreliable narrator ఏమో? ఇదంతా ఆమె కల్పించిన కట్టు కథేమో? జీవితంలో అన్ని విధాలా విఫలమై ఆ నిందని ప్రాణప్రదంగా ప్రేమించిన భర్త మీదకి తోస్తుందేమో? ఆమె మగాడయ్యుంటే ఏమన్నా benefit of doubt ఇవ్వచ్చు. దేవదాస్ అంతటి స్థాయిలో కాకపోయినా దరిదాపుల్లో నుంచోబెట్టచ్చు. కానీ కాదే! బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కినట్టు చచ్చాక సెలబ్రేట్ చేసుకోడానికి ఏం మిగులుతుంది? 

కడుపులో పేగుల్ని నులిపెట్టినప్పటి నొప్పిని కలిగించే ఈ చిన్న నవలిక నర్మగర్భంగా చాలానే మోసుకొస్తుంది. తరతరాలుగా మనకి అందిస్తూ మిథ్యామాయా ప్రపంచంలో విషం చిమ్మే కాలియులెన్ని ఉన్నాయో గుర్తుచేస్తుంది. ఇది ఒక స్థాయిలో చూస్తే గృహ హింస, ప్రేమ పేరుతో మోసపోయే అమ్మాయిల కథే. ఇంకో స్థాయిలో చూస్తే the myth of love కి వ్యతిరేకంగా లేచిన ధిక్కార స్వరం! పుస్తకం చివర్లో రచయిత, “నేను ఇది రాస్తున్నప్పుడు తులసి పాత్రలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారనుకున్నాను, రాధలాగా, మీరాలాగా. కానీ లెక్కలేనంత మంది, లెక్కలేనన్ని సందర్భాల్లో, ఆఖరికి అంత్యక్రియలకి హాజరవుతుండగా కూడా వచ్చి, తులసి కథ తమ కథే అని చెప్పారు” అని రాశారు. 

అదెందుకంటే, అచ్చంగా మోసగించబడో, విధవరాలయ్యో బృందావనానికి చేరినవాళ్ళే “మీరా సాధులు” కారు. తామున్న చోటునుంచి, తమ గతం-ప్రస్తుతం నుంచి గత్యంతరం లేకుండా గెంటేయబడి, వాటివైపు మళ్ళీ తిరిగి చూసే అవకాశం కూడా కోల్పోయి, ఒకే జన్మలో మళ్ళీ మళ్ళీ పుడుతూ, మళ్ళీ మళ్ళీ చస్తూ ప్రతీ అంకాన్నీ (phase) భారంగా శిలువలా మోస్తూ గడపడమనేది భారత స్త్రీల నుదుటిరాత. The only truth of our lives is displacement.

రాధ, మీరా, కృష్ణ, పాలు, వెన్న, పూతన, కాలియ, రాసలీల, వేణుగానం, బృందావనం, ప్రేమ, భక్తి  అన్నీ మెటఫర్లే! ప్రపంచం నుంచి, తన నుంచి తాను ఆడది మానసికంగా, శారీరికంగా ఎంత దూరం విసిరేయబడుతుంది, దానికి ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందోనన్నదే ఆలోచించుకోడానికి అవసరమయ్యే మెటఫర్లు. 

Metaphors give words a way to go beyond their own meaning. They are handles on the door of what we can know and of what we can imagine. Each door leads to some new house and some new world that only that one handle can open.

What’s amazing is this: By making a handle, you can make a world.

-Jane Hirshfield 

మీర ఇందులో సృష్టించిన మెటఫర్లు మాత్రం ఎన్నో యుగాలుగా బిగిసుకుపోయిన తలుపులని తెరిచే గొళ్ళాలు. అన్నాళ్ళనుంచి చీకట్లో మగ్గుతున్నదేదీ అహ్లాదకరంగా ఉండదు. ఇదీ ఉండదు. చీకటిని, భయంకర కంపుని, కీచురాళ్ళ శబ్దాలనీ భరించే ధైర్యాన్ని కూడదీసుకుని చదవాల్సిన రచన.

You Might Also Like

Leave a Reply