తేరా నామ్ ఏక్ సహారా: నరేష్ నున్నా
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
తేరా నామ్ ఏక్ సహారా అనే వాక్యానికి నీ నామమే జీవాధారం అని చెప్తేనే తెలుగులో సరిపోతుంది, నీ నామము ఒక ఆధారము కాదు, ఏకైక ఆధారము. దేనికి? మనుగడకు. జీవం నిలిచి ఉండడానికి. నచ్చిన లక్ష్యము/గురి దేనిమీదుందో అది అలా ఏకైక ఆధారము అనే గాఢమైన అనుభూతికి కారణమౌతుంది. విజ్ఞానశాస్త్రాల ప్రకారం జీవానికి ఆధారాలేమున్నా, మానసికమైన గాఢానుభూతి ఏ లక్ష్యం మీద కుదురుకుంటుందో అది మాత్రమే మనుగడకు ఏకైక ఆధారమౌతుంది. ఆ లక్ష్యం ప్రియమైన మనుష్యులు కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు, అదే జీవాధారమనిపిస్తుంది.
ఈ శీర్షికలోని మాట తేరా నామ్ ఏక్ సహారా అని నాయకుడు నాయికతో చెప్తున్నట్లైతే ప్రశ్నార్థకము, ఆశ్చర్యార్థకము ఎందుకు? ఈ బిందువు ఆ సందిగ్ధతను ఎందుకు మోస్తున్నట్టు? “తేరా నామ్ ఏక్ సహారా?!” అనే ఈ రచనలో కథకుని ఉద్దేశ్యము ఏమిటని తెలియని ఒక చదువరికి ఇందులో కనిపిస్తున్నది ఏమిటి?
సంగీతం పట్ల , సంగీతజ్ఞుల పట్ల ఆరాధన ఉన్న కథకుని అభిరుచి ప్రసిద్ధ/అభిమాన సంగీతజ్ఞురాలిని చూడగానే పాదాభివందనం చేయడం ద్వారా తెలుస్తుంది. అంతకు తగ్గని ఆరాధన నాయిక సంగీత విద్య పట్ల నాయకునికి ఉంటుంది. ఇది ప్రేమనీ, కాదనీ, ప్రేమంటే ఫలానా అనీ చెప్పే కొలతలు, తూనికరాళ్ళు నావద్ద లేవు. కానీ ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది కథానాయికకు సంగీతం పట్ల ఉన్న గాఢానుభూతిని స్పష్టంగా చూడగలిగి, ఆ అనుభూతి లో తాదాత్మ్యం చెందగలిగిన కథానాయకుడు. పదానికి భావానికి మధ్య పలుకువంతెనలు వేస్తున్న గాంధర్వగాత్రం పట్ల ఉన్న ఆరాధనను ప్రేమ అని స్వయంగా కథానాయకుడు కూడా తీర్మానించలేదు. తన ఆరాధనకు సాన్నిధ్యాన్ని తోడు చేయాలన్న అభిలాష సాధారణమైన సామాజిక సహవాసం గురించి ఆలోచింపజేసిందే తప్ప వేరు కాదు.
ఆమెకు సంగీతం పట్ల ఉన్న గాఢానుభూతి తన భక్తి పట్ల కూడా ఉంది. ఆమెకు జీవాధారం ఆ భక్తి పట్ల ఉన్న అచంచల నమ్మకమే. ఆ నమ్మకపు తెరలలోకి రాగలిగిన, వచ్చిందనుకున్న విషయాలే ఆమెకు వాస్తవాలు. అలా కాని వాటి పట్ల తన కళ్ళూ , మనసూ కూడా ఆర్ద్రమయ్యే ప్రసక్తి లేదు. ఈ విషయం మీద అవగాహన ఉన్న నాయకుడు కాబట్టే ఆమెకు చేరువవడానికీ ఆ తెరలను ఛేదించాలని కాక ఆ తెరలలోకి చేరగలగాలనే ప్రయత్నింఛాడు. ఈ విషయం మీద అవగాహన ఉన్న నాయకుడు కాబట్టే ఆ తెరలలోనికి తాను చేరలేకపోతే నిశ్శబ్దంగా దూరం కావడానికి సంసిద్ధుడై ఉన్నాడు.
చివరికి (రచన చేసే నాటికి) ఆమె నమ్మకాల పునాదులు కదిలే వేళ వచ్చిననాడు, కూలే సమయం వచ్చిననాడు సంగీతం వలెనే ఆమెకు జీవాధారమైన ఆ భక్తి నమ్మకపు తెరల జీవాధారం లేక ఆమె ఎలా మనగలుగుందోనని కళవళ పడినాడు. వాస్తవిక ప్రపంచపు దూరాల నడుమ ఆమెను గుర్తించలేక , ఆమె నిస్సహాయస్థితిని గురించి తలచి చింతించి ఆమెకు ఆ భక్తి నమ్మకాలే జీవాధారమా, అవి కూలిననేటి పరిస్థితి ఏమిటన్న ఆరాటమే, కథకుని అంతరంగ ఆవేదనే తేరా నామ్ ఏక్ సహారా అనే పేరు, పక్కనున్న ?! చిహ్నాల అంతరార్థమనీ, మొత్తం కథలో వ్యక్తమైన దృశ్యానికి ఆధారమనీ నాకు తోచింది.
ఇందులో నాయికానాయకుల మధ్య కథలో (ఉంటే గింటే) ఉన్నది ప్రేమనా అన్న చర్చకు కథకుడు ప్రాధాన్యతనివ్వలేదు. వారి అంతరంగాలను వారి ఆలోచనల ద్వారా గానీ, చర్యలద్వారా గానీ, చర్చలద్వారా గానీ, నెరేషన్ ద్వారా గానీ ఎస్టాబ్లిష్ చేయలేదు. అయినా సరే, పెళ్ళి వంటి సామాజిక బంధనంలో ముడిపడేందుకు అనుమతి ఆశించి, విఫలమై వేరుపడిన అంశాన్ని నవలగా తీర్చిదిద్దాలనుకుంటే అది అటు ఆదర్శవంతంగానూ లేదు, ఇటు సహజంగానూ లేదు.
ఈ కథలో ఉన్న బాబాతో సహా ఇతర పాత్రధారులందరి ప్రవర్తనలమీదా, మనస్తత్వాల మీదా సూటిగా ప్రయోగించిన వ్యంగ్యం సమర్థవంతంగా ఉంది. ముఖ్యాంశం కన్నా ఇదే డామినేట్ చేసింది. దాంతో ముందే ఆకట్టుకొనని ముఖ్యాంశం మరింత బలహీనపడింది. అన్నిటికీ సరైన చోటు కల్పించి మరింత విస్తృతమైన రచన చేసి ఉండడానికి అవకాశం ఉన్నా చిన్న నవలలో అనేక విషయాలు ఇరికించినట్టైంది. రచయిత ఇతర వ్యాసాలు, కథలలో ఉన్న భాషా పటిమ, సంక్లిష్ట వాక్యనిర్మాణంద్వారా సున్నితమైన భావప్రకటనాశక్తి కూడా ఇందులో కనిపించలేదు. లెక్కకు మిక్కిలిగా ఉన్న ఉపమానాలు మాత్రం కొత్తగానూ ఉన్నాయి, పాతవీ సందర్భోచితంగా ఉన్నాయి.
ఈ కారణాలవలన ఈ రచన బాగుందని నాకనిపించలేదు. ఈ కథ ఆత్మకథైనా, కాల్పనికమైనా దాంతో సగటు చదువరికి సంబంధం లేదు అని నా అభిప్రాయం. నేను తెప్పించుకున్న ప్రతిలో రెండు మూడు పేజీలు ఒకదానిమీద ఇంకొక పేజీ ప్రింటయినాయి. దాన్ని కూడా ఎలాగో చదవగలిగాను. దానివల్ల ఏ అంశమైనా నా దృష్టినుంచి తప్పిపోయి ఉంటే చెప్పలేను. అది తప్ప మిగతా పుస్తకాన్ని అందంగా అచ్చువేశారు.
Leave a Reply