Cobalt Blue: Sachin Kundalkar
ఎనభై, తొంభై దశకాల్లో, అంటే గోడ మొత్తం ఆక్రమించుకుని, అతుక్కుపోయే ఫ్లాట్ స్క్రీన్ టివీలు ఇంకా రాక ముందు, వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ప్రతి మధ్యతరగతి ఇంట్లో, అడుగుపెట్టగానే కనిపించేవి: టేబుల్ మీద టివీ, దాని వెనుక ఒక అర. ఆ కుటుంబంలోని వారి అభిరుచుల మేరకు ఆ అరలో చాలానే కనిపించేవి: కొత్తవి, పాతవి ఫ్రేమ్ కట్టిన ఫోటోలు, కొన్నింటికి బొట్లు, ప్లాస్టిక్ దండలు. కొన్నవో, గిఫ్ట్ గా వచ్చినవో బొమ్మలు. ముఖ్యంగా జోడిగా ఉన్నవి: కొత్త పెళ్ళికూతురూ కొడుకూ లేదా మొహమొహాలు చూసుకుంటున్న కోతులో, ఏనుగులో, మనకేసి చూసే దేవుడి బొమ్మలో. గెల్చుకున్న ట్రోఫీలు. కిందన పుస్తకాలో, కాసెట్లో. మధ్యన ఏ టేప్ రికార్డరో. “మీ ఇల్లు చాలా బాగుందండీ” అని ఒక రెండు మూడు నిమషాల్లోపు వచ్చినవారు అన్నారంటే అది దాదాపుగా ఆ అరని చూసి అన్న మాటలే. మొదటిసారో, రెండోసారో ఆ ఇంటికి వెళ్ళిన సందర్భమైతే, “ఎవరివా ట్రోఫీలు? ఎందులో వచ్చాయి?”, “ఓహ్… మీక్కూడా బాలీవుడ్ సంగీతం అంటే పిచ్చా?” అని మొహమాటాల మంచుని కూడా కరింగించి పెడతాయి.
అయితే, ఇవి ఒట్టి అలంకరణ అరలు (decorative) మాత్రమే కాదు. వాటిల్లో ఆ కుటుంబ నేపథ్యం, గతం, వర్తమానం అన్నీ ఉంటాయి. ఆ అరల్లోకి ఫోటోలుగా చేరినవాళ్ళంటే ఒక గౌరవం, గుర్తింపు ఉందన్నమాటే. మర్యాదపూర్వక మరణాలకి మాత్రమే అక్కడ స్థానం. కుటుంబ మర్యాదని, ఆ ఇంట్లో పెద్దలని ఇష్టాయిష్టాలని అతిక్రమించని వాళ్ళే ఆ అరల్లో స్థానం సంపాదించగలుగుతారు. తక్కినవాళ్ళు చీకట్లోకి జారిపోతారు. “వాడున్నా చచ్చినా మాకొక్కటే”, “నా కంఠంలో ప్రాణముండగా మళ్ళీ ఈ గుమ్మం తొక్కను” లాంటి డైలాగుల్లో భారాన్నీ, లోటునీ చివరికి మూలుగుతూ మోసేది ఈ అరలే. గోడలకి చెవులతో పాటు గొంతులూ ఉంటాయి, మనం వినమంతే!
అచ్చంగా అలాంటి ఒక మధ్యతరగతి కుటుంబాన్ని తీసుకుని మరాఠి రచయిత, సచిన్ కుందాల్కర్ రాసిన నవల ’కోబాల్ట్ బ్లూ.’ ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. మొదటివాడు అన్ని విధాలా అరలో స్థానాన్ని సుస్థిరం చేసుకోదగ్గ వాడే. సమాజమూ, కుటుంబం ఆశలకి, అంచనాలకి సరితూగుతాడు. అమ్మాయి అందరికన్నా చిన్నది. కొంచెం తేడా. ఆడపిల్లలు చేయాల్సిన ఇంటిపని, వంటపని కాకుండా కొండలు ఎక్కుతానంటుంది. కోనల్లో తిరుగుతుంది. అంటే, కళ్ళు పసిగట్టే తేడా. ఆమెకీ బయట ప్రపంచానికీ యుద్ధం: మాటల యుద్ధం, అవును-కాదుల యుద్ధం, మేము చెప్పిందే చేయాలి-నేను చచ్చినా చేయను మధ్య యుద్ధం. కాకపోతే, ఎదురెదురుగా నుంచుని తాడోపేడో తేల్చుకునే యుద్ధం. గెలుపోటముల స్కోర్ బోర్డ్ చకచకా కదిలే యుద్ధం.
మధ్యన ఉన్నవాడు, సమాజపు కళ్ళకి మామూలుగానే కనిపిస్తాడు. అప్పుడో ఇప్పుడో అనుమానం వచ్చినా కాస్త నడక మార్చుకుంటేనో, కొన్ని పనులు మానుకుంటేనో మళ్ళీ మామూలు అనిపించేస్తాడు. అతడు గే. ఆ విషయాన్ని ఒప్పుకోవడంలో మాత్రం ఏ జాప్యం చేయడు. తన శరీరాన్ని గౌరవిస్తాడు, దానికి కావాల్సింది దొంగచాటుగానైనా అందిస్తుంటాడు. ఇతడిదీ బయట ప్రపంచంతో యుద్ధమే. కాని అదో మార్మిక యుద్ధం. బయటకి అరపులు వినిపించని యుద్ధం. గాయాలు కనిపించని యుద్ధం. తన వాటాగా ఓటములు మాత్రమే మిగిల్చే యుద్ధం. అన్నింటికన్నా దారుణంగా అసలు యుద్ధం జరిగిన ఆనవాళ్ళే మిగల్చని యుద్ధం.
నవలా నిర్మాణం – నిర్వహణ
ఈ చిన్న నవలలో ఏకకాలంలో రచయిత అనేక ఫీట్లు చేశారు. అన్నింటికన్నా ముఖ్యమైనది homosexualityకి వేదికనివ్వడం. అదీ సగటు భారతీయ మధ్యతరగతి కుటుంబంలో. సగభాగం పుస్తకం అదే ఆక్రమించుకుంటుంది. కేవలం ఒకడి స్వగతమనే కాదు, అసలు మన దేశంలో గేలు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా చూస్తారు, వాళ్ళకి ఉండే outlets ఏంటి, వాళ్ళకుండే support systems ఏంటి అన్నింటిని ప్రస్తావించారు. దాని పక్కనే heterosexualityని పెట్టి, రెంటినీ వద్దనుకున్నా పోల్చకుండా ఉండలేకపోయేలా చేస్తుంది. చిన్నప్పుడు స్కూలులో “ఫలానా రెంటి మధ్య బేధాలని వివరించు” అన్న ప్రశ్నకి కాగితాన్ని సగం మడిచి రెండు కాలమ్స్ చేసి, వాటికి పేర్లు పెట్టి రెండింటిలో తేడాలు రాసుకుంటూ పోయినట్టే ఈ నవలా నిర్మాణాన్ని సాగడం మరో విశేషం. అటు అబ్బాయి అబ్బాయిని ప్రేమించడంలోనూ, ఇటు అమ్మాయి అబ్బాయిపై మనసు పారేసుకోవడంలో ఉన్న అబ్బాయి ఒక్కడే అవ్వడం మరో గొప్ప ఎత్తుగడ.
ఈ నవల గురించి సినాప్సిస్, రివ్యూలు ఏం చదివినా “ఒకడు పేయింగ్ గెస్ట్ గా వచ్చి అన్నాచెల్లల్ని ఇద్దరిని ప్రేమించి వాళ్ళ జీవితాలని ఎలా తల్లకిందులు చేశాడు అన్నది కథ” అన్నదే కనిపించింది. అలా ఈ పుస్తకం గురించి చెప్పడం, శేఖర్ కమ్ముల “ఆనంద్” సినిమాని “చీర కోసం గొడవ పడి పీటల మీద పెళ్ళి చెడగొట్టుకున్న పిల్ల కథ” అనడం లాంటిది. ప్రేరకాలు ఏవైనా కావచ్చు, వాటి ఉనికి నిమిత్తమాత్రం. జీవితాల్లోకి మనుషులు వచ్చిపోతుంటారు. వాళ్ళు సృష్టించే అలజడుల తీవ్రత మాత్రం మన గతం మీద ఆధారపడుంటుంది.
యవ్వనంలో కలిగే ప్రేమల మీద ఎన్నో కావ్యాలు, సినిమాలు, కథలు చెప్పుకున్న మనం, ఆ యవ్వనంలోని ప్రతి ఆలోచనని, ప్రతి చర్యని, ప్రతి ప్రతిక్రియని బాల్యం నిర్దేశిస్తుందన్న సంగతి అర్థం చేసుకోము. ఇప్పుడీ నవలలో ఉన్నది త్రికోణ ప్రేమకథ అనుకుంటే అందులో ముగ్గురికి ఎంతో కొంత ట్రమాటిక్ బాల్యం ఉన్నట్టు. పేయింగ్ గెస్ట్ గా వచ్చినవాడిది అందరం “అయ్యో, అయ్యో” అని తెగ బాధపడిపోయే గతమే. కానీ ఆ అన్నాచెళ్ళలదీ ఏ మాత్రం సమస్యలు లేని బాల్యమేం కాదు. వాళ్ళకి నిజంగా ఒక అరోగ్యవంతమైన బాల్యం ఉండుంటే ఈ కథ నడిచేదే కాదు.
చెప్పే కథ ఏదైనా, చెప్పే విధానం బట్టి దాన్ని రెండింతలు పై స్థాయికి తీసుకెళ్ళచ్చు అనేదానికి మరో గొప్ప ఉదాహరణ ఈ నవల. మొదటి భాగంలో గే అబ్బాయి స్వగతం ఉంటుంది. రెండో భాగం చెల్లిలు మోసపోయాక డిప్రషన్‍లోకి జారుకున్నాక థెరపీలో భాగంగా రాసుకునే డైరీ. The very form in which these narratives span out, screams out the discriminations at hand. అబ్బాయి నోరువిప్పి ఎవరికీ చెప్పుకోలేడు, కాగితం మీదకూడా రాసుకోడు. తన మనసులోనే జరిగినదాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాడు. ఆ అమ్మాయికి సైక్రియాటిస్ట్ నుంచి స్నేహితులు, బంధువుల వరకు వినేవాళ్ళు ఉంటారు. అందుకే ఆమె కొంతకాలానికి దీన్ని వెనక్కి నెట్టేసి మామూలు అయిపోగలుగుతుంది. ఆ అబ్బాయిది మాత్రం ఎవరికీ అంతుపట్టని పీడ, ఎవరికి వాళ్ళు assumptions మాత్రమే ఇచ్చుకోగల వేదన. ఆడామగా ప్రేమకి సమాజం ఆమోదముద్ర కాస్త తేలిగ్గా వేస్తుంది కాబట్టి ఆ ముద్ర కోసం, ఆపై బతకాల్సిన “టెంప్లేట్” కోసం వెంపర్లాటలో ప్రేమ ఎంత పల్చబడిపోతుందో, పేలవమైపోతుందో కదా అని అనిపించింది. భవిష్యత్తులేని ప్రేమల్లో గాఢత వేరు, సాంద్రత వేరు. వాటిని సమాజం ఇచ్చే ముష్టి రిపోర్టు కార్డ్ ఎప్పుడూ కొలవలేదు.
నరేటివ్‍లో ట్రామా
“Trauma Theory As an Approach to Analyzing Literary Texts (Ted Morrissey and Robert McLaughlin)” అనే పుస్తకంలో పోస్ట్ మార్డన్ సాహిత్యంలో ట్రామా రచన గురించి మాట్లాడుతూ, దానికి ముఖ్యంగా మూడు, నాలుగు లక్షణాలుంటాయి అని అంటారు. వాటిని ఈ రచనకి అన్వయించుకుంటే:
- intertextuality: అనేక textsలని వాడుతూ, వాటిని పక్కపక్కన పెట్టడం ద్వారా, వాటికో contextలో ఇవ్వడం ద్వారా కొత్త అర్థాలని స్ఫురించేలా చేయడం. ఈ పుస్తకంలో రెండు భాగాలని తీసుకుని ఒక పూర్తి నిడివి గే నవల, ఒక ఫెమినిస్ట్ నవలగా రాయచ్చు. కానీ వాటి పక్కపక్కన పెట్టడం వల్ల (కథ కూడా ఒకే ఇంట్లో జరుగుతుంది) పైన నేను చెప్పుకొచ్చిన కొన్ని సంగతులు బలంగా స్పష్టమవుతాయి. విడివిడిగా చదివినప్పుడు కనిపించని అర్థాలు.
- repetition: మళ్లీ మళ్ళీ అవే ఇమేజిలని, సంఘటలని ప్రస్తావించడం. ట్రామాకి గురైన మనిషి జ్ఞాపకాల్లో జరిగినట్టే. మొదటసారి ప్రస్తావనలో అతి చిన్నవి అనిపించిన విషయాలు మరో ప్రస్తావనలో తీవ్రంగా అనిపించే అవకాశం ఎక్కువ. ఈ నవలలో అది రెండు విధాల జరుగుతుంది.
- ఒకటేమో అన్న చెప్పిన కథే చెల్లి కూడా చెప్పడం వల్ల ఒక నాణాన్ని రెండు వైపుల నుంచి చూసినట్టు అవుతుంది. ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా వీళ్ళిద్దరికి ఒకళ్ళ వాస్తవాలు ఒక్కళ్ళకి తెలీదు.
- రెండోదేమో, వాళ్ళు చెప్తున్న కథలోనే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం. జ్ఞాపకాలని తిరగాబోర్లా వేసుకుని చూసుకుంటున్నట్టుగా. ముఖ్యంగా అబ్బాయి చెప్పే కథలో దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది.
- a dispersed or fragmented narrative voice: అంటే ఒక్కళ్ళకన్నా ఎక్కువ నరేటర్స్ ఉండడం ఒకటి. నాన్-లీనియర్‍గా కథ చెప్పడం మరోటి.
- అబ్బాయి చెప్పే కథకన్నా అమ్మాయి చెప్పేది తక్కువ fragmentedగా, మాట్లాడే/ఆలోచించేటప్పటి వాక్యంతో పోల్చుకుంటే రాసిన వాక్యంలో ఉండే స్పష్టత, coherence ఉంటుంది. అంటే వచనంలా ఉంటుంది. అబ్బాయి వర్షన్‍లో మాత్రం కవితాత్మకత ఎక్కువ ఉంటుంది.
- ఈ రెండు కథనాల వైరుధ్యాల్లో వాళ్ళ అనుభవాల, అనుభూతుల తీవ్రతలోని వ్యత్యాసం కూడా మనకి తెలిసి వస్తుంది. అది మన సమాజం heterosexuality, homosexualityని ఎలా ఆదరిస్తుందన్న విషయం కూడా ప్రతిబింబిస్తుంది.
- తోబుట్టువులే అయినా, కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా వీళ్ళకి ఎలా అవతలివాళ్ళ వాస్తవాలు తెలియవో, నవల్లో రెండు భాగాలు కూడా అలా కూల్చలేని కనిపించని గోడలు (indestructible, invisible walls) మధ్యే నిలిపిన భావన కలిపిస్తుంది. ఆ గోడలు వ్యక్తిగతమైనవి, మానసికమైనవి, సామాజికమైనవి. కుటుంబం, వ్యవస్థ నిలబెట్టేవి.
వీటితో పాటుగా నాలుగో అంశం కూడా ఉండచ్చునని, రచయితలు ఇలా అంటారు:
Whitehead explicitly names these three aspects of postmodern technique that mirror the traumatized voice, but I would augment the list with a fourth (implied) aspect: a search for language—if you will, for powerful, indeed, almost magical words—that will uncouple the traumatized from the traumatizing event.
ట్రామా నుంచి విడిపడే ప్రయత్నంలో భాష ఏ రూపాన్ని సంతరించుకుంటుందనేది గమనించడానికి కూడా ఈ నవలలోని రెండు కథనాలు బాగా పనికొస్తాయి. ముఖ్యంగా ఆ కథనాలు ఎక్కడ. ఎలా ఆగాయన్నది ఆసక్తికరమైన విషయం. అనువాదంలో ఆ భాషలోని లోతుపాతుల్ని తీసుకురావడం అసాధ్యమనిపించచ్చు, ముఖ్యంగా అనువాదం చేయాలంటే మూలభాషలో కథని మళ్ళీ మళ్ళీ చదవాల్సి వచ్చినప్పుడల్లా. “నా నవలకి ఇది టెక్నికల్‍గా కరెక్ట్ అనువాదం కాదు, ఎమోషనల్లీ కరెక్ట్ అనువాదం” అని రచయితే వ్యాఖ్యానించారట. తర్జుమాలో పోయింది పోగా మిగిలింది కూడా చాలా ప్రభావం చూపించగల వచనమే.
రంగురంగుల బంధాలు
“మూవ్ ఆన్” రెండు కథల్లో ఉన్నా అబ్బాయి కథలో చిక్కదనం ఎన్నాళ్ళైనా వేటాడుతూనే ఉంటుంది. అమెరికన్ రచయిత André Aciman రాసిన Call me by your name అనే నవల కూడా ఇలాంటి కథే. అది 2007లో వస్తే ’కోబాల్ట్ బ్లూ’ మరాఠి పుస్తకం 2006లోనే వచ్చిందని తెలిసి ఇంకా సంతోషమనిపించింది. భారతీయ నేపథ్యంలో ఇలాంటి కథాంశాలతో రచనలు రావడమే అరుదంటే, ఇలాంటి కథానిర్మాణాలతో రావడం అపురూపమే.
ఆ అమెరికన్ నవల ఆధారంగా తీసిన సినిమాలో చివరి సీన్‍లో తనని ప్రేమించినవాడు ఒక ఆడమనిషిని పెళ్ళిచేసుకున్నాడన్న వార్తని మోసుకొచ్చిన ఫోన్ కాల్ కట్ చేసి అక్కడే కూలబడిపోతాడు ఆ అబ్బాయి. ఏదో ఆలోచించుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు. క్రెడిట్స్ రోల్ అవ్వడం మొదలెడతాయి. కానీ ఫ్రేము ఫ్రీజ్ అవ్వదు. వాడలా చూస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. (నాలుగు నిముషాల వీడియో ఇక్కడ) కొన్నేళ్ళ కింద చూసినా ఇప్పటికీ ఆ కళ్ళు నన్ను వెంటాడుతూ ఉంటాయి. I can feel those eyes on me. ఆ కళ్ళకి అక్షర రూపమంటూ ఉంటే అది ఈ రచన.
మనం మన బంధాలకి ప్రేమ, స్నేహం, బంధుత్వం, శత్రుత్వం లాంటి గుణాల్లో లెక్కవేసుకుంటాం గానీ, వాటిని రంగుల్లో పోల్చుకోగలితే, ప్రతి బంధం ప్రతి మనిషి మనపై, మనసులపై వదిలిపోయే రంగులని గమనించుకుంటే జీవితం అచ్చంగా రంగులమయంగా తోస్తుంది. Relationships ooze out colors. Of varying shades and hues. Literature too leaks colors. I’ve cobalt blue on my hands now. కొన్ని గోరింటాకులు నీలంగా కూడా పండుతాయి.
Leave a Reply