శకుంతల: రాణి శివశంకర శర్మ
వ్యాసకర్త: శివ అయ్యలసోమయాజుల
ఈ పుస్తకం కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకానికి నవలారూపం. దీనిని రచించినవారు శ్రీ రాణి శివశంకర శర్మ గారు. ఈయన ‘ది లాస్ట్ బ్రాహ్మిణ్’ ద్వారా తెలుగు సాహిత్య రంగంలో సంచలనం సృష్టించిన రచయిత. ఆధునిక నాగరికత, సమాజం, రాజకీయాలను భారతీయ తాత్త్విక దృక్కోణంతో సునిశితంగా విశ్లేషించిన ‘ది లాస్ట్ బ్రాహ్మిణ్’ కన్నడ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదమై చాలా మంది ఆదరణకి నోచుకున్నది. శర్మగారి ఇతర రచనలు- పురాణం వేదం, అమెరికానిజం, సనాతనం, దళిత కవి మద్దూరి నగేష్బాబుతో కలిసి ఊరూవాడా అనునవి ప్రఖ్యాత రచనలు.
ఇది ఒక 110 పేజీల చిన్న పుస్తకం. దీనిని రెండు భాగాలుగా విభజించడం జరిగినది. ఇందులో మొదటి భాగం 60 పేజీల శకుంతల నాటకం, రెండవ భాగం ఇంకో 50 పేజీల వ్యాఖ్యానములతో కూడి ఉంటుంది.కాళిదాసు మహాకవి, కవికులగురువు అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు సాక్ష్యం. నేను హైదరాబాదులో ఉండేటప్పుడు సుమారు ఒక 12 సంవత్సరాల క్రితం, బెస్ట్ బుక్ స్టోరులో చాలాసార్లు కాళిదాసు కావ్యాలను, నాటకాలు కొనేవాడిని.. కాని ఇంటికి వచ్చి చదువుతుంటే అంత సులువుగా అర్ధం అయ్యేవికావు.. కొన్ని తెలుగు అనువాదాలు అయినా కుడా పక్కన ఒక డిక్ష్నరీ ఉన్నా కూడా అంతతేలికగా బోధపడేవికావు..అటుపై మరలా ఎప్పుడు ప్రయత్నించలేదు కూడా. పోయిన సంవత్సరం అమజాన్ లో శ్రీకంతశర్మ గారి ‘మౌన సుందరి’ అనే కధల పుస్తకం కోసం వెతుకుతూ ఉంటే యాదృచ్చికంగా ఈ పుస్తకాన్ని కూడా నా కార్టులోకి జత చేర్చడం జరిగింది..కారణాంతరాల వలన కొన్న వెంటనే చదవక పోయిన, ఈ పుస్తకాన్ని గత నెలలో చదవటం ముగించాను..
కె.బలరాం గారి ‘అనల్ప’ మాట అనంతరము, ఈ పుస్తకంలో ‘పరిచయం’ పాఠకుడికి కాళిదాసు చరిత్ర గురుంచి, అసలు కధ ఎక్కడిది, ఏకాలానికి, ప్రాంతానికి సంబంధించిన విషయాలు సమగ్రంగా వివరించబడినవి. ఇది నాకు బాగా నచ్చింది.. అందరికీ అన్నీ తెలియాలనే నియమము లేదు కనుక ఇది చాలా ఉపయుక్తమైన వివరణ పద్దతి గానే నేను భావించాను…
అటుపై,శివశంకర శర్మగారు ‘నా మాట ‘అని, అందులో ఈమధ్య కాలంలో శంకుంతలని అర్ధం చేసుకోవటంలో పలు రచయితల దృక్పధాలను వివరించడం జరిగింది. చివరిగా, ఆయనను ఈ రచన రచించడానికి ప్రోత్సహించిన, సహకరించిన మిత్రులను, వ్యాఖ్యలత గురించి చెప్పబడినది.
కె.బలరాంగారి ‘అనల్ప’ మాట నుంచి ప్రతీ పేజీ చదువుతున్నప్పుడు కాళిదాసుని తలుచుకోకుండా ఉండలేము.. అదేవిధంగా శివశంకర శర్మగారు మొత్తం నాటకాన్ని నవలా రూపంలో వర్ణించిన తీరు నన్ను పూర్తి చేసినంతవరకూ కట్టిపడేసింది. అనువాదం అయినా, నాటకరూపంలో పొందు పరచడం, అదీ కాళిదాసు ని అనుకరిస్తూ సరైన భావ ప్రకటన చేయటం అంత తేలికైన విషయం కాదు. కానీ, శర్మగారు దీనిని అతి సహజంగా, స్వేచ్చగా, స్వచ్చంగా, తేలికగా అనువదించటంలో సఫలీకృతులయ్యారనే నాకు అనిపిస్తుంది!
జాలరికి చేప కడుపులో దొరికిన రత్నఖచితమైన అంగుళీయకం దొరకడంతో, పురోహితుడు బెస్తవాడిని దుష్యంతుడి సమక్షంలో ఇది ఎక్కడ, ఎప్పుడు అని ఇలా పలు పశ్నలు కురిపిస్తాడు.. అక్కడే ఆసీనుడై ఉన్న దుష్యంతుడు ఆలోచనా నిమగ్నుడవుతాడు. వలయాకృతిలోని అంగుళీయకాన్ని చూడగానే తనలో స్మృతి పరంపర సుళ్ళు తిరిగేలా చేయడం మొదలు పెడుతుంది. శకుంతలను స్మరించడం తో నాటకం మొదలవుతుంది…కాళిదాసు స్మృతి, విస్మృతుల వివరణతో కధను జరిగిన సన్నివేశాల స్మరణతో, ప్రస్తుతం జరిగుతున్న పరిణామలనీ పాఠకుడుకి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉంటాడు. ఇందులో దుష్యంతుడి మనో వేదన, శకుతలతో ప్రణయం, బ్రహ్మర్షి అయిన కణ్వుడి పెంచిన తండ్రి వేదనా, శంకుతలకు ప్రకృతితో ఉన్న స్వచ్చమైన స్నేహభావం ఇలా కధమొత్తం భావోదృకమైన సంఘటలతో పాఠకుడిని రంజింప జేస్తుంది.కొన్ని…
“మహారాజా! నీ పౌరుషం విద్యకీ తపస్సుకీ నిలయాలైన ముని ఆశ్రమాల్లో కాదు. పుష్పాలపై అగ్గిరవ్వలు చిందడం వీరత్వంకాదు. ఇది నీ రాజసానికి పరీక్షాస్థలం కాదు. విద్యలకి స్పర్ధా నిలయం. శాంతికి ఆవాసం. అని శకుంతల దుష్యంతడుతో వేటకు వచ్చినప్పుడు అంటున్నప్పుడు..
వేధించే ప్రియత్ముడా!
మదనుడెపుడు తాపమిచ్హు
దివానిశలు వెంటాడును
వేటకు విరామమివ్వడు
రక్షించేవాడెవ్వడు? శకుంతల లేఖ
కోకిలా శంకుంతలా
తాపమొకటె నీకు కాని
జ్వాలలు రేపెను నాలో.
చంద్రుని కనుమరుగు చేయి
సూర్యుడు కాదె మదనుడు.
కలువకు కాదంతటి వ్యధ? అంటు దుష్యంతుడు లేఖని స్వీకరిస్తాడు.
కణ్వుడు శకుంతలను పెంచి పెద్దచేసిన తండ్రి. ఆతనికి భాగ్యవశాత్తు ఆమె అడివిలో లభిస్తుంది.కణ్వుడుకి పుత్ర సంతానం ఉండరు. శకుంతల ఆగమనం తరువాతే కణ్వమహర్షి ఉన్మీలిత నేత్రాలతో అంతర్ముఖుడై శాంతిని అన్వేషించడం మాని చుట్టూ ఉన్న ప్రకృతిలో, అరణ్యంలో జీవన సౌందర్యాన్నీ, శాంతినీ, దైవాన్నీ దర్శించడం మొదలుపెట్టాడు. అన్ని వేద మంత్రాల అర్ధాలని శకుంతల సన్నిధిలోనే రుషికి స్ఫురించేవి.ఒక్కొక్కసారి ఆ వృక్షాలలో, లతలలో, పక్షులలో, ఆ సుందర ప్రకృతిలో శకుంతల కలిసి పోసినట్లు, మమైకమైనట్లు భాసించేది.ఇప్పుడు కణ్వుడికి పుత్రుడు లేకపోవటం ఒక లోటుగా అనిపించటం లేదు. ఆర్ద్రమైన, ప్రేమాస్పదమైనది ఆడపల్ల అంటాడు కాళిదాసు.
పెంచుకున్న కూతురైనప్పటికీ, శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోతుంటే, నేను తీవ్ర దుఃఖంలో మునిగిపోయాను. అరణ్యంలో నివసించే వీతరాగుడైన మునినైనప్పటికీ నా పరిస్థితి ఇది. ఇంక సాధారణ గృహస్తుల పరిస్థితులు ఎలా తట్టుకొంటారో అనుకుంటాడు కణ్వుడు. ఈ వేదన నుంచి తన తపస్సు, మునిత్వం ఒడ్డున పడేస్తాయని భావించిన కణ్వుడు, ఆ సమయంలో ఒడ్డున పడిన చేపలా గిల గిలా గింజుకుంటాడు.
తపోవన తరువుల్లారా, దేవతామూర్తుల్లారా! అత్తవారింటికి పయనమై వెళ్తున్న ప్రియపుత్రిక శకుంతలకి చల్లని నీడనివ్వండి. మీరు తాగకుండా తాను నీరు తాగడానికి కూడా ఇచ్చగించేదికాదు శకుంతల…
ఇలా చాలా సందర్భాలలో చదువుతూ ఉన్నంత సేపూ వాత్సల్యం, ప్రేమ, కరుణ వంటి భావాలతో హృదయం బరువెక్కుతూ ఉంటుంది.
ఈ కథ బహుశా అందరికీ విదితమే కానీ ఇందులో చాలా సున్నితమైన అంశాలు చాలా విమర్శలకి దారి తీసాయి.. స్త్రీ వాదం, పురుషాహంకారం, ఈ కధ గ్రీకు పురాణంలోని ఒక జాతక కధ అని, ఇంకా అనేక సాహిత్య సంబంధిత విషయాలకు ఈ నాటకం తావు నిచ్చింది. ఈ పుస్తకంలో రెండవ భాగం కధకి సంబంధించిన వ్యాఖ్యానాలు ఇవ్వబడ్డాయి. చాలా సున్నితమైన విషయాలకు కాలం, దేశము ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో అలానే కాళిదాసు శకుంతలని అర్ధం చేసుకోవడానికి కూడా అవి అంతే ప్రాముఖ్యం వహిస్తాయి అని కొందరి వ్యాఖ్యానించారు! స్మృతి విస్మృతి మానవ జీవితంలో ఎంత వరకూ విడదీయలేని విషయములో, వాటి ప్రాముఖ్య రీత్య వ్రాసిన వ్యాఖ్యలు నాకు చాలా నచ్చిన వివరణలు..
మొత్తానికి ఇది నాకు ఎన్ని సార్లు చదివినా, చదవాలనిపించే మరొక పుస్తకాల జాబితాలోకి చేరినది.. మా ఈ శాకుంతల!
(ఇదే సీరిస్ లో వచ్చిన “మాళవిక” గురించిన పరిచయం వ్యాసం ఇక్కడ.)
Leave a Reply