మాళవికాగ్నిమిత్రం

వ్యాసకర్త: శివ అయ్యలసోమయాజుల

ఈ పుస్తకం కాళిదాసు ‘మాళవికాగ్నిమిత్రం’ నాటకానికి నవలారూపం. దీనిని రచించినవారు శ్రీ.ఇంద్రగంటి శ్రీకంతశర్మ గారు. ఈయన కవి-పండితుడు-విమర్శకుడు-వ్యాసకర్త-కథానికా రచయిత అయిన శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు తనయుడు. శ్రీకాంత్ శర్మ గారు కూడా ఆయన తండ్రి గారి వలెనే తెలుగు సాహిత్య లోకంలో ప్రముఖులు. పాత్రికేయుడిగా, ఆకాశవాణి కార్యక్రమ రూపకర్తగా, పత్రికాసంపాదకుడిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించిన శ్రీకాంతశర్మగారు సంస్కృత, తెలుగు, ఆంగ్ల భాషలలో పండితులు. కవిగా, విమర్శకుడిగా, నవలాకారుడిగా, నాటక రచయితగా, కథకుడిగా బహుధా ప్రశంసలందుకున్న ప్రజ్ఞాశాలి. తన సాహిత్య కృషికి తెలుగు నేల నలుచెరగులా ప్రశంసలు అందుకున్నారు. సంస్కృత సాహిత్యాభిమాని. దీనిని ముద్రించినవారు అనల్ప బూక్ కంపెని వారు.

ఇది ఒక 85 పేజీల చిన్న పుస్తకం. కాళిదాసు మహాకవి. కవికులగురువు అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు సాక్ష్యం. నేను హైదరాబాదులో ఉండేటప్పుడు సుమారు ఒక 12 సంవత్సరాల క్రితం, బెస్ట్ బుక్ స్టోరులో చాలాసార్లు కాళిదాసు కావ్యాలు, నాటకాలు కొనేవాడిని. కాని ఇంటికి వచ్చి చదువుతుంటే అంత సులువుగా అర్ధం అయ్యేవికావు. కొన్ని తెలుగు అనువాదులు అయినా కుడా పక్కన ఒక డిక్ష్నరీ ఉన్నా కూడా. అటుపై మరలా ఎప్పుడు ప్రయత్నించలేదు కూడా. పోయిన సంవత్సరం అమెజాన్ లో శ్రీకంతశర్మ గారి ‘మౌన సుందరీ కధల పుస్తకం కోసం వెతుకుతూ ఉంటే యాదృచ్చికంగా ఇది నా కార్ట్ లోకి జత చేర్చడంతో మరికొన్ని పుస్తకాలతో ఇది కూడా వచ్చింది. కారణాంతరాల వలన ఈ పుస్తకాన్ని గత నెలలో చదవటం ముగించాను. కె.బలరాంగారి ‘అనల్పా మాట నుంచి ప్రతీ పేజీ చదువుతున్నప్పుడు కాళిదాసుని తలుచుకోకుండా ఉండలేము. అదే విధంగా శ్రీకాంతశర్మ మొత్తం నాటకాన్ని నవలా రూపంలో వర్ణించిన తీరు నన్ను పూర్తి చేసినంతవరకూ కట్టిపడేసింది.

కె.బలరాం గారి ‘అనల్పా మాట అనంతరము, ఈ పుస్తకంలో ‘ముందుమాటా  పాఠకుడికి కాళిదాసు చరిత్ర గురించి, అసలు కథ ఎక్కడిది, ఏకాలానికి, ప్రాంతానికి సంబంధిచిన విషయాలు సమగ్రంగా వివరించబడినది. ఇది నాకు బాగా నచ్చింది. అందరికీ అన్నీ తెలియాలనే నియమము లేదు కనుక ఇది చాలా ఉపయుక్తమైన వివరణ పద్దతి గానే నేను భావించాను..

మాళవికాగ్నిమిత్రం-నాటకం అనే రీతికి చెందినది. మూలంలో ఇది అయిదు అంకాల నాటకం ఇతివృత్తం అగ్నిమిత్రుడనే రాజుకి, మాళవిక అనే అమ్మాయితో నడిచిన ప్రేమకధ. ఈ కధని సంస్కృతభాష తెలియని వాళ్ళ కోసం-నవలా రూపకంగా చెప్పడం ఈ పుస్తకం ప్రస్తుత ఉద్దేశ్యం.

“వసంతకాలం ప్రవేశించింది.

చలి, చురుకు, మధ్యగా సూర్యరశ్మి

ఆహ్లాదకరంగా ఉంటుంది.

విదర్భరాజ్యం సరిహద్దు ప్రాంతాలి దాటి,

నర్మదానదికి దక్షిణంగా విదిశా నగరం

చేరుకోవడానికి ఒక యాత్రిక బృదం ప్రయాణిస్తోంది… ఇలా మెల్లగా పాఠకుడిని ఎక్కడో చరిత్రలో విదర్భా రాజ్యానికి తీసుకుపోతాడు రచయిత…

చదువుతూన్నంత సేపు రచయిత ములానికి దగ్గరగా ఉన్నా భావావేశాన్ని తీసుకురావటానికి రచయిత చేసిన ప్రయత్నం ఆయన వాడిన పద జాలాన్ని బట్టి తెలుస్తుంది…ఉదా, ఒక చోట:

మాళవిక పాట:

హృదయమా!

అలవికాని ఆశలేలనే!

నాప్రియుని జేర నలవియౌనటే!

వామనేత్ర స్పందనమే-అయ్యయో!

ఎన్నినాళ్ళకతని జూచితే!

నా దరికిక జేరుటెన్నడో!

స్వామీ నీ దాసినిరా!

ఇలా కాళిదాసు విరహ గీతాన్ని అభివర్ణించటములో రచయిత ప్రజ్ఞ స్పష్టముగా తెలుస్తుంది.

ఇకపోతే మొత్తం పుస్తకం చదువుతున్నంతసేపూ, ఆకాలపు ఆచార వ్యవహాలను, వారి వ్యవహార శైలిని కాళిదాసు సూచించినట్లు మనకు విదితమవుతూ ఉంటుంది.. గౌతముడనే బ్రాహ్మణుడి తో అగ్నిమిత్రుడి సంభాషణా, మైత్ర భావనా ముఖ్యంగా మనోరంజకముగా కనిపిస్తుంది. అగ్నిమిత్రుడికి మాళవికపైనే కాక మిగతా రాణులపై ఉన్న గౌరవాన్ని, ఎక్కడా వారిని కించపరిచే మాటలు గానీ కనిపించవు.రాజు స్త్రీలపై ఉన్న గౌరవం కూడా ఇందులో గమంచించ వలసిన విషయము..

చివరిగా, నాకు ఈ నవలా పద్ధతి నచ్చింది.కాళిదాసుని అర్ధం చేసుకోవటానికి మరొక అవకాశంగానే నేను భావిస్తున్నాను. 

You Might Also Like

Leave a Reply