Yellow is the colour of longing – K.R.Meera

“The Phallus constitues the Central Shaft, the very Axis of contemporary systems of power; it must be debilitated, demolished, destroyed without delay!” (Same-sex sorrows.)

ఇలాంటి వాక్యాలతో కథ ఒకటి మొదలవ్వగానే, పైగా రాసిన రచయిత గురించి పదేపదే ఇంటర్వ్యూలలోనూ వ్యాసాలలోనూ “ఫెమినిస్ట్” అన్న పదం ఎక్కువగా విని ఉండడం చేత, దీన్ని భావజాలంతో నిండిన భావావేశపు కథ అన్న నిర్ణయానికి రావచ్చు. సాధారణంగా జరిగేది కూడా అదే.  ఏదైనా ఒక భావజాలమో, సిద్ధాంతమో ఒక చోట పాతిపెట్టిన విద్యుత్ స్తంభంలాంటిది అనుకుంటే, దాన్ని నమ్మేవాళ్ళు, అందుకు అనుగుణంగా రాసేవాళ్ళు దాని వెలుతురులోనే తచ్చాడుతూ ఉంటారు. కనిపించని తాడేదో వాళ్ళని ఆ స్తంభానికి కట్టేసినట్టు వాళ్ళు కొంచెం దూరమే వెళ్ళగలరు. స్తంభానికి దగ్గరగా ఉండడం వల్ల ప్రయోజనాలు కూడా ఎక్కువే. ఫలానా భావజాలానికి ప్రస్తుతం ఉన్న డిమాండ్ బట్టి రచయితలకి గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు వెతుక్కుంటూ చేరతాయి. ఆ విద్యుత్ స్తంభం వెలుతురులోనే తిరిగే రచయిత అయితే పైన ఉటకించిన వాక్యాలతోనే కథ మొదలుపెట్టచ్చు. మొదలుపెట్టి, అంతటి భీషణంగా ఉపన్యాసం ఇస్తున్న అమ్మాయిని చితగొట్టారనో, లేదా రేప్ చేశారనో, లేదా ఆమె ఇంట్లో మాత్రం కుక్కిన పేను అనో ఏదో ఒకటి రాసి ముగించచ్చు. “ప్చ్, ప్చ్” అని పాఠకుల చేత అనిపించచ్చు. 

కానీ కొంతమంది అరుదైన రచయితలు ఉంటారు. వాళ్ళకి ఫలానా విద్యుత్ స్తంభం దగ్గరే పడిగాపులు పడాలసిన, దాని వెలుగు నీడల్లోనే కథలు వెతుక్కోవాలసిన అగత్యం ఉండదు. వీళ్ళు ఆ స్తంభం ఎక్కి ఆ దీపం నుంచి మరో దీపం వెలిగించుకుని దాన్ని చేతబట్టుకుని వాళ్ళు వెళ్ళే ప్రతి చోటకీ పట్టుకుని పోతారు. వాళ్ళకి కనిపించే కథలని వాళ్ళు చేతిలో ఉన్న దీపంలోనూ, వాళ్ళు మనసు-మేధలలో వెలిగించుకున్న దీపంలోనూ చూడగలుగుతారు. ఈ సంగతి నాకు కె.ఆర్.మీరా రాసిన “హాంగ్ వుమన్” చదివినప్పుడే అర్థమైంది. అసలైతే, ఆ నవల కూడా స్త్రీలకి ఉరిశిక్ష వేసే హక్కు లేదా అన్నది మాత్రమే కథలో ఉండాలి. మహా అయితే కాపిటల్ పనిష్మెంట్, దాని చుట్టూ ఉండే రాజకీయాలు. కానీ రచయిత అంతకు మించిన విన్యాసమే చేస్తుందందులో. చరిత్రలో మరుగున పడిపోయి, కథలుగా వ్యథలుగా జ్ఞాపకంగా వచ్చి పోయే అలల్లాగా మాత్రమే మిగిలిపోయిన సమస్త భారత స్త్రీ చరిత్రను తిరగతోడింది. ఒక రచయితగా, ఫెమినిస్టుగా ఆమె తవ్వితీసిన అవశేషాలని, శిథిలాలని పాఠకురాలైన పాపానికి నా చేత మోయించింది. ఆ బరువుని మోయడానికి మానసికంగా సిద్ధపడినప్పుడే ఆమె రచనలని చదవాలని కొద్ది కాలంగా వాటికి దూరంగా ఉన్నాను. చిన్న కథలైతే కాస్త తేలికనుకున్నాను గానీ పొరపాటు.

ఒక  కథ ఎత్తుకోడానికి మొదట్లో కోట్ చేసిన వాక్యాలతోనే ఎత్తుకున్నా, మరు క్షణం కరుడు గట్టిన పితృస్వామ్య భావజాల మగాడిని ఆ ఉపన్యాస వేదికకి మైక్ మాన్‍గా ఒక పాత్రని నిలిపి దాన్ని అతని కథగా మారుస్తుంది. పురుషాంగం చుట్టూ తిప్పుతూ చివరకి అది ఉండీ వద్దనుకునే మనిషితో ముగింపునిస్తుంది. మగజాతి మీదున్న విపరీతమైన అసహ్యం, మగజాతి చేసే వికృత పనులు, అణగారిపోయిన ఆడజీవితాలు, ఆడ-మగ బైనరీలలో ఇరుక్కోలేని అస్తిత్వాలు అన్నీ చూపించగలుగుతుంది – ఒక్క కథలో. 

చిన్న కథలని మామూలుగా slice of life representations అంటారు. ఏదో ఒక ముఖ్యమైన ఘటన, ఏదో ఒక phase. కానీ, చిత్రంగా కె.ఆర్.మీరా కథల్లో తరతరాలుగా కేరళ సభ్యసమాజం, రాజకీయ నేపథ్యం, ఆడవారు పడిన, పడుతున్న అవస్థలు – అన్నింటి బరువూ ఉంటుంది.  అది అరవై ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే ఇల్లాలి కథలోనూ ఉంటుంది, నాన్న ఉద్యోగాన్ని కాపాడ్డానికి “అరేబియన్ నైట్స్” తరహా టివి సీరియల్స్ కథ రాసే అమ్మాయి కథలోనూ ఉంటుంది. అరవై ఏళ్ళకి కడుపు తెచ్చుకున్న అమ్మమ్మ కథలోనూ ఉంటుంది, అమ్మమ్మ చనిపోయిననాటి పీడ వదలక మంత్రతంత్రాలని ఆశ్రయించే మనవరాలి కథలోనూ ఉంటుంది. 

ఎందుకంటే, కె.ఆర్.మీరా ఫెమినిజం ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాలకి ఆక్రోశించడం, మగవాళ్ళని దూషించడంతోనో ఆగదు. కథ రాసే విధానంలోనూ, వాడే పదజాలంలోనూ  తీవ్రమైన కసిలోంచి పుట్టుకొచ్చిన ఒక పదునైన వ్యంగ్యం, ఒక అపహాస్యం  కనిపిస్తుంటాయి. ఈ కథల్లో ’నరేటర్ గేజ్’ (Narrator’s gaze) ఎవరిదో పట్టుకోవడం చాలా కష్టం. అది కేరళ సమాజంలో మర్రి ఊడల్లా పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలాన్ని వెక్కిరిస్తున్నట్టే, ఈసడించుకుంటున్నట్టే ఉంటుంది.  కానీ అది ఎవరిది? గదిలో వేసి పిల్లిలా కొడితే పులైన ఆడదానిదా? లేదా, ఇప్పటికైనా తన ప్రవర్తనని పరికించుకుంటున్న మగాడిదా? లేక ఈ ఆడా-మగా విభజనలో ఇమడని మరో సాక్షిదా? కథలో ఎవరు ఎవరివైపుకి ఒక వేలెత్తి చూపినా, తక్కిన అన్ని వేళ్ళూ పాఠకులవైపుకే చూపెడుతుంటాయి – జరుగుతున్నదాంట్లో నీ పాత్ర ఎంతో? అంటూ నిలదీస్తున్నట్టే ఉంటాయి.  

ఉదాహరణకి, ఆడవాళ్ళ శరీరాలు, వాళ్ళ కోరికలు, కాంక్షలని వ్యక్తపరిచే స్వేచ్ఛ, నిబంధనల అంశాలతో చాలానే కథలు వచ్చాయి, వస్తుంటాయి. చర్చకి పెట్టాలిసిన అంశాలవి. కానీ పైన చెప్పుకున్నట్టు “ఫెమినిజం” అనే థియరీ (లేదా limited and rigid meaning) దీపపు వెలుతురులోనే  రాసే కథలు ఒక దగ్గరే ఆగిపోతాయి. అవి మనకి తెల్సిన ప్రపంచంలో ఉండి, పాఠకులుగా మనం పాత్రలపై తీర్పులు ఇవ్వగల పరిస్థితుల్లో నిలబెడతాయి. కె.ఆర్. మీరా కథలు మాత్రం మానవ మేధకి పరీక్ష పెట్టే మరో reamలోకి తీసుకెళ్తాయి. అలా వెళ్ళడానికి ఆమె కొన్ని టెక్‍నిక్‍లని వాడుతుంటారు.

కథల్లో చాలా బలమైన అతిశయాలు  వాడడం ఒకటి. “Yellow is the color of longing”లో ఆమెకి పచ్చకామెర్లు కాబట్టి అతను పచ్చగా కనిపిస్తాడు. అతనికేదో కొత్త రకం వైరల్ ఫీవర్ కాబట్టి అన్నీ బూడిద రంగులో కనిపిస్తుంటాయి. వాళ్ళకి ప్రేమ కూడా ఏదో రోగంలాగా “అంటుకుంటుంది.” “The Heart Attacks us”లో ఒక అరవై ఏళ్ళ ఆవిడకి శ్రీవల్లభుడంటే పరమ భక్తి. కట్టుకున్న మొగుడన్నా అంతే భయం, భక్తీ. జీవితమంతా వాళ్ళ సేవలోనే గడిపేస్తుంది. కానీ ఆ పరలోక దేవుడు, ఈ ఇహలోక దేవుడు ఇద్దరికీ ఆడవాళ్ళంటే చిన్నచూపు. కథలో ఎక్కువగా దేవుడి ప్రస్తావనే ఉంటుంది. దాన్ని భర్త ప్రవర్తనకి మనం అన్వయించుకోవాలి. 

కథ నిజంగా జరిగిందా, లేదా కేవలం పాత్ర ఊహల్లో మాత్రమే జరిగిందా అని తేల్చుకోలేని విధంగా ఒక అనిశ్చితిలో వదిలిపెట్టే కథలు కొన్ని.  “The Hanging Cot”లో ఒక అమ్మమ్మ చనిపోయిననాటి పీడ మనవరాలిని వెంటాడుతూ ఉంటుంది. ఆమెని ఒక భూతవైద్యుని దగ్గరకి తీసుకెళ్తారు. అమ్మమ్మ చనిపోయిన రోజునాటి జ్ఞాపకాలు, ఇక్కడ భూతవైద్యంలో జరుగుతున్న ఘటనలు కలిగలిసిపోయి కథనం వింతగా ఉంటుంది. అలానే, “Finally, Sasandeham” అనే కథలో అరవై ఏళ్ళ అమ్మమ్మకి కడుపు వస్తుంది. డాక్టరైన కూతురే పురుడు పోస్తుంది. కానీ ఆమెకి కడుపు రావడానికి గల కారణం మాత్రం abstract, metamorphical గా చెప్పడంతో, అసలు ఏది నమ్మాలో తెలీదు. 

చారిత్రిక ఘటనలని, కాల్పనిక సాహిత్యాన్ని వాడుకుంటూ కథ చెప్పడం. “Guillotine”లో ఆమె  కేరళలోని ఒకప్పటి కమ్యూనిస్ట్ రాజకీయాల్లో తలమునలకై, ఆ పోరాటాలు చేస్తున్న ఒకడిని ప్రేమించి, ఆరాధించి, మోసగించబడి, చివరికి పై చదువుల కోసం విదేశాలకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అతణ్ణి కలవాల్సి వచ్చినప్పుడు ఆనాటి జ్ఞాపకాలని, చదివిన చరిత్రని కలగాపులగం చేసి చెప్తుంది. మగవాళ్ళకైతే ప్రేమ శరీర వాంఛ, కలయిక, ఒక విడుదల. ఆడవాళ్ళకి ప్రేమ అంతరంతరాల్లో నిలిచిపోయి పెరిగి పెద్దదవుతుంటుందేమో. అందుకనే వాళ్ళ ప్రేమ కథలని తవ్వితే ఎన్నో అవశేషాలు బయటపడతాయి అని అనిపించింది ఈ కథ చదువుతుంటే. 

“Alif Laila” అన్న కథ టివి సీరియల్స్ మీద సెటైర్. అరేబియన్ నైట్స్ తరహాలో గమ్మత్తుగా, అద్భుతంగా నడుస్తుంటుంది. ప్రస్తుత సమాజం మీద పాత కథ స్టైల్‍లో వ్యాఖ్యానం అని అనుకునే లోపు, ముగింపుగా రెండు సాధ్యతలని మన ముందుంచి ఇప్పటి షెహరజాద్‍లు యుక్తితో ప్రాణాలు కాపాడుకోగలిగినా వారి మానం మాత్రం మరో పురుషుని ఆధీనంలో ఉండక తప్పదని గుర్తుచేస్తుంది. “Noor-Light Years of Solitude”లో మార్క్వెజ్ రాసిన “One hundred years of solitude” అనే పుస్తకం కీలక పాత్ర పోషిస్తుంది. నాకీ కథ చదువుతుంటే మంటో గుర్తొచ్చాడు, ఒక్క క్షణం.  హిందు-ముస్లిముల అల్లర్లు, రేప్ చేయడానికని వచ్చిన యువకుడు ఒక అమ్మాయి చూసి ప్రేమలో పడి మనిషిగా మారడం కథాంశం. చాలా కవితాత్మకమైన వచనం – అనువాదంలో కూడా. 

ఇహ నన్ను మొత్తంగా ఒక కుదుపు కుదుపు ఊపేసిన కథ “The Saga of Krishna.” కేరళలో సెక్స్ రాకెట్‍లో చిన్నపిల్లలు ఇరుక్కోవడం అనే నేపథ్యంతో రాసిన కథ. రాస్తాను త్వరలో. ఎక్కువ కథల్లో కృష్ణుని ప్రస్తావన ఏదో విధంగా వస్తుంది, కానీ ఇందులో వచ్చినట్టు మరెక్కడా రాదు.  ఈ ఒక్క కథ గురించి మాత్రమే ఒక వ్యాసం రాయచ్చు. 

నేను భారతీయ మహిళా రచయితలని చదివింది తక్కువే కానీ, మొన్నీ మధ్యనే చదివిన అమ్రితా ప్రీతమ్ స్త్రీ శరీరాన్ని (ముఖ్యంగా తన శరీరాన్ని, తన శరీరం నుంచి వచ్చిన వాళ్ళని) పంజరంలా, ఒక ఏహ్య భావంతో చూస్తే, కె.ఆర్.మీరా అలాంటి judgments pass చేయకపోయినా స్త్రీ శరీర ప్రస్తావన uninhibitedగా తీసుకొస్తూనే ఉంటుంది కథల్లో.  

“The police came in turns. Handcuffed her, and then raped. She shut her eyes tight and prayed – Ingila Sindaba…. People gaped. Communist wench. Hardy stuff. The ploughed-up soil sprouted. People laughed. Did you hear? The wife of the jailed comrade is pregnant. That’s socialist pregancy. Communist pregnancy. Just wait, the kid’s going to be born with a hammer and a sickle.” (Ave Maria)

రేప్‍కి గురికాబడ్డ స్త్రీ శరీరాన్ని దున్నబడ్డ నేలతో పోల్చారు ఇక్కడ. ఇలాంటిదే మరో ఉపమానం “Saga of Krishna”లో కూడా వస్తుంది. అక్కడ సెక్స్ రాకెట్ నుంచి కూతుర్ని పోలీసులు కాపాడాక జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం అందరూ పోగైనప్పుడు వచ్చే వాక్యాలు: 

“In the veranda outside, a crowd had gathered. From the window of the inner courtyard, the little front yard enclosed by the ornamental wall near the row of steps and neatly laid with fine sand looked as if it had been raped. The marks of many who had entered and exited, deep dents made by police boots. Reticulated footprints from leather sandals; unthinking blotches from rubber sandals. In between, the marks of the bare feet of those who had come in for a curious peek.”  (Saga of Krishna)

ఈ కథలన్నింటిలో రచయిత స్త్రీ శరీరాల గురించి, కోరికల గురించి, మగవాళ్ళు వాటిని అనుభవించడం, అత్యాచారాలు చేయడం గురించి  ఏ మాత్రం మాటలకోసం తడబడకుండా, మొహమాటపడకుండా రాసింది. ఆమె heterosexual కథల్లో మనకి ఇప్పటి వరకూ చూడని ఆడా-మగాకి సంబంధించిన power equations కనిపిస్తే Homosexuality నేపథ్యంగా ఉన్న కొద్ది కథల్లో ఈ బైనరీని తుక్కుతుక్కు చేస్తుంది. జీవితం-మరణం, వాస్తవికత-ఊహాలోకం, కామం-వైరాగ్యం, ఆలోచన-అనుభవం, గతం-ప్రస్తుతం-భవిష్యత్తు: ఆమె రచనలో ఏది ఎప్పుడు ఎలాగ పరివర్తన చెంది కథనంలో మరో కొత్త కోణాన్ని తీసుకొస్తుందో చెప్పలేం. 

“The Revolution is inevitable. Blood will have to be split, for the good of the world. Elimination, too, is a kind of a democratic process. Blood will be split in the first entry into power, like in your first intercourse.” (Guillotine)

కె.ఆర్.మీరాని చదవడం కూడా అలాంటి visceral experience, నా వరకూ. అవ్వడానికి ఇవి పది పేజీలకి మించని కథలే అయినా ఒక్కొక్కొటి చదివాక తేరుకోవడం కష్టమే. ఐడియాలజిలకి లొంగేవాటికన్నా కథలే ఎక్కువ చిక్కుముళ్ళు చూపించగలుగుతాయి. ఇంకెవరో ఇచ్చిన థియరీని సమాధానంగా చేసుకోకుండా వాటిని మనమే విప్పుకోవాలి. అత్యుత్తమ సాహిత్యం మనకా పని అప్పగిస్తుంది. కె.ఆర్.మీరా లాంటి రచయితలు మన చేతిలో చిక్కుముళ్ళని పెట్టేసి వాళ్ళు చక్కా పోతారు. 

అనువాదంలో గమనించిన విషయాలు: 

  1. స్త్రీ ప్రాధాన పాత్రగా నడిచిన కథల్లో పురుషుల ప్రస్తావన, ముఖ్యంగా ప్రియుడు, భర్త అన్న పాత్రల గురించి వాడే సర్వనామం “He” అని వాడారు, సాధారణంగా వాడే “he” అని కాకుండా. “He” అని మామూలుగా దేవుని ప్రస్తావనలో వాడతారు. మలయాళంలో ఏ పదం వాడారో (’ఆయన’ అనే పదం కన్నా భారీ పదం ఉందేమో.)
  2. మలయాళ సంస్కృతి, జీవన విధానానికి సంబంధించిన పదాలు (ముండు, నెర్యాతు వంటివి) యధాతథంగా వాడారు. 
  3. పాత్రల పేర్లు, ఊర్ల పేర్లు, కథల్లో వచ్చే ఇతర సాహిత్యం పేర్లు అన్నీ మలయాళీ అవ్వడంతో, అక్కడ వాతావరాణాన్ని, సంస్కృతిని బలంగా చెప్పారు కాబట్టి, ఇంగ్లీష్ లో చదువుతున్నా ఇవి మలయాళీ కథలు అన్న సంగతి ఒక్క క్షణం కూడా మర్చిపోలేము. 
  4. భారతీయ భాషల్లో ఉండే సౌలభ్యం చిన్న వాక్యాల్లోనే మాట్లాడుతున్నట్టు (chatty tone) సంగతులు చెప్పగలగడం.  వాటిని ఇంగ్లీష్‍లోకి పట్టుకొచ్చేటప్పుడు కాస్త wordiness తప్పదు, ఆ భాష గ్రామర్ ప్రకారం.  దేవిక ఇంగ్లీష్ వాక్యాలు చదువుతున్నా మన భాషల్లో వాటిని పోల్చుకోగలడం అనేది చిన్న విషయం కాదు.  ఉదా: “ఫాంటసీ పార్క్ లో ఏదో జరిగింది. ఎవరికి తెలుసు ఏమైందో? నాలుగైదు రోజులు తర్వాత శ్రీకుమారి అమ్మకి కడుపొచ్చింది. ఎలాంటి కడుపు?” – “Something happened at Fantasy Park. Who knows what. Four or five days later, Sreekumari Amma became pregnant. What sort of pregnancy?” 

మీరా వచనం గురించి కూడా గొప్పగా చెప్పుకుంటుంటారు. అయితే మలయాళం చదవలేనివాళ్ళకి దేవిక లాంటి అనువాదకులు చేస్తున్న సేవ అంతా ఇంతా కాదు. ఇజ్రాయిల్ రచయిత ఎట్గర్ కరెట్ “అనువాదంలో మిగిలేది రసం తీసేసిన చెరుకు గడ పిప్పి మాత్రమే. మూల భాషలో ఉన్న రసాన్ని వేరే భాషలకి పట్టుకెళ్ళడం అసాధ్యం” అని అంటారు. పిప్పే ఇంత రుచిగా, పౌష్టికంగా ఉంటే అసలు రసం అందుకోకపోయినా పర్వాలేదనిపిస్తుంది. భాషని పక్కకు పెట్టి భావోద్వేగాల మీద దృష్టి పెట్టచ్చు. అనువాదం చేసే పనుల్లో అదీ ఒకటి. 

You Might Also Like

3 Comments

  1. ఇంద్రగంటి ప్రసాద్

    మంచి విశ్లేషణ. మలయాళీ ప్రముఖ రచయితల్లో ఓ వి విజయన్ తరహా మేజిక్ రియలిజం కాస్తంత అలిగొరిక్ పద్ధతులు కనిపిస్తాయి. సేతు కూడా ఇలాంటి కథకుడే. మీరా వచనంలో గంభీరట కనిపిస్తుంది.

  2. కాత్యాయని

    తప్పకుండా ఈ కథలు చదవాలనిపించేంత ఆసక్తికరంగా పరిచయం చేశారు పూర్ణిమా .పుస్తకం కోసం ప్రయత్నిస్తాను .

  3. Sujata

    Wow. Excellent presentation. Amazing stories. Its very difficult to catch up with the (this kind of..) fire, especially through a block. Good job. Much power to you.

Leave a Reply