2019-20 లలో నా పుస్తకపఠనం

పుస్తకం.నెట్ లో ఈ గత ఏడాది చదివిన పుస్తకాల జాబితాలను పంచుకునే వ్యాసాలు 2010లో మొదలయ్యాయి. నేను మధ్యలో 2016 లో, 2020 లో రెండు సార్లు ఈ వ్యాసాలు రాయలేదు. 2016 లో రాయకపోడానికి ప్రధాన కారణం అప్పుడే ఓ కొత్త దేశానికి మరలడం అయితే, గత ఏడాది జనవరి మొత్తం ల్యాప్టాప్ లేకుండా ఇండియా ట్రిప్ లో ఉన్నా. అయితే, మామూలుగానే గత రెండేళ్ళలో నేను పుస్తకం.నెట్ లో 2019 మొదలయ్యాక రాసిన వ్యాసాలు మూడే. వ్యక్తిగత జీవితంలో వచ్చిన పెద్ద మార్పు దానికి కారణం అని నా ఫీలింగ్. ఇదంతా అటు పెడితే, ఈఏడాదైనా మళ్ళీ కొంచెం ఉత్సాహంగా పుస్తకం కార్యకలాపాలలో పాల్గొందాం అని ఏడాది మొదలైనరోజు అనుకున్నాను. అది అలా అలా “ఓ స్త్రీ, రేపు రా” టైపులో సాగుతోంది. సరే, ఫిబ్రవరి కూడా వచ్చేస్తోంది, కనీసం ఈ జాబితా పోస్టన్నా రాద్దాం అని మొదలుపెట్టా. కానీ పుస్తకం.నెట్ కి రాయడమే కాదు, నేను చదవడం కూడా బాగా తగ్గిపోయింది కదా… ఏం రాస్తాం? అనుకుని రెండేళ్ళకీ కలిపి రాసేద్దాం‌ అని నిర్ణయించుకుని రాస్తున్న వ్యాసం ఇది. నేను చదివిన పుస్తకాలివీ:

పిల్లలు, పెంపకం వగైరా విషయాలపై: (ఫిక్షన్, నాన్ ఫిక్షన్, అన్నీ)

Norths: Two Suitcases And A Stroller Around The Circumpolar World : Alison McCreesh. వృత్తిరిత్యా చిత్రకారిణి అయిన ఈ రచయిత్రి తన భర్త, రెండేళ్ళ పిల్లాడితో కలిసి ఆరునెలలు నార్త్ పోల్ వైపుకి ఉన్న ప్రాంతాలలో గడిపిన అనుభవాలతో కూడా గ్రాఫిక్ కథనం. ఇది నన్ను అప్పట్లో చాలా ఆకట్టుకుంది. దీన్ని గురించి కాస్త వివరంగా పరిచయం చేశాను.

A User’s Guide to Neglectful Parenting – Guy Delisle, Helge Dascher: పై పుస్తకంలాగే ఇది కూడా బొమ్మల పుస్తకం. నాకు బాగా నచ్చింది. సరదాగా ఉండింది చదవడం.

Wiped!: Life with a Pint-size Dictator: Rebecca Eckler. పాప పుట్టిన తొలినాటి అనుభవాలను పంచుకుంది ఒక కెనడియన్ మీడియా పర్సనాలిటీ. అస్సలు నాకెంత చిరాగ్గా ఉండిందంటే… చదవడం చదవడం అలా నేరుగా డస్ట్బిన్ లో పడేశాను పుస్తకాన్ని (నిజం). ఇలా పడేసిన మొదటి పుస్తకం ఇదే నా జీవితంలో ఇప్పటిదాకా.

Still: A Memoir of Love, Loss, and Motherhood: Emma Hansen. రచయిత్రి ఒకసారి అనుకోని పరిస్థితులలో తొమ్మిది నెలలు నిండిన తర్వాత బిడ్డ కడుపులో ఉండగానే మరణించిందని తెలుస్తుంది. మృత శిశువుకి జన్మనిచ్చాక ఆవిడ అనుభవించిన బాధ, కుటుంబ సభ్యులతో అనుభవాలు, క్రమంగా కొన్నాళ్ళ తరువాత మళ్ళీ తల్లవడం – ఇదీ విషయం. నేనిలా న్యూస్రీడర్ లా రాస్తున్నా కానీ, ఈ సడెన్ గా హాస్పిటల్ కి పరుగెత్తడం (నేనైతే ఆంబులెంస్ లో వెళ్ళాల్సి వచ్చింది) ఇవన్నీ నేను అంతకు కొన్ని నెలల ముందే అనుభవించినందువల్ల పుస్తకం నన్ను బాగా కదిలించింది.

Through, Not Around – Stories of Infertility and Pregnancy Loss. ఇది వివిధ వ్యక్తులు టైటిల్ లో ప్రస్తావించిన అంశాల గురించి పంచుకున్న స్వీయ అనుభవాల సంకలనం. అప్పట్లో నాకు పాప పుట్టి నియోనేటల్ కేర్ లో ఉన్నపుడు రాత్రుళ్ళు చదివేదాన్ని ఈ కథలన్నీ (పగళ్ళు అక్కడ ప్రత్యక్షంగా ఇలాంటివే అయినా కొంచెం వేరే తరహావి వినేదాన్ని తోటి పేరెంట్స్ నుండి). కొంచెం బాధించేవే అన్నీ!

The Danish Way of Parenting: What the Happiest People in the World Know About Raising Confident, Capable Kids – Jessica Joelle Alexander, Iben Dissing Sandahl. అక్కడక్కడా కొన్ని ఆసక్తికరమైన/ఉపయోగకరమైన విషయాలు ఉన్నా మొత్తానికి పుస్తకం కొంచెం overhyped అనిపించింది.

Keepers of the children: Native American wisdom and parenting – Laura M. Ramirez: పై పుస్తకంతో పోలిస్తే ఈ పుస్తకం కాస్త నయం. కానీ ఇది అకడెమిక్ గా అనిపించింది ఓ నాలుగు అధ్యాయాలు గడిచాక. ఏమాటకామాటే, ఈ పుస్తకం నా చేత అమ్మగా నేనెలా ఉండాలనుకుంటున్నా?‌ అన్న వ్యాసం కూడా రాయించింది కనుక నామటుకు బాగున్నట్లే!

నవలలు, కథలు, కవిత్వం వగైరా:

The Sixth Stage of Dying – Roland Kuhn: ఈయన మా ఆఫీసులో నేను బాగా గౌరవించే సీనియర్ కొలీగ్. చాలా ఆసక్తికరమైన మనిషి. అందుకని నవల రాశా అనగానే కొనేశాను. ఓ మోస్తరుగా ఉంది కానీ అక్కడక్కడా భలే ఆసక్తికరమైన సంభాషణలు ఉన్నాయి. వీటిలో కొన్ని మా లంచి టేబుల్ సంభాషణలని గుర్తించా నేను (అంటే ఈయన చెప్పినవే, మా మాటలు వాడుకున్నారని కాదు). అంటే ఆయన నవలలోని విషయాలే మా మీద టెస్టు చేశాడో ఏమిటో గానీ, ఇది నాకు ఒక కొత్త అనుభవం. అదొక రకం ఆనందం ఇచ్చింది – అర్రే, ఇదంతా మనకి తెల్సు కదా? అని 🙂

Emmy in the key of code – Aimee Lucido: చిన్న పిల్లల నవల. ఆసక్తికరంగా సాగింది.

Avishi, Abhaya, Mauri – Sai Swaroopa Iyer: మూడూ మైథలాజికల్ ఫిక్షన్ కిందకి రావొచ్చనుకుంటా. నాకు నచ్చాయి. ఆసక్తికరంగా సాగాయి.

Sita: Warrior of Mithila – Amish: ఆసక్తికరంగా మొదలై, అలాగే సాగినా కూడా ఈ మైథాలజీ రీటెల్లింగ్ తరహా పుస్తకాలంటే బోరు కొట్టేసింది ఈ పుస్తకం దెబ్బకి. ఇక కొన్నాళ్ళు ఆవైపు పోనేమో.

The Handmaid’s Tale – Margaret Atwood: నాకు ఇది చాలా నచ్చింది.

Indians on Vacation – Thomas King: కెనడాలో బాగా పేరు తెచ్చుకున్నట్లు ఉంది – బుక్ లిస్టులలో కూడా ఉండింది కానీ నాకేమో అంత నచ్చలేదు. అక్కడక్కడా బాగుంది, ఇక యూరోపులో జరుగుతుంది కనుక గతం గుర్తు వచ్చింది. అది తప్పితే గుర్తుంచుకోదగ్గ పుస్తకమేం కాదు.

Cottagers and Indians – Drew Hayden Taylor: ఇది నాటకం. గత రెండేళ్ళలో కెనడాలో బాగా పేరు తెచ్చుకుంది. Wild Rice పెంచడం గురించి వెకేషంలకి వచ్చే తెల్లవారికీ, అక్కడే ఉండే ఆదివాసులకీ మధ్య జరిగే ఘర్షణ. ముఖ్యమైన విషయాన్ని ఇరు పక్షాల వాదనలూ వినిపిస్తూ (రచయిత ఎవరి పక్షమో మనకి ముందే తెలుస్తుందనుకోండి), నాటకంగానే సాగడం అంత ఆషామాషీ విషయం కాదు. రచయిత ఇది చాలా బాగా నిర్వహించాడని అనిపించింది. దీన్ని గురించిన డాక్యుమెంటరీ కూడా ఒకటి ఉంది. బాగుంటుంది. నాటకం ఇంకా చూడలేదు.

Just Give Me a Cool Drink of Water ‘fore I Diiie – Maya Angelou: ఈవిడ భాష ఎంత బాగుంటుందొ, కొన్ని కొన్ని కవితలు అలా ఉండిపోయాయి మనసులో. ఈ పుస్తకాన్ని గురించి, గత ఏడాది చదివిన ఈవిడ ఇతర పుస్తకాల గురించీ పుస్తకం.నెట్లో రాశాను.

The Many That I Am: Writings from Nagaland, Crafting the Word: Writings from Manipur – జుబాన్ బుక్స్ వారు వేసిన ఈ రెండూ ఆయా రాష్ట్రాల మహిళల నుండి వచ్చిన రకరకాల సాహిత్యం సంకలనాలు. చాలా చాలా ఆసక్తికరమైన పుస్తకాలు. వీలైతే మరింత వివరంగా రాయడానికి ప్రయత్నిస్తాను. బెస్ట్ బుక్స్ ఆఫ్ 2020 నాకు సంబంధించినంతవరకు.

స్వీయకథనాలు:

A Step Away From Paradise – Thomas K. Shor ఒక యోగి ఆత్మకథ వంటి పుస్తకాలు నచ్చితే ఈ పుస్తకం చదవొచ్చు. ఆ తరహాలోనే కొన్ని ఆశ్చర్యం (నాకు) కలిగించే కథనాలు ఉన్నాయి ఇందులో.

Seasons of Hope: Memoirs of Ontario’s First Aboriginal Lieutenant-Governor – James Bartleman – పుస్తకం టైటిల్ లో రాసినట్లు ఈయనది ఓ భిన్న నేపథ్యం. దానికి తోడు డిప్లోమాట్ గా దేశాలు తిరిగిన అనుభవం. అందువల్ల ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

Mad Like Me: Travels in Bipolar Country – Merryl Hammond: మామూలుగా ఇలాంటి ఇతర స్వీయకథానాలు చదివినపుడు ఆ సమస్యతో వాళ్ళ అనుభవం మాత్రమే తెలిసేది. ఇందులో there is something for everyone – కుటుంబ సభ్యులు, ఇలాగే సమస్య ఉన్న ఇతరులు ఇలా అందరికీ ఉపయోగపడే పుస్తకం అని నాకు అనిపించింది.

Once Upon a Life: Burnt Curry and Bloody Rags: A Memoir – Temsula Ao: నాగాలాండ్ రచయిత్రి ఆత్మకథ. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అలాగే, పిల్లల తల్లిగా ఆవిడ కెరీర్ లో ఎదిగిన తీరు కొంచెం స్పూర్తివంతంగా కూడా అనిపించింది.

Kind of Hindu, ఇతర వ్యాసాలు – Mindy Kaling: చిన్న చిన్న వ్యాసాలు. మిండీ కలింగ్ నటిగా తెలుసు. ఒకటీ అరా గతంలో రాసిన పుస్తకాలు కూడా చదివాను. ఆవిడ శైలి నాకు ఒక్కోసారి చిరాకు తెప్పించినా ఇష్టం. ఈ వ్యాసాల్లో అన్నింటికంటే నచ్చింది నిజాయితీ.

Maya Angelou రాసిన ఆత్మకథాత్మక పుస్తకాలు: I know why a caged bird sings, Gather Together in my name, Mom & me & mom, Letter to my daughter: ఈ పుస్తకాల గురించి వివరంగా ఓ పరిచయం రాశాను గతంలో.

A Book of Light: When a Loved One Has a Different Mind: జెర్రీ పింటో‌ సంపాదకత్వం వహించిన ఈ సంకలనం రకరకాల మానసిక వ్యాధులు ఉన్నవారి కుటుంబ సభ్యులు పంచుకున్న అనుభవాలు. గత ఏడాది కాలంలో చాలాసార్లు గుర్తు వచ్చింది పుస్తకం. అన్ని వ్యాసాలు బాగా రాశారు అనలేము -వీళ్లంతా స్వతహాగా రచయితలు కారు. కానీ ఉపయోగకరమైన పుస్తకం. ఆ మొదటి కథనం (Swadesh Deepak గురించి) ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు!

ఇతరాలు:

The Language of Food: A Linguist Reads the Menu – Dan Jurafsky. రచయిత ప్రముఖ భాషావేత్త, ప్రపంచ వ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో చదివే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంస్ సంబంధిత పుస్తకానికి రచయిత. ఇందువల్ల పుస్తకాన్ని చదివా. కానీ, అక్కడక్కడా ఆసక్తికరమైన tidbits తప్పితే ఈ పుస్తకం బాగా నిరాశ పరిచింది. ఎంతసేపు ప్రపంచమంటే San Fransisco, San Fransisco అంటే ప్రపంచం అన్నట్లు ఉండటం ఒక కారణమైతే, అసలేం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కాకపోవడం మరో కారణం.

A Billion Voices: China’s Search for a Common Language– David Moser. చైనా దేశంలో ఒక కామన్ భాష రూపొందించడానికి గత శతాబ్ద కాలంలో జరిగిన ప్రయత్నాల గురించిన వ్యాసాలు. అక్కడక్కడా మరీ అకడమిక్ గా అనిపించినా, మొత్తానికి చాలా ఆసక్తికరమైన పుస్తకం.

Conversations on Data Science – Roger D. Peng. ఇది డేటా సైంస్ అనుభవాల గురించి పలువురితో జరిపిన సంభాషణల సంకలనం. అయితే ఒకట్రెండు వ్యాసాలు తప్పిస్తే మిగితావి మరీ వాళ్ళ ప్రాజెక్టుల చుట్టూ మాత్రమే తిరగడంతో నన్నంత ఆకట్టుకోలేదు.

The Checklist Manifesto: How to Get Things Right – Atul Gawande: ఏ పనికైనా చెక్ లిస్టులు వాడ్డం వల్ల చాలా సమస్యలు అరికట్టవచ్చు అన్నది ఈ పుస్తకం సూత్రీకరణ. రచయిత డాక్టరు – ఆయన అనుభవంలో ఇది ఎలా పనిచేసిందో చెప్పారు. పుస్తకం లో కొన్ని ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయి. గతంలో ఈ పుస్తకం గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారు పుస్తకం.నెట్లో పరిచయం చేశారు. ఆ వ్యాసం ఇక్కడ.

Unstoppable: 75 Stories of Trailblazing Indian Women – Gayatri Ponvannan- ఇందులో కొన్ని కథలు బాగున్నాయి. టీనేజి అమ్మాయిలకి కానుకగా ఇవ్వొచ్చనుకుంటాను.

Lagom: The Swedish Art of Balanced Living – Linnea Dunne: ఆ డేనిష్ పుస్తకం లాగే over hyped.

అంతే ఇదే కథ ఇప్పటికి. నేనే ఓ సాంకేతిక పుస్తకం రాసినందువల్ల గత ఏడాది ఆ పుస్తకాలు అనేకం చదివాను కానీ ఇక్కడ చేర్చడం లేదు.

You Might Also Like

Leave a Reply