ప్రతి మజిలీ వొక కవిసమయం

వ్యాసకర్త: ఏ.కె. ప్రభాకర్

(ఇది తొవ్వముచ్చట్లు – 6వ భాగానికి ప్రభాకర్ గారు రాసిన ముందుమాట)

‘బానిసగా ఉండి పాశం (పాయసం) తాగుట మేలు గాదురన్నా

పక్షుల లాగా బతికితె రెండే గింజలు చాలన్నా

భయపడి బతుకుట కంటే చావే మేలన్నా

వీరుడు చచ్చి కూడా జగతిలో బతికే ఉండునురా’

తొవ్వలో, కలిసి విడిపోయే ఫలక్ నుమా రైలు పట్టాల మీద, తూర్పాటి రాములు పాడిన యీ తత్త్వగీతం చదువుతుంటే అనేక భావాలు వొక్కసారిగా  చుట్టుముట్టాయి. ‘బానిసగా బతికే కన్నా పోరాడి మరణించడం మేలు’ అని మహామహోపాధ్యాయుల గోడమీది నినాదం గుర్తొచ్చింది. మహాకవుల యే కవిత్వపంక్తికీ  యే మాత్రం తీసిపోని జీవనసారం అతి సాధారణంగా నిరాడంబరంగా యెటువంటి అలంకారిక ఆర్భాటాలు లేకుండా అందులో గోచరించింది. జయధీర్ తిరుమలరావులా ఆ విశ్వగీతాన్ని రాములు ముఖత: వింటే యెంత బావుంటుంటుందో అనిపించింది. 

తిరుమలరావు గారి తొవ్వముచ్చట్లు  చదవడం వొక గొప్ప పఠనానుభవం. తొవ్వలో ప్రతి అడుగూ వొక కొత్త ఆలోచనకు పాదు. ప్రతి మజిలీ వొక కవి సమయం. కలిసిన ప్రతి వ్యక్తీ బతుకు తాత్త్వికతని బోధించే వొక వొజ్జ. ప్రతి బాట వొక పాఠశాల. ప్రతి ముచ్చటా వొక చద్దిమూట. నడిచిన  దారిలో తారసపడే ప్రతి సంచారీ వొక జ్ఞాన దీపధారి. 

***

తొవ్వ ముచ్చట్లు ఆరో భాగంతో మీ ముందుకు వస్తున్నప్పుడు అందులోని వైవిధ్యం నన్ను వుక్కిరిబిక్కిరి చేసింది. పంచుకోవాల్సిన పఠనానుభవం, వూరుకోనివ్వని వాచాలత యీ నాలుగు మాటలు రాయడానికి పురిగొల్పుతున్నాయి. 

ఎప్పట్లాగానే  యీ సారీ జయధీర్ జానపద  కళారంగాల మీద దృష్టి సారించారు. మేలట్టూరు ‘భాగోతుల’ యక్షగానాలకీ కూచిపూడి ‘భాగవతుల’ నాటక కలాపాలకీ శైలీ పరంగా భాషా విషయికంగా  వున్న మౌలికమైన తేడాల్ని పరిశీలించారు. తెలుగునేల మీద బిసి దళిత ఆదివాసీ సమూహాలకు కులపురాణాలు చెప్పే వుపకులాల  వృత్తికళాకారులు ప్రదర్శించే పటాలను  వొక  గుడారం కింద చేర్చి అధ్యయనం చేసిన సందర్భాన్ని వుత్సవ వుత్సాహంతో  వర్ణించారు. ఆ కళాకారులు  పుక్కిట బట్టి వున్న కథనాలు సమాంతర సాంస్కృతిక విశేషాలు పట చిత్రాలుగా తర్జుమా అయిన వైనాన్ని, జానపద చిత్రం –   నాటకం   సమ్మిళితమై రూపొందిన అపూర్వ కళా రంగ స్థలాన్ని కళ్లకుగట్టారు (నష్కల్ డక్కలి జాంబపురాణం డాక్యుమెంటేషన్ తర్వాత, HCU లో జరిగిన ఆ మహా మేళా నిర్వహణలో పాల్గొనడం నాకైతే  మరచిపోలేని అనుభవం). వీటికి కొనసాగింపుగా శిష్ట సాహిత్య మూలాలు జానపదంలోనే వున్నాయని మరోసారి సోపపత్తికంగా నిరూపించారు.     ఫ్యూడల్ కళా సాహిత్యాలుగా వాటిని తిరస్కరించడం వల్ల  సాంస్కృతిక పరాయీకరణ మూలాల్ని తెలుసుకోవడంలో వామపక్ష సిద్ధాంత కర్తలు విఫలమయ్యారని ఆవేదన వెలిబుచ్చారు.  

ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో ప్రజా కళారూపాల్ని అభివృద్ధిపరచడంలో సమాంతర సాహిత్య నిర్మాణంలో విప్లవ ప్రజాసంఘాలు వెనకబడి ఉండటానికి కారణాల్ని తిరుమలరావు తాత్వికంగా విశ్లేషించారు.  ప్రజా కేంద్రితమైన సాంస్కృతిక వ్యవస్థల్ని నిర్మించుకోవాలని వొకటికి పదిసార్లు పదే పదే వుద్బోధించారు. సరైన సాంస్కృతిక విధానం యేర్పరచుకోవడంలో ప్రగతిశీల శిబిరాల్లో సమ్యగ్ దృష్టి కొరవడిన కారణంగా ఆచరణలో వొంటెత్తు పోకడల వలనా వుద్యమాలు వైఫల్యం చెందుతున్నాయని అనేక సందర్భాల్లో వాపోయారు. ఆ వలపోత మిత్రులకు  కటువుగా వినిపించి వుండొచ్చు; ఆ క్రమంలో కొందరు దగ్గరయ్యారు, కొందరు దూరమయ్యారు. కానీ చెప్పడం  మానలేదు. చెప్పడం తన సామాజిక (నైతిక?) బాధ్యత అని కూడా భావించారు. పునరుక్తమనిపించే స్థాయిలో ప్రస్తావించిన తిరుమలరావుగారి యీ ధోరణి కొందరికి శత్రు వైఖరిగా కూడా కనిపించింది. 

కానీ ప్రతి సందర్భంలోనూ ఆయన ‘వామపక్ష, విప్లవ పార్టీలలో చీలికలు శత్రు పూరిత వైఖరి’ తీసుకుంటున్నందుకు ఆవేదన చెందడం చూస్తాం. సాంస్కృతికోద్యమంలో  ఐక్య వేదికల అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేకాదు; సాహిత్యం సాంస్కృతిక రంగం ఐక్య రాజకీయ సంఘటనకు దారిచూపాలని ఆశించారు.  ఉద్యమాలకు వత్తాసుగా రాసిన సాహిత్యం అందరికీ ఉపయోగపడుతుంది, పడాలి అని  ఆయన  విశ్వసిస్తున్నారు. ప్రగతిశీల సాంస్కృతిక సంస్థల మధ్య ఉమ్మడి కార్యాచరణ మాత్రమే ప్రజా శత్రువులను, బలీయ రాజకీయ వర్గాలను బలహీనపరచ గలుగుతుందని వొక  నిర్దిష్ట ప్రణాళికని సైతం తిరుమల రావు తన యీ  రచనల ద్వారా సూచిస్తున్నారు.                                  

ఆధునికత, అభివృద్ధి, పురోగతి పదాల మాటున దాక్కుని సమాజాన్ని వ్యాఖ్యానించే మేధావులు ప్రభుత్వ అధికార – ఆధిపత్య వ్యవస్థల్ని నిరంతరం ప్రతిఘటించిన  ప్రజా రాశుల సంస్కృతిని కాపాడి, వారికి తిరిగి అందించడంలో విఫమవుతున్న కారణాలని అన్వేషిస్తున్నారు. ఆ క్రమంలో సాంస్కృతిక ఆయుధాలైన ప్రజల సాహిత్య వ్యవస్థలలోని,  కళా రూపాలలోని ప్రజాస్వామిక భావనల్ని  వెలికి తీయాల్సిన అవసరాన్ని మన గమనంలోకి తీసుకువస్తున్నారు.

‘మార్కెట్ సంస్కృతి వెనక దాగిన సామ్రాజ్యవాద శక్తుల్ని, భూస్వామ్య సంస్కృతి వెనక దాగిన మత  కుల పెత్తందారీ ఆధిపత్య దోపిడీని’ స్పష్టంగా చూడగలిగినందువలనే కార్పొరేట్ కి దాస్యం చేస్తున్న ఫాసిస్టు రాజకీయాల గురించి జయధీర్ అనుక్షణం  అప్రమత్తం చేస్తున్నారు.    

అందుకే సమకాలీన సంఘటనల్ని వ్యాఖ్యానించే ముచ్చట్లలో చాలా మటుకు నిర్దిష్టమైన రాజకీయ కోణం దాగి వుంటుంది. వుదాహరణకి చూడండి :

  • పసిబిడ్డని వెంటబెట్టుకుని మైళ్ళ తరబడి భార్య శవాన్ని భుజాన మోసుకుని  తిరిగిన ‘ఆధునిక పశుపతి’ దానా మాఝీ వుదంతాన్ని పేర్కొంటూ సమాజంలో మనుషులు అమానవీయంగా ఉండటానికి కారణం సమస్త వ్యవస్థలు విఫలమవ్వడమే అని నిర్ధారించారు.  
  • శవాల్ని ఆత్మగౌరవంతో సాగనంపడం నాగరిక సమాజం యింకా నేర్చుకోనందుకు యెవర్ని నిందించాలని ప్రశ్నించేటప్పుడు అమరుల బంధు మిత్ర సంఘం శవాలనైనా ఇవ్వండి అని న్యాయస్థానాల నాశ్రయించిన వైనం చెప్పకనే గుర్తుచేస్తారు. 
  • అద్దె సరుకవుతున్న వేలాది గర్భసంచులు పిల్లల్ని కనే ఫ్యాక్టరీలుగా తయారవుతున్న వైనానికి ఖిన్నుడవుతూనే పేదతల్లుల గర్భాలపై వ్యాపారం చేస్తున్న కార్పోరేట్ ఫెర్టిలిటీ సెంటర్లు వాటిని కంట్రోల్ చేసున్న స్వదేశీ విదేశీ మాఫియాలు వాటికి వూడిగం చేయడానికి సిద్ధమయ్యే శాసనకర్తలు చివరికి ఆ పేదతల్లినే దోషిగా నిర్ణయించి శిక్షించినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు.
  • స్థూపాల్ని కూల్చే పాలకుల కుట్రల నడుమ యింద్రవెల్లి అమరుల్ని స్మరించుకోడానికి సంస్మరణ రోజున యింద్రవెల్లి వెళ్లి  వీరుల పేర్లని స్థూపంపై గుంజాల గోండి లిపిలో రాయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లిపి వొక  నెపం మాత్రమే. గోండి సాంస్కృతిక సంపద పరిరక్షణ పేరుతొ అమరుల పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరాన్ని పరోక్షంగా తెలియజేస్తున్నారు.  
  • ఉస్మానియా  శతాబ్ది వుత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని జార్జిరెడ్డిని స్మరించుకోవడం వొక వ్యూహమైతే రైట్ లెఫ్ట్ స్టూడెంట్ రాజకీయాలపై బలమైన విశ్లేషణాత్మక వ్యాఖ్యానం చేసి కొత్త తరం బడుగు విద్యార్థులు నిలవాల్సిన పక్షాన్ని నిర్ధారించారు.
  • కె. శివకుమార్ నల్ల వలస కర్తృత్వం విషయంలో యేర్పడ్డ వివాదం లోంచి వ్యక్తి స్వేచ్చ పై విధించే ఆంక్షల వెనక వుండే ఆధిపత్య స్వభావాన్ని ఎత్తిచూపడం దగ్గర  ఆగిపోక ఉద్యమ సాహిత్యంలో సామూహిక కర్తృత్వం గురించి చేసిన ఆలోచనలు వ్యక్తి కేంద్రితమైన కెరీరిస్టు సాహిత్య కారులకు చెంపపెట్టు. అదే సమయంలో సాహిత్యానికి వుండాల్సిన ప్రజాస్వామిక స్వభావాన్నీ  సమష్టి తత్త్వాన్ని నిరాకరించే  కాపీ రైట్ పెట్టుబడీదారు విలువపై  సున్నితమైన చర్చకి పురిగోల్పారు.  పనిలో పనిగా అందెశ్రీ రాసిన తెలంగాణ జాతీయగీతం గతి ఏమైంది అన్న ప్రశ్నని   మరోసారి తెర మీదకి తెచ్చారు .
  • మందుల షాపుల్లో క్వాలిఫైడ్ సేల్స్ మెన్ వుండాలన్న నిబంధన వెనక ఫార్మా కంపెనీల,   ఆన్ లైన్ కార్పొరేట్  వ్యాపారుల గుత్త  ప్రయోజనాలు దాగి వున్నాయన్న నిజాన్ని వెలికితీస్తారు. . 

ఇవి గాక పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాల్ని తిరుమలరావు తనదైన రాజకీయ భావజాలంతో  ప్రత్యక్షంగా ఖండిచే ముచ్చట్లు అనేకం యీ భాగంలో చోటుచేసుకున్నాయి.

ప్రధానంగా – ప్రజాస్వామిక నిరసన గళాలకు వేదికైన ధర్నా చౌక్ ఎత్తివేసిన నియంతృత్వ పోకడల్ని బాహాటంగా గర్హించడం, పాలకుల మోచేతి నీళ్ళ కోసం క్యూ కట్టే దళారి కలాల గురించి నిక్కచ్చిగా విమర్శించడం, మల్లన్న సాగర్ కింద ముంపుకి గురయ్యే నిర్వాసితుల (బాధితుల) పట్ల అమలయ్యే కుట్ర పూరితమైన క్రూర హింసనీ , ప్రజల తరపున మాట్లాడే వారి గొంతుల్లో కత్తుల్ని దించే అమానవీయతనీ, దానికి ఆమోదాన్ని సాధించడానికి యెదురు  శిబిరాల్ని  నిర్వహించే స్థాయికి దిగజారిన పాలక వర్గాల తొత్తు రచయితల మేధావుల సంఘాల్ని పత్రికల ద్వంద్వ నీతిని   నిర్ద్వంద్వం గా  ఖండించడం, దేశంపై ఉత్తరాది పెత్తనాన్ని ప్రశ్నిస్తూ వారి రాజకీయ సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిరసించడం, డిమానిటైజేషన్ డిహ్యూమనైజ్ గా మారి పెద్ద నోట్లు పెద్దల అవినీతి, పేదల రక్తం మరకలతో మలినమై పోయిన తీరుని బహిర్గతం చేయడం … యివన్నీ  జయధీర్ ప్రజా రాజకీయ దృక్పథానికి నిలువెత్తు దర్పణాలే. ఆయన ప్రతి ఆలోచనా ప్రజా పక్షమని నిరూపించేవే.  

ఈ క్రమంలో బహుళజాతి పెట్టుబడిదారూ వాడికి అండగా నిల్చిన దళారీ పాలకులే ప్రజల వుమ్మడి శత్రువని తిరుమలరావు చాలా స్పష్టంగా గుర్తించారు. గుర్తించడమే కాదు; వాడు బలవంతుడనీ బహుముఖీనుడనీ బైరూపులోడనీ బహువేషదారి అనీ వాడిని యెదుర్కోడానికి సామూహిక స్వరాలు అవసరమనీ వుద్బోధించారు. యెవరి పీఠాలు వారివిగా మార్చుకున్న మేధావులు యిప్పటికైనా కళ్ళు తెరవకుంటే  ప్రమాదమనీ హెచ్చరించారు. 

అంతిమంగా చెప్పేదేమంటే – సమకాలీన రాజకీయాల నేపథ్యం నుంచి చూసినప్పుడే  తొవ్వముచ్చట్ల ప్రాసంగికత  స్పష్టంగా అర్థమౌతుంది.  

***

తొవ్వముచ్చట్లు లో తిరుమలరావు నిర్వచించిన అనేక సూత్రీకరణలు చెరగని ముద్రలు. చరిత్రని సృష్టించే ప్రజలే చరిత్రని బోధించే మహోపాధ్యాయులు అని ప్రకటించినప్పుడు, శిష్ట భావనతో భాషను శుష్కింపజేసేది పండితులైతే – సజీవమైన భాషను  సృష్టించే లాక్షణికులు మాత్రం ప్రజలే అని శాస్త్రీయంగా నిరూపించినప్పుడు, కులాధిపత్యాలు, మతాధిక్యతలు, పురుషాధిక్యతలు తగ్గిపోవాలంటే సాంస్కృతిక రంగం స్త్రీల ఆధీనంలోకి రావాలి అని స్పష్టం చేసినప్పుడు, చరిత్ర రచన సమగ్రం కాకుండా సాహిత్య చరిత్రలో సమగ్రతలు  సాధ్యం కావు అని తీర్మానించినప్పుడు, చరిత్రకారుడికి స్పష్టమైన శ్రామిక ప్రజా దృక్పథంతో పాటు దళిత స్త్రీవాద దృక్పథాలు కూడా వుండాలని నిర్దేశించినప్పుడు, సాంస్కృతిక విప్లవం జరగకుండా సాయుధ విప్లవం విజయవంతం కాదు అని కుండబద్దలు కొట్టినప్పుడు, భూస్వామ్య – మత – కుల వ్యవస్థల సాంస్కృతిక పునాదిని అర్థంచేసుంటేనే దానికి ప్రతిగా ప్రజా రంగస్థల నిర్మాణం సాధ్యమౌతుంది అని ధ్రువీకరించినప్పుడు యీ ముచ్చట్లలో జయధీర్ వొక సామాజికవేత్తగా, వొక  చరిత్ర పరిశోధకుడిగా, వొక భాషా భిషక్కుగా, వొక రాజనీతిజ్ఞుడిగా సాక్షాత్కరిస్తారు.    

జోగిని సమాజానికి, అట్టడుగు వర్గాల కళాకారులకి  వకుళాభరణం లలిత చేసిన సేవలు స్మరించుకున్నా, తన కాలం కవుల కన్నా యెంతో ముందుండి నగ్సల్బరీ వసంత మేఘ గర్జనని   హిందీలో ప్రతిధ్వనించి అనామకంగానే మిగిలిపోయిన  వేణుగోపాల శర్మ  విప్లవ కవిత్వాన్ని యెదకు హత్తుకున్నా, బహుజన సామాజిక తాత్త్వికతని విప్లవోద్యమంలో భాగంగా నిర్వచించిన మిత్ర కవితల కవాతులో మిళితమై కదం తొక్కినా, ప్రజల్ని కలిపే సాహిత్యాన్ని సృష్టించిన బండి సత్తెన్నలోని  కళతో  కరచాలనం చేసినా,  అగ్రికల్చరిస్ట్ ఆర్టిస్ట్ గిరిధర్ ని వెతుక్కుంటూ ఆంధ్రాకి  వెళ్ళినా, సంచలన యువకవి ఇంద్రపాల శ్రీనివాస్ నూతనాభివ్యక్తికి సాదర స్వాగతం చెప్పినా, సామూహిక  సంస్కృతి  చిత్రాన్ని ఆవిష్కరించిన ‘వూరూ వాడా బతుకు’ రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి వస్తు రూపాల స్వీకృతిలో వ్యక్తివాదాన్ని అధిగమించి సాహిత్యంలో ప్రజాస్వామిక దృక్పథాన్ని యెత్తిపట్టిన విధానాన్ని  సమీక్షించినా, జోగు అంజయ్య కవిత్వాన్ని పరామర్శించే నెపంతో కవిత్వానికి సామాజిక శాస్త్రాలతో వుండాల్సిన సంబంధాన్ని ప్రస్తావించినా వొక ఆత్మీయ స్నేహ స్పర్శ రచన నిండా పరివ్యాప్తమైవుంటుంది. అది అనేక సందర్భాల్లో వుద్వేగ భరితమై వుంటుంది.  ఆ వుద్వేగ గుణం తొవ్వ ముచ్చట్లకి  కవితాత్మక  శైలిని అద్దింది. కథా లక్షణాన్ని సాధించింది. సృజనాత్మక వ్యాస రూపానికి దోహదం చేసింది. ఆ వుద్వేగ గుణం  కారణంగానే చిన్ననాటి స్నేహితుడు ఫారూక్ చావులకు వెళ్ళినప్పుడు తిరుమలరావులోని ఆర్ద్రమనస్కుడు జానపద తత్త్వ గాయకులు తూర్పాటి రాములు మల్లమ్మ దంపతుల  బతుకు పాట ముందు మోకరిల్లి కన్నీళ్ళలో తడిసి ముద్దయ్యాడు.

‘భూమి మీద చావు లేకుండా బతికేటోడు ఇందనుక ఎవడూ పుట్టలేదు కొడుకా!’ (మల్లమ్మ)

యిది అప్పుడు మల్లమ్మ యిచ్చిన వోదార్పు. నిజమే. సహజ మరణాలు సరే. ఆప్తుల్ని అయినవాళ్ళని మృత్యు ముఖంలోకి నెడుతున్న కరోనా గడ్డుకాలంలో సైతం   మల్లమ్మ మాట వోదార్పుగా పనికివస్తుంది గానీ నియంతలు సమాజం మీద రుద్దుతున్న అసహజ మరణాల, ఎన్ కౌంటర్ల   మాటేమిటి?  వాటికి విరుగుడు యేమిటి? యిలా యింకానా? అన్న ప్రశ్నలకి సమాధానం యెవరిస్తారు? ఇలాంటి సామాజికవేత్తలు తప్ప!

***

తొవ్వముచ్చట్లు ఆరో భాగం ప్రత్యేకత గురించి మరో మాట ప్రస్తావించుకోవాలి. ఈ సారి భిన్న రంగాలకు చెందిన  పాఠక ప్రముఖుల స్పందనల్ని దీనికి జత  చేర్చాం. పారిస్ లో తెలుగు అధ్యయన అధ్యాపనాల్లో వున్న ప్రముఖ జానపద విజ్ఞాన పరిశోధకుడు తెలుగువారి ఆత్మబంధువు  డా. డేనియల్ నెజర్స్ రాసిన ముందుమాట (అను. ప్రొ. గూడూరు మనోజ),  తెలిదేవర భానుమూర్తి, అరుణాంక్ లత, నందివాడ భీమారావు గార్ల వెనక మాటలు దశాబ్దాలుగా  తిరుమలరావు నడుస్తున్న తొవ్వనీ ఆయన చెప్పిన ముచ్చట్లనీ లోతుగా అవగాహన చేసుకోడానికి కరదీపికలుగా వుపకరిస్తాయి. తొవ్వముచ్చట్లు వినిపించిన సామాజిక సాంస్కృతిక రాజకీయ విశ్లేషణ పైన, చెప్పిన పద్ధతి మీద మరింత చర్చ, అధ్యయనం జరగాల్సిన అవసరాన్ని ఆ మాటలు ధ్రువీకరిస్తున్నాయి. వారందరికీ మా కృతజ్ఞతలు. 

తొవ్వ ముచ్చట్లు ఆఖరి ఏడో  సంపుటితో మీ ముందుకు త్వరలోనే రాగలమనే హామీతో… 

ప్రస్తుతానికి సెలవ్. 

హైదరాబాద్, ఎ. కె. ప్రభాకర్  

06 జనవరి 2021 సంపాదకుడు 

You Might Also Like

Leave a Reply