Norths: Two Suitcases And A Stroller Around The Circumpolar World

Norths: Two Suitcases And A Stroller Around The Circumpolar World
Alison McCreesh
*********************

ఒక రెండు మూడు వారాల క్రితం కెనడా బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్ వాళ్ళ వెబ్సైటులో ఒక వ్యాసం కనబడింది – “10 Funny, Surprising And Poignant Comics About Being A Parent” అని. ఏదో వెరైటీగా ఉందని చూడగా, అందులో ఈ పుస్తకం గురించి కనబడ్డది. వృత్తిరిత్యా చిత్రకారిణి, కెనెడియన్లు కూడా చలిప్రాంతం అనుకునే యెల్లోనైఫ్ ప్రాంతంలో నివసించే రచయిత్రి కుటుంబంతో (భర్త, రెండేళ్ళ పిల్లవాడు) కలిసి ఆరునెలల పాటు అవతలి వారి ఆహ్వానం మేరకు – గ్రీన్ లాండ్, రష్యా, ఫిన్ లాండ్, ఐస్లాండ్ వంటి దేశాలలో ఉత్తర దిశగా ఉన్న ప్రాంతాల్లో (అంటే ఇంకా చలిగా ఉండేవే!) నివసించింది. ఈ సమయంలో తన అనుభవాల గురించి అమెరికా ఖండంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న తన సన్నిహితులకి రోజూ తానే గీసిన పోస్టు కార్డులు పంపింది.‌ ఈ‌పుస్తకం ఆ కార్డుల సమాహారం. ఏదో వెరైటీగా ఉందని లైబ్రరీ నుండి తెచ్చుకున్నాను. ఈ పుస్తకం గురించి నా అభిప్రాయాలు క్లుప్తంగా ఇక్కడ పంచుకుంటున్నాను.

వీళ్ళ ప్రయాణం‌ ఉత్తర కెనడాలోని నార్త్ వెస్ట్ టెరిటరీస్ రాష్ట్రంలోని యెల్లోనైఫ్ నగరం నుండి ఆర్నెల్లపాటు ఇలా సాగింది:
నవంబర్-డిసెంబర్ 2016: Lapua, Finland
జనవరి-ఫిబ్రవరి 2017: Petrozavodsk, Russia
మార్చి 2017: Qaqortow, Greenland
ఏప్రిల్ 2017: Blönduós, Iceland
(అవన్నీ ఎలా పలకాలో నాకు తెలియదు కానీ, యెల్లోనైఫ్ సహా అన్నీ భూమధ్య రేఖకు కనీసం‌ అరవై డిగ్రీలు ఉత్తరంగా ఉన్న ప్రాంతాలు. అంటే చలికాలం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు)

ఈ ఆర్నెల్లలో నాలుగు విభిన్నమైన భాషలు, సంస్కృతులు, పద్ధతులు. వీళ్ళకా ఇంగ్లీషు, ఫ్రెంచి తప్ప వేరేవి రావు. పైగా ‘పక్కా ప్లానింగ్’ తో పోలేదు. దీని వల్ల వీళ్ళూ‌ బాగా చలిప్రాంతపు వాళ్ళైనా కొన్నిచోట్ల ఇబ్బంది పడ్డారు. అన్నింటికీ తోడు పసిపిల్లాడు! – ఈ నా వర్ణన వింటే, ఎన్ని కష్టాలు పడుంటారో అనిపిస్తుంది. కానీ, వీళ్ళు బహుశా వీటికి సిద్ధపడే వెళ్ళుంటారు – అది వేరే విషయం. కానీ, రచయిత్రి వాళ్ళ దైనందిన జీవితం గురించీ, అక్కడ వాతావరణం, చలికాలంలో అందరూ‌ ఏం‌ చేస్తూ ఉంటారు? చిన్న చిన్న ఊళ్ళలో సౌకర్యాలు ఎలా ఉంటాయి? ఇలాంటి వాటి గురించి తన స్నేహితులకి పంపిన కార్డు ముక్కల్లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. కొంచెం అలా ఊళ్ళు తిరగడం ఆసక్తి ఉన్నవాళ్ళకి ఈవిడ పరిశీలనలు చదవడం నచ్చుతుందని అనుకుంటాను. అయితే, వీటిలో కొన్ని మామూలుగా ఎవరైనా ఆలోచించాల్సినవి కూడా ఉన్నాయి. ఉదాహరణకి -ఈ క్రింది కార్డు-బొమ్మ నన్ను బాగా ఆకట్టుకున్న వాటిలో ఒకటి.


డెబ్భై ఏళ్ళ పైబడ్డ వారు ఆ భయంకరమైన చలిలో, రోడ్లు-ఫుట్పాత్ల పైన ఐస్ పేరుకుని నడవడం కూడా ప్రమాదకరం అయ్యే వేళల్లో బైట పనులుంటే ఎలా చలాకీగా తిరుగుతూ ఉంటారో రాసింది/గీసింది. అది చూసినపుడు నాకైతే మనదగ్గర కొందరు ఎందుకు ఏ యాభై ఏళ్ళో రాగానే ఇంక సర్వం ముగిసిపోయినట్లు, రోజుకోమారు చావు గురించో, ఆస్తి పంపకాల గురించో మాట్లాడుతూ, ఉన్నవీ లేనివీ అన్నిరోగాలనూ అంటగట్టుకుంటూ‌ ఉంటారో (ఇదంతా నేను చూసిన, విన్న అనుభవాలే లెండి. అందరూ ఇలా ఉన్నారని కాదు) అర్థంకాలేదు. కొన్ని అలా ఆ పరిస్థితుల మధ్య జీవించడం గురించి రాసిన ఇతర పరిశీలనలు (ఉదా: ఐస్ పేరుకుపోయిన రోడ్లలో పసిపిల్లలతో బైటికెళ్ళే విధంగా తయారు చేసిన స్ట్రోలర్ల గురించి రాయడం వంటివి) కూడా నన్ను ఆకట్టుకున్నాయి.

బొమ్మలు చాలా‌ బాగున్నాయి. కొన్ని చోట్ల రచయిత్రి పరిశీలన గొప్పగా ఉంది. ప్రతి ఊరినీ ఆ బొమ్మల ద్వారా చూసినట్లు అయింది. బొమ్మల్లో ఉన్న వాక్యాలు (అంటే కార్డుపైన రాసిన ఉత్తరంలోనివి కావు) కూడా బాగా కుదిరాయి. ఒక్కోచోట చాలా నవ్వు కూడా తెప్పించాయి. ముఖ్యంగా, తెలియకుండా ఏదో చేసేసి, అక్కడ ఏదైనా జరిగుంటే పిల్లాడి పరిస్థితి ఏంటి? అని ఖంగారు పడే చోట self deprecating humor బాగుంది. అయితే పుస్తకంలో మనకి ఎక్కడ చూసినా రచయిత్రే కనిపిస్తుంది. మధ్య మధ్య ఆమె కుటుంబం, ఆమె కలిసిన మనుషులూ వస్తూ పోతూ ఉంటారు. చదువుతున్నంత సేపూ నాకు వాళ్ళాయనకి బోరు కొట్టలేదా?‌ (ఈవిడ పనిమీదే కదా ఆర్నెల్లు వచ్చారు!), ఆయనకి ఈ దేశాలు తిరగడం ఎలా ఉండింది? అన్న ప్రశ్నలు కలుగుతూ ఉన్నాయి. నాకు భారతీయ నేపథ్యం నుంచి వచ్చినందువల్ల, అసలు ఆయన అలా పోవడమే ఆశ్చర్యంగా ఉండింది. ఈ‌ రచయిత్రి ఏమిటి “మాఆయన దేవుడని” వందసార్లైనా అనలేదేంటి పుస్తకంలో? అలా అనకపోయినా అతనేం అనుకోలేదా? వాళ్ళలో ఇలాంటివి మామూలు విషయాలా? – ఇలాంటి సందేహాలు కూడా కలిగాయి. వీటికి పుస్తకంలో జవాబు లేదనుకోండి, అది వేరే విషయం.

మొత్తానికి పేరుకి రచయిత్రి స్వీయానుభవాలే అయినా, మామూలుగా చదివే యాత్రానుభవాలకి భిన్నంగా ఉన్నాయి – ఇందుకు నాలుగు కారణాలు అని నేను అనుకుంటున్నాను: ఈ పోస్టు కార్డుల సంకలనం ఐడియా నాకు కొత్త కావడం, రచయిత్రి తిరిగిన ప్రాంతాలు మామూలుగా యాత్రానుభవాలు రాసేవాళ్ళ వ్యాసాల్లో కనబడేవి కాకపోవడం, వాళ్ళు ప్రయాణాలు చేసినది చలికాలం కావడం, మామూలుగా కనబడే కథనాల్లాగ ఒక్కళ్ళే/స్నేహితులతో కాక రెండేళ్ళ పసివాడితో ఇదంతా తిరగడం!! యాత్రానుభవాలు, గ్రాఫిక్ నవలల మీద ఆసక్తి ఉన్న వారికి తప్పక నచ్చుతుంది.

You Might Also Like

Leave a Reply