నమ్మశక్యం కాని కథ – సరూ బ్రియర్లీ జీవితం

ఓ పదిరోజుల క్రితం లయన్ అని ఒక సినిమా వచ్చింది మూవీ రికమెండేషంస్ లో.. నెట్ఫిక్స్ లో అనుకుంటాను. యదార్థ సంఘటనల ఆధారంగా అంటే చూద్దామని మొదలుపెట్టాము. సినిమా అయ్యేసరికి ఆశ్చర్యం. నిజమా? నిజమా? ఇలా నిజంగా జరిగిందా? అని ఆ రోజు నుండి రోజు ఆ కథ తల్చుకుంటూనే ఉన్నాను. సినిమా అవ్వగానే మూల పుస్తకం ఆర్డర్ చేసుకున్నాను. ఇవాళ అది చదివాను. చదువుతున్నంత సేపు కథంతా సినిమా ద్వారా ముందే తెల్సినా కూడా అదే ఆశ్చర్యం. వీడు అదృష్టవంతుడని ఒకసారీ, అసలు ఎక్కడ్నుంచి ఎక్కడికెళ్ళింది జీవితం? ఇలా అసలు జరగడం సాధ్యమా? Truth is stranger than fiction అని మళ్ళీ మళ్ళీ అనుకున్నా. అందువల్ల, ఇక ఓ చిన్న పరిచయమైనా రాయక తప్పడం లేదు.

దాదాపు పదిహేనేళ్ళ క్రితం నేను మా యూనివర్సిటి లో ఉన్న ఒక చిన్న ఎన్ జీ వో – ఆశాకిరణ్ అన్న స్కూలులో కొన్ని నెలలు స్వచ్ఛంద సేవ చేశాను. ఇందులో చుట్టుపక్కల “స్లం” ఏరియాల నుండి పిల్లలు వచ్చేవాళ్ళు. మేము గణితం, తెలుగు చెప్పేవాళ్ళం అనుకుంటా. ఇంగ్లీషు కూడా ఉందేమో, గుర్తు లేదు. ఇక్కడికి వచ్చే పిల్లలలో కొందరు మామూలుగా పనులకి పొయ్యే తల్లిదండ్రుల పిల్లలైతే, కొందరి నేపథ్యాలు కొంచెం వినడానికి కష్టంగా ఉండేవి. ఉదాహరణకి తల్లిని చంపి తండ్రి జైలుకి పోతే ఇంకెవరితోనో ఉండే అబ్బాయి ఒకడు ఉండేవాడు. పదేళ్ళైనా లేకపోయినా చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. వాలంటీరుగా వెళ్ళిన నాకు కొత్తల్లో అస్సలు ఎలా మాట్లాడాలో, అంతకు మించి చదువెలా చెప్పాలో అర్థమయ్యేది కాదు. కొంతమంది ఇతర వాలంటీరు విద్యార్థులతో పోలిస్తే నాకు భాష సమస్య లేదన్నది ఒక్కటి తప్పితే, అసలు మా నేపథ్యాలకి పోలికే లేదు. అప్పటికి ఇలాంటి కథలు నేరుగా పిల్లల నోట్లోంచి వినడం నాకు తొలి అనుభవం కనుక ఒక్కోరోజు చాలా బాధగా ఉండేది – ఏమిటి ఇంత చిన్న వయసులో వీళ్ళకివన్నీ? అని.

ఇపుడు ఇలాంటి ఓ‌ పరమ బీద పిల్లవాడు ఓ రోజు రైల్వే స్టేషన్ లో తప్పిపోయాడంటే మనం ఇంక వాడి గురించి మర్చిపోవాల్సిందే. డబ్బున్న తల్లిదండ్రులుంటే కనీసం మిస్సింగ్ ప్రకటనలూ అవీ ఇప్పించి వెదికించగలరు. మరి డబ్బుల్లేకపోతే? సరే, వాడు తప్పిపోయాడు. సినిమాలు, వార్తలు చూసి నాకు అర్థమయింది (అవును, నా జ్ఞానం అంతే) ఏమిటంటే ఇట్లా తప్పిపోయిన పిల్లలు అక్కడా ఇక్కడా వీథుల్లో అడుక్కోవచ్చు, ఆకలి చావుకి గురి కావొచ్చు, ఏ ముఠా చేతనో బడి ఎక్కడికో అమ్ముడుపోవచ్చు, ఏ కాలో చెయ్యో పోవచ్చు, కాలం కలిసొచ్చి ఎక్కువకాలం బతికితే ఏ రౌడీ గానో అవ్వొచ్చు, ఇలా రకరకాల వైపరిత్యాలు జరగొచ్చని. అంతేగానీ ఇట్లా ఆల్రెడీ పరమ బీద పరిస్థితుల్లో ఉన్నవాడు సడన్ గా ధనికుడైపోయాడు – అన్న కథ నేనెప్పుడూ వినలేదు. మరి ఇలాంటి ఓ ఐదేళ్ళ పిల్లాడు ట్రెయిన్ లో ఎక్కి తప్పిపోయి మధ్యప్రదేశ్ నుండి కలకత్తా వెళ్ళిపోయి, భాషా అదీ కూడా రాకుండా కొన్నాళ్ళు నానా అవస్థా పడ్డాక ఓరోజు ఎవరో సంబంధం లేని మనిషి ఒకడు పోలీసులకి అప్పజెప్తే, పోలీసులు కూడా బాధ్యతగా వాడిని జువనైల్ హోం కి తరలిస్తే, అక్కణ్ణుంచి ఓ అనాథాశ్రమానికి, అక్కడ్నుంచి ఆస్ట్రేలియాకి చెందిన దంపతుల దత్తపుత్రుడిగా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయాడు – అని వింటే ఎలా ఉంటుంది? ” ఏదో, వాడి అదృష్టం కలిసి వచ్చింది, సేఫ్ గా ఆ పరిస్థితి నుండి బయటపడి మంచి కుటుంబం కంట బడ్డాడు.”అనుకుంటాము.

ఇపుడు ఈ యువకుడైన పిల్లాడు తనకి ఆ ఐదేళ్ళ వయసు నాటివి గుర్తున్న వివరాలతో, కనీసం తాను ఆ ట్రెయిన్ ఎక్కి కలకత్తా చేరే ముందు ఉన్న ఊరి పేరు కూడా సరిగా పలకడం రానివాడు… ఏ పాతికేళ్ళ తరువాతో గూగుల్ ఎర్త్, ఫేస్బుక్ సహాయంతో ఆ ఊరు ఏమిటి? అన్నది కనుక్కుని, అక్కడికెళ్ళి, పాడుబడిపోయిన తన ఇంటిని కూడా గుర్తు పట్టి, అక్కడే దగ్గర్లో ఉంటున్న తల్లిని, అన్న చెల్లెళ్ళను కలవగలిగాడు – అంటే ఎలా ఉంటుంది? “అద్భుత రసంలో కథ బాగా అల్లావు” అనుండేదాన్ని నేనైతే. గూగుల్ ఎర్త్, ఫేస్బుక్ వీటిని బట్టుకుని అసలు ఉందో లేదో తెలియని ఊరి పేరు ని వెదుక్కోడం ఏంది సామి? అన్నేళ్ళ తరువాత పోతే తప్పిపోయిన కొడుకు ఎప్పటికైనా తిరిగొస్తాడని ఆ ప్రాంతాల్లోనే ఉండిపోయిన తల్లి కనబడ్డం ఏంది? పైగా మన కథానాయకుడు వీళ్ళ పాడుబడ్డ పాత గుడిసెని చూసి, అక్కడెవరూ ఉండట్లేదన్న విషయం తెల్సుకుని అయోమయంలో ఉంటే, దారిన పొయ్యే దానయ్యెవడో వచ్చి, ఇతగాడు చెప్పింది వినేసి, ఇప్పుడే వస్తా..అని రెండిళ్ళవ్వతలకి పొయ్యి మళ్ళీ వచ్చి ఎటో తీసుకెళ్ళి – “ఇదిగో ఈమే మీ అమ్మ” అని చూపించడం ఏంది? నిజంగా జరిగిన ఈ కథ నిండా ఎన్ని వ్యథలో… అన్ని ఇలాంటి ఆశ్చర్యార్థకాలు…

సరూ పెద్ద రచయితేం కాదు. మామూలుగా చాలామంది లాగే ఫ్లుయెంట్ గా రాయగలడు, అంతే. కానీ, అతని జీవితంలోని మలుపుల వల్ల పుస్తకం అలా ఏదో పరమ త్రిల్లర్ నవల చదువుతున్న తరహాలో పేజీలు తిప్పించింది. సాధారణంగా నేను చదవడానికి ఎంపిక చేసుకునే పుస్తకాలలో విపరీతమైన భావోద్వేగాలు ఉండవు. ఉన్నా నేనంత లీనమైపోయి అనుభవించిన సందర్భాలు తక్కువ. ఓ పుస్తకం చదువుతూ కన్నీటి తెర అడ్డం పడి అక్షరాలు మసగ్గా కనబడ్డం అన్నది నాకు అంత తరుచుగా ఎదురయ్యే అనుభవం కాదు. ఈ పుస్తకం చదువుతూ ఉంటే అలా చాలాసార్లు జరిగింది. చివరికొచ్చేసరికి అది ఆనంద భాష్పాలు గా మారింది లెండి. ప్రస్తుతం ప్రపంచమంతా మూకుమ్మడిగా అనుభవిస్తున్న కష్టకాలంలో ఇలాంటి కథలు చదువుతూంటే భవిష్యత్తు గురించి ఏదో ఆశ కలుగుతుంది. అదృష్టంతో సహజీవనం చేస్తూ ప్రపంచంలో మంచన్నది ఇంకా అక్కడా ఇక్కడా సరూ ని వివిధ సందర్భాల్లో ఆదుకు మనుషుల మనసుల మధ్యలో మిగిలి ఉందని అనిపిస్తుంది.

You Might Also Like

One Comment

  1. 2021 – నా పుస్తక పఠనం – పుస్తకం.నెట్

    […] A long way home by Saroo Brierly -ఈ పుస్తకం నన్ను విపరీతంగా కదిలించి కళ్ళనీళ్ళు కూడా పెట్టించేసింది. నా పరిచయం ఇక్కడ. […]

Leave a Reply