అతడే సముద్రం – అందమైన అనువాదం
వ్యాసకర్త: పి.సత్యవతి
“మనుషులను నాశనం చెయ్యవచ్చేమో కానీ వారిని ఓడించడం కష్టం” అంటాడు హెమింగ్వే, శాంటియాగో గొంతుతో.
గెలుపోటములు కాదిక్కడ. శాంటియాగో పోరాటపటిమ, అతని పట్టుదల, తనకు తనే చెప్పుకునే ధైర్యం, ఆశావహ దృక్పథం, అతని జీవన తాత్త్వికత మనకి ముఖ్యం. శారీరక దౌర్బల్యం, అంతగా సరిపోని పనిముట్లు, సలిపే గాయాలు, అతని పట్టుదలని మరింత పెంచాయేగాని సడలించలేదు. హెమింగ్వే కి నోబెల్ తెచ్చి పెట్టిన ఈ చిన్న నవల ముసలాయన శాంటియాగోతో పాటు మనని కూడా ఒక చిన్న పడవలో ఎక్కించి సముద్రపు అలలలో ఊగించి చీకటిరాత్రిలో ఒంటరి ప్రయాణం చేయించి భయపెట్టి బాధపెట్టి, ధైర్యం చెప్పి రకరకాల ఉద్వేగాలకు గురిచేస్తుంది. అతను అంత తెలివినీ ఒడుపునూ ప్రదర్శించి, చివరికి పద్నాలుగు అడుగుల పొడుగున్న చేపతో పోరాడి దాన్ని లోపలికి ఎత్తి పడెయ్యలేక పడవ అంచుకు కట్టేసే వరకూ, గాయాలైన శాంటియాగో చేతులకు ఏదైనా లేపనం పుయ్యలేక పోయామే అని దుఃఖపడతాం. అంత బలిష్టమైన, ఠీవిగల ఆ చేపను నిస్సహాయ స్థితిలో వుండగా, దానిమీద దండెత్తిన సొరచేపల్ని తరిమి కొట్టడానికి శాంటియాగో కి సాయం చెయ్యలేక పోయినందుకు ఏడుపొస్తుంది. అతని స్వగతాలకు ముచ్చటతో కూడిన ఆశ్చర్యానందాలు కలుగుతాయి. నవల చివరకు అలసి సొలసి చేప అస్థిపంజరం మాత్రమే దక్కించుకున్న ముసలాయనకి మన జాలి అవసరం లేదు. అతను నిద్రపోతూ సింహాలను కలగంటున్నాడు. ఆఫ్రికా సముద్రతీరంలో తిరిగే సింహాలను చూస్తున్నాడు. సింహాల గుంపును ఇంగ్లిష్ లో “ప్రైడ్” అంటారు. ముసలాయనకు కూడా తన సామర్ధ్యాన్ని గురించి గర్వం వుంది.
అంతకుముందు ఆయనతో చేపలవేటకు ఒక పిల్లాడు వచ్చేవాడు. ఈ మధ్యన ఒక 84 రోజుల నుంచి ముసలాయనకి ఒక్క చేప కూడా పడలేదు. ముసలాయన దురదృష్టవంతుడని ఆ పిల్లాడి తల్లితండ్రులు వాడిని వేరేవాళ్ళతో పంపుతున్నారు. అయినా ముసలాయన అంటే పిల్లవాడికి వల్లమాలిన ప్రేమ. మూడు రోజుల పాటు ఏమైపోయాడో తెలియని ముసలాయన మళ్ళీ కనపడగానే వాడు ఊపిరి పీల్చుకుని అవసరమైన సపర్యలు చేశాడు. మళ్ళీ తామిద్దరూ కలిసి వేటకు వెళ్ళాలని కలలు కన్నారు. పడవ పనిముట్లు బాగు చేయించుకోవాలనుకున్నారు. నవల ముగింపులో ముసలాయన బోర్లా పడుకుని నిద్రపోతూ వుంటాడు. పిల్లాడు పక్కన కూర్చుని వుంటాడు. శాంటియాగోను ముప్పతిప్పలు పెట్టి వీరమరణం పొందిన ఆ చేప పేరు మార్లిన్. ముసలాయన, మార్లిన్ యుద్ధంలో సమవుజ్జీలు. ముసలాయన పట్టుదలకి ఓరిమికి ధీటైన చేప అదే. దాని వెన్నెముక సముద్రంలో తేలుతుంది. ఒక చేప వెన్నెముక అంత పొడుగుండడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. హెమింగ్వే కూడా చేపలవేటలో నేర్పరి క్రీడలంటే చాలా ఇష్టం. బేస్ బాల్ ఛాంపియన్ డిమాజియో అభిమాని. అతని ఆటే ఈయనకు ఒక స్పూర్తి.
ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ ఒక అలిగరి. ఎన్నో పొరలను దాచుకున్న చిన్న నవల. విశ్వ సాహిత్యం లో ఒక గొప్ప నవల. ఈ నవల గురించి కాంపోజిషన్ వ్రాయడానికి రాలేదు నేనిప్పుడు.
ఇన్నాళ్ళకు తెలుగు పాఠకులకు సరళ సుందరమైన అనువాదంగా అందించారు స్వాతికుమారి, రవి వీరెల్లి.వీరిద్దరి కృషినీ అభినందించాలి. చక్కని తెలుగులో అనువాదం చెయ్యడమే కాక పాదసూచికలు, చిత్రాలు కూడా యిచ్చారు. ఇటువంటి అనువాదాలు విశ్వసాహిత్యానికి రహదారులు.
సాహిత్య వాతావరణం వున్న ఇల్లు పిల్లల మానసిక వికాసానికి తెరిచిన వాకిళ్ళు.వ్యక్తిత్వాన్ని సంతరించుకునే వయసులోని యువతకి,హైస్కూల్ పిల్లలకి, ఇంగ్లిష్ చదవలేని పెద్దవాళ్ళకి కూడా ఈ పుస్తకం మంచి కానుక.
Leave a Reply