భగవాన్ అడుగుజాడలలో – అణ్ణామలైస్వామి జీవితం
పుస్తక పరిచయం – ఇంద్రకంటి వెంకటేశ్వర్లు గారు
(లివింగ్ బై ది వర్డ్స్ ఆఫ్ భగవాన్ – డేవిడ్ గాడ్మన్ గారు రచించిన ఆంగ్ల పుస్తకానికి రాజా పిడూరి గారి అనువాదం)
పుస్తక పఠనం ఆనందానుభూతినిస్తుంది. ఒక మంచి పుస్తకం లభ్యమైనప్పుడు అది మహదానందం. చాలా అరుదుగా మనకు బహుళ ప్రయోజనాలను సిద్ధింప జేసే ఉత్తమ గ్రంథం లభిస్తుంది. ఇక అది బ్రహ్మానందమే. అలాంటి బ్రహ్మానందాన్ని కలిగించే పుస్తకం ‘భగవాన్ అడుగుజాడలలో’. పేరుకు ఇది డేవిడ్ గాడ్మన్ రచించిన అన్నామలై స్వామి జీవిత కథగా ఉన్నా, సమాంతరంగా ఇందులో భగవాన్ దివ్యత్వం, వారి దినచర్య, బోధనా విధానం, ఆశ్రమంలో భక్తుల వింత పోకడలు, ఆశ్రమం విస్తరించిన విధం – అన్నీ సమగ్రంగా ఆవిష్కరింపబడ్డాయి . అట్లే ఆశ్రమంలో గొడవలు, ఆశ్రమ ఆర్థికస్థితి, అధికారం కోసం ఆరాటాలూ నాటకీయంగా చిత్రింపబడ్డాయి. ఇదేదో ఒక సన్యాసి జీవిత గాధగనో లేక ఒక ఆధ్యాత్మిక గ్రంథంగనో కాక పాఠకులను ఉత్కంఠతో ఒక్క బిగిన చదివించే అద్భుత కథనంలా సాగుతుంది. భగవాన్ నుంచీ, ఆశ్రమం నుంచీ అన్నామలై స్వామి జీవితాన్ని వేరుచేసి చూడ ప్రయత్నించడం చెరుకు నుంచి తీపిని వేరుచేసి చూడడం లాంటిదే.
ఆధ్యాత్మిక విద్యా సాధనలో, మోక్ష సాధనామార్గంలో శిక్షణా విధానం ఏమిటి? గురు-శిష్య సంబంధం ఎలా ఉంటుంది? ఆత్మజ్ఞాన సంపన్నుడైన గురువు తన శిష్యుని ఎలా ఎన్నుకుంటాడు? ఎలాంటి శిక్షణనిస్తాడు? శిక్షణా సమాప్తి ఎలా నిర్ణయింపబడుతుంది? ఇలాంటి సాంకేతికాంశాలన్నీ రచయితకు తెలిసో లేక యాదృచ్ఛికంగానో ఈ గ్రంథంలో కూలంకషంగనే చొరబడ్డాయి. ఇదంతా వాస్తవానికి సైన్సే. అయితే ఇంతదాకా ఈ సైన్స్ లేదా ఈ సాంకేతికత ఎక్కడా గ్రంథరూపంగా వెలువడినట్లు లేదు.
తమిళనాడులో తిరువణ్ణామలై కి దూరంగా తొండన్కురుచ్చి అనే కుగ్రామం. అంతా కలిపి 200 కడప. ఆ గ్రామంలో 1906లో జన్మించాడు సెల్ల పెరుమాళ్. తండ్రి ఆ గ్రామంలో ఒక ప్రముఖుడు. ఆ బాలుడు జన్మించినపుడే అతని జాతకంలో సన్యాసి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి ఆ తండ్రికి. ఆ ధ్యాస కలగకుండా ఉండడానికి ఆ బాలుని చదివించ కుండా ఇతర పనుల్లో దింపడమే సరి అనిపించింది . చదువే రానప్పుడు మత గ్రంథాలు చదివే అవకాశం ఉండదు. దైవం గురించి ఆలోచన గానీ, ఆసక్తిగానీ కలిగే అవకాశం లేదు. ఏ తల్లిదండ్రులు మాత్రం బిడ్డ సన్యాసి కావాలని కోరుకుంటారు? కానీ విధి నిర్ణయం ఎవరు మార్చగలరు?
1928 ప్రాంతంలో ఆ గ్రామం గుండా పోతూ ఉన్న ఒక సాధువు ‘ఉపదేశ ఉండియార్’ అనే పుస్తకాన్ని సెల్ల పెరుమాళ్ కు ఇచ్చాడు. ఇందులో భగవాన్ రమణ మహర్షి ఛాయా చిత్రం ఉంది. దాన్ని చూడగానే ‘తన గురువు వీరే’ అనే గాఢ విశ్వాసం అతనికి కలిగింది. కాలినడకన, రైలులో ప్రయాణించి తిరువణ్ణామలై చేరుకున్నాడు. అతన్ని చూడగనే భగవాన్, “నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నీవు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను.” అన్నప్పుడు సెల్ల పెరుమాళ్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. చిన్నస్వామి సూచనతో భగవాన్ కు సహాయకుడిగా నియుక్తుడు అయ్యాడు. భగవాన్ స్కందాశ్రమంలో ఉన్న సమయంలో, భగవాన్ కు సహాయకుడిగా ఉన్న ఒక శిష్యుడి పేరు అన్నామలై. సెల్ల పెరుమాళ్ను చూచినప్పుడు భగవాన్ కు ఆ అన్నామలై గుర్తుకు వచ్చేవాడు. ఇతనిని కూడా అన్నామలై అని పిలిచేవారు భగవాన్. ఇక ఆ పేరే స్థిరపడి, సెల్ల పెరుమాల్ కాస్త అన్నామలై స్వామిగా రూపాంతరం చెందారు. ఇక అప్పట్నుంచి అంటే 1928 నుంచి 1995లో తాము ఈ భౌతిక రూపం వదలి పెట్టే వరకు అంటే సుమారు 70 సంవత్సరాలు అన్నామలై స్వామి తిరువణ్ణామలై వదలి బయటకు వెళ్ళినది లేదు. భగవాన్ కూడా అంతే కదా! ఒక్కమారు 1906 లో అక్కడకు చేరాక 1950లో తాము సమాధిగతులయ్యేదాకా భగవాన్ అరుణగిరి కి దూరంగా ఒక్క రాత్రి గూడా గడిపింది లేదు.
ఆధ్యాత్మిక వారసత్వానికి సీనియారిటీగానీ, అమేయజ్ఞాన సంపదకానీ అర్హతలు కాజాలవు. ఈ విషయం పెరుమాళ్ స్వామి విషయంలోనూ, మహాజ్ఞాని గణపతిముని విషయంలోనూ స్పష్టమైంది. భగవాన్ బాగా ప్రాచుర్యం పొందాక ఆశ్రమం చేరుకున్నవారు అన్నామలై స్వామి. విద్యాగంధం లేనివారు. అయినా భగవాన్ వారినే తమ ఆధ్యాత్మిక వారసుడిగా స్వీకరించారనీ, ప్రారంభం నుంచే వారికి అందుకు అవసరమైన శిక్షణనిచ్చారనీ అనిపిస్తుంది. వారు చేస్తున్న పూజలూ, జపాలూ మాన్పించడం, నిర్మాణాల నెపంతో వారు గురువును సంపూర్ణ శరణాగతి పొందేలా చేయడం ఆ శిక్షణలో భాగాలే కావచ్చు
కానీ సూక్ష్మంగా పరిశీలించ గలిగితే ఆశ్రమంలో నిర్మాణాలు చేయిస్తూనే భగవాన్ స్వయంగా వీరి వేలు పట్టుకొని ఆధ్యాత్మికత వైపు నడిపించారని, వారే స్వయంగా పూనుకొని వీరి హృదయంలో ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించారని అవగతమవుతుంది . తాను కోరుకున్న ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శారీరక మానసిక దార్ఢ్యతను ఆ పనుల నిర్వహణ ద్వారా అన్నామలై స్వామి సాధించాలని వారి అభిమతం కావచ్చు . రెండవది తనలో ఉండే అహాన్ని, కర్తృత్వ భావనను పూర్తిగా నిర్మూలన చేసుకోవడానికి ఈ శిక్షణ అవసరం. అన్నిటికంటే ప్రధానమైనది గురువుకు సంపూర్ణ సమర్పణ. ఈ విషయంలో అన్నామలై స్వామి భగవాన్ పెట్టిన పరీక్షలో కృతార్థులయ్యారు.
ప్రస్తుతం మనం రమణాశ్రమం లో ప్రవేశించగానే కనిపించే ప్రధాన కట్టడాలన్నీ, కొన్ని మార్పులు చేర్పులు మినహా, అన్నామలై స్వామి ఆశ్రమంలో నివసించిన ఆ 12 సంవత్సరాల కాలంలో నిర్మించినవే. ఆశ్రమం ఉత్తరం వైపున నీటి ప్రవాహం వర్షాకాలంలో వరద నీటితో ఆశ్రమాన్ని ముంచెత్తకుండా నూరు గజాల పొడవైన ఒక బలమైన రాతి గోడ , కొండ మీదకు వెళ్లే వాళ్ళు ఆ గోడ దాటడానికి అనువుగా మెట్లు, తరువాత స్టోర్ రూమ్, గోశాల, భోజనశాల, వంటశాల, పాఠశాల, పాలితీర్థానికి మెట్లు మొదలైనవి. అన్నామలై స్వామి ఆశ్రమం వదలి పలాకొత్తులో నివాసం ఉంటున్నప్పుడు కూడా భగవాన్ ఆయనను ఆశ్రమంలో వైద్యశాల నిర్మాణానికి వినియోగించారు. ఆశ్రమంలో అన్నామలై స్వామి చేపట్టిన చివరి నిర్మాణం అదే .
ఈ నిర్మాణాలు అన్నామలైస్వామి స్వయంగా పూనుకొని నిర్మిస్తున్నాడు అనే భావన ఆశ్రమవాసులలో ఉండేది. ఆయన ఆశ్రమ ధనాన్ని అంతా వృథా చేస్తున్నారని వారు భావించేవారు. పైగా అప్పటి ఆశ్రమ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. కారణం తెలియదు గానీ, భగవాన్ ఈ నిర్మాణాలు చేయమని తాము ఆదేశించిన విషయాన్ని గోప్యంగా ఉంచమని చెప్పారు. అప్పట్లో ఆశ్రమం అంత రద్దీగా ఉండేది కాదు. అంత పెద్ద నిర్మాణాల అవసరం అప్పుడు లేదు. కానీ ఆశ్రమం భవిష్యత్తులో ఎంతగా విస్తరించేది భగవాన్ కు ముందే ఎరుక అనడానికి వారు సంకల్పించిన ఈ నిర్మాణాలే సాక్షులు. ఆ నిర్మాణాల సమయంలో అన్నామలై స్వామి అనుభవించిన మనోవ్యథ ఈ గ్రంథంలో సుస్పష్టం. తన రాక లక్ష్యం ఏమిటి? తను నియోగింపబడ్డ కార్యమేమిటి? పైగా భగవాన్ ఈ గుంభనత్వం ఏమిటి? తనకీ నిందలు, నిష్ఠూరాలు ఏమిటి? ఒకసారి క్షణికావేశంలో “ఇక తిరగబడి ఈ పనిని వదలివేసి వెళ్ళిపోదాం” అని నిశ్చయించుకున్న క్షణంలో అకస్మాత్తుగా అక్కడ భగవాన్ ప్రత్యక్షమవడం , “నీతో కాకుంటే వదిలేయ్”, అనడంతో ఓటమిని అంగీకరించడం ఇష్టం లేక, ‘భగవాన్ సేవలో ఈ శరీరం నాశనమైనా సరే ఆయన మాటలకు కట్టుబడి వాటిని శిరసా వహిస్తాను’ అని పట్టుదల కలగడం.
ఆశ్రమంలో భగవాన్ భౌతికంగా ఉన్నప్పుడు ఆ పరిసరాలన్నీ చాలా ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉండి ఉంటాయనుకోవడం భ్రమ. ఎక్కడ ఎవరి సమక్షంలో ఉన్నా మానవుల నైసర్గిక స్వభావాలు వాటంతట అవి పెచ్చరిల్లుతూనే ఉంటాయి. చాలా గొడవలు జరిగేవి. చిన్నస్వామి – దండపాణి స్వామికి; చిన్నస్వామి -గణపతి ముని కి; చిన్నస్వామి- పెరుమాళ్ స్వామి కి మధ్య యుద్ధాలే నడిచాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా అహంభావా తిశయం, అధికార లాలసల కారణంగానే. భగవాన్ చేత “నాయనా” అని పిలిపించుకున్న మహా జ్ఞాని గణపతిముని సైతం ఆశ్రమ అధికారం కోసం తపించారు. చిన్నస్వామితో గొడవలు కారణంగా పాల్ బ్రంటన్, అతనికి ఆశ్రయం ఇచ్చినందుకు గణపతి శాస్త్రి అనే మరో భక్తుడు కూడా ఆశ్రమ ప్రవేశాన్ని కోల్పోయారు. ఇక అన్నామలై స్వామి విషయం సరే సరి. ఆశ్రమం వదలి పలాకొత్తులో నివాసం ఏర్పరచుకున్నాక మేజర్ చాడ్విక్ అన్నామలై స్వామికి నెలకు 50 రూపాయల చొప్పున ఇచ్చేవాడు. అది అన్నామలై స్వామి నెల ఖర్చులకు సరిపోయేది . చాడ్విక్ పై ఒత్తిడి తెచ్చి దాన్ని ఆపు చేయించాడు చిన్నస్వామి . తరువాత స్వామిని ఆదుకున్న ఆర్ముగంని బెదిరించాడు.
“ఆశ్రమ బహిష్కరణ అనే బెదిరింపులు, డబ్బు గురించి దిగులు ఇవన్నీ భగవాన్ లీలలో భాగమే. భక్తులకు పరీక్షలు, కష్టాలు పెడతారేమో కానీ తనను నమ్మిన వారిని మాత్రం వదిలిపెట్టరు” అంటారు అన్నామలై స్వామి. దానికి దృష్టాంతం చాడ్విక్, ఆర్ముగం సహాయం నిలిచిపోయాక తేలూరు అనే గ్రామానికి చెందిన భక్త బృందం ఒకటి చాలా కాలం పాటు అన్నామలై స్వామికి ధన సహాయం చేసింది.
వైద్యశాల నిర్మాణం పూర్తయ్యాక కొంతకాలానికి ఒక నాడు అన్నామలై స్వామి హాలులోకి ప్రవేశించగానే భగవాన్ ముఖంపై గుడ్డ కప్పుకొని అటు వైపు తిరిగారు. ఆ తరువాత రెండు రోజులు అలాగే జరిగింది. భగవాన్ అంతరంగం అన్నామలై స్వామికి అవగతం అయ్యింది. ఆ తరువాత ఆయన ఆశ్రమంలో కాలు పెట్టలేదు. ఇది 1940 ప్రాంతంలో జరిగింది. ఆశ్రమానికి అన్నామలై స్వామి కుటీరం కేవలం 200 గజాలే. అయినా 1995లో సమాధిపర్యంతం ఒక్క మారు కూడా ఆశ్రమంలో పాదం మోపలేదు. “దైవం పట్ల విశ్వాసం లేని వాడే ఎన్నో పాపాలు చేసి దీనస్థితిలో పడతాడు. కానీ నువ్వు పరిణతి చెందిన భక్తుడివి. ఇంత పరిణతి వచ్చాక కూడా భగవంతుడు వేరేగా ఉన్నాడు నేను వేరే అనుకుంటున్నావంటె – దైవం లో విశ్వాసం లేని నాస్తికుని స్థితిలో పడతావు. నువ్వు సవ్యమైన సాధకునివి. ఇంకా ఇక్కడికి వచ్చే అవసరం లేదు. పలాకొత్తులో ఉండి ధ్యానం చేసుకో. నువ్వు దైవాని కన్నా వేరుగా ఉన్నావు అన్న భావనను వదులుకోవడానికి ప్రయత్నించు” – ఇది అన్నామలై స్వామితో భగవాన్ వీడుకోలు సందేశం.
భగవాన్ పై భక్తి విశ్వాసాలు కల వారెవరైనా భగవాన్ అన్నామలై స్వామిని గమ్యం చేర్చకుండా మధ్యలో వదలి వేశారని భావించరు. సాధకుని యొక్క ఆధ్యాత్మిక సాధన పరిణతిని గుర్తించే, నిర్ణయించే సూచికలు, కొలమానాలు ఎక్కడా ఉండవు. ఈ వ్యాస రచయితకు ఆ స్థాయి అసలు లేదు. కానీ తమ మరియే ఇతర శిష్యుని పట్ల చూపని ప్రత్యేక శ్రద్ధ, వాత్సల్యము భగవాన్ అన్నామలై స్వామిపై చూపారు అనేది సుస్పష్టం . అన్నామలై స్వామి మనస్సు ఆ శుద్ధచైతన్య స్థితికి చేరుకుందని నిర్ణయించుకున్నాకే, ఇంకా తమ మధ్య ఆ ‘లౌకిక బంధం’ ఉండకూడదని భగవాన్ నిర్ణయం అయి ఉంటుంది.
ఆ మహనీయుడు డేవిడ్ గాడ్మన్ గారు పూనుకోక పోయుంటే అన్నామలై స్వామిని గురించి ప్రపంచానికి అంతగా తెలిసి ఉండేది కాదు. ఆశ్రమ విస్తరణ కార్యంలో వారి సింహభాగ ప్రాతినిధ్యం కానీ, భగవాన్ ఆజ్ఞలు శిరసావహించడంలో చిన్నస్వామి వలన పడిన ఇబ్బందులు కానీ, 1940 లో ఆశ్రమం వదలి వెళ్ళిన తరువాత 50 సంవత్సరాల కాలం వారి ఆధ్యాత్మిక ప్రస్థానం కానీ – అన్నీ అజ్ఞాతం గానే ఉండిపోయేవి. భగవాన్ ను సేవించిన అనేకానేక మంది సేవక శిష్యులలో ఒకడుగా అనామకుడుగానే మిగిలిపోయే వారు.
భగవాన్ భౌతికంగా ప్రత్యక్షంగా ఉన్న సమయంలో పాల్ బ్రంటన్, విలియం ఆస్బోర్న్, మేజర్ చాడ్విక్, కోహెన్ లాంటి పాశ్చాత్యులు ఆశ్రమాన్ని దర్శించారు. తమ ఆర్తి ఏదో భగవాన్ కు తెలియజేసుకున్నారు. సాంత్వన పొందారు. ఈ డేవిడ్ గాడ్ మన్ గారు 1976 ప్రాంతంలో తమ పాతికేళ్ల ప్రాయంలో రమణాశ్రమం చేరుకున్నారు. అప్పటికి భగవాన్ సమాధి పొంది పాతిక సంవత్సరాలు. మరి ఆశ్రమంలో గాడ్మన్ గారికి ఎలాంటి ప్రశాంతత, ఎటువంటి సాంత్వన లభించాయో మరి ! ఇక వారు ఆ అరుణగిరినే తమ నివాసంగా చేసుకున్నారు. 1987 ప్రాంతంలో వారు అన్నామలై స్వామితో చేసిన సంభాషణల సారమే ఈ గ్రంథం. భగవాన్ ఆశ్రమాన్ని అనుకునే ఉన్న అన్నామలై స్వామి నివాసం, వారి సమాధి ఇంత బహుళ ప్రాచుర్యం పొందడానికి కారకులు డేవిడ్ గాడ్మన్ గారే . ఏ శక్తి వారిని ఆ ప్రాంతానికి అంతగా కట్టిపడేసిందో, ఏ ఆధ్యాత్మిక సంపద వారిని అంత ప్రభావితం చేసిందో! ఇక ఎక్కడెక్కడ తిరిగినా తమ కేంద్ర స్థావరంగా తిరువణ్ణామలైనే ఎంచుకున్నారు. వారు ప్రాతస్స్మరణీయులు .
ఇక ఈ అనువాదం గురించి ఏమి చెప్పగలం!! పిడూరి రాజశేఖర్ ఈ అనువాద బాధ్యతకు వందశాతం అర్హత కలవారు. వారితో నాకు కొంత పరిచయం, కొద్దిపాటి ఆత్మీయత ఉన్నాయి. వారి జీవన విధానం విలక్షణం, మత్సర కారకం. అనువాదకునికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం రెండు భాషల పై పట్టు. వారికి ఆంధ్రాంగ్లములపై సాధికారికత ఉంది. ఇక ఆధ్యాత్మిక విషయాలు వివరించడానికి అనువైన అవగాహన రెండవది. భగవాన్ ను, జిడ్డు కృష్ణమూర్తి గారినీ ఆపోసన పట్టిన వీరికి అది నల్లేరుపై బండి నడక. ఇక మూడవ అతి ప్రధాన లక్షణం – అనువదిస్తున్న విషయంపై అనురక్తి. రాజశేఖర్ గారి ప్రతి శ్వాస లోనూ భగవాన్ ఉంటారు. అన్నామలై స్వామి పట్ల ప్రత్యేక అభిమానం, భక్తి.
తెలుగులో వచ్చిన ఆధ్యాత్మిక గ్రంథాల అనువాదాలలో ఇది అత్యుత్తమం అనడం నిస్సందేహం.
¼ th క్రౌన్ సైజులో దాదాపు 300 పేజీల ఈ బృహద్గ్రంథంలో మొదటి సగం అణ్ణామలై స్వామి ఆశ్రమ ప్రవేశం, నిర్మాణాలు, ఆశ్రమంలో ఇతర వ్యవహారాల గురించి. ఈ నా సమీక్షలాంటి అభిప్రాయం కేవలం ఆ భాగం గురించే. రెండవభాగం అంతా భక్తుల సందేహాలకు భగవాన్ సమాధానాలు; భక్తుల సందేహాలకు అణ్ణామలై స్వామి సమాధానాలు. వాటిని సమీక్షించే సాహసం చేయను. భక్తుల మానసిక పరిణతిని దృష్టిలో ఉంచుకుని భగవాన్, అణ్ణామలై స్వామి వారివారికి తగినస్థాయిలో స్పందించారు. ఒకే విధమైన ప్రశ్నకు వేరువేరు సమాధానాలూ కనిపిస్తాయి. పాఠకులు తమతమ శక్తిమేరా వాటిని అర్థం చేసుకుని అన్వయించుకోవలసిందే.
పుస్తక ప్రతులకు సంప్రదించండి :
సుందరం స్వామి గారు
Phone # 09150741455
295 పేజీలు. 24 ఫోటోలతో ఉన్న ఈ పుస్తకం వెల : Rs.250/-
Sri Satguru Annamalai Swamigal Spiritual Trust, S.B. A/C.134100710400147 IFSC Code TMBL0000134 Tamilnad Mercantile Bank, Thiruvannamalai.
Phone # 09150741455
srinivasa rao.v,khammam
చక్కగా తెలిపారు, ధన్యవాదాలు.