ద్వాపరయుగం నుంచీ కొండపొలం?

వ్యాసకర్త: గాలి తివిక్రమ్

 లాక్ డౌన్ రోజుల్లో కొండపొలం నవల చదివిన తర్వాత పిల్లలకు పురాణ కథాకాలక్షేపం కింద కృష్ణావతారం కథ చదివి వినిపిస్తున్నప్పుడు కొండపొలంలోని పరిస్థితులకు, శ్రీకృష్ణుడి కాలం నాటి గోపాలకుల పరిస్థితులకు ఉన్న పోలికలు విస్మయాన్ని కలిగించాయి. నవలలోని రవి వాళ్ళ బృందంతోబాటు తిరుగుతూ నల్లమల కొండలమీదెక్కడో రూపాయి బిళ్ళ పారేసుకున్నట్టున్నాను (penny drop = అకస్మాత్తుగా జ్ఞానోదయం కలగడం :-)), బాగా తెలిసిన కథలోనే అంతకుముందెప్పుడూ నా దృష్టిని ఆకర్షించని అంశాలు కొన్ని ఈసారి కొట్టొచ్చినట్లు కనబడడం విశేషం. ఉదాహరణకు అంతకుముందెన్నోసార్లు “పోయెద మెక్కడి కైనను, మా యన్నల సురభు లాన” అన్న వాక్యం నెమరేసుకున్నా వాళ్ళ ఇబ్బందికి కారణం కృష్ణుడి కొంటెచేష్టలే కాబట్టి వినోదంగానే తప్ప ఇంకో విధమైన ఆలోచన రాలేదు. ఆ మాట వాళ్ళు అంత తేలిగ్గా, తొందరగా అనగలగడానికి కారణం వాళ్ళ కుటుంబాల వృత్తి నేపథ్యమే అని ఇప్పుడు కొత్తగా అర్థమౌతున్న విషయం.

 

వ్యవసాయానికి, సంచార జీవితానికి చుక్కెదురు. నేల కదలనిది కాబట్టి నేలను దున్నే రైతు సారవంతమైన నేలా, నీటి వసతీ చూసుకుని అక్కడే స్థిరనివాసమేర్పరచుకుంటేగానీ వ్యవసాయం సాధ్యపడదు. “పొరుగూరి చాకిరి, పొరుగూరి సేద్యం తనను తినేవేగాని తను తినేవి కావు” అన్నది గతంలో పొద్దు కోసం చేసిన ఇంటర్వ్యూలో సన్నపురెడ్డి గారే గుర్తు చేసిన సామెత.

 

పాడిని వ్యవసాయానికి అనుబంధరంగంగా చూసినా, పాడి-పంటలను ఎంత జంట పదాలుగా వాడినా పశుపోషణ వ్యవసాయంలాంటిది కాదు. శ్రీకృష్ణుడు పెరిగింది పశుపోషణ వృత్తిగా గల కుటుంబంలో. అందుకేనేమో అతడి జీవితమంతా వలసపోవడం కొనసాగుతూనే వచ్చింది – రేపల్లె నుంచి బృందావనానికి, అక్కడి నుంచి మథురకు, అక్కడినుంచి ద్వారకకు.

 

ద్వారకకు మకాం మార్చడానికి శత్రుభయాన్ని కారణంగా చూపినా (జరాసంధ/కాలయవన) అంతకుముందు జరిగిన వలసలకు కారణం అంతవరకూ ఉన్నచోట పశువుల మేత దొరకకపోవడమే. బృందావనంలో ఉన్నప్పుడే మధ్యలో ఒకసారి నివాసం మార్చలేదుగానీ కాస్త దూరంగా పశువుల మేతకు ఇంకొక స్థలం చూసుకోవలసి వచ్చింది. అంటే ఒకరకంగా కొండపొలం లాంటిదే.

 

యశోదకు చిన్నికృష్ణుడి ఆగడాల గురించి ఫిర్యాదు చెయ్యడానికి వచ్చిన గొల్ల స్త్రీలు కూడా తమ సమస్యకు వలసపోవడం చాలా సులభమైన పరిష్కారమైనట్లు “ఈ పాట్లు పడేకన్న ఈ పల్లెకు అగ్గిపెట్టేసి మా పశువులతో ఇంకో చోటికి పోయి నిక్షేపంగా బతుకుతాం” అనేస్తారు. బృందావనానికి నివాసం మార్చడానికి ప్రేరణా బలరాముడితో కృష్ణుడన్న మాటలే “అన్నా, మనం ఈ వనంలోనే పుట్టాం, ఇన్నాళ్ళూ ఇక్కడే పెరిగాం. మందలూ గోపకులూ ఇంత కాలంపాటు ఒకేచోట ఉండటం మంచిదా?” అని మొదలుపెడతాడు! తీరా బృందావనానికి చేరగానే పశువులకు తెగుళ్ళూ, గోపకులకు రోగాలూ తగిలాయి.

 

అప్పుడు కూడా మొట్టమొదటగా “ఆ స్థలం వదిలిపెట్టి పోతేగానీ బతకలేమని కృష్ణుడికి తోచింది”! (తర్వాత రోగకారణం కనుక్కుని దాన్ని నిర్మూలించి అక్కడే కొన్నేళ్ళు నివసించడం వేరే కథ). గమనించాల్సిందేమంటే పశువులకు మేత సమస్యగానీ, మనుషులకు రోగ సమస్యగానీ శత్రుభయంగానీ కలిగితే ఒక యాదవుడిగా కృష్ణుడికి వచ్చిన మొదటి ఆలోచన అక్కడినుంచి వేరేచోటికి పోవడం!

 

కాలయవనుడు దండెత్తి వచ్చినప్పుడు కూడా “కృష్ణుడు పరిస్థితి అంతా చక్కగా ఆలోచించి మథుర విడిచి వెళ్లటమే కర్తవ్యమని నిశ్చయించుకున్నాడు”.

 

స్థూలదృష్టికి ఇది పలాయనవాదంలా కనిపించవచ్చు. కృష్ణుడి ధీరత్వం, సాహసం, పరాక్రమం ఏమయ్యాయనిపించవచ్చు. కానీ ఏ మాత్రం పరిచయంలేని కొత్తచోటుకు పోయి అక్కడి సవాళ్ళను అధిగమించి సానుకూలం చేసుకోవడంలోనే అసలు సాహసం బయటపడేది. ఉదాహరణకు ఇది చూడండి:

 

“కొంత కాలం గడిచింది.  పశువులకు మేత లేకుండా పోయింది. కృష్ణుడు మిగిలిన గోపకులతో కర్తవ్యం ఆలోచించాడు. అప్పుడు వారిలో పెద్దవాళ్ళు ఒక విషయం కృష్ణుడికి చెప్పారు. గోవర్ధన పర్వతానికి ఉత్తరంగా, కాళిందీ నదికి దగ్గరలోనే అతి విశాలమైన తాటితోపు ఉన్నది. అందులో పచ్చిగడ్డి పుష్కలంగా ఉన్నది. అయితే అందులో ధేనుకుడనే రాక్షసుడు గాడిద రూపంలో ఉండటం చేత అందులోకి ఏ ప్రాణీ ప్రవేశించదు.

 

“ఈ విషయం చెవుల పడేసరికి బలరామకృష్ణులకు ఉత్సాహం పుట్టుకొచ్చింది. వాళ్ళు ధైర్యం గల గోపకులతో, “పశువులకు మేత ఉండాలి గానీ, రాక్షసులకు భయపడతామా? పదండి!” అన్నారు.

 

అదే విధంగా కొండపొలంలోని గొల్లలు ఎదుర్కొన్న సమస్యలు కూడా. ఉండూర్లో ఒక్కనాటికీ ఎదురవని సమస్యలు అవి. వాళ్ళు ఆ సమస్యలను ఎదుర్కొని అధిగమించడాన్ని వివరించిన తీరే ఆ నవల గొప్పదనం. బలరామకృష్ణుల మాటలను వీళ్ళ నోటి వెంట “గొర్లకు మేత ఉండాల గానీ, పెద్దనక్కలకు (పులులకు) భయపడతామా? పాండి పోదాం!” అని వింటున్నట్లే అనిపించింది నాకు.

 

గోవర్ధనోద్ధరణ సన్నివేశం కొండపొలానికి ఇంకా దగ్గరి పోలికలున్న ఘట్టం. గోపాలకులు ఇంద్రోత్సవం తలపెట్టినప్పుడు కృష్ణుడిలా అంటాడు: “… మనం గోపాలకులం; అడవులలో ఉంటాం, కొండల్లో తిరుగుతాం, పశువులను పెంచుతూ జీవిస్తాం. అందుచేత మనకు అడవులూ, కొండలూ, పశువులూ దేవతలు. ఎవరి కులదేవతలను వాళ్ళు పూజించాలి. కర్షకులు గ్రామాల్లో నివసిస్తారు, ఆటవికులు అరణ్యంలో నివసిస్తారు, మనం కొండలలో నివసిస్తాం. బ్రాహ్మణులు మంత్రయజ్ఞం చేస్తారు; కర్షకులు నాగలియజ్ఞం చేస్తారు; గోపాలకులు కొండయజ్ఞం చేస్తారు. అందుచేత మనం పర్వతోత్సవం జరపటం యుక్తంగా ఉంటుంది…” పశుపోషకులు పశువుల మేత కోసం కొండల మీద ఆధారపడడం అప్పట్నుంచీ ఇంకా మారనేలేదన్నమాట!!

 

అన్నట్లు వేదకాలంలో ప్రజల ముఖ్యవృత్తి పశుపోషణే కదా? దానికి తగ్గట్టు వాళ్ళది సంచార జీవనం కూడా. అప్పటి సాధారణ ప్రజల (విశ్ – వ్యుత్పత్తి ప్రకారం వైశ్యుల మూలపురుషులు) జీవన విధానం గురించి (అంటే పశుపోషణలో అప్పటివాళ్ళకు ఎదురైన సవాళ్ళు, వాటిని వాళ్ళు ఎదుర్కొన్న/పరిష్కరించుకొన్న తీరు వగైరా) వివరాలేమైనా ఉన్నాయా?

 

You Might Also Like

Leave a Reply