కొంగొత్త రాగాల కవితా పల్లవులు
వ్యాసకర్త: విశీ
వందమంది మధ్యలో ఉన్నప్పుడు కథ చదవగలను కానీ.. కవిత్వం చదవాలంటే మాత్రం ఒంటరిగా ఉండాల్సిందే! చాలా మంది కవిత్వం తమకు అర్థం కాదంటుంటారు. అర్థం కాగలిగే సమయాన ఆ కవితను అందుకోకపోవడమే అసలు దోషం అనిపిస్తుంది నాకు. నేను చదివే కవిత్వం చాలా తక్కువ. కరువు సీమన వర్షం కురిసిన చందంగా ఏడాదికోనాటి పున్నమి. అప్పుడు గనక ఆ కవిత నచ్చిందంటే ఆ తర్వాత ఆ కవి ఎన్ని రాసినా చదువుతాను.
నిన్న రాత్రి అనిల్ డ్యానీ(డ్యానీ మావయ్య) ‘ఎనిమిదో రంగు’ పుస్తకం చదువుతూ ఉండిపోయాను. అందులోని కవితలు భలే గమ్మత్తుగా, గాఢంగా అనిపించాయి. ‘ఆమె-రాత్రి చందమామ’ కవితలో అంటాడు కదా..
‘చిందాడుతున్న పాదాలకిరువైపులా బారులుగా దీపాల వెలుగులు..
కొన్ని దీపాలది ఆకలి.. కొన్ని దీపాలది దాహం’
దీపాల ఆకలీ, దప్పికా గురించి ఆలోచించే తత్వం. బహు విచిత్రం అనిపించింది.
‘ఆమెతనం’ కవిత మకుటమే అతి మధురంగా అనిపించింది. అందులో ఈ వాక్యాలు ఎంత బాగున్నాయో!
‘ఆమెకు సూర్యోదయం అంటే..
ఆమెని ఆమె వెతుక్కోవడం
బహుముఖ రూపాల మధ్యన
ఆమె ఎప్పుడూ తప్పిపోతుంది
చేయవలసిందిల్లా ఇప్పుడు
భూమిని మొత్తం తవ్విపోసి
ఆమెతనం నారుపోయాలి
కొత్తగా మొలిచే మొక్కలకి మనుషులనే పేరు పెట్టాలి’
ఇవి చదువుతున్నప్పుడు ఒంట్లో ఒక్క క్షణం విద్యుత్ ప్రసరించినట్టు అనిపించింది. అదోలాంటి గాఢమైన భావన చుట్టుముట్టింది..
కొన్ని సందర్భాలను ఆయన వ్యక్తీకరించిన పద్ధతి చూశాక వాటి విలువ మరింత బలంగా అవగతమైనట్టనిపించింది.
ఉత్తర ప్రదేశ్‌లో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోయిన వైనాన్ని ‘ఇక్కడ ఏడుపు నిషేధం’లో చాలా హృద్యంగా చెప్పారు.
‘కొంత మట్టి తీసుకుని ఒక బొమ్మని చేయండి
కళ్లు ముక్కు చేతులు కాళ్ళు సరిగ్గా అమర్చి
ఎవరినైనా అడిగి రక్తమూ ఇవ్వండి
ప్రాణం మాత్రం ఎలా పోయాలో ఆలోచించకండి
ఎందుకంటే మీకు మనుషులు అక్కరలేదు
బొమ్మలు కావాలి’
ఉదాసీన పాలకుల ముఖాన చల్లిన కళ్లాపిలా అనిపించిన వాక్యాలివి.
కార్పొరేటు కాలేజీ చదువుల ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంటున్న పిల్లల గురించి రాస్తూ..
‘అమ్మ పాటని నాన్న మాటల్ని
అమ్మానాన్నలే మరిచిపోయాక
ర్యాంకుల హోర్డింగుల మీద మెరుస్తున్న
అంకెల మధ్య ఇమడలేక
పిల్లలు గాజుదేహాలై పగిలిపోక ఏం చేస్తారు’
అని రాశారు.
పల్లెల మీద కచ్చ గట్టి.. పట్నంపైన కురిసే వాన గురించి ‘వలస వాన’ కవిత రాస్తూ అన్న మాటలు చూడండి..
‘చినుకు కురిస్తే నగరానిది మురుగు వాసన
జనానికి పని ఇవ్వలేని ప్రసవ వేదన
పల్లెల్లో కురవకుండా ఊరిని వలస పంపే వాన
నగరంపై కురిసినప్పుడు మాత్రం బోరుమంటుంది.’
ఈ పుస్తకంలోని ప్రతి కవితా కొంగొత్త రాగాల పల్లవులు పాడుతున్నట్లే అనిపిస్తుంది. వినే ఓపిక, విని ఆనందించే తీరిక మనకుండాలి. అవి నడిపించే ఆలోచనా సాగరానికి పయనం కట్టాలి.
Leave a Reply