కథలతో ప్రపంచయాత్ర : ఏడు గంటల వార్తలు
వ్యాసకర్త: దాసరి శిరీష
కొంతమంది రచయితలు అనువాదాలు చేయడం అంటే ప్రత్యేకంగా ఇష్టపడతారు. ఇతర భాషల్లో విశిష్టమైన
రచనల్ని అందించడం… తద్వారా సాహితీవేత్తల మనోస్థాయిని పెంచడం జరుగుతుంటుంది. ఈ ప్రక్రియలో
ఆరితేరిన కొల్లూరి సోమ శంకర్ అనువదించే పద్ధతి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. సరళమైన పదాలు,
నిరాడంబరమైన శైలీ… తన భావాలని క్లుప్తంగా, అర్థవంతంగా ఒదిగి ఉంటాయి.
నిజానికి అనువదించడం అనేది ఓ చక్కటి ప్రక్రియ. అయితే అది ఎన్నుకున్న రచనలా పటిష్టంగా ఉండాలి.
మచ్చుకి ఈ 'ఏడు గంటల వార్తలు' పుస్తకంలో అనేక కథలు వేటికవే ఉన్నతస్థాయిలో ఉంటాయి. పాఠకుల నాడి తెలిసిన సోమ శంకర్ చాలా సులభమైన పద్ధతిలో మనల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకువెడతారు. అది అనువాదకుడి నైపుణ్యం.
మొట్టమొదటి కథ విచారగ్రస్తుడు (మూలం: జాన్ గార్డినర్, కెనడా రచయిత)లో కథానాయకుడు తను
ఎన్నుకున్న జీవనపథాన్ని సంతృప్తిగా గడిపిన వైనమే కాకుండా… తన చిన్న ఆభరణాల షాపుని క్రిస్మస్
ముందు రోజు మూసివేయాలన్న నిర్ణయం ఆయనని విచారగ్రస్తుడిని చేస్తుంది. ఈ కథలో కూతురూ, భార్యా
ఈ పాత్రలన్నీ ఆ వ్యక్తి పట్ల అంతులేని అనురాగాన్ని కురిపించే మనుషులే. ఆయన ఎక్కడ ఇబ్బంది
పడుతున్నారో అని ఆందోళనపడే ప్రేమాస్పదులే. కథ ముగింపులో ముక్తాయింపు ఆర్ద్రంగా చెబుతారు
రచయిత. మనస్సుని ప్రఫుల్లపరిచే కథావస్తువు విచారగ్రస్తుడు.
బైపాస్ రోడ్ (మూలం: టోనీ గాదర్‍కోల్) చదివితే కళ్ళు చెమ్మగిల్లుతాయి. జీవితంలో ఒక బలమైన
సంఘటన – ఆ ప్రేమ గురించి ఎంత గాఢమైన ముద్ర వేయగలదో? (అవసరమైతే పూర్తి జీవితాన్ని
వదులుకోగలరు) ఈ కథ నిరూపిస్తుంది.
వీటన్నింటినీ మించినది ఏడు గంటల వార్తలు కథ. కథ ప్రారంభమే రాటుదేలిన జీవితానికి తార్కాణం. ఆకలి బాధని తీర్చుకోడానికి బిడ్డతో సహా వెదుకులాట తప్ప ఇంకేమీ ఆలోచించే స్థితిలో లేని స్త్రీ దుఃఖం పాఠకులని విచలితం చేస్తుంది. కథని చెప్పను, చదివితే కన్నీరు కార్చాల్సిందే.
విద్వేషం (అఫ్ఘన్ కథ, మూలం: పర్వీన్ జైద్ జదాహ్ మలాల్) కథలో జీవితం దుర్భరమైన సంఘటనతో
ఎంత తారుమారవుతుందో? అసలు తనేమిటో! స్వదేశంలో గడిచిన గతమేమిటో? ఇప్పుడు పరాయి దేశంలో
మనుగడ గురించి కొడుకుతో సహా పడుతున్న తిప్పలేమిటో? చాలా హృద్యంగా చిత్రీకరించారు.
ఉద్యోగం పోయింది (కజకిస్థాన్ కథ, మూలం: జౌరె బతయెవా) కథలో ఒక రకమైన తిరుగుబాటు మనస్తత్వం
కనిపిస్తుంటే… గ్రామసీమల్లో మంత్రిగారి పాదయాత్ర (నేపాల్ కథ మూలం: నయన్ రాజ్ పాండే) కథ
హాస్యంగా మనల్ని ఉల్లాసభరితంగా చేస్తుంది.
జీవితం ఎంత కఠినమైనదో, వాస్తవం ఎంత చేదుగా ఉంటుందో ప్రతీ కథా విషాదభరితంగా నిరూపిస్తుంటుంది.
అన్ని బాధల గురించి ఆ కథల్లోని నికృష్టత గురించీ రాస్తే ఎన్ని పేజీలయినా చాలవు.
కథలు ఎంత ప్రభావాన్ని చూపించగలవో నిరూపిస్తాయి ఏడు గంటల వార్తలు పుస్తకంలోని కథలు. కథలు ఎన్నుకోవడమే కాదు, ఇవి తెలుగుతనంతో చదువరులకి చాలా నిరాటంకంగా సాగే శైలితో… పదాల కూర్పుతో… హుందాతనాన్ని సంతరించుకున్నాయి.
కాకపోతే నాకు ఒక్కటే అనిపించింది. ప్రతీ కథలో దాదాపు ప్రాపంచిక అసమానతలున్నాయి. అందువల్ల
తయారయిన మానవుల దురాగతాలను తెలియజేస్తూనే…. యుద్ధాలనీ, క్షతగాత్రులనీ, యుద్ధానంతరం
ఆశలు కోల్పోని దయనీయమైన జీవితాలని అనువాదకుడు స్పృశించారు. వాటి నేపథ్యాన్ని మూల
రచయితలు కనీసం చిన్న వివరణలిస్తే బావుండేదా అని అనిపించింది (ఆ లోపం సోమ శంకర్‌ది కాదు).
మొత్తానికి అన్ని దేశాల స్థితిగతుల్నీ ఆకళింపు చేసుకునేలా నైపుణ్యంగా రాయడంలో అనువాదకుడిగా సోమ
శంకర్ ప్రతిభ అద్వితీయం.
కథల ద్వారా ప్రతి దేశ స్థానికతనీ, పరిసరాలనీ, సంస్కృతినీ తెలుసుకుంటూ ఓ ప్రపంచయాత్రని దిగ్విజయంగా చేసి వస్తాం.
***
ఏడు గంటల వార్తలు
(విదేశీ కథల అనువాద సంపుటి)
అనువాదం: కొల్లూరి సోమ శంకర్
ప్రచురణ: కొల్లూరి సోమ శంకర్
పేజీలు: 128 (14+114)
వెల: ₹ 120/-
ప్రతులకు:
ఈబుక్ కినిగెలో:
http://kinige.com/book/Edu+Gantala+Vartalu
ప్రింట్ బుక్: నవోదయా బుక్ హౌజ్, కాచీగుడా, హైదరాబాద్. +91-9000413413, 040-24652387
విజయవాడలో:
సాహితీ ప్రచురణలు, #33-22-2, చంద్ర బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ. 520 004. ఫోన్:
0866-2436643
విశాలాంధ్ర బుక్ హౌజ్, ఏలూరు రోడ్, విజయవాడ., ఇతర శాఖలు.
ఆన్‌లైన్ ఆర్డర్స్ కోసం:
నవోదయ బుక్ హౌస్
Yedu Gantala Vaarthalu
అమెజాన్
~ దాసరి శిరీష
Leave a Reply