అనగనగా : వంశీ మాగంటి 

వ్యాసకర్త: సోమశంకర్

పిల్లల కోసం మాగంటి వంశీ మోహన్ గారు కూర్చిన కథల సంపుటి – “అనగనగా”na. నేను పరిచయం
చేస్తున్నది మొదటి వాల్యూమ్‌ని.

ఇందులో చాలామటుకు కథలు ఆయన స్వంతవే అయినా, కాపీరైటు పరిధిలో లేనివి, పబ్లిక్ డొమైన్‍లో ఉన్న
వివిధ ప్రపంచ దేశాల జానపద కథలకు స్వేచ్ఛానువాదాలు, అనుకరణలు ఉన్నాయి. వారి అమ్మాయి
వైష్ణవికి చెప్పిన కథలు కొన్ని ఉన్నాయి.

***

మొదటి కథ రామకథ. అన్నదమ్ముల ప్రేమని ఆప్యాయతని సరళమైన పదాలలో చిత్రించారు. తమ్ముళ్ళ
మీద ప్రేమ వల్ల రాముని కంటి నుంచి ఒక చుక్క రాలిందట. అది శివుని జటాజూటం నుంచి దిగే గంగమ్మలా
ఉందట. స్వామి వారి పాదాల నుంచి ముఖంలోకి వచ్చేసానన్న గంగమ్మ గర్వం ఎలా అణిగిందో ఈ కథ
చెబుతుంది.

రెండో కథ – నదులలో కృష్ణ నల్లగా ఉండడానికి, గోదావరి భిన్నంగా కాసింత తెల్లగా ఉండడానికి కారణాలు
అన్వేషిస్తూ వచ్చిన ఊహతో రాసిన పిట్టకథ.

మూడో కథ ఓ రైతు కథ. ఆ రైతు కూతురు ‘మహీలత’ కథ. అందరికీ తల్లో నాలుకగా ఉండే ఆ అమ్మాయికి ఒక ప్రమాదంలో కళ్ళు పోతాయి. అయినా భగవంతుడిని మరుజన్మలో అందరికీ ఉపయోగపడాలనే వరం
కోరుకుంది. కొన్ని జన్మల తర్వాత వానపాముగా జన్మించి రైతులకి ఎంతగానో ఉపయోగపడిందట. మహీలత
అనే పదానికి వానపాముకి పర్యాయం అని తెలిసినప్పుడు రాసిన కథ ఇది.

బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గురించి వారి కుమార్తెకి ఓ కథలా ఎలా చెప్పాలా అని ఆలోచించి రాసిన కథ అందరినీ
ఆకట్టుకుంటుంది. అమెరికన్ జానపద కథ పీటర్ అండ్ డెవిల్‍ను మన వాతావరణానికి తగ్గట్టుగా మార్చి, ఆ
కథలో 'మృత్యువు' ఎలా పుట్టిందో చెప్పడం బావుంది.

ఓ మేక తోడేలుతో పోరాడుతుంది. సర్వశక్తులు ఒడ్డుతుంది. పోరాటం తీవ్రమై చివరికి రెండూ తగ్గుతాయి.
ఎవరు గెలిచారో తెలియదు. మాజీ రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ గారు రచించిన 'అబ్బూఖాన్ కీ బక్రీ' ఈ కథకి ఆధారం.

మహాభారతానికి, కుక్కకీ ఉన్న సంబంధం గురించి ఒక కథలో చెబుతారు. కుక్క మీద ఉన్న సామెతలు గుర్తు
చేసి కుక్క అంత గొప్ప జంతువు మరొకటి లేదంటారు.

ఓ అందమైన ఊరు. అందులో ప్రకృతంటే ప్రాణం పెట్టే అందమైన మనుషులు. ఆ ఊర్లోని ప్రకృతి అందాలకు దేవతలు కూడా అసూయపడేవారట. ఆడుకోడానికి అక్కడికి వచ్చేవారట. సూర్యుడు ఇంద్రుడు పోటీ పడడంతో ఇంద్రధనుస్సు ఏర్పడిందని ఈ కథలో చెబుతారు.

ఓ రైతు పొలంలో జొన్నలు విరగకాస్తాయి. కాకుల గుంపు వచ్చి కొన్ని గింజల్ని ఎత్తుకుపోతుంటాయి. ఈ
క్రమంలో ఓ కాకిపిల్ల రైతుకి చిక్కుతుంది. అది కాకుల్లో యువరాజట! అందుకని యువరాజుని
కాపాడుకోవడం రాజు కాకి వచ్చి రైతు అడిగిన పని చేయడానికి సిద్ధమవుతాడు. ఎన్నో ఆటంకాలు వస్తాయి.
కానీ కాకి రాజు ఉపాయంతో వాటిని అధిగమిస్తాడు, కొడుకుని విడిపించుకుంటాడు.

ఊరంతా క్షామం వచ్చినప్పుడు ఓ ముసలావిడ అందరికీ అన్నం ఎలా పెట్టగలిగిందో, ఆమెకి దొరికిన ఓ
ముత్యం అందుకు ఎలా దోహదం చేసిందో ఓ కథ చెబుతుంది. ఇది ఒక హవాయియన్ జానపద కథకి
మార్పులు చేసి రాసిన కథ.

అనగనగా ఓ మంచి రాజు గారు. తమ రాజ్యం వచ్చిన వీరుడికి కోటకి కాపలాదారుల నాయకుడిగా ఉద్యోగం
ఇచ్చాడు. బదులుగా విశ్వాసంతో రాజు గారి ప్రాణాలను తీసుకుపోవడానికి వచ్చిన యముడిని
మెప్పిస్తాడతను. రాజంటే ఎందుకంత ప్రేమ అని అడిగితే, అతను చెప్పిన సమాధానం అందరినీ
ఆకట్టుకుంటుంది.

ముందూ వెనుకా చూడక ఆవేశంగా పనులు చేస్తే కష్టాలు తప్పవనీ, ఒక్కోసారి మృత్యువుకీ దారి తీస్తుందని
ఓ కథలో చెబుతారు. ఆవేశమెంత అనర్థమో ఈ కథ చెబుతుంది.

బభ్రాజమానం భజగోవిందం అన్న పిలుపు తెలుగువారింట ఎలా వచ్చి చేరాయో ఒక కథలో చెప్తారు.
చాలా పిట్టలు ఎందుకు రంగురంగులలో ఉంటాయో, కోకిల మాత్రం ఎందుకు నలుపు రంగులో ఉంటుందో ఒక కథలో చెబుతారు. ఆనాకర్షకమైన రంగుకి పరిహారంగా శ్రావ్యమైన కంఠం ఇచ్చిన వైనం ఆసక్తిగా చదివిస్తుంది.

తన దురుసు ప్రవర్తనతో ఓ మునిని ఇబ్బంది పెట్టి, మరుసటి జన్మ నుంచి 'వడ్రంగి పిట్ట'గా పుట్టిన ఓ ముసలమ్మ కథ ఆసక్తిదాయకం. వడ్రంగి పిట్టకు దార్వాఘాటము అనే మరో పేరు ఎలా వచ్చిందో ఈ కథ చెబుతుంది.

మేకపోతుకీ, తోడేళ్లకి వైరం ఎలా ఏర్పడిందో ఎసోప్ కథల ఆధారంగా వ్రాసిన ఒక కథ చెబుతుంది.
సాలీడు ఎప్పుడు ఎందుకు అల్లుతూనే ఉంటుందో ఓ కథ చెబుతుంది. గొంతెమ్మ కోరికలకు ఆ పేరు ఎలా
వచ్చిందో మరో కథలో చెబుతారు.

తెలుగువారి “ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం” కథలాంటిదే హిమాచల్ ప్రదేశ్, అస్సాంలో మరో
రూపంలో ఉందని తెలుసుకుని కుందేలు పాత్రధారిగా ఉన్న ఆ కథని చెబుతారు.

తొమ్మిది విధాల మూర్ఖత్వం గురించి ఒక కథలో వివరించి మానవులకు ‘పట్టకార’ ఎలా లభించిందో
చెబుతారు. బద్ధకస్తుడైన తమ ఉపాధ్యాయుడిని తెలివిగా మార్చుకుంటారు పిల్లలు మరో కథలో.

విష్ణువు దర్శనార్థం వైకుంఠానికి విచ్చేసిన ఓ గంధర్వాంగన అందం, పొగరు ఆదిశేషుడిని ఇబ్బంది పెడతాయి.

దర్శనానికి సమయం కాదని శేషువు వారించినా అమె వినకపోవడం… చివరికి ఆమె శాపమివ్వడం
జరుగుతుంది. రామాయణంలో లేని ఈ కథని రచయితకి వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పారట.

వైకుంఠంలోని పాల సముద్రంలోని శంఖం, భూలోకంలో ఉగ్గు గిన్నెగా ఎలా మారిందో చెప్పే కథ బహు చిత్రంగా ఉంటుంది. అకారణంగా జంతువులని చంపిన పాపానికి ముని శాపంలో రూపంలో ప్రకృతి దండన విధిస్తుంది ఓ కథలో.

ఓ కథలో దుస్సల గురించి, జయద్రథుడి గురించి చెబుతూ, ఆకాశవాణి అశరీరీవాణి ఎలా అయిందో
చెబుతారు. యుద్ధంలో కౌరవులు, వారి తరపు వీరులు మరణించిన సందర్భంగా భారతంలో స్త్రీ పర్వంలో
తిక్కన వ్రాసిన పద్యాలను సందర్భోచితంగా ప్రస్తావించారు రచయిత. కాస్త పెద్ద కథ ఇది.

ఆవులు మందలో ఉండకుండా, ఎందుకు విడిగా ఉంటాయో; గొర్రెలు విడిగా కాకుండా ఎప్పుడూ మందలోనే
ఎందుకుంటాయో ఓ కథలో చెబుతారు. భూమంతా ఎగుడుదిగుడుగా ఎలా ఏర్పడిందో ఓ కథలో ఆసక్తికరంగా
చెబుతారు.

బట్టతలకు ‘ఇంద్రలుప్తము’ అనే పదం ప్రత్యామ్నాయం అని తెలిసి, ఆ వివరంతో ఒక కథ రాశారు.
మానవులకు దురదలెలా వచ్చాయో ఓ కథలో చెప్తారు.

వర్తకుడికీ, పనికి కుదిరిన వ్యక్తికీ సమాన న్యాయం చెప్తాడు దారినపోయే దానయ్య ఓ కథలో. కథ పూర్తయ్యాక
పాఠకుల పెదాలపై చిన్న నవ్వు మొలుస్తుంది.

ఓ పెద్ద అడివి, అందులో ఓ భారీ మర్రి చెట్టు. ఆ మర్రిచెట్టు ఎవరికి దగ్గరి చుట్టమో తేల్చుకునేందుకు పక్షులు
జంతువులు పోటీ పడతాయి. చివరికి గబ్బిలం గెలుస్తుంది. హాయిగా చదివిస్తుందీ కథ.

ఓ కథలో – గద్దకి కోడిపిల్లలు ఎందుకు ఆహారం అవుతాయో చెప్పి, అరిచేవాడు ఎప్పుడూ అరుస్తునే
ఉంటాడు, కానీ మౌనంగా ఉండేవాడు ఎప్పుడు అరుస్తాడో, కరుస్తాడో తెలియదు. అందుకని మౌనంగా
ఉన్నవాడిని నమ్మటం మంచిది కాదు పక్షుల ద్వారా చెప్పిస్తారు. పాలినేషియన్ జానపద కథకి
స్వేచ్ఛానుసరణ ఈ కథ.

విధిని, ధర్మాన్ని మోసం చేయాలని చూస్తే, నష్టపోయేది మనమేనని ఒక కథ చెబుతుంది. అనాతపము అన్న
పదం ‘నీడ’ అనే పదానికి ప్రత్యామ్నాయం అని తెలిసి ఆ వివరంతో రాసిన కథ బావుంటుంది.
గబ్బిలం… ‘వాతులి’… ఎందుకు తలక్రిందులుగా వేలాడుతుందో ఓ కథలో చెప్పారు. మందయ్యకి కుడుముల
మందయ్య అని పేరెలా వచ్చిందో ఒక కథ చెబుతుంది.

తన కొడుకుకి విద్య సరిగ్గా నేర్పడంలేదని గురువుగారిని దబాయించాలని వచ్చిన ఓ తండ్రికి తాను గుడిలో
గంటలాంటివాడినని చూపించి అతడి అపోహను తొలగిస్తారు గురువుగారు మరో కథలో.

మనిషి తల విలువ ఏంటో, తలపొగరు దిగిన రాజుకి అర్థమై, అదే వివరాన్ని మంత్రికి అర్థమయ్యేలా చెబుతారు ఓ కథలో. చక్కని కథ.

ధ్యానం కూడా ఋషుల తపస్సు లాంటిదే అని ఓ జమీందారు కథ చెబుతుంది.
తడితో ఎన్ని ఉపయోగాలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని అనుభూతులున్నాయో ఒక కథ చెబుతుంది. చక్కని
భావ వ్యక్తీకరణ.

దేవతలు మనుషులకు అమృతం ఇవ్వలేక, చింతచెట్టు ఇచ్చారని చెబుతూ చింతపండు ప్రాశస్త్యం వివరిస్తారో కథలో.

సూర్యుడిపై ప్రేమ పెంచుకున్న వరుణుడి కూతురు శాపవశాత్తు పొద్దు తిరుగుడు పువ్వుగా జన్మించి
సూర్యూడినే అనుసరిస్తుందోని ఒక కథ చెబుతుంది.

ఇంకా ఎన్నెన్నో కథలు… అనువాదాలు, కవితలు.. పద్యాలు…

చిన్న పిల్లలతో పాటు, పెద్దవాళ్ళని కూడా ఆసక్తిగా చదివింఛే శైలితో మాగంటి వంశీ మోహన్ రచించిన ఈ
పుస్తకం విజ్ఞాననిధి అని చెప్పవచ్చు. విలువైన సమాచారాన్ని చక్కని కథలుగా అల్లి విజ్ఞానదాయకంగా
బాలబాలికలకు అందించారు.

601 పేజీలున్న ఈ పుస్తకం ధర ₹658.
పోతీ.కామ్‌లో “ప్రింట్ ఆన్ డిమాండ్” ద్వారా లభ్యం. భారతదేశంలో ఆర్డర్ ఇవ్వడానికి లింక్:
https://store.pothi.com/book/vamsi-m-maganti-once-upon-time

 

You Might Also Like

One Comment

  1. Prasuna Balantrapu

    its a good review. I am forced to write this in English since I don’t have Telugu script in this laptop. I too read the book and was amazed at his imagination and creativity.

Leave a Reply