Half Lion: Vinay Sitapati

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్

పీవీ నరసింహా రావు గారి శత జయంతి ఉత్సవాలు మొదలు పెట్టినప్పటినుంచి, ఆయనకి సంబంధించిన చాలా సంగతులు వివిధ పత్రికల్లో, బ్లాగుల్లో వస్తున్నాయి. అలా కొన్ని చదువుతుంటే, ‘Half Lion’ అన్న పుస్తకం గురించి తెలిసింది. ఈ పుస్తకం వ్రాసింది శ్రీ వినయ్ సీతాపతి.

ఆన్లైన్లో Kindle edition 285/- రూపాయలకే దొరుకుతుంది.

ఇంతకు ముందు పీవీ గారే రచించిన ‘లోపలి మనిషి ‘ చదివాను. కానీ ఆ పుస్తకం పూర్తిగా ఆత్మకథ కాదు. ‘ఆనంద్ ‘ అనే ఒక పాత్ర ద్వారా తన అనుభవాలని చెప్పించారు. పైగా ఆ పుస్తకం తన బాల్యం ఉంచి మొదలయ్యి ప్రధాన మంత్రి పదవి చేపట్టడం వరకే వుంటుంది. ఆ తరువాత జరిగిన పరిణామాలు అందులో వుండవు.

‘Half Lion’ పుస్తకం గురించి తెలిసాక, పుస్తకం కొనడానికంటే ముందు మరికొంత సమాచారం కోసం చూస్తుంటే, యూట్యూబ్ లో ఈ పుస్తక రచయిత యొక్క వీడియో ఒక్కటి కనిపించింది. అందులో ఈ పుస్తకం లోని ముఖ్యాంశాల మీద వివరణ, తర్వాత పీవీ గారితో పరిచయం వున్న కొంతమంది వ్యక్తులతో కలిసి ఒక చిన్న చర్చా కార్యక్రమం వుంది. అది చూసాక ఈ పుస్తకం కొన్నాను. ఆ వీడియో లింక్ కింద ఇస్తున్నాను.  https://www.youtube.com/watch?v=S_Q7xWKyXVo

 

‘ఆత్మకథ’ లో లేక జీవిత చరిత్ర లో వ్రాసేటప్పుడు, కొంత ఆత్మ స్తుతి, పర నింద అనేవి సాధారణంగా  వుంటాయి. కొన్ని సార్లు నిజాలు కూడా స్తుతి లాగే అనిపించే  ప్రమాదం వుంది. అయితే  అలాంటి పరిస్థితి ఈ పుస్తకం లో కనిపించలేదు. ఈ పుస్తకంలోనే ఒక చోట రచయిత చెప్పినట్టు, అవసరమైన చోట ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారించుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ విషయాన్ని ఒకరి కంటె ఎక్కువ మందితో చర్చించి, సరిచూసుకున్న తర్వాతే వ్రాయడం, అలాగే ప్రతీ ముఖ్యమైన వాదన కి తగిన రెఫరెన్సు లని ఇవ్వడం వలన, ఈ పుస్తకం యొక్క విశ్వసనీయత ఎక్కువగానే అనిపించింది.

 

మొత్తం పదిహేను చాప్టర్లు గా విభజించబడిన ఈ పుస్తకం, పీవీ గారి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాల చుట్టూ తిరుగుతూ, పీవీ గారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. ఈ పుస్తకాన్ని ఒక పూర్తి బయోగ్రఫి గా పరిగణించలేము, కానీ రచయిత చెప్పదలచుకున్న విషయానుసారం, పీవీ గారి బాల్యం నుంచి మరణం వరకూ జరిగిన సంఘటనలను అవసరం మేరకు చెప్పారు.

 

మనకు పరిచయం లేని మనిషి మీద మనకి అకారణ ప్రేమ లేదా ద్వేషం కలగడానికి ఒక కారణం, మనం వారి గురించి ఇతరులు చెప్పగా విన్నదీ, లేక చదివినదీ అయి వుంటుంది. ఈ పుస్తకం పీవీ గారి గురించే కాబట్టి, సహజంగా ఆయన గురించిన మంచే ఎక్కువగా చెప్పి వుంటారు అనుకుంటాం. కానీ ఇందులో, ఆయన చేసిన మంచి తో పాటు ఆయన్ చేసిన పొరపాట్ల ని కూడా చెప్పారు. కానీ జరిగిన పొరపాట్లని, జరిగిన మంచి తో పోల్చి, ఏది మంచిదో మనకే వదిలేసారు.

 

పీవీ గారి వ్యక్తిత్వం చాలా కాంప్లెక్స్ గా అనిపించేలా వున్నా, మొత్తం చదివేసరికి, తను కూడా ఒక మామూలు మనిషే కదా అనిపిస్తుంది. ఎన్నో పవర్ సెంటర్ల తో నిండి వున్న ఒక జాతీయ పార్టీ లో, సొంత అజెండా లేకుండా వుండటమే ఆయనకు గొప్ప పదవులు తెచ్చి పెట్టింది. ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పుడైనా,   ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నప్పుడైనా, దానికి ముఖ్య కారణం ఆయన్ని ఎవరూ ప్రత్యర్థిగా భావించకపోవటం. అతి క్లిష్ట పరిస్తితులలో, ఒక మైనారిటీ గవర్నమెంట్లో ప్రధాన మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిననాడు, ఎవరూ అనుకొలేదు ఆయన తన టర్మ్ పూర్తి చేసుకుంటారని. ఎన్నో యేళ్ళ అనుభవం, ఎన్నో అంతర్గత సంఘర్షణల పోరు ఫలితం,  ఆయన పదవిని చేపట్టాక, పాలన లో తన ముద్రను వేయడానికి ఉపయోగ పడ్డాయి.

 

మొదట ఈ పుస్తకం టైటిల్ కొంచం చిరాకుగా అనిపించింది. కానీ ఈ పుస్తకంలో చెప్పినట్టు, పీవీ గారు నర / సింహం లా వ్యవహరించడం వల్లనే ఆయన చాలా సాధించగలిగారు అన్న జస్టిఫికేషన్ సంత్రుప్తి పరిచింది. ఎక్కడ అవసరమో అక్కడ, ఒక సాధారణ మనిషి లా సర్దుకుపోయి, తగ్గకూడని చోట తన బలాన్ని ఉపయొగించటం వల్లే మొట్టమొదటి సారి ఒక మైనారిటీ గవర్నమెంట్ లో వుండి కూడా పూర్తి కాలం పాలించగలిగారు. తను అనుకున్నది సాధించటానికి ఏం చేయాలో అది చేసారు. ఒక విధంగా చూస్తే ఈగో లేనట్టు కనపడుతూనే, తన ఈగో ని సంత్రుప్తిపరచుకోగలిగే వారు అనిపించింది.

 

ఆర్థిక సంస్కరణలు పీవీ గారి హయాం లోవే అన్న విషయం ఎప్పటినుంచో విన్నదే. కానీ మొదటి సారి, ఆధునిక న్యూక్లియర్ ప్రోగ్రాం కి కూడా ఆద్యులు వారే అన్న విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది.

 

ఆర్థిక సంస్కరణలు, న్యూక్లియర్ ప్రోగ్రాం, చైనా, అమెరికా, ఇజ్రాయేల్ మరియు ఇతర ఆసియా దేశాలతో దౌత్య సంబందాల వృద్ది ఇలాంటివన్నీ పీవీ గారి విజయాలు కాగా, బాబ్రి మసీదు కూల్చివేత, జే.ఎం.ఎం. ముడుపుల కేసు, హవాలా కుంబకోణం ఇలాంటివి పీవీ గారి పాలనలో ఎదుర్కొన్న వైఫల్యాలు.  ఈ విషయాలకు సంబంధించి కోర్టులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినా, అ మరకలు మాత్రం పోలేదు. ఆయన ప్రభుత్వం సాధించిన విజయాలను అందరూ అనుభవిస్తున్నా, వైఫల్యాలను మాత్రం తనవిగా మిగిలిపోయాయి.

 

పుస్తకం మొత్తంలో అర్థం కాని విషయం ఏమిటంటే, సోనియా గాంధీ గారికి, పీవీ గారికి మధ్య అంతగా అంతరం ఎందుకు పెరిగింది అనేది. పుస్తకం లో వ్రాసిన దాని ప్రకారం, పీవీ గారి మరణానికి కొద్ది రోజుల ముందు కూడా,  సోనియా గాంధీ గారు హాస్పిటల్  కి వచ్చి, తెల్లవారు ఝాము న 2.15 వరకూ వారితో వున్నారు. అలాంటిది పీవీ గారు చనిపోగానే, అసలు తను కాంగ్రెస్ వ్యక్తి కాదు అన్నంతగా తనను వదిలించుకోవాలనుకోవటానికి సరైన కారణం సరిగ్గా తెలీదు.

 

ఈ పుస్తకంలోనే చెప్పినట్టు, అన్ని ఘన విజయాలూ కేవలం పీవీ గారికి వ్యక్తిగతంగా ఆపాదించటం ఇష్టం లేకపోయినా, ఒక సరైన సమయంలో, సరైన చోట, సరైన పదవిలో వుండడం వలన ఆయన చేసిన పనులకున్న చారిత్రక విశిష్టతనైనా సరిగ్గా గుర్తించకపోవటం మన తప్పు.

 

ఆ కాలం లో జరిగిన చాలా విషయాలు ఈ పుస్తకంలో వున్నాయి. పీవీ గారి అఫిషియల్ మీటింగ్ డైరీ, వారి వ్యక్తిగత నోట్స్, వుండటం వలన చాలా విషయాలు, గంటలు నిమిషాల లతో సహా తెలుసుకోవడం కుదిరింది. కానీ అలా ఎక్కువ ఇంఫర్మేషన్ చెప్పటం కూడా, కథా గమనంలో అక్కడక్కడా కొద్దిగా అడ్డుగా అనిపించింది.

 

పీవీ గారి గురించి మరియు భారత దేశ చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్య మార్పులని గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం నచ్చుతుంది. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాకుండా, ఒక మంచి బయోగ్రఫి పుస్తకానికి వుండే లక్షణాలను తెలుసుకోవడానికి ఒక మంచి రెఫరెన్సు లా కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. పీవీ గారి శత జయంతి సంవత్సరం లో ఆయన గురించి ఎంతో కొంత తెలుసుకోవడం ఈ పుస్తకం నాకిచ్చిన బోనస్.

You Might Also Like

One Comment

  1. leol

    మంచి పరిచయం. ఈ పుస్తకం చదవాలని చాన్నాళ్ళుగా అనుకుంటున్నాను.

Leave a Reply