రుడాలి : మహాశ్వేతా దేవి

వ్యాసకర్త: భారతి కోడె

(ఇది ఫేస్‌బుక్ లో “నవలా స్రవంతి”లో భాగంగా లైవ్‌లో పరిచయం చేసిన వీడియోకి పూర్తి పాఠం.)

మహాశ్వేతా దేవి పరిచయం అవసరం లేని రచయిత్రి. సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ్ అవార్డ్ పొందిన రచయిత్రిని, నిర్వాసిత గిరిజన తెగల కోసం కృషి చేసినందుకు పద్మవిభూషణ్, రామన్ మెగసెసే అవార్డు పొందిన రచయిత్రిని పరిచయం చేయడం అంటే సూర్యుడికి దివిటీ పట్టడమే. అయినా ఎవరైనా తెలియని వారు ఉన్నట్లయితే వారికోసం క్లుప్తంగా పరిచయం చేస్తాను.

 

  • మహాశ్వేతా 1926 జనవరి 14 ఢాకాలో జన్మించారు.
  • తండ్రి మనీష్ ఘాటక్ కవి, నవలా రచయిత
  • తల్లి ధరిత్రీ దేవి కూడా రచయిత, సామాజిక కార్యకర్త
  • రవీంద్రుని విశ్వ భారతి యూనివర్సిటీ లో చదువుకున్నారు
  • వీరందరి ప్రభావం ఆమె మీద ఎంతో ఉంది
  • ఆమె మొదటి నవల ఝాన్సీ రాణి 1956 లో ప్రచురించబడింది
  • వందకు పైగా నవలలు, ఇరవై పైగా కథా సంకలనాలు రచించారు
  • ఆమె రచనల ఆధారంగా రుడాలి, హజార్ చౌరాసి కి మా అని రెండు సినిమాలు వచ్చాయి.
  • ఆదివాసీలు, దళితులు, స్త్రీల సమస్యలపై ఎంతో కృషి చేశారు
  • అనేక మారుమూల గిరిజన ప్రాంతాలలో విస్తృతంగా తిరిగారు

 

ఆమె రచనలన్నీ దాదాపుగా స్వయంగా పరిశోధించి, తెలుసుకుని రాసినవే. సాక్ష్యాధారాలున్న వాస్తవిక సమాచారాన్నే నమ్ముతాను నేను అంటారు మహాశ్వేతనా రచన చదివిన తర్వాత పాఠకుడు యదార్ధ సత్యాలను ఆకళింపు చేసుకోవాలి. సమాజపు అసలు రూపు చూసి సిగ్గుతో పరితపించాలి” అని అంటారు ఆమె. అలా చదివే పాఠకుడిని కూడా సత్యం వైపు నడిపించి సిగ్గుపడేలా చేసే కొన్ని శక్తివంతమైన కధల సంకలనమే నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్న రుడాలి. దీనిని సూరంపూడి కామేశ్వరి గారి సంపాదకత్వంలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించారు. మొత్తం ఐదు కథలు ఉన్నాయి


ఐదు కూడా అద్భుతమైన కథలే. మహాశ్వేత కథల గురించి పరిచయం చేస్తూ ఇవన్నీ దాదాపు 1980 ప్రాంతంలో గిరిజనులపై ఉన్నత వర్గాల దోపిడీని నయవంచనని ప్రత్యక్షంగా చూసి ఆగ్రహంతో అక్షరబద్ధం చేసిన రచనలు అని చెప్తారు. ఆగ్రహం, అన్యాయంగా దోపిడీకి గురవుతున్న వారిపట్ల ఆమెకి ఉన్న కన్సర్న్, బాధ అన్నీ ప్రతి వాక్యంలో కనిపిస్తాయి కథలలో. దానితో పాటు ఇవన్నీ పరిశోధనాత్మక రచనలు కాబట్టి కావొచ్చు కొంత జర్నలిస్టిక్ ఫ్లేవర్ కూడా కనిపిస్తుంది.


బీహార్ లోని అంటే ఇప్పటి ఝార్ఖండ్ లోని పలాము రిజర్వు ఫారెస్ట్ ప్రాంతానికి సంబంధించిన కధలు ఇవన్నీ. కథల నేపధ్యాన్ని వివరించే పరిచయంలో పలాము భారతదేశానికి ప్రతిబింబంఅంటారు మహాశ్వేత. ఇక్కడ ప్రతిదీ ఉన్నత వర్గాల ప్రయోజనాలకొరకే ఉద్దేశించబడి ఉంటుంది. ఒక్క వాక్యం చాలు పలాము భారతదేశానికి ప్రతిబింబం అని ఆమె ఎందుకన్నారో అర్ధం చేసుకోవడానికి. అద్భుతమైన ఐదు కథలలోనుండి నేను పరిచయం చేయడానికి ఎన్నుకున్నది ఉప్పు అనే కథను


చేత్తో కాదు. తిండితో కాదు. ఉప్పుతో మిమ్మల్ని దెబ్బ కొడతా. ఉప్పుతోనే మిమ్మల్ని చంపేస్తాఅన్నాడు ఉత్తమచంద్ అనే వాక్యంతో ప్రారంభమవుతుంది కథ. రోజుకి కూడా అత్యంత చవకగా దొరికే నిత్యావసరం ఉప్పే. అటువంటి ఉప్పు ఎలా దోపిడీకి సాధనమయిందో వివరిస్తుందో కథ.


ఉప్పుతోనే మిమ్మల్ని చంపేస్తా అన్న ఉత్తమచంద్ ఒక వ్యాపారి. ప్రాంతంలో ప్రజలకు వడ్డీలకు అప్పులు ఇచ్చే వ్యాపారి కూడా అతనే. పలాము రిజర్వు ఫారెస్ట్ లో వొరాన్, కోల్ తెగల ఆదివాసీలు అధికంగా ఉండే ఝఝర్ అనే ప్రాంతాన్ని అతని కుటుంబమే తరతరాలుగా ఏలుతుంది.


ఉత్తమచంద్ తాత ముత్తాతల్లో ఒకరు అక్కడి సారవంతమైన అటవీ భూములన్నీ కొనేసాడు. లెక్కలు, దస్తావేజులు, పట్టాలు, చట్టాల విషయంలో ఇప్పుడెంత జాగ్రత్తగా ఉన్నారో అప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉన్నారు ఆదివాసీలు. కాబట్టి అసలు భూములు ఎప్పటి వరకు తమ ఆధీనంలో ఉండేవో, తమ కష్టంతో పండించిన పంటను ఎప్పుడైనా ఇంటికి తెచ్చుకున్నారో లేదో కూడా వాళ్ళకి తెలియదు


తమ తాత ముత్తాతల అప్పులు తీర్చడం కోసం వారంతా ఉత్తమచంద్ పొలాల్లో జీతంలేని చాకిరీ చేస్తారు. వాళ్ళకి దొరికేది కేవలం ఒక పూట తిండి, గుప్పెడు గింజలు. పంటలో వాళ్ళకి రావాల్సిన వాటా ఉత్తమచంద్ ఖాతా పుస్తకంలో అప్పుల కింద జమ అయిపోతుంది. అసలు అలా వెట్టి చాకిరీ చేయడం చట్ట విరుద్ధం అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఆదివాసీ కార్యాలయం ఇన్స్పెక్టర్ పుణ్యమా అని వాళ్ళకీ విషయం తెలిసింది. అయినా వాళ్ళు వెట్టి చాకిరీ ఆపలేదు. అతనిని కోర్ట్ కి లాగడం అసాధ్యం అని వాళ్ళకి తెలుసు. దానికోసం డాల్టన్ గంజ్ పట్టణానికి వెళ్ళడం, లాయర్ ని పెట్టుకోవడం వాళ్ళ వలన అయ్యే పని కాదు. ఆదివాసీ సంక్షేమ కార్యాలయం కూడా ఆదివాసీలకు అందుబాటులో లేదు. అదెక్కడో పట్నం లో ఉంది.

 

ఝఝర్ పల్లె మొత్తం పదిహేడు కుటుంబాలు, 86 మంది జనాభా ఉన్న చిన్న ఊరు. కాలిబాట తప్ప మరో దారిలేదు ఊరికి వెళ్లాలంటే. అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడవ సారి ఎన్నికలు జరిగే వరకు కూడా వీళ్ళు అసలు ఓటు కూడా వేయలేదు. నాలుగో ఎన్నికలప్పుడు నుండి ఓటు వేయడం మొదలుపెడతారు. అది కూడా ఒకసారి. తర్వాత ఉత్తమచంద్ అంటాడు కదా. ఓటు వేయడం కోసం మీరు అంత దూరం ఏమి వెళ్తారు. మీరు అంతా తలా రూపాయి తీసుకోండి. నేను వేసేస్తాలే అని. ఇక అప్పటి నుండి అదే తతంగం నడుస్తుంది.

 

అయితే 1977 లో ఊరికి దగ్గరలోని ప్రైమరీ స్కూల్ లో టీచర్ గా వచ్చిన బాల కిషన్ సింగ్ వాళ్ళకి ఓటు విలువ చెబుతాడు. అతను ఎంతో కృషి చేసి వాళ్ళ ఊరిలో బావి తవ్వించే ఏర్పాటు చేస్తాడు. అంతకు ముందు ఎంతో దూరంలో ఉన్న నది నుండి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు. ఊరి నుండి ముగ్గురు పిల్లలను బడిలో కూడా చేర్పిస్తాడు. పిల్లలే ఊరిలో ఫస్ట్ జనరేషన్ learners. దానితో అతని మాట మీద గురి కుదిరి వాళ్ళు ఓటు వేస్తారు. అప్పుడు ఉత్తమ్ చంద్ కి మొదటి సారి వాళ్ళ మీద కోపం వస్తుంది.


ఎన్నికలు జరిగిన కొన్నాళ్ళకు ఒక యువజన దళం వాళ్ళ ఊరికి వస్తుంది. వెట్టి చాకిరీ చేస్తున్న కుటుంబాల వివరాలు తీసుకుంటారు వాళ్ళు. ఊరిలో కాస్త గట్టిగా మాట్లాడగలిగిన వ్యక్తి పుర్తి ముండా ఒక్కడే. ఊరి మొత్తంలో అతనొక్కడే రాంచి, ధన్బాద్ లాంటి పట్టణాలకు వెళ్ళి కూలీ పని చేసిన వచ్చినవాడు. ఎక్కడికి వెళ్లినా తన పరిస్థితి ఏమీ మారలేదని అతను బయట ప్రపంచం మీద ఉమ్మేసి మళ్ళీ తన ఊరికి తిరిగి వచ్చేస్తాడు

 

కథ మళ్ళీ చదువుతున్నప్పుడు వాక్యం దగ్గరికి రాగానే మొన్న lockdown సమయం లో ఎన్నో ఇబ్బందులు పడి సొంత ఊర్లకి తిరిగి వెళ్ళిన వలస కార్మికులు అంతా గుర్తువచ్చారు. వారిలో ఎంతమంది పుర్తీ ముండా లాగా మన నాగరిక సమాజం మీద ఉమ్మేసి తిరిగి వెళ్ళారో కదా అనిపించింది.

 

మన కథలోకి తిరిగి వస్తే ఝఝర్ కి వచ్చిన యువజన సంఘం సభ్యులు పుర్తి ని వెంటబెట్టుకుని ఉత్తమచంద్ దగ్గరకి వెళ్ళి వెట్టి చాకిరీ చట్ట విరుద్ధం, ఇక నుండి వీళ్ళు చేయరు, నువ్వు బలవంతంగా చేయిస్తే మేము చట్ట ప్రకారం చేయాల్సింది చేస్తాం అని బెదిరిస్తారు


పండిన పంటలో సగం వాళ్ళకి ఇవ్వాలని షరతు పెడతారు. తాను చేస్తుంది చట్ట విరుద్ధం అని తెలుసు కాబట్టి ఉత్తమ్ చంద్ అన్నిటికి మౌనంగా సరే అని ఒప్పుకుంటాడు. తిరిగి ఊరికి వెళ్ళేటప్పుడు పుర్తి కుర్రవాళ్ళని రెండు రూపాయలివ్వండి. కాస్త కల్లు తాగుతాం అని అడుగుతాడు. వాళ్ళు ఇదిగో తాగుడే మిమ్మల్ని నాశనం చేస్తుంది. ముందు ఇది మానేయండి అని చెప్పి వెళ్ళిపోతారు


వాళ్ళు వెళ్ళిపోయాక పూర్తీ తన దగ్గర ఉన్న డబ్బులతో కల్లు కొనుక్కుంటూనాశనం చేస్తుందట. బాబులకేమి తెలుసు. ఇది తాగకపోతే మా పొట్టలో అగ్గిలా మండే ఆకలిని ఇంకెలా మర్చిపోగలంఅనుకుంటాడు.


అటువైపు ఉత్తమ్ చంద్ కోపంతో రగిలిపోతుంటాడు. వీళ్ళని ఉప్పుతోనే చంపేస్తా అంటాడు. అటువంటి ఒక పొగరుబోతు ప్రకటన అతను మాత్రమే చేయగలడు. చుట్టుపక్కల ఆదివాసీ సంతలలో అంగళ్ళన్నీ అతనివే


ఇన్నేళ్ళ నుంచి వీళ్ళకి తిండి పెడుతున్నాను. నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తారా. వీళ్ళకి ఉప్పు అమ్మను. ఉప్పు లేని గంజి రుచి ఎలా ఉంటుందో తెలిసొస్తుంది అనుకుంటాడు.

 

మొదట్లో ఆదివాసీలు పట్టించుకోరు కానీ రాను రాను భరించలేని స్థితి ఏర్పడటంతో పుర్తి ఇంకొంతమందితో కలిసి పట్టణానికి పరిగెత్తి యువజన సంఘం వాళ్ళని కలుసుకుని విషయం చెబుతాడు. కానీ తాము తినే గంజికి రుచి ఇచ్చేది ఉప్పు మాత్రమే అని వాళ్ళకి అర్ధం ఎలా చెప్పలేకపోతాడు. అతను ఉప్పు అమ్మకపోతే మేమేమి చేయగలం. మాకింకా చాలా సమస్యలు ఉన్నాయి అంటారు వాళ్ళు.


చేసేదేమి లేక తాము తెచ్చుకున్న డబ్బుతో పది కిలోల ఉప్పు కొని పద్దెనిమిది మైళ్ళు నడిచి ఊరికి తీసుకువెళ్లి అన్ని ఇళ్ళకి పంచిపెట్టి జాగ్రత్తగా వాడుకోమని చెబుతారు. అయితే పది కిలోల ఉప్పు అనంతము కాదు, శాశ్వతము కాదు.

 

సారి పూర్తీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ పట్టుకుని మాకు ఏదో ఒక పని ఇవ్వండి. కూలీ ఇవ్వక్కర్లేదు. ఉప్పు ఇవ్వండి చాలు అంటాడు. అతనికేమీ అర్ధం కాదు. ఉప్పు కోసం పని చేస్తాం అంటారేంటి అని అతనికి అనుమానం వస్తుంది. వీళ్లంతా పని చేసేది ఉత్తమచంద్ దగ్గర. వీళ్ళకి ఏమైనా అవసరమైతే కొనుక్కునేది ఉత్తమచంద్ దగ్గర. కాబట్టి అతనినే అడిగి చూద్దాం అనుకుంటాడు. వీళ్ళేదో యువజన సంఘంతో కలిసి ఉత్తమచంద్ ని ఎదిరించారు అని తెలిసి ఎందుకొచ్చిన రిస్క్ అని పని ఇవ్వడు.


ఇక ఊరిలో అందరూ కలిసి పుర్తిని తిట్టడం మొదలు పెడతారు. నీ వల్లే ఇదంతా. వాళ్ళు చెప్పాగానే వెళ్ళి ఉత్తమచంద్ ను ఎదిరించావు. ఇప్పుడు ఉప్పెక్కడ నుండి తెస్తావు అని. నేను వెళ్ళి ఉండకపోతే మనకు వెట్టి చాకిరీ పోయేదా, పంటలో వాటా వచ్చేదా అని అడుగుతాడు పుర్తి. నిజానికి ఏడాది వాళ్ళ వాటాకి వచ్చిన పంటని కూడా కొన్ని గుప్పిళ్ళ ఉప్పుకు మారకం చేసేసి ఉంటారు


వాళ్ళు లాభ నష్టాలన్నీ బేరీజు వేసి చూసుకుంటే మురికి పట్టిన ఉప్పు పెళ్లలు ఎక్కువ బరువుగా కనిపిస్తాయి వాళ్ళకి. వెట్టిచాకిరీ, పంట వాటా చాలా తేలికగా కనిపిస్తాయి

 

మనం కూడా చాలా సందర్భాలలో పేదవాళ్ళని చూసి అత్యంత దుర్భర పరిస్థితులలో కూడా ఎందుకు ఎదురు తిరగరు? ప్రశ్నించరు? అని కొంచెం విసుగు పడతాం కదా. దానిని అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడే ఒక సందర్భం ఇది. నేను ముందు ప్రస్తావించినట్లు పలామూ లో నే కాదు దేశంలో ఎక్కడైనా వ్యవస్థలోని ప్రతి అంశము ఉన్నత వర్గాల ప్రయోజనం కోసమే ఉద్దేశించబడి ఉంటుంది. పేదలు, నిస్సహాయ వర్గాల వారు తమను దోపిడీ చేస్తున్న వ్యక్తులపై పోరాటం చేయడం అంటే దోపిడీకి అనుకూలంగా ఉన్న, దోపిడీని facilitate చేస్తున్న వ్యవస్థపై పోరాటం చేయడమే. అందుకు తగిన శక్తి, సమయం, వనరులు వారికి ఉండే అవకాశమే లేదు. అందుకే ప్రశ్నించడం మానుకుని జరిగేదేదో అనుభవించడానికి అలవాటు పడిపోయి ఉంటారు అనుకుంటాను నేను.


మళ్ళీ మన కథలోకి వస్తే పుర్తి ఒక సందర్భంలో ఫారెస్ట్ గార్డ్ కి కోళ్లు ఇచ్చి దానికి బదులుగా ఉప్పు తెచ్చుకునేందుకు వెళ్తాడు. అప్పుడు ఫారెస్ట్ గార్డ్ ద్వారా అతనికి ఒక విషయం తెలుస్తుంది. ఏనుగులు, జింకల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడవిలో అక్కడక్కడా నల్ల ఉప్పు పెడతారు అని. అవి ఎక్కడ పెడతారు, ఎప్పుడు, ఏనుగులు ఉప్పు చప్పరించే ప్రదేశాలను కనుక్కోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు అతను.

 

మరోవైపు వీళ్ళని ఎవరైతే ఉత్తమచంద్ పై ఎదురు తిరగమని ప్రోత్సహించారో యువజన సంఘం సభ్యులు వీళ్ళని పూర్తిగా మర్చిపోలేదు. వాళ్ళల్లో ఒక యువకుడు ఒక మెడికల్ representative ని పట్టుకుని అసలు మనిషి శరీరానికి ఉప్పు విధంగా అవసరం అని అడుగుతాడు. అతనేదో సైన్స్ అంతా చెబుతాడు కానీ వాళ్ళకి అర్ధం కాక అలాకాదోయి ఉప్పు తినకపోతే నష్టం ఏంటో చెప్పు అని అడుగుతారు


నష్టమా, ఎక్కువ కాలరీలుండే ఆహారం తినేవాళ్లు ఉప్పు తక్కువ తిన్నా పర్లేదు అంటాడు అతను.

 

అరే! అసలు కాలరీలతో సంబంధమే లేని మనుషులున్నారోయ్ అంటాడు యువకుడు!

 

అవును మన దేశంలో జనాలకి మంచి ఆహారపు అలవాట్లు లేవు అంటాడు representative!

 

డాల్టన్ గంజ్ లో వీళ్ళద్దరు ఎక్కడైతే కూర్చుని మాట్లాడుకుంటున్నారో టీ దుకాణం ఝఝర్ కి లక్షలాది మైళ్ళ దూరంలో ఏమీ లేదు. కానీ రెండు స్థలాలు రెండు వేర్వేరు నక్షత్ర మండలాల్లో ఉన్నట్లున్నాయి. కుర్రవాడికి ఆదివాసీల సమస్యని అర్ధం చేయించడమంటే గాల్లో నుండి అద్భుత వస్తువులని సృష్టించడం లాంటిదే.


చివరకి మెడికల్ representative అడుగుతాడు. ఉప్పు తినని మనుషులా? ఎందుకు తినరు అని
వాళ్ళకి దొరకదు అంటాడు కుర్రవాడు.

 

అదొట్టి కట్టుకథ. ఉప్పే కదా చవకగా దొరికే వస్తువు.

 

అరే, ధర సంగతి కాదు. వాళ్ళకి అమ్మట్లేదు.

 

ఎందుకు అమ్మరు? వాళ్ళు అబద్దాలు చెబుతున్నారు అంటాడు representative. 

 

ఇలా కొంత సేపు సంభాషణ జరిగాక చివరికి అతను చెబుతాడు. ఉప్పు శరీరంలోని ద్రవాలను, రక్తాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అది తినకపోతే రక్తానికి గడ్డ కట్టే గుణం పెరిగిపోయి బ్లడ్ ని pump చేయడం గుండెకి కష్టమయిపోతుంది. శరీరంలో అన్ని అవయవాల మీద ఒత్తిడి పెరిగి క్రమంగా నీరసించి శరీరం శిధిలమయిపోతుంది అని చెబుతాడు.

 

అంతా విన్న కుర్రవాడికి ఇది రుచికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు, దానికి మించినది అని అర్ధమయ్యి ఉత్తమ్ చంద్ దగ్గరకి వెళ్ళి అడుగుతాడు. అతను చాలా సింపుల్ గా నేను అసలు ఉప్పు అమ్మే వ్యాపారమే మానేసాను, దానిలో లాభం లేదు. అయినా వేరే దుకాణాల్లో వాళ్ళకి అమ్మలేదా. అబద్దాలు చెబుతున్నారు అనేస్తాడు. కుర్రవాడు తాను చేయగలిగిందేమీ లేక తిరిగి వెళ్ళిపోతాడు.


మరోపక్క పుర్తి కొంతమంది కుర్రవాళ్ళని వెంటపెట్టుకుని ఏనుగుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉప్పు పెడుతున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఏనుగులు గుంపుగా తిరిగేటప్పుడు వాటి కంట పడటం ప్రమాదం కాబట్టి చెట్ల కొమ్మల పైన నక్కి పడుకుని అవి ఎటు వెళ్తున్నాయో గమనించి మొత్తానికి నల్ల ఉప్పు ఉన్న ప్రదేశాలు తెలుసుకుంటారు


అయితే ప్రయత్నంలో వాళ్ళు ఇంకో విషయం కూడా గమనిస్తారు. ఏనుగుల మంద వచ్చే సమయానికి అటు ఇటుగా ఇంకొక ఒంటరి ఏనుగు కూడా తిరుగుతుంటుంది. దాన్ని ఎకోవా అని కనిపెడతారు వీళ్ళు. ఎకోవా అనేది మంద నుండి వెళ్లగొట్టబడిన ఏనుగు. ఏదో ఒక కుర్ర ఏనుగు మందకి నాయకత్వం కోసం దీనిని వెళ్లగొట్టి ఉంటుంది. దానితో ఏనుగు ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ తిరుగుతుంది. చాలా వైల్డ్ గా ప్రవర్తిస్తుంది కాబట్టి దానికి ఎవరూ ఎదురు పడే సాహసం చేయరు


ఏనుగుల మంద మీద కోపంతో ఎకోవా ఉప్పు మీద మూత్రం పోసి వెళ్లడం కూడా గమనిస్తారు పుర్తి, అతని స్నేహితులు ఇద్దరు. మనుషుల కంట, ఏనుగుల కంట, ఎకోవా కంట పడకుండా ఎలాగోలా ఉప్పుని దొంగిలించడం మొదలు పెడతారు.

 

అయితే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎకోవాకి ఉప్పు ని ఎవరో దొంగిలిస్తున్న సంగతి అర్థమయిపోతుంది. నిజానికి కొన్ని రోజులయేసరికి పుర్తి వాళ్ళు కొంచం అజాగ్రత్తగానే ఉంటారు. అంత పెద్ద ఏనుగు వస్తుంటే తెలియకుండా ఉంటుందా. అది వచ్చేటప్పుడు శబ్దం గమనించుకుని పారిపోవొచ్చులే అనుకుని అంత జాగ్రత్త తీసుకోరు. అయితే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు అంత పెద్ద జంతువు కూడా సీతాకోక చిలుకలా అసలు చప్పుడు లేకుండా వచ్చేస్తుందని తెలుసుకోలేకపోతారు వాళ్ళు. అది ఎక్కడో మాటు వేసి వీళ్ళని చూస్తుంది. వీళ్ళు ఝఝర్ వాళ్ళని కూడా కనిపెడుతుంది. ఒకరోజు ఊరిలోకి కూడా వెళ్తుంది. అందరు ఇళ్లల్లోకి పరిగెత్తి దాక్కుంటారు.


ఊరిపెద్ద ఎకోవా మీ సంగతి కనిపెట్టినట్లుంది. కొన్నాళ్ళు ఉప్పు కోసం వెళ్ళకండి అంటాడు. దానితో పుర్తి, అతని స్నేహితులు కొన్ని రోజులు ఉప్పు దొంగతనం మానుకుంటారు. కొన్ని రోజులకి అంతా సద్దు మణుగుతుంది. ఎకోవా కూడా ఎక్కువగా కనిపించడం మానేస్తుంది. అయితే నిజానికి అదేమీ వీళ్ళని మర్చిపోలేదు. నది దగ్గర వెదురు పొదల్లో ఉండి వీళ్ళని గమనిస్తూనే ఉంటుంది.

 

 
ఇక్కడ ఎకోవా ఇలా అనుకుంటుంది అన్నట్లు రచయిత్రి కొన్ని మాటలు అంటారు. మనిషి ప్రధానంగా హేతు విరుద్ధంగా ప్రవర్తించే ప్రాణి అని ఎకోవా గ్రహిస్తున్నట్లుంది. ఉప్పు మట్టి కాజేసి ఎకోవకి కోపం తెప్పించడం అహేతుకమైనది. అలా చేయకుండా ఉండడం సహేతుకమైన పని. కానీ మనిషి హేతుబద్ధమైన పనులను ఎంతో కాలం చేస్తూ ఉండలేడు. ఇది చాలా ఇంటరెస్టింగ్ observation అనిపించింది నాకు.

 

ఎకోవా అనుకున్నట్లుగానే వాళ్ళు హేతువుకి విరుద్ధంగా మళ్ళీ ఉప్పు దొంగతనానికి బయలు దేరుతారు. వాళ్ళు వెళ్ళగానే ఎకోవా కదిలింది. ఎలా అంటే ఎండుటాకుల మీద నడిచేటప్పుడు కూడా దాని అడుగుల చప్పుడు వినపడకుండా చీమ లాగా కదిలింది. మౌనంగా చడీ చప్పుడు లేకుండా వెళ్లి వాళ్ళ మీద దాడి చేస్తుంది. పుర్తి, అతని స్నేహితుల అరుపులు వినే వారెవరు లేరు అక్కడ. అసలు అక్కడేమి జరిగింది ఎలా జరిగింది అనే విషయంపై వాళ్ళేమి చెప్పేవారో కానీ, చితికిపోయి నలిగిపోయి ఉన్న మానవ శరీరాలు ఇక సాక్ష్యం చెప్పే అవకాశం లేదు. మనుషులను చంపినందుకు ఎకోవా ని క్రూరమృగం గా ప్రకటిస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఒక కిరాయి వేటగాడు దానిని కాల్చేస్తాడు.

 

పుర్తి అతని సహచరుల మరణంపై ఎంక్వయిరీ చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ ఉప్పు మట్టిని దొంగిలించడానికి వచ్చి చనిపోయారా? అని అదే ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి అసలు ప్రవర్తన ఇంతకీ అంతుబట్టదు. వాళ్ళు జంతువులకు పెట్టిన మురికి పట్టిన నల్ల ఉప్పు పెళ్లలను దొంగిలించడం, ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకోవడం హేతువుకీ అందకుండా ఉంటుంది అతనికి.


చివరకి అతను వాళ్ళు తప్ప తాగి ఉంటారు అనే conclusion కి వస్తాడు. అలా తాగి ఉండకపోతే అంత తెలివి లేని పని ఎలా చేస్తారు అనేది అతనికి కొంచెం లాజికల్ గా అనిపించిన కారణం


ఊరి వాళ్ళందరూ చనిపోయిన ఎకోవాని చూడడానికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఊరిపెద్ద అనుకుంటాడు. పుర్తిని, అతని అనుచరులను చంపేసింది కాబట్టి దానిని చంపేశారన్నది వాస్తవం. కానీ అసలు నిజం వేరే ఉంది. ఇదంతా జరిగింది ఉప్పు కోసం. ఉప్పే ఉంటే ముగ్గురు మనుషులు, ఒక ఏనుగు ఇంకా బతికే ఉండేవాళ్ళు. దీనికి బాధ్యులెవరు. ఉప్పు అమ్మని మనిషా? అసలు అలా అమ్మకపోవడాన్ని నేరంగా పరిగణించకుండా అతని దోపిడీకి అనుకూలంగా ఉండి అతనికి రక్షణ ఇచ్చిన వ్యవస్థా? అతనికి ఏదీ అంతుబట్టదు.

 

ఇది సరైనది కాదు అని మాత్రం అనుకోగలుగుతాడు. ఎవరైనా తమ ప్రాణాలకు సైతం తెగించి సాధించే వస్తువుగా ఉప్పు ఎలా తయారుకాగలదో బాబుగార్లు ఎప్పటికీ అర్ధం చేసుకోలేరని అతనికి తెలుసు. బాబుగార్లకి వ్యవహారం అంతా ఎప్పటికీ అవాస్తవికంగానే మిగిలిపోతుంది. పుర్తి లాంటి మనుషుల మరణాలకు సులువైన వివరణలు ఉండవు. సాధారణమైన వివరణలలో ఇమడని జీవన విధానం వాళ్ళది.


ఇదండీ స్థూలంగా ఉప్పు కథ. ఒక్క సారి చదివి చూడండి. It will haunt you for years. 

 

మిగిలిన కథలు కూడా మనల్ని అంత తేలికగా వదిలిపెట్టేవి కావు. ముఖ్యంగా అనంత్ అనువాదం చేసిన చిన్నోళ్లు కథ చదివితే మన వొళ్ళు జలదరిస్తుంది. పొట్టిగా మురికిగా ఉన్న మనుషులు కళ్ళల్లో మెదులుతూనే ఉంటారు. న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రెజిల్ అనే సంస్థ వ్యవస్థాపకుడైన డి. కాస్ట్రో అనే అతను రాసిన ది జియోగ్రఫీ ఆఫ్ హంగర్ అనే పుస్తకంలోని కొన్ని విషయాల గురించి ప్రస్తావిస్తారు మహాశ్వేతా కథని వివరించేటప్పుడు. షెట్లాండ్ అనే ద్వీపంలో కనపడ్డ పొట్టి గుర్రాలను అమెరికా లో అమ్మకానికి తీసుకువెళ్లారు అప్పట్లో. అయితే అక్కడ మంచి పుష్టికరమైన మేత దొరికేసరికి మూడు తరాలు గడిచేసరికల్లా అవి మామూలు గుర్రాలలా ఎత్తుగా, దృడంగా మారిపోతాయి. జియోగ్రఫీ ఆఫ్ హంగర్ లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ తరతరాలుగా కొనసాగిన ఆకలి, పోషకాహారలోపం మనుషులను పిగ్మి లుగా మార్చిన పరిస్థితి గురించి రాస్తారు చిన్నోళ్లు కథలో. తిండి తిప్పలు, పాలన, పోషణ లేకుండా బక్కచిక్కి ఎండిన శరీరాలు, నవ్వు తెప్పించేలా ఉన్న వాళ్ళ ఎత్తునాగరికత చేసిన భయంకరమైన నేరంగా మనకి కూడా అనిపించక మానదు

 

ఇక రుడాలి విషయానికి వస్తే ఇది చాలా పాపులర్ రచన. సినిమాగా కూడా వచ్చింది. కథలో ప్రధాన పాత్ర శనిచరి శనివారం పుట్టినది నష్ట జాతకురాలని అందరితో మాటలు పడుతూ ఉంటుంది. అందరిలాగానే ఆమెని సాధించిన అత్త చనిపోయినప్పుడు ఏడ్చేందుకు కూడా శనిచరికి సమయం ఉండదు. ఆమె రాత్రి పూట చనిపోతే శవాన్ని రాత్రంతా ఇంట్లో ఉంచితే అరిష్టం, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తది, అందుకు ఖర్చవుతుంది. ఇంట్లో కనీసం కొన్ని గింజలు కూడా లేవు. అలాంటిది ఖర్చు పెట్టి కార్యక్రమాలన్నీ ఎలా చేయించగలం అని రాత్రికి రాత్రి దహన సంస్కారాలు జరిపిస్తుంది. హడావిడిలో శనిచరికి ఏడ్చేందుకు సమయం ఉండదు. ఆమె చనిపోయిన కొన్నాళ్ళకు మరిది, తోడికోడలు కూడా చనిపోతారు. సమయంలో ఊరి దొర రామావతార్ సింగ్ నిమ్నకులాల వారైనా గంజుల్ని, దుషాదులని ఊరి నుండి తరిమేస్తానని బెదిరిస్తుంటారు. భయంలో మునిగిపోయిన శనిచరి అప్పుడు కూడా ఏడవలేకపోతుంది.

 

తర్వాత భర్త చనిపోయిన సందర్భంలో, కొడుకు చనిపోయినప్పుడు, కోడలు ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆమెకి ఏడిచే అవకాశం, సమయం కుదరదు. భర్త చనిపోయినప్పుడు అంత్యక్రియలు నిర్వహించడానికి ఇరవై రూపాయలు రామావతార్ దగ్గర అప్పు చేస్తే అతను యాభై రూపాయలు తీసుకున్నట్లు లెక్కల్లో రాసుకుని ఐదేళ్ల పాటు వెట్టి చాకిరీ చేసి అప్పు తీర్చేట్లు ఆమెతో వేలిముద్ర వేయించుకుంటాడు

 

అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆదుకోవాల్సిన సమాజం నిస్సహాయతను అలుసుగా తీసుకుని ఎంత దోపిడీ చేస్తుందో సందర్భంలో మనకి అర్ధమవుతుంది. బయట నుండి చూసేవారికి ఇందులో అన్యాయమేమీ కనిపించదు. ఆమె ఎంత అప్పు తీసుకుందో ఎవరికీ తెలియదు. లెక్కల పుస్తకాలు చూస్తే అంతా న్యాయంగానే కనిపిస్తుంది. శనిచరి అత్యంత పేదరికంలో ఉన్న దళిత మహిళ. పేదరాలు కావడం ఒక బర్డెన్ అయితే, దళిత వర్గానికి చెందడం రెండవ బర్డెన్. స్త్రీ కావడం మూడవ బర్డెన్. ఇలా ట్రిపుల్ బర్డెన్ ని మోస్తున్న మహిళ కన్నా అత్యంత నిస్సహాయ స్థితిలో ఉండే వాళ్ళు ఇంకెవరు ఉంటారు. నిజానికి శనిచరి ఒంటరి స్త్రీ కావడం మరొక బర్డెన్ కూడా. అలాంటి అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ సహాయం కోసం అడిగితే అది కూడా అప్పు అడిగితే vulnerability ని తమ exploitation కి వాడుకోవడం ఎంత బాధాకరమైన విషయం.

 

కష్టపడి పెంచిన మనవడు కూడా ఆమెని వదిలి వెళ్ళిపోతే వాడిని వెతికే సందర్భంలో చిన్ననాటి స్నేహితురాలు బిఖిని ని కలుస్తుంది. బిఖిని కూడా దాదాపు శనిచరి లాగే అందరికి దూరమయి ఏదైనా పట్టణానికి వెళ్ళి ఎలాగోలా బతుకుదామని బయలుదేరి ఉంటుంది. ఇద్దరు కలిసి ఉందామని అనుకుని బిఖ్ని కూడా శనిచరితో పాటు ఉంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఊరిలోని ఒక వ్యక్తి ద్వారా వాళ్లకి రుడాలి గా పని దొరుకుతుంది. రుడాలి అంటే దొరల కుటుంబాలలో ఎవరైనా చనిపోయినప్పుడు కిరాయికి ఏడ్చే కూలీలన్నమాట. ఎంత మంది రుడాలి లను పెట్టుకుంటే అంత గొప్ప వాళ్లకి. సమయంలో డబ్బు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడరు దొరల కుటుంబీకులు. తన సొంత మనుషులు ఎవరు చనిపోయినా ఏడవని శనిచరి చివరకి దొరలు చనిపోతే ఏడ్చే రుడాలి వృత్తిలో స్థిరపడుతోంది. కథ చివరిలో శనిచరి రుడాలి లుగా పని చేస్తున్న వారందరినీ ఆర్గనైజ్ చేసి దానిని ఒక సంఘటిత వృత్తిగా మారుస్తుంది. నిరుపేద, బహిష్కృత స్త్రీలందరు సంఘటితమవుతారు. అప్పుడు వారికి అది కేవలం జీవనాధారం మాత్రమే కాదు. శక్తిని, అధికారాన్ని పొందేందుకు ఒక మార్గం అనే అవగాహన కలుగుతుంది. దోపిడీ నుండి, అణచివేత నుండి బయటపడేందుకు ఎవరికైనా సంఘటితమవడమే మార్గం అని రచయిత్రి స్పష్టం చేస్తారు.

 

కథలో ఒక చోట మహాశ్వేత ఇలా రాస్తారు. పేదవాళ్ళు ఊళ్ళో నిలదొక్కుకుని బతకగలగాలంటే తోటి పేదవాళ్ల సహాయ సహకారాలు ఎంతగానో కావాలి అని.

 

ఎంత లోతైన పరిశీలన అది. భూమి నీరు వంటి natural capital పైన హక్కు లేని పేదవారికి financial capital కూడా ఎలాగూ అందుబాటులో ఉండదు. వారికి బతికేందుకు అవకాశం కల్పించే ఏకైక వనరు సోషల్ కాపిటల్ మాత్రమే కదా. పరస్పరం సహకరించుకోవడం, ఒకరి అవసరాల్లో ఒకరు ఆదుకోవడం, జాతికి అండగా ఉండడం జీవనానికి సహాయపడే అంశాలు అని చాలా సందర్భాలలో చాలా subtle గా చెబుతారు మహాశ్వేతా


అయితే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళని సోషల్ కాపిటల్ కి కూడా దూరం చేస్తున్నాయని అనిపిస్తుంది నాకు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మైనింగ్, టూరిజం ప్రాజెక్ట్స్, అర్బనైజషన్ అన్ని కూడా గిరిజనులను, ఆదివాసీలను వారి eco system నుండి దూరం చేసి వాళ్ళ కల్చర్ ని, ఐడెంటిటీ ని, సోషల్ ఫాబ్రిక్ ని దెబ్బతీసి వారికి సోషల్ కాపిటల్ కి కూడా access లేకుండా చేస్తున్నాయి అనిపిస్తుంది.

 

రుడాలి కథలో అత్యంత దుర్మార్గమైన దోపిడీ వ్యవస్థలో విషాదం, దుఃఖం కూడా అమ్మకానికి పెట్టే సరుకుగా ఎలా మారుతుందో వివరించే ప్రయత్నం చేస్తారు రచయిత్రి

 

మిగిలిన కథలు కూడా అంతే. కథ చదివినా ఒక రకమైన గిల్ట్, కోపం, దుఃఖం అన్నీ కలిసిన ఒక రకమైన శూన్యపు స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. దోపిడీకి గురయ్యే వాళ్ళకీ దోపిడీదారులకు ఇద్దరికీ అణచివేతే వారసత్వంగా సంక్రమిస్తుందనే వాస్తవం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం.

 

అంతే కాకుండా భారతీయ గ్రామం పట్ల అక్షరాస్యులైన నగర జీవులకు ఉండే కాల్పనిక భావనలను బద్దలు చేస్తాయి కథలు. పల్లెటూర్లు అంటే పాడి పంటలతో తులతూగుతూ ప్రశాంతంగా అందంగా ఉంటాయనే మన అభిప్రాయాలను భ్రమలను పటాపంచలు చేస్తూ గ్రామ స్థాయిలో వర్గ వివక్ష, వర్ణ వివక్ష విధంగా కొనసాగుతుందో, సామాజికంగా ఆర్ధికంగా ఆధిపత్యం కల వర్గాల వారు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నెన్ని అవినీతి మార్గాలను అవలంభిస్తారో స్పష్టంగా వివరిస్తారు కథల ద్వారా


నేను పరిచయం లో చెప్పినట్లు ఇవన్నీ చదివాక మనకు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. వీటిలోని విషయాలు మనకు అంత మింగుడుపడవు. అందుకు కారణం వీటిలోని వాస్తవికత. ఇవేవో ఫిక్షన్ కథలైతే మనకు అంత నొప్పి కలగదు. కానీ వాస్తవ జీవితం నుండి వచ్చిన కథలు కావడం, మన చుట్టూ ఇంత దుర్మార్గం జరుగుతుందని, అటువంటి దుర్మార్గానికి అనుకూలంగా ఉన్న వ్యవస్థలో మనం కూడా భాగమనే ఆలోచన కలగడమే inconvenience కి కారణం

 

నిజానికి మహాశ్వేతా కథలు రాయడంలో ఉద్దేశం కూడా అదే. కథలని నేను పాఠకులను ఉల్లాసపరచడం కోసం రాయలేదు అంటారు మహాశ్వేతా తన ముందు మాటలో. కథలతో మమేకమై పాఠకుడు కూడా రచయిత స్పందించిన రీతిలో స్పందిచగలిగితే నా ప్రయత్నం సఫలమైనట్లు అంటారు ఆమె. స్పందించకుండా ఉండలేని నిస్సహాయ పరిస్థితిలోకి నెడతాయి కథలు మనల్ని.


ఇవన్నీ ఎప్పుడో 1980 నాటి కథలు. ప్రపంచం అప్పటి నుండి ఇప్పటికి చాలా మారింది. వీటికి సమకాలీనత ఎక్కడ ఉంది అనే ప్రశ్న రావొచ్చు. నిజమే అప్పటికి ఇప్పటికి సమాజం మారింది. టెక్నాలజీ విస్తృతంగా అభివృద్ధి చెందింది. కనెక్టివిటీ పెరిగింది. Y2K ఇయర్ 2000 నుండి ప్రారంభమైన గ్లోబలైజెషన్ మూడవ దశ ప్రపంచాన్ని ఫ్లాట్ గా మార్చేసిందని, ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయింది అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం.

 
ఇటువంటి నేపథ్యంలో ఇలాంటి కథలకి relevance ఎక్కడి ఉంది అనిపిస్తుంది.

 

కథలు మళ్ళీ చదువుతూ నేను కూడా అదే ఆలోచన చేసాను. ఆలోచన చేయగానే నాకు తట్టింది ఒక్కటే. ఉప్పు దొంగతనం చేయబోతూ చనిపోయిన పుర్తికి, కేరళలో కాసింత బియ్యం దొంగతనం చేసినందుకు చంపబడ్డ ఆదివాసీ యువకుడు మధుకి, మన ఆంధ్ర లో మామిడి పళ్ళు దొంగతనం చేయబోతూ చంపబడ్డ దళిత యువకుడు బక్కి శీను కి మధ్య నలభై ఏళ్ళు. భర్త చనిపోయిన ఏడాదికి కూతురికి జ్వరం వస్తే ట్రీట్మెంట్ ఇప్పించలేక పాప చనిపోతే ఏడ్చే తీరిక లేకుండా దహన కార్యక్రమాలు జరిపించడానికి డబ్బుల కోసం తిరిగిన శనిచరి లాంటి తల్లిని గత సంవత్సరం నేను స్వయంగా కలిసాను


సందర్భాలు వేరు కావొచ్చు. నేపధ్యాలు వేరు కావొచ్చు. స్థలం, కాలం వేరు అయి ఉండవొచ్చు. కానీ ఆధిపత్య ధోరణి, దోపిడీ వ్యవస్థ ఇంకా మారలేదు అనేది మనం కొంచెం పరిశీలనగా చూసినా స్పష్టంగానే అర్ధమవుతుంది. దోపిడీ స్వరూపం మారిందేమో. మరింత sophisticated గా రూపాంతరం చెంది ఉండొచ్చు. కానీ తుడిచి పెట్టుకు పోలేదు అన్నది వాస్తవం. మరణాలకు, దోపిడీ కొనసాగడానికి కారణం ఆధిపత్య ధోరణి. దోపిడీకి గురయ్యే వాళ్లకి, దోపిడీ చేసే వాళ్ళకీ వారసత్వంగా సంక్రమించే ఆస్తి కూడా ఆధిపత్య ధోరణే.

 

ఇక అంతకంటే వీటి రెలెవెన్సు గురించి నేనేమీ చెప్పక్కర్లేదనుకుంటాను. నలభై ఏళ్ళ క్రితం రాసిన కథలు ఇప్పటికీ సమకాలీన సత్యాలు అని చెప్పడానికి ఇవి నాకు తోచిన ఉదాహరణలు.


సందర్భంలో నాకు ఎడ్వర్డ్ అబీ అనే ecological ఫిలాసఫర్ చెప్పిన మాట గుర్తు వస్తుంది. “Growth for the sake of growth is the ideology of the cancer cell.” అంటారుఎడ్వర్డ్. Power balance ను, environment balance ను ఇగ్నోర్ చేస్తూ జరిగే అభివృద్ధి కాన్సర్ వంటిదే. అది శరీరాన్నంతటినీ చంపేలోపే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది.

 

రుడాలి, ఉప్పు వంటి కథలు మనల్ని భ్రమలలో జోకొట్టవు. మనల్ని ఒక్కసారి ఉలిక్కిపడి భ్రమల నుండి బయటపడేలా చేస్తాయి. మహాశ్వేతా లాంటి రచయిత్రుల దృష్టిలో సాహితీ సృజన అంటే సామాజిక మార్పు కోసం జరిగే అనేక ప్రయత్నాలలో ఒక భాగం.

 

You Might Also Like

Leave a Reply