పల్నాటి కవుల చరిత్ర – డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు

వ్యాసకర్త:‌ పిఆర్ తమిరి
**********

సాహితీ మిత్రులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పల్నాటి కవుల చరిత్ర గ్రంథం సర్వాంగ సుందరంగా ముస్తాబు పూర్తిచేసుకొని ప్రచురితమై వచ్చేసింది. ఈ గ్రంథ రచయిత డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు ఎన్నో వ్యయప్రయాసలతో సేకరించిన 173 మంది పల్నాటి కవుల వివరాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు పల్నాటి వాసులు కాకపోయినా పల్నాడు గురించి రాసిన 57 మంది కవులు, రచయితల క్లుప్త పరిచయాలూ ఉన్నాయి. లభ్యమైన కవుల ఫోటోలు కూడా ఆయా వివరాలతో పాటు పొందుపరచడం విశేషం. కవుల వివరాలు, ఫోటోలే కాదు ఆయా కవుల ప్రతిభకు ఆనవాళ్లుగా కవిత్వాల ఉదాహరణలు కూడా చేర్చారు. వీటిద్వారా పల్నాటి కవుల సమగ్ర సాహితీ ప్రస్థానాన్ని అవగతం చేసుకోవచ్చు.

మహాకవి శ్రీనాథుని కాలంలో పల్నాడు బాగా వెనుకబడి ఉన్నా ఆ తర్వాత కాలంలో క్రమంగా అభివృద్ధిపొందుతూ వచ్చింది. కదన రంగంలో వీరాధివీరులకు నిలయంగా చారిత్రక ప్రాశస్త్యం పొందింది. అలాగే సాహితీ రంగంలో కవిసింహాలకు, కవిదిగ్గజాలకు, కవిశిఖామణులకు పుట్టిన గడ్డగా పేరుప్రఖ్యాతలు సంతరించుకుంది. ప్రాచీన బాణీలోనూ ఆధునిక శైలిలోనూ ఆధునికోత్తర రీతుల్లోనూ కవిత్వం వెలువరించే కవిశ్రేష్ఠులు నేటికీ పల్నాడులో ఉన్నారనే అంశాన్ని అంగీకరించి తీరాలి. దీనినే డాక్టర్ బెజ్జంకి వారు తన ఈ పల్నాటి కవుల చరిత్ర గ్రంథంలో నిరూపించారు. కేవలం కవుల గురించే కాక పల్నాడు చారిత్రక ప్రాధాన్యం వివరిస్తూ, మరుగున పడిపోయిన అంశాలను వెలికి తెస్తూ మన పల్నాడు పేరిట రచయిత ఒక ప్రత్యేక వ్యాసాన్ని ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఇది పల్నాడు గురించి తెలిసిన వారికీ తెలియని వారికీ పూర్తి పరిచయం కలిగిస్తుంది. ఈ గ్రంథనికి ఇదొక హైలెట్… అందుకే ప్రత్యేకించి పల్నాటి వాసులే కాదు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల వారు, దేశంలోని అన్ని రాష్ర్టాల వారూ ఈ పుస్తకాన్ని చదవాలి….శౌర్యపరాక్రమాల విషయంలో కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన పల్నాడు మనందరి పల్నాడు కదా…..

ఈ గ్రంథం సాహితీ పిపాసులకే కాదు, పరిశోధక విద్యార్థులకూ ఎంతగానో ఉపకరిస్తుందనడం సత్యదూరం కానేకాదు.

ఆత్మీయ వచనం పేరిట డాక్టర్ నెల్లూరి పార్వతయ్య ఎం.బి.బి.ఎస్, విమర్శనాత్మక పరామర్శ పేరిట టి. గౌరీశంకర్, పల్నాటి కవుల తారాతోరణం శీర్షకన డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, గొప్ప సాహితీ కృషి పేరిట కె.ఎస్. లక్ష్మణరావు, ముందు మాట శీర్షికన డాక్టర్ జీవీ పూర్ణచందు, అభినందన పేరిట డాక్టర్ రాధశ్రీ, పల్నాటి కవితకు పట్టాభిషేకం పేరుతో బీరం సుందరరావు తదితర సాహితీ ఉద్దండులు ఈ గ్రంథానికి తమతమ అబిప్రాయాలు అందించారు.

మాచర్ల నివాసి అయిన ఈ గ్రంథ రచయిత డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు పాఠ్యాంశాల బోధనలో విశేష అనుభవం సంపాదించుకున్నారు. ఉద్యోగ రీత్యా విశ్రాంతి తీసుకున్నప్పటికీ రచన పరంగా అవిశ్రాంతంగా కృషిచేస్తూనే ఉన్నారు.. ఇది ఆయన 12 వ రచన. మరో 11 రచనలు అముద్రితాలుగా ఉన్నాయి. వాటినీ ప్రాధాన్యతా క్రమంలో ప్రచురణకు సిద్ధం చేస్తున్నారు.

కొని, చదివి, భద్రపరచుకో వలసిన గ్రంథం ఈ పల్నాటి కవుల చరిత్ర అని నిస్సందేహంగా చెప్పవచ్చు…మందపాటి కాగితం 168 +8 పుటలతో ముచ్చటగొలిపే ముద్రణతో ఈ గ్రంథం కనువిందు చేస్తుంది…
వివరాలకు రచయిత చరవాణి నంబరు 9848562726 లో సంప్రదించాలి.

You Might Also Like

Leave a Reply