త్రిపుర కథలు – ఒక పరిచయం

వ్యాసకర్త: వెంకట్ సిద్ధారెడ్డి
When I consider the short duration of my life, swallowed up in the eternity before and after, the little space which I fill, and even can see, engulfed in the infinite immensity of spaces of which I am ignorant, and which know me not, I am frightened, and am astonished at being here rather than there; for there is no reason why here rather than there, why now rather than then. -Blaise Pascal
Who calls my poems poems?
My poems are not poems
Knowing my poems are not poems
Together we can begin to speak of poems
Daigu Ryokan – Zen Monk
అసలెవరీ త్రిపుర?
ఈయన అసలు పేరు రాయసం వెంకట్ త్రిపురాంతకేశ్వరరావు. పుట్టింది 1928 లో. ఆయన దాదాపు పాతికేళ్లపాటు త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాలోని ఒక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేసారు.
త్రిపుర కథలు మాత్రమే కాకుండా మరో మూడు పుస్తకాలు రాసారు. అవన్నీ కవితా సంకలనాలు.
ఇక మనం త్రిపుర కథల్లోకి వెళ్దాం. వెళ్లే ముందు కొన్ని విషయాలు చెప్పుకోవాలి. నా వరకూ నేను త్రిపుర కథలు చదవకపోయుంటే నేను సోల్ సర్కస్ కథ రాసుండే వాడినీ కాదు. ముఖ్యంగా చీకటి గదులు కథ. అది చదివి నేను సోల్ సర్కస్ రాయలేదు కానీ, ఆ కథ చదివిన చాలా రోజులవరకూ ఆ కథలోని ఇమేజరీ నన్ను వెంటాడింది. బహుశా నాకు తెలియకుండానే ఆ కథ నాచేత సోల్ సర్కస్ రాయించిందని నమ్ముతునాను. ఆ కథే లేకుంటే ఇప్పుడు నేను రచయితని అని చెప్పుకోదగినన్ని పుస్తకాలు రాసుండేవాడినీ కాదు. ఆ విధంగా త్రిపుర కథలు నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. త్రిపుర గురించి ఇంకొక ఇంట్రస్టింగ్ టిడ్ బిట్ ఏంటంటే ఆయన్ని ఏల్వీ ప్రసాద్ గారు సినిమాల్లో హీరోగా నటించమని అడిగారట. కానీ ఎందుకో ఆయన సినిమాల్లోకి వెళ్లలేదు. కానీ ఆయన ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది, వయసులో ఉన్నప్పుడు రష్యన్ సినిమాల్లో హీరో లా ఉండేవాడు ఆయన, ఇప్పటికీ ఆయన ఫోటో చూస్తే ఎందుకో టార్కోవ్స్కీ గుర్తుకొస్తాడు.
ఇదే కాదు ఆయన గురించి చదువుతుంటే తెలిసిన మరొక విషయం – మిడ్ సమ్మర్ ప్రింటర్స్ గురించి. అత్తలూరి నరసింహా రావు రాసిన రెండు వ్యాసాల్లోనూ ఈ ప్రెస్ గురించి ప్రస్తావించబడింది. ఎందుకనో ఈ విషయం నన్నెంతగానో ఆకట్టుకుంది. త్రిపుర ఒక ప్రెస్ పెట్టాలనీ. ఆ ప్రెస్ కి ఆనుకునే ఒక పాత పుస్తకాల షాప్ పెట్టాలనీ కూడా చాలా సార్లు అనుకున్నారని ఈ వ్యాసాల్లో రాసారు.
త్రిపుర గురించి చాలా మంది చెప్పేదేంటంటే ఆయన చాలా రిజర్వుడ్, ఎక్కువమందిని కలవరు. కలిసినా పెద్దగా మాట్లాడరు లాంటి విషయాలు చాలామంది చెప్పగా విన్నాను. అంత రిజర్వ్ డ్ గా ఉండే మనిషి ఒక ప్రెస్ పెట్టి ఎవరి పుస్తకాలు ప్రచురిద్దామనుకున్నారో ఏమో? మొత్తానికైతే ఇదొక కొత్త కోణం ఆయనలో. డెఫినెట్ గా తెలుగులో అప్పుడు వస్తున్న సాహిత్యంకంటే ఇంకేదో కొత్త రకమైన సాహిత్యాన్నేదో తీసుకురావలనే ఆలోచన ఉండుంటుందేమో! ఆ ప్రెస్ పెట్టకపోయినా ఆయనలోని ఈ ఆలోచన నాకు చాలా నచ్చింది.
త్రిపుర రాసింది చాలా తక్కువ. ఆయన గురించి అత్తలూరి నరసింహారావు గారు రాసిన ఒక వ్యాసంలో ఇలా అంటారు:
“నేనంటే రెండు మనుషులని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది” అంటూ ఆ మధ్య ఒక వాక్యం రాసి ఆపేసి ఆ తర్వాత కొనసాగించలేదు అని.
నా దృష్టిలో ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ఇది చదివినప్పుడు నాకు చాలా గుర్తొచ్చాయి.
ముఖ్యంగా పెసోవా రాసిన ది బుక్ ఆఫ్ డిస్ క్వైట్. (The book of disquiet)
“Each of us is several, is many, is a profusion of selves. So that the self who disdains his surroundings is not the same as the self who suffers or takes joy in them. In the vast colony of our being there are many species of people who think and feel in different ways.
అలాగే మెమెంటో సినిమాకు ఆధారమైన కథలో జోనథన్ నోలన్ రాసిన కథలోని కొన్ని వాక్యాలు.
మనిషి-అంటే మామూలు సాదా సీదా సగటు మనిషి సైతం, ఒకే రకమైన లక్షణాలు కలిగున్న ఒకే వ్యక్తి కాదు. మనిషి ఒకడే. కానీ తనలో అనేక మంది ఉంటారు. తన మెదడు నుంచి నిరంతరం తరలివెళ్లే ఎలిక్ట్రిక్ సిగ్నల్స్ కి బానిస మనిషి. అతన్ని 24 తో భాగాహారం చేసి, ఆ వచ్చిన భిన్నాల్ని 60 తో భాగాహారం చేసి…అలా నిరంతరం మనిషి ముక్కలవుతూనే ఉంటాడు. అతను ఒక అర్థం పర్థం లేని ప్రదర్శనలో పాత్రధారి. కార్యక్రమంలో ఈ భాగం ఒక పాత్రధారికి అంకితం. ఆ పాత్ర టైం అయిపోగానే తెర వెనుక ఎదురుచూస్తున్న ఎంతో మంది తమ ఛాన్స్ కోసం పోరాడుతూ చేసే తీవ్రమైన గందరగోళం. ప్రతి వారం, ప్రతి రోజు – నిరంతరంగా సాగే ఒక నిరర్థక నాటకం మనిషి జీవితం. ఒక కోపిష్టి తన ప్రదర్శన అవగానే తన టోకెన్ ని ఒక నిరాశావాదికి అప్పగిస్తాడు, అతను ఒక కామాంధుడికి కి ఛాన్స్ ఇస్తాడు. అతని తర్వాత ఒక పిరికివాడు, ఆ పై ఒక మాటకారి. ప్రతి మనిషీ ఒక సమూహం.
ఈ విషయం గురించి ఇంతగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే త్రిపుర కథల్లోని మొదటి కథ పాము. ఆ పాము కథలో శేషాచలపతి పాత్ర రోజుకో కొత్త వేషం వేస్తూ ఉంటాడు. అయితే త్రిపుర తను రాసిన మొదటి కథ ఒకే మనిషలోని వివిధరూపాల గురించి అయితే ఆయన రాయాలనుకున్న చివరి కథలోకూడా మనిషిలోని ఇతర రూపాలగురించే కావడం ఆశ్చర్యమేం లేదు. కాకపోతే మొదటికథలో అవతలివాళ్లకోసం మనం రోజూ వేసే బయటకు కనవడే వేషాలు, అవతారాలు. కానీ చివర్లో ఆయన రాసుకున్నది మాత్రం మనకి మాత్రమే తెలిసే మనలోపలి ఎన్నో అవతారాలు, విశ్వరూపాలు.
మనిషిలోని వివిధ రూపాలు, ఆ ఒక్కో రూపాం యొక్క వివిధ ఆలోచనలను బయటపెట్టే ప్రయత్నం మరొక కథ సుబ్బారాయుడి రహస్య జీవితం. ఇది నిజానికి జేమ్స్ థర్బర్ రాసిన ది సీక్రెట్ లైవ్స్ ఆఫ్ వాల్టర్ మిట్టీ అన కథకు అనుకరణ. త్రిపుర గారు ఎన్నో కథలు చదివుంటారు. కానీ ఈ కథనే ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం వెనక “Each of is many” అనే విషయం ఆయన్ని ఎంతో ఆలోచింపచేసి ఉండొచ్చని నాకనిపించింది.
త్రిపర కథలు పుస్తకంలో మొత్తం 14 కథలు ఉన్నాయి.
మొదటి కథ పాము. ఈ కథ నాకు చాలా నచ్చింది. చాలా లైటర్ వేన్ లో మొదలయ్యి చివర్లో మందు మత్తులో బాల్యపు అనుభూతులు, జ్ఞాపకాలను నెమరువేసుకుంటాడు. కానీ అవి నెమరువేసుకునే ముందే అతను అనుకుంటాడు – ఇప్పుడు కాస్తా సెంటిమెంటల్ మూడ్ లోకి వెళ్లిపోవచ్చని. సో చదివే పాఠకుడికి శేషు మీద ఎలాంటి అభిప్రాయం కలగనివ్వకుండా జాగ్రత్తపడతాడు త్రిపుర. అందుకే ఆయన కథలు అందరికీ అంత దగ్గరకావు. ఇప్పుడు మీకు మాంచి సెంటిమెంట్ కలిగే ఒక సీన్ రాస్తున్నాను అని చెప్పి సెంటిమెంటల్ సీన్ రాస్తే ఎలా ఉంటుంది? పాఠకుడు సెంటిమెంట్ ఫీల్ అయ్యే అవకాశం తక్కువ. ఇక్కడే త్రిపుర ప్లే ఫుల్ నెస్ (playfulness) తెలుస్తుంది. అతను పాఠకుడ్ని ఒకాట ఆడుకుంటాడు. ఏదీ ఒక పట్టాన రచయిత కంట్రోల్ నుంచి పోగొట్టనివ్వడు. అందుకే త్రిపుర కథలు అందరికీ అంత ఈజీగా ఎక్కవు.
అయితే ఈ కథ గురించి ఒక రచయిత రాసిన కొన్ని మాటలు చదివినప్పుడు కొంత బాధ, కొంత నవ్వూ వస్తుంది. శేషు పాత్ర స్వభావానికికల కారణాలేమిటోనని ఆ మూల కారణాల్లోకి పోయి రాస్తే ఇటువంట కథలు సమాజంలో మార్పుకి, అలాంటి మానవ స్వభావాన్ని సరిదిద్దడానికి తప్పకుండా ఎంతో ఉపయోగపడతాయి. ఇది చదివినప్పుడల్లా నాకు చాలా బాధ కలుగతుంది. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా సమాజాన్ని మార్చే బాధ్యతను రచయితలమీద పెట్టిన తెలుగు సాహితీకారులను ఘోరంగా శిక్షించాలని కూడా అనిపిస్తుంటుంది.
ఒక మనిషిగా మనల్ని మనమేంటో అర్థం చేసుకోడానికి ఒక జీవితకాలం సరిపోదు. ప్రపంచం కోసం మనం వేసుకున్న మాస్క్ తీసేసి, మన కాన్శియస్ సెల్ప్ (conscious self) నీ  దాటుకునీ, మనకి తెలియని, అర్థం కాని మన ఆన్ కాన్శియస్ సెల్ఫ్ (unconscious self) ని అర్థం చేసుకోవడమంటే చిన్నపని కాదు. అసలు ఒక జీవితకాలంలో పూర్తయ్యే పని కూడా కాదు. అలాంటిది ఇన్ని కోట్లమందితో కూడిన ఈ సమాజాన్ని అర్థం చేసుకుని, దాన్ని మార్చేలా రచనలు చేయమనడం ఎంత పెద్ద బాధ్యత! అందుకేనేమో త్రిపుర అలాంటి కథల జోలికి పోయినట్టులేదు. తనకిష్టమైనవేవో తను రాసుకున్నారు. అలాగని ఆయన కథల్లో ఏ మాత్రం సామాజిక ప్రయోజనం లేదా అంటే చదివితే మీకే తెలుస్తుంది.
త్రిపుర గురించి చాలామంది చాలా రాసారు, కానీ కనకప్రసాద్ రాసిన గురుప్రసాద్ శేషము అనే వ్యాసంలో ఆయన త్రిపుర గురించీ, త్రిపురకీ సామ్యూల్ బెకెట్ కీ ఉన్న సిమిలారిటీస్ గురించి చెప్తూ – Art has nothing to do with clarity, does not dabble in the clear and does not make clear అని బెకెట్ ఎలా అయితే అన్నారో – సృజనకారుడంటే జీవితపు బీభత్సానికీ, విషాదానికి ఉపశమనంగా ఉదాత్తమైన సత్యాల్నీ, జవాబుల్నీ స్పష్టంగా గుళికలు చేసిచ్చే భిషగ్వరుండేం కాదు. అందరిలాగే బతకుబరువును తనూ మోసుకుంటూనే ఆ నిరాశను, నొప్పినే మాటల్లో అందిపుచ్చుకుని చెక్కే కళాకారుడని ఆయన చెప్పుకున్నారు, త్రిపుర కూడా అంతే! ఇలాగే అనుకున్నారు అని రాసారు.
త్రిపుర గురింఛి ఇంకొంచెం చెప్పాలంటే అత్తలూరి నరసింహారావు రాసిన ఒక వ్యాసంలోని ఒక ప్రారాగ్రాఫ్ చదివి వినిపిస్తాను.
కథలు రాసినప్పుడు కొత్తగా కనిపించి, తర్వాత పాతగా అనిపిస్తాయంట. సాహిత్యంలో కన్ఫెషనల్ ఎలిమెంట్ లేకపోతే అది సాహిత్యమే కాదంట. ప్రయోజనం అనేది దానికి ఇన్సిడెంటల్ వాల్యూనేనట. అభిమాన రచయితలు ఇద్దరూ ఫ్రెంచ్ వాళ్లేనట. లూయీ ఫెర్డినాడ్ సెలినీ, ఆంతోనా ఆర్తో. ఇద్దరూ పిచ్చెక్కిపోయి అసైలమ్ లో ఉన్న వాళ్లేనట. ఏ కాస్మిక్ ఐరనీని ఎలా బోధపర్చుకోవాలో తెలియకుండా ఉందట. సాహిత్యం తాగిన తర్వాత మాట్లాడినట్టు ఉండాలిట, తను రాసిన వాటిల్లో ’భగవంతం కోసం’ ’జర్కన్’ కథలు తనకి ఇష్టమైనవట.
సో త్రిపుర గురించి చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు. బోలెడు మంది ఆయన గురించి చాలా రాశారు. అవన్నీ మీకు చదివి వినిపించొచ్చు. కానీ ఆ పని మీరు కూడా చెయొచ్చు. మీకు ఆసక్తి ఉంటే త్రిపుర కథలతో పాటు త్రిపుర ఓ జ్ఞాపకం అని మరొక పుస్తకం ఉంది. ఇందులో చాలామంది రచయితలు త్రిపుర గురించి రాసిన వ్యాసాలను సాహితీ మిత్రులు ప్రచురించారు. అవి చదువుకోవచ్చు.
మీరు త్రిపుర కథలు చదవాలనుకుంటే ముందుగా పాము, భగవంతం కోసం, హోటల్లో, సుబ్బారాయుడి రహస్య జీవితం లాంటి చిన్నవీ, అర్థంచేసుకోడానికి కొంత సింపుల్ గా ఉండేవీ చదవొచ్చు. ముఖ్యంగా ఆయనకిష్టమైన కథ ’భగవంతం కోసం’ గురించి కొంత చెప్పాలి.
ఒక ఇంటర్వ్యూలో త్రిపురని అడిగారు – సామ్యూల్ బెకెట్ రాసిన వెయిటింగ్ ఫర్ గోడో కి త్రిపుర రాసిన భగవంతం కోసం కథకి ఉన్న సిమిలారిటీస్ గురించి అడిగారు. పేరులో తప్ప వేరే పోలికలు లేవు అన్నప్పటికీ థీమాటిక్ గా కొంత పోలికైతే ఉంది. ఆ థీమ్ ఏంటంటే నిరీక్షణ. ఎదురుచూపు. మనందరం ఏదో ఒకదానికోసం ప్రతి క్షణం ఎదురుచూస్తూనే ఉంటాం. ఆ ఎదురుచూపులో జీవితం తనపాటికది సాగిపోతూనే ఉంటుంది, మనతో పాటు ఎదురుచూస్తూ కూర్చోదు. ఈ కథలో కూడా అంతే భగవంతం కోసం ఎదురుచూస్తుంటాడు, కానీ ఎక్కడో మూల అతనికి తెలుసు భగవంతం రాడని. మనమూ అంతేగా చాలా విషయాలు జరగవని తెలిసీ ఎదురుచూస్తూనే ఉంటాం.
ఈ కొన్ని సులభంగా చదువుకోగలిగే కథల తర్వాత చీకటి గదులు చదువుకోవచ్చు. అప్పటికి పాఠకుడికి కొంతలో కొంతైనా త్రిపుర లోపలకి ఇంకి ఉంటాడు కాబట్టి ఆ తర్వాత వాళ్లేం చదవాలో నిర్ణయించుకుంటారని అనుకుంటున్నాను.
త్రిపుర కథలు చదివినప్పుడు నాకేమనిపించిందంటే ఆయన తెలుగు సాహిత్యాన్ని పెద్దగా చదవలేదు. చదివినా పెద్దగా అభిమానించలేదు. ఆయనకు నచ్చిన పాశ్చాత్య సాహిత్యం influenc ఆయన కథల్లో బాగా కనిపిస్తుంది. ఎంత కనిపిస్తుందంటే ఆయన ఆలోచన ఇంగ్లీష్ లో ఉండి అది పేపర్ మీదకి తెలుగులో వచ్చనట్టు అనిపిస్తుంది, అది తప్పేమీ కాదు. ఇప్పుడు రాస్తున్న చాలామంది రచయితలకు మొదట ఆలోచన ఆంగ్లంలోనే పుడ్తుంది. అది ఇప్పుడు పరిస్థితుల ప్రభావం. అయితే ఆ ఆలోచన ఆంగ్లంలో ఉండడం మాత్రమే కాదు. ఆయన చదివిన గొప్ప సాహిత్యం కూడా ఆ ఆలోచనల్లో ఉండడం వల్ల, ఆ గొప్ప ఆలోచనలు మనలాంటి సామాన్య పాఠకులకు అంత ఈజీగా అర్థమవ్వదు. చాలా కాంప్లికేటేడ్ నెరేటివి స్ట్రక్చర్ ఒక వైపైతే, మరొక వైపు చాలా కాంప్లెక్స్ ఐడియాస్ ని ఆయన తన కథల్లో ప్రవేశపెడతారు.
ఉదాహరణకు వలస పక్షుల గానంలో ఇలా అంటారు:
“జ్ఞాపకాల ముక్కల అస్తవ్యస్తపు సముదాయమే జీవితం కాబోలు. మనం ఉందనుకున్న పేటర్న్‌ అసలు వున్నది కాదు. మానవ జీవితం మీద మనం మన అవసరాల కోసం ఇంపోజ్‌ చేసినది. ఆ పేటర్న్‌ లేకపోతే జీవితం సాగదు, సాగాలని మనం భౌతికంగా, మానసికంగా అనుకుంటున్నా. కాబట్టి దాన్ని తీసేస్తే, అది లేదూ అనే నిర్ధారణకి వస్తే అది నిజంగానే లేదు కాబట్టి, మనకి స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలో, ఆ స్వేచ్ఛతో మన వునికిని మనమేమేనా చేసుకోవచ్చు.”
దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది ఆయా పాఠకుడి బట్టి ఉంటుంది. త్రిపుర చెప్పారు కాబట్టి ఇది నిజమా? అసలే పేటర్న్ లేకపోవడం నిజమా? ఒక వేళ లేదే అనుకుందాం. అప్పుడు త్రిపుర చెప్పినట్టు దాన్ని తీసేసి, లేదని ఒక నిర్థారణకి రావడం అంత సులభమా? ఒక్క పేరాలోనే ఎన్ని ప్రశ్నలో చూడండి.
నిజం చెప్పాలంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి అనుకోవడం కూడా వృథా. నావరకూ అయితే నాకు పెద్దగా అర్థం కాలేదు కూడా. మరి అర్థం కాని ఈ కథల గురించి మాకెందుకు చెప్తున్నావు అని మీరు అనొచ్చు.
ఈ మధ్య ఒక ప్రాజెక్ట్ కోసం రామానుజన్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను. ఆయన హార్డీకి రాసిన ఉత్తరాలు, అందులో కొన్ని మ్యాథ్స్ ఫార్ములా చూశాను. అద్బుతంగా అనిపించాయి. అద్భుతం అనడంకంటే బ్యూటిఫుల్ గా అనిపించాయనడం కరెక్ట్. ఈ ప్రాజెక్ట్ విషయమై మరొక పుస్తకం కూడా చదివాను. రామనుజన్ జీవితం ఆధారం రాసిన ఒక బ్రిటిష్ నాటకం అది. డిసప్పయిరింగ్ నంబర్ (Disappearing Number) ఆ నాటకం పేరు. అందులో ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్ ఆమె భర్త కి మధ్య జరిగిన ఒక సంబాషణ నాకు చాలా నచ్చింది. ఇందులో ఆ ప్రొఫెసర్ రామానుజన్ నోట్ బుక్ లోని కొన్ని ఇక్వేషన్స్ చూసి ఇవన్నీ నాకు అర్థం కావడం లేదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయంటుంది. ఆప్పుడామె భర్త అంటాడు. నీకేం అర్థం కాలేదు. కానీ బ్యూటీఫుల్ గా ఉందా? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదంటాడు. అప్పుడామె ఈ విధంగా సమాధానం చెప్తుంది.
“Don’t we call something beautiful simply because it outpaces us? It may be very hard to define mathematical beauty but that is true of beauty of any kind. We may not know quite what we mean by a beautiful poem, but that does not prevent us from recognizing one when we read it.
నిజం చెప్పాలంటే త్రిపుర కథలు కూడా ఇలాంటివే. These are beautiful stories but you cannot really describe why.
అయితే అందరూ ఈ విషయాన్ని అగ్రీ చేస్తారని నేననుకోను. ఉదాహరణకు బీనాదేవి గారి వ్యాసం ఒకటుంది త్రిపుర ఓ జ్ఞాపకంలో.
త్రిపురగారికి అతి మేధాశక్తి, ఆపార అనుభవం, విస్తృత ప్రపంచజ్ఞానం ఉన్నాయి. బహుశా ఇవన్నీ ’అతి’ లెవెల్లో ఉండడం వల్లనేమో స్పష్టత లోపించింది. అందుకే తెలుగువాడికి అర్థం కాలేదు. ఈ కథల్లో ఎంత అస్పష్టత అంటే రచయితకే అర్థం కానంత.
మనం రాస్తున్నది మేధావుల కోసం కాదు. సామాన్య పాఠకుల కోసం. అందుకే అందరికీ అర్థమయ్యే కథలు రాయాలని వేడుకున్నారు.
త్రిపుర గురించి రాసిన వ్యాసాల్లో ముఖ్యంగా సీతారం, అరుణ్ సాగర్ వ్యాసాల్లో ఆయన కథల గురించి, ఆయన గురించీ రాయడం వెనుక ఉన్న కష్టాన్నే ఎక్కువ చెప్పుకొచ్చారు. ఇది మాత్రం నిజం. సీతారం అన్నట్టు ఉత్త డుస్కీ మాటలు ఎన్నైనా చెప్పొచ్చు కానీ మొత్తం అర్థమైపోయినట్టు, ఆధ్యయనం చేసినట్టు చెప్తే అవన్నీ ఉత్త మాటలే అని చెప్పాలి.
మిత్రుడు మూలా సుబ్రమణ్యం త్రిపురగారితో చేసిన సంభాషణ నాకు చాలా ఇష్టం. అందులో మీ కథల గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే ఇలా అన్నారు:
అసలు నేను రైటర్ని అవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో ఏక్సిడెంటల్ గా మొదలుపెట్టాను. ఏదో ఆవహించి రాయించినట్టు, తప్పక పదేళ్ళపాటు కథలు రాసాను. Existential story రాద్దామనీ, Absurd Story రాద్దామనీ, Philosophical Story రాద్దామనీ, Predetermined state of mind తో ఎప్పుడూ రాయలేదు. కథ మొదలుపెట్టిన దగ్గరనుంచీ, అంతమయ్యేదాకా చచ్చాను. ఆ కథని చంపాను. ఆ చచ్చిన కథతో నేను చాలా కాలం జీవించాను. అవి అలాగే ఉన్నాయి. నేను ఇలాగే ఉన్నాను.
తన కథలగురించి అంత గట్టిగా చెప్పాక అర్థం చేసుకుని మీకు చెప్పడం అనేది చచ్చేచావు.
అందుకే ఈ కథలన్నింటినీ అనలైజ్ చెయ్యాలని ఇక్కడ మీ ముందుకు రాలేదు. ఇప్పుడు రాస్తున్న చాలామంది కొత్త వాళ్లకి త్రిపుర గురించి చిన్న పచిచయం చేద్దామనే ఈ ప్రయత్నం.
అంతే తప్ప ఆయన్ని, ఆయన రచనల్ని అర్థం చేసుకుని, ఆ అర్థాలేవో మీకు చెప్పాలనే ప్రయత్నమైతే కాదు. అంత ధైర్యం నాకు లేదు.

You Might Also Like

One Comment

  1. లియో

    మంచి పరిచయం వెంకట్ గారు. కధల గురించి చెప్పకుండా రచయిత గురించి చెప్పి ఆసక్తి పెంచారు.

Leave a Reply