53 ప్రాచీన పుష్పాల దివ్యసౌరభం

’ముకుందమాల’ ని Mukunda-maalaనేను మొదటిసారిగా చూసినది తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో ! దానికి కీ.శే. శ్రీభాష్యం అప్పలాచార్యులుగారు వ్యాఖ్య వ్రాయగా ప్రచురించిన ప్రతి ఒకటి కొనుక్కున్నాను. అప్పట్లో ఏదో భక్తిభావమే తప్ప ఆ పుస్తకం గుఱించి నాకసలు ఏమీ తెలియదు. ఎవరూ చెప్పలేదు. చదివాకనే దాని గొప్పతనం బోధపడింది. ఇంత ప్రాశస్త్యం ఉన్న ఈ చిఱుపొత్తానికి మన పూర్వతెలుగుకవులెవరూ పద్యానువాదం చెయ్యకపోవడం కూడా ఆశ్చర్యకరమే. ఎందుకో మఱి ఆ విషయంలో శ్రీకృష్ణ పరమాత్ముని సంకల్పం లేదు. ముకుందమాలని తాజాగా శ్రీశ్రీల ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులవారి వ్యాఖ్యతో భక్తివేదాంత బుక్ ట్రస్ట్ (ISKCON) వారు ప్రచురించారు. ఒరిజినల్ గా ఆంగ్లంలో ఉన్న వ్యాఖ్యానాన్ని గోవిందరాజు శశిధరశాస్త్రిగారు తెలుగులోనికి అనువదించారు. ముకుందమాలలో మొత్తం ఉన్నది 53 శ్లోకాలే. కానీ ఒక్కొక్కటి అగాధ భక్తిభావ ప్రతిపాదకం. ఆ కారణం చేత వాటి స్ఫూర్తిని, అంతరార్థాన్ని విశదీకరించడం కోసం వ్యాఖ్యాత ఎన్నో అదనపు పుటల కొద్దీ వివరణ వ్రాయవలసి వచ్చింది. అలా ప్రకృత ప్రచురణ 170 పుటల దాకా ఎగబ్రాకింది.

ముకుందమాలని రచించినది శ్రీ కులశేఖర మహారాజు. ఈయనకే శ్రీ కులశేఖరాழ்వార్ అని పేరు. దాక్షిణాత్య వైష్ణవధర్మానికి ప్రధానులైన పన్నిద్దఱాళ్వారులలో ఒకఱుగా పరిగణింపబడుతున్నారు. సుమారు వెయ్యేళ్ళ క్రితం కేరళదేశాన్ని పరిపాలించారు. రంగనాథునికి నిలయమైన శ్రీరంగం ఆయనకు అత్యంత ప్రీతికరమైన క్షేత్రం.

“ఘుష్యతే యస్య నగరే
రంగయాత్రా దినే దినే”

అని ఆయన గుఱించి ఒక శ్లోకం ఉంది. “ఈరోజు మనమంతా శ్రీరంగం వెళుతున్నాం. సిద్ధం కండి” అని శ్రీ కులశేఖర మహారాజు రాజధానీ నగరంలో ప్రతిరోజూ చాటింపు వేయించేవారట. కానీ విష్ణుమూర్తికి నిత్యపూజ చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోవడం వల్ల అక్కణ్ణుంచి లేచేవారు కారు. అలా రోజూ యాత్రకి సన్నద్ధం కావడం, కానీ అది వాయిదా పడుతూండడం సంభవించేదట. కొన్ని సంవత్సరాల తరువాత ఆయన సంసార విషయాల యెడ సంపూర్ణ వైరాగ్యం పొంది మహారాజ పదాన్ని పరిత్యజించి ఒక సాధారణ పౌరుడుగా, అసాధారణ వైష్ణవ భక్తుడుగా మారారు. శ్రీరంగ క్షేత్రంలోనే నివసిస్తూ, స్వామివారి ప్రసాదం మీదనే ఆధారపడి శేషజీవితాన్ని గడిపారు. కేరళ రాజైనప్పటికీ శ్రీ కులశేఖరులు సంస్కృతంలోనే కాక తమిళంలో కూడా మంచి దిట్ట. పెరుమాళ్ తిరుమొళి పేరిట 105 తమిళ పాశురాలు కూడా రచించారు. ఎందుకంటే అప్పటికింకా మలయాళభాష అని ప్రత్యేకంగా ఏర్పడలేదు. అది తమిళంలోనే భాగమై ఒక మాండలికంగా ఉండేది. తొలితొలి మలయాళ కవులు తమ రచనాభాష తమిళమని పేర్కొనడమే ఇందుకు నిదర్శనం.

విష్ణుభక్తిలో వివిధ ప్రభేదాలున్నాయి. మధురభక్తి, శుద్ధభక్తి మొదలైనవి. శ్రీకృష్ణులవారి యెడ శ్రీ రాధాదేవికి ఉన్నది మధురభక్తి. శ్రీచైతన్య మహాప్రభువులది కూడా మధురభక్తే. శుద్ధభక్తి అంటే భక్తికి ప్రతిఫలంగా ఇంకా నిర్భరమైన భక్తే కావాలని కోరుతూ ఉపాసించడం. ఈ విధమైన భక్తిలో మోక్షవాంఛ కూడా ఉండదు. శ్రీ కులశేఖరాళ్వారులది ఈ విధమైన భక్తి. అందుకే ముకుందమాలలో ఆయన ఇలా అన్నారు :

శ్లో|| నాఽహం వన్దే తవ చరణయోర్ ద్వన్ద్వమద్వన్ద్వహేతోః
కుమ్భీపాకం గురుమపి
హరే నారకం నాఽపనేతుమ్ |
రమ్యా రామామృదుతనులతా నన్దనే నాఽపి రన్తుం
భావే భావే హృదయ
భవనే భావయేయమ్ భవన్తమ్ ||

తాత్పర్యము : శ్రీహరీ ! సంసారద్వంద్వముల నుండి బయట పడుటకు గాని, ఘోరమగు కుంభీపాక నరకక్లేశముల నుండి తప్పించుకొనుటకు గాని నీ పాదపద్మములను ప్రార్థించుట లేదు. నందనోద్యానమున వసించు కోమలాంగులగు సుందరీమణుల పొందు ననుభవించుట కూడ నా ఉద్దేశ్యము కాదు. జన్మజన్మలకు నా హృదయభవనమున కేవలము నిన్నే స్మరింపగలుగునట్లు నీ చరణ కమలమును ప్రార్థించుచున్నాను.

సాధారణంగా సంసార జీవితాన్ని సముద్రంతో పోల్చడం తాత్త్విక సాహితీ పిపాసువులకు పరిచితపూర్వమే. శ్రీ కులశేఖరులు ఆ భావననే స్వల్పంగా విస్తరించి ఇలా వర్ణించారు :

శ్లో|| తృష్ణాతోయే మదన పవనోద్ధూత మోహోర్మిమాలే
దారావర్తే తనయ సహజగ్రాహ
సఙ్ఘాకులే చ |
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్
పాదామ్భోజే వరద భవతో భక్తినావమ్ ప్రయచ్ఛ ||

తాత్పర్యము : ఓ త్రైలోక్యనాథా ! అత్యాశాజలములతో నిండినది, కామమనెడి వాయువుచే ఎగసినట్టి మోహ కెఱటములను గూడినది, భార్యాసుడిగుండముతోను, సుతసోదర మొసళ్ళ గుంపులతోను ఇతర జలచరములతోను నిండినదియు నగు సువిశాల సంసారసాగరమున నేను మునుగుచున్నాను. ఓ సమస్త వరదాయకా ! నీ పాదపద్మములనెడి భక్తినావ యందు నాకు కొంత స్థానము నొసగుము.

శ్లో|| నాథే నః పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతరి పరే నారాయణే తిష్ఠతి |
యఙ్కిఞ్చిత్పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్థదం
సేవాయై మృగయామహే నరమహో మూఢా వరాకా వయమ్ ||

తాత్పర్యము  : త్రిలోకాధిపతి, జ్ఞానసేవ్యుడు, స్వీయస్థానమును ఆనందముతో నొసగువాడును, పురుషోత్తముడు నగు మన ప్రభువు నారాయణుడు ఎదుటనే ఉపస్థితుడై యున్నాడు. అయినను కొన్ని గ్రామములకు అధిపతియైన ఎవడో అల్పుడు, కేవలముగా పారితోషికము నొసగెడి పురుషాధముడు నగు వ్యక్తి యొక్కసేవనే అపేక్షించుచున్నాము. ఆహా ! మనమెంతటి మూఢులము, నీచులము !

ముకుందమాలలో ఇటువంటి సంక్లిష్ట కవనాలే కాక మృదుమధురమైన అలతిపదాలతో సరళభావాలను వెలిబుచ్చే శ్లోకాలు సైతం లెక్కకు మిక్కిలి.

శ్లో|| చిన్తయామి హరిమేవ సన్తతమ్
మన్దహాస ముదితాననామ్బుజమ్ |
నన్దగోప తనయమ్ పరాత్పరం
నారదాది మునిబృన్దవన్దితమ్ ||

శ్లో|| నమామి నారాయణ పాదపఙ్కజం
కరోమి నారాయణపూజనం సదా |
వదామి నారాయణనామ నిర్మలం
స్మరామి నారాయణతత్త్వమవ్యయమ్ ||

శ్లో|| క్షీరసాగర తరఙ్గ శీకరా-
సార తారకిత చారుమూర్తయే |
భోగిభోగ శయనీయ శాయినే
మాధవాయ మధువిద్విషే నమః ||

ఈ పుస్తకంలోని చిట్టచివఱి శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ శ్రీల భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు వాక్రుచ్చినట్లు “…ముకుందమాలాస్తోత్రము పాఠకునికి పూర్ణాశీర్వాదము నొసగి అతనిని భగవద్ధామమునకు చేర్చగలదు.”

(ముకుందమాలాస్తోత్రము ; రచన – శ్రీకులశేఖర మహారాజు ; వ్యాఖ్యానము – శ్రీశ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు ; అనువాదము – గోవిందరాజు శశిధరశాస్త్రి ; క్రౌన్ సైజు ; పుటలు – 172+16 ; వెల – పేర్కొనలేదు ; వలయువారు – భక్తివేదాంత బుక్ ట్రస్ట్, శ్రీశ్రీ రాధామోహన మందిరము, హరేకృష్ణ ల్యాండ్, నాంపల్లి స్టేషన్ రోడ్డు, హైదరాబాదు -1, ఆంధ్రప్రదేశ్)

You Might Also Like

9 Comments

  1. రవి

    క్షమించాలి. “జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం..” అని ఉండాలనుకుంటాను ఇందాక వ్యాఖ్యలో.

  2. రవి

    కొత్తపాళీ గారి అభ్యర్థనే నాది కూడా.

    “జిహ్వే కీర్తయ కేశవం సురరిపుం
    చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్పయ అచ్యుతకథాం..”

    “కమలాక్షునర్చించు కరములు కరములు
    శ్రీ నాథు వర్ణించు జిహ్వ జిహ్వ..”

    మన పోతన్న, ముకుందమాల చదివి ఉంటాడా?

  3. కొత్తపాళీ

    చాలా బావుంది. వివరంగా మీ వ్యాఖ్యానంతో మీబ్లాగులో రాయండి. అటువంటి తీరిక మీకూ, చదివే అదృష్టం మాకూ ఆ శ్రీరంగనాఠుడు ప్రసాదించు గాక.

  4. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

    ’ముకుందమాల’లోని భాషాసౌందర్యాన్ని, కవితాచమత్కృతినీ వివరిద్దామంటే అప్పటికే సమీక్ష విస్తారమైపోయింది. అదీగాక మూలగ్రంథం సంస్కృతంలో ఉండడం వల్ల వివరించినా తెలుగు పాఠకులకి కొఱుకుడు పడేది తక్కువ.

  5. chavakiran

    లెస్సగా వ్రాశారు. ఎక్కువగా ఆధ్యాత్మిక లాభాల గురించి నొక్కి వక్కాణించారు, వాటితో పాటు ఈ పుస్తకం భాషా సౌందర్యం కూడా ఒక ముక్క ఎక్కువగా చెపితే బాగుండేది. సంస్కృతం రాకపొయినా తెలుగు వారికి ఇది చదివితే పోతన భాగవతంలా మధురంగా ఉంటుంది.

  6. సౌమ్య

    Great to know more about this book! 🙂
    [Pardon my commenting in English. I am writing this from a telugu-illiterate computer]

  7. గిరి

    దివ్యమైన పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ముకుందమాలలో స్తోత్రాలు అక్కడక్కడా వినడమే కానీ, అంతకు మించి నాకింకేమీ వివరాలు తెలియవు, నేటితో ఆ లోటు భర్తీ చేసారు.
    మీరు చవిగా చూపించిన రెండు సరళి శ్లోకాలు వ్రాసుకుని మా అమ్మాయికి నేర్పిస్తాను.
    మరొక్క మాట, నాకు సమీక్షోద్వేగం కలగడం చాల సహజం, సింగపూరులో ఉంటూండడం వల్ల దానికి లొంగిపోయి, ఉద్వేగంలో కొట్టుకుపోయి, హాయిగా ఓ పుస్తకాల కొట్టుకు పోయి కొనుక్కొని, పుస్తకాన్ని వెంటనే చదివేయాలనే కోరిక – కోరికగానే మిగిలి పోతుంది.. అదే నా బాధ.

  8. చింతా రామ కృష్ణా రావు.

    అతి ప్రాచీన సంస్కృఅ గ్రంథమైన ముకుందమాలను గూర్చి వెలువరించిన మీకు మా ధన్యవాదములు.

  9. రవి

    నేను నాలుగవ తరగతి చదివేప్పుడు ముకుందమాల మాకు పారాయణ గ్రంథం. అప్పుడు వల్లె వేసిన శ్లోకాలలో అక్కడక్కడా ఒక్కో శ్లోకం లో ఒక్కో పాదం గుర్తు కానీ, ఒకే ఒక్క శ్లోకం గుర్తుండిపోయింది.అదీ బాల్య చాపల్యంతో పిత్తైః అన్న శబ్దం విచిత్రంగా అనిపించడం మూలాన.

    కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతః
    మద్వైవ మే విశతు మానస రాజహంసః |
    ప్రాణ ప్రయాణ సమయే కఫ వాత పిత్తైః
    కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే ||

    (పొరబాట్లు ఉంటే మన్నించాలి). మంచి జ్ఞాపకాన్ని తట్టి లేపినందుకు కృతజ్జతలు.

Leave a Reply