Arzee, the dwarf – పుస్తకం, రచయిత, ముఖాముఖీ!

నేను అమితంగా ఇష్టపడే బ్లాగుల్లో ఒకటి: The Middlestage. పుస్తకాల గురించి కూలంకషంగా, నిజాయితీగా రాసే బ్లాగుల్లో ఇదీ ఒకటి. వ్యక్తిగతంగా నాకు చాలా ఉపయోగపడిన బ్లాగు. ఈ బ్లాగరు రాసిన నవల మార్కెట్టులోకి రాబోతుందన్న దగ్గర నుండీ, వచ్చీ.. చదివినవారిని మెప్పిస్తుందని విని/ చదివి కూడా ఈ పుస్తకం జోలికి పోయే సాహసం చేయలేదు. సమకాలీనపు భారత రచయితలు (ఆంగ్లంలో రాసేవారు) నన్ను అంతగా ఆకట్టుకుపోవడం అందుకు కారణం. అందునా హైద్‍లో ఏ పుస్తకం కొట్లలోనూ ఇది కబడకపోవడం కూడా కొంత కారణం. ఆఖరుకి లాండ్‍మార్క్ లో కనిపించేసరికి, ’చూద్దాం, అసలేంటో!’ అని ఒక్క నాలుగైదు పేజీలు చదివి ’హమ్మ్.. కొనాల్సిందే’ అని తీసుకున్నాను. కథను ఎక్కడకైనా తీసుకుపోని, కథకై వాడిన భాషకోసమైనా చదవాలి అని అనుకున్నాను.

Arzeeఅర్జీ – ది డ్వార్ఫ్! ముంబయిలో పుట్టి ఇరవై తొమ్మిదేళ్ళు పెరిగేసి, రాబోవు కాలంలో తన భవిష్యత్తు గురించి రంగుల కలలు కంటున్న ఒక మరుగుజ్జు కథ! ఐదారాడుగుల పొడగర్లు జీవినాన్ని సాగించే ఈ ప్రపంచంలో, మూడున్నర అడుగుల ఎత్తులో తక్కిన మనుషులకి అందనంత లోతులో జీవిస్తున్నానని వగచే ఓ సామాన్యుడి కథ! ప్రతీ చిన్న సంఘటనకీ కల కనీ లేక కలవరపడీ, అందుకనుగుణంగా ఊహల ఊబిలో చిక్కి ఊపిరాడక మాటలనీ, మనుషులనీ ఆశ్రయించే ఓ స్వాప్నికుడి కథ! ముంబయి మహానగరంలో ఒక పాత సినిమా హాలులో (పాత సినిమాలు తరచుగా ఆడే హాలులో) ప్రొజెక్షనిస్ట్ గా పనిచేస్తూ, త్వరలో ప్రమోషన్ వచ్చి, ఆదాయం పెరిగి, పెళ్ళయ్యి, కొత్త కాపురపు కమ్మని అనుభూతిని అప్పటికే కలలు కనిపారేస్తున్న ఇతగాడికి కాలం తన రంగూ, రుచీ, చిక్కదనం ఎలా చూపించింది? దాన్ని ఎదుర్కొని ఈ కథానాయకుడు(?) ఎలా నిల్వగలిగాడు? అసలు నిలిచాడా? అన్నదే కథాంశం.

పుస్తకంలో నాకు అత్యధికంగా నచ్చింది, అర్జీ కన్నా ఎక్కువ నచ్చింది, నరేటర్ వాయిస్. థర్డ్ పార్టీ నరేషన్‍లో కొనసాగినా, అర్జీలోని భావోద్వేగాలనూ, అతడి ఆలోచనాసరళినీ, తనతో తాను మాట్లాడుకునే సందర్భాల్లోనూ, పాఠకుడు నేరుగా ఆర్జీతోనే మాట్లాడిన అనుభవం కలిగిస్తుంది. అదీ కాక, చుట్టు పక్కలున్న వాతావరణాన్ని వర్ణించేటప్పుడు కూడా నరేటర్ గొంతులో బాలెన్స్ పోదు. పాఠకుడికి ఎంత వరకూ విషయం చెప్పాలో అంతే చెప్పినట్టు అనిపిస్తుంది. నాలుగైదు పేజీలు చదివేసరికే, ’ఇది కొనాల్సిన పుస్తకం’ అని తీసుకొంది ఎందుకంటే, కథ చెప్పేటప్పటి వర్ణనలూ (ఎక్కువా కాకుండా – తక్కువా కాకుండా) బాగుండడం వల్ల.  కథ సరికొత్తగా అనిపించకపోయినా, నరేట్ చేసిన విధానం వల్లే నాకు ఇంతగా నచ్చిందనిపిస్తోంది. కథలోని మలుపులు అక్కడక్కడా నిరాశపరిచినా, కథనం ఆపకుండా చదివించింది. చదువుతున్నంతసేపూ ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిన అనుభూతి కలిగింది. పాత్రల చిత్రీకరణ నిజానికి దగ్గరగా ఉంది.

ఈ పుస్తకం నన్ను ఆకట్టుకోడానికి మరో కారణం: అర్జీ పాత్రలోని individuality కోల్పోనివ్వకుండానే universal చేయడం. ఆర్జీ అనే ఒకానొకడికి తాను మరుగుజ్జుని ఆత్మన్యూన్యతా భావం, తాను ఈ ప్రపంచంలో ఇమడలేనని (అప)నమ్మకం, తనకి పిల్లనెవరైనా ఇస్తారా అని ఒక భయం, తన తొలిప్రేమను మర్చిపోతున్నానూ అనుకుంటూ గుర్తుచేసుకునే రకం, అమ్మని ఇకనైనా సంతోష పెట్టాలని ఆశ, ఆశయం – ఇవ్వన్నీ ఆర్జీకి మాత్రమే సొంతమైనవి. ఇవి అతడి జీవితంలో భాగం. కానీ చదువుతున్నప్పుడు, అవి మనవే అనిపించొచ్చు. అంటే ఆర్జీ బాధలన్నీ మనవే అనేలా రాశారని కాదు. ఆత్మన్యూన్యత – దేనివల్ల అయినా, మనం క్రుంగిపోయే తీరు. ప్రపంచంతో ఎప్పుడో ఒకప్పుడు ఏదోలా పేచీ వచ్చినప్పుడు దాని మీద చేసే అప్రకటిత యుద్ధం. పెళ్ళిలో, ఉద్యోగంలో ఏదో అనిశ్చితి కల్చివేస్తున్నప్పుడు రగిలే సంఘర్షణ. తొలిప్రేమ చితిని ఆరనివ్వకుండా ఊదే వెర్రి ప్రయత్నంలోని క్షోభ – ఒక్కోరిదీ ఒక్కో కథ కావచ్చు. కాకపోతే అంతర్లీనంగా అంతా మనుషులమే అనిపించేలా ఉంది. రెండొందల పేజీలు కూడా ఉండని ఈ నవల చదవటానికి నాకు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టింది. చదివాక చెలరేగే ఆలోచనల వల్ల కాస్త జాప్యం అయితే, చదివినదే చదవేలా ఊరించే వచనం మరొక్క కారణం.

అభినందించదగ్గ తొలి ప్రయత్నం. ఆస్వాదించదగ్గ వచనం!

ముఖాముఖీ విశేషాలు:

క్రాస్‍వర్డ్స్, సిటీ సెంటర్ మాల్ లో శనివారం సాయంత్రం ఈ పుస్తకావిష్కరణ, మరియూ రీడింగ్ సెషన్ జరిగాయి. రచయిత చంద్రహాస్ చౌదరి, వారిని ఇంటర్వ్యూ చేయడానికి శ్రీదల గారూ, నేను అనుకున్నదానికన్నా కాస్త ఎక్కువ జనం వచ్చారు. రిపోర్టింగ్ నాకు చేతకాదు కనుక, అలా అని ఏం జరిగిందో చెప్పకుండా ఊరుకోలేను కనుక, యధావిధిగా నాకు గుర్తున్నంతలో నా సోది.

ఆరింటికళ్ళా మొదలవ్వాల్సిన కార్యక్రమం, కేవలం ఐదు పది నిముషాల జాప్యంతో మొదలయ్యింది. చంద్రహాస్ స్వీయపరిచయం భాగంగా, తాను సికిందరాబాదులో పుట్టాననీ, కానీChandrahas ముంబయి, ఢిల్లీలో పెరిగాననీ, పాతికేళ్ళ తర్వాత హైదరాబాదుకి రావటం చేత హుస్సేన్ సాగర్‍ని తప్పించి మరేమీ గుర్తుపట్టలేకపోయాననీ చెప్పారు. పరిచయం తర్వాత పుస్తకంలో కొన్ని భాగాలనీ పైకి చదివి వినిపించారు. (నిల్చొని.. ఆయన అయితే నిల్చొని లేకపోతే పడుకొని మాత్రమే చదువుతారట!)

రీడింగ్స్ మధ్యలో శ్రీదల గారు వేసిన కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. నాకు అన్నీ గుర్తులేవు, ఉన్నవి ఇవీ!

అర్జీ – ది డ్వార్ఫ్హ్ అనే ఐడియా మీకు ఎలా, ఎప్పుడు వచ్చింది?
నేను క్రిక్ ఇన్ఫోలో పనిచేస్తున్న రోజుల్లో, చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది. షార్ట్ కట్ కోసమని ఒక స్లమ్‍ గుండా వెళ్ళేవాడిని. ఓ రోజున ఆ దారిలో నాకో మరుగుజ్జు కనిపించారు. చాలా అందంగా ఉన్నారాయన. అప్పుడే, “ఇలాంటి వాళ్ళకి జీవితం ఎంత కష్టం” అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుండే ఈ నవల పుట్టింది.

మీ రచనని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? సినిమా, క్రికెట్ బుకీ, ముంబయి – వీటిలో ఒక పాత్రను నిలిపారా? లేక పాత్ర చుట్టూ వీటిని అల్లుకుపోయారా?
ముందుగా పాత్రనుకున్నాను. అక్కడ నుండీ కథలల్లుకుంటూ, కథకి తగ్గ తక్కిన పాత్రలనీ, వాతావరణాన్నీ సృష్టించుకుంటూ పోయాను. ఎప్పుడైనా పాత్ర మనముందుకి వచ్చేస్తేనే, అందుకనుగుణంగా మిగితావి ఏర్పరుచుకోవడం తేలిక అని నా అభిప్రాయం.

ప్రధాన పాత్రది ఎక్కువగా self talk చేసే నైజం.. కొన్ని సన్నివేశాలు, theatricalగా ఉన్నాయి. దాన్ని రాయటం మీకు ఎంత కష్టమయ్యింది?
ఈ పుస్తకం అచ్చు వేయడానికి హాపర్ కొలిన్స్ వాళ్ళు ఒప్పుకున్నాక కూడా చాలా డ్రాప్ట్స్ మారాయి. అందుకు ముఖ్య కారణం నరేషన్‍లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం వల్ల. ఈ రచనలో అన్ని పాత్రలూ బాహాటంగా పాఠకుని ముందుకి రావు. ఎంత వరకూ కావాలో ఆ మేరకే వస్తాయి. ప్రొజెక్షన్ రూంలో వెలుగు నీడల కాంబినేషన్ లానే ఇందులో నరేషన్నీ చూపించాలనుకున్నాను. ఇక అర్జీ అనేవాడిది డ్రీమర్ స్వభావం. అందుకోసమే వచనంలో ఎక్కువ హైఫెన్లూ, ఆశ్చర్యార్థకాలూ వాడాల్సి వచ్చింది.

మీ ఊహల్లోని అర్జీకి, పుస్తకంలోని అర్జీకి ఎంత తేడా ఉందని మీరనుకుంటున్నారు?
చాలా మట్టుక్కు అనుకున్నట్టుగానే వచ్చింది. ఈ రోజు ఈ పుస్తకాన్ని తెరిచి, ఏ పేజీలోనైనా ఏ పేరానైనా చదువుకుంటున్నప్పుడు, “అనుకున్నది చేశాను” అనే సంతృప్తి ఉంది. పుస్తకం కొని చదివేవాళ్లకి కూడా ఎక్కువ నిరాశ కలిగించదూ అనే నమ్మకం ఏర్పడింది.

రచనాకాలంలో మీరు తరచుగా చదివే పుస్తకాలను ( చంద్రహాస్ కొన్ని పత్రికల్లో లిటరరీ క్రిటిక్) ఎలా ఎంపిక చేసుకొన్నారు? వాటి ప్రభావం పుస్తకం మీద పడిందా?
క్రిటిక్ ని కనుక కొన్ని నచ్చని పుస్తకాలూ చదవాల్సి వస్తుంది. చదవటం ఎంతో ఇష్టంతో చేసే పని కాబట్టి అంత కష్టం అనిపించదు.  మంచి పుస్తకాలను చదివే అవకాశం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఈ రచన చేయడానికి అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయంలో అన్ని పుస్తకాలనూ చదివేను గానీ, రాయడానికి ఉపక్రమించే ముందు మాత్రం నా నోట్ బుక్ ని చదువుకోనేవాడిని. చదివే అలవాటున్నప్పుడు నోటుబుక్ పెట్టుకొని అందులో మనం చదివినవాటిలో నచ్చిన వాక్యాలు రాసుకొంటే, మనకి కావాల్సినప్పుడు చదువుకోవచ్చును. ముఖ్యంగా కొన్ని అద్భుతమైన వచనాలను చదివితే మన ఆంబిషన్స్ కూడా పెరిగి, బా రాయడానికి ప్రయత్నిస్తాము.

మీకు నచ్చే రచయితలూ? ఇప్పుడూ – అప్పుడూ?
సమకాలీన భారతీయ రచయితల్లో విక్రమ్ చంద్రా, అంజుం హసన్ తదితరులు. విదేశీయుల్లో ఒర్హాన్ పాముక్ – వారి “మై నేమ్ ఇస్ రెడ్” నాకు అత్యంత ఇష్టమైన నవలల్లో ఒకటి. ఇస్తాన్‍బుల్ – వారు రాసిన నాన్-ఫిక్షన్ కూడా నాకు అమితంగా ఇష్టం. పుస్తకాల్లో నా అభిరుచి నా బ్లాగులో తెలుస్తుంది.

ఈ రచనకోసం మీరెంత రిసెర్చి చేశారు?
ఈ నవలలో సినిమా, సినిమా వర్క్రింగ్ గురించి కొంత రిసెర్చి చెయ్యాల్సి వచ్చింది. అది కూడా కొంచెమే! అంత కన్నా రి-సెర్చ్ ఏమీ లేదు. ఈ సమస్య ఉన్నవారి దగ్గరకి వెళ్ళి వాళ్ళ గాధలు విని రాసింది కాదు. ఇది పూర్తిగా ఇమాజినేషన్ నుండి వచ్చినదే. వాళ్ళ కథలు తెలిస్తే, అవన్నీ నవలలోకి దూరి మొదటికి మోసం రావచ్చు.

ఆర్జీ అనే పేరు ఎందుకు పెట్టారు?
అది నవలలోనే చెప్పాను. మీరే చదువుకోండి.

ఈ పుస్తకాన్ని సినిమా తీస్తే అందుకు మీరు సమ్మతిస్తారా?
సినిమా తీస్తామంటే అది నాకు సంతోషమే! కాకపోతే నేనీ రచన సినిమా కోసం రాయలేదు. రైటర్ తన పనైన రాయడం చూసుకోవాలి. రేపు ఎవ్వరైనా సినిమా హక్కులు కొన్నా, సినిమా తీసే బాధ్యత పూర్తిగా వారిదే! నాకు ఎటువంటి సంబంధం ఉండబోదు.

మీకు సంతోషమేనా సినిమా తీస్తే?
ఇంకొన్ని కాపీలు అమ్ముడు పోతాయంటే, ఎందుకు సంతోషపడను!

ఈ నవల ముగింపు ఏంటో చెప్పమని అడిగితే చెప్తారా?
చెప్పను. మా అమ్మకి కూడా చెప్పననే చెప్పాను. తను నేరుగా చివరి పేజీలే చదివేసుకొంది. (నవ్వుతూ)

అర్జీలోని మరగుజ్జుతనం దేనికైనా ఉపమానమా?
(నవ్వుతూ) నేను అలా అనుకొని పెట్టలేదు. అది ఓ మనిషిలోని అసహజత్వం అంతే! ఈ పుస్తకం చదివి ఒక విలేఖరి, “Is the dwarfism you used was actually the dwarfism of Mumbai?” అని అడిగారు. (ఉన్న పది మందీ గొల్లుమన్నాం!) “నేను అలా అనుకోలేదు. మీరు ఏమనుకుంటున్నారో చెప్తే వినడానికి ఉత్సుకత ఉంది.

చంద్రహాస్ ఢిల్లీ యూనివర్సిటీలో ఇచ్చిన లెక్చర్ తాలూకూ విశేషాలని బ్లాగీకరించమంటే ఇచ్చిన జవాబు: I won’t put up notes or a transcript of the lecture because both the pleasure and the pith of it lies in its spontaneous (and sometimes less than logical) flow, which would only look ugly when tracked or recorded. దీన్ని నేను చాలా సమర్థవంతంగా పైన నిరూపించేశాను. రీడింగ్ సెషన్స్ ఇంత ఆహ్లాదంగా జరుగుతాయని అనుకోలేదు. సరదా, సరదాగా గడిచిపోయింది. వేరొక చోట, “I think, that interviewers are also interpreters” అన్నారు. Audience too.. అని నేను పైన రెండో విధంగానూ నిరూపించేశాను. కాబట్టి, తప్పులు దొర్లితే ముందస్తు క్షమాపణలు!

**************************************
Arzee, the dwarf
Author: Chandrahas Choudhary
Publisher: Harper Collins
Pages: 184
Price: 325

Available in all leading bookstores and online shopping sites.

Arzee in Middlestage.

You Might Also Like

2 Comments

  1. అరుణ పప్పు

    ఈ పుస్తకం చదువుదామని, ఈ రచయితను కలుద్దామని అనుకున్నాగానీ కుదర్లేదు. ఆ విశేషాలు పంచుకున్నందుకు సంతోషం.

Leave a Reply