‘ఎవరున్నా లేకున్న’ కవితా సంకలనం – ఒక అభిప్రాయం

రాసినవారు: సి.రఘోత్తమ రావు
[ఈ వ్యాసం మొదట తెలుగుపీపుల్.కాంలో 2006 లో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం.]

కవిత్వం ఒక ఆల్కెమీ లాంటిది
దాని రహస్యం కవికే తెలుసు

శ్రీశ్రీకి తెలుసు, తిలక్‌ కు తెలుసు, ఇస్మాయిల్‌ కు తెలుసు అని నేను అనుకుంటున్న తరుణం లో ‘నాక్కూడా తెలుసు’ అని నిశ్శబ్దంగా ప్రకటించిన కవి శ్రీ ముకుంద రామారావు గారు.

శ్రీ రామారావు గారు తెలుగు సాహితీ ప్రపంచానికి ఎలా సుపరిచితులో తెలుగుపీపుల్‌ డాట్‌ కాం కు కూడా అపరిచితులేమి కాదు. తోటి సాహితీ మిత్రుడు మూలా సుబ్రహ్మణ్య,్‌ రామారావు గారి రెండవ సంకలనమైన ‘మరో మజిలీకి ముందు’ పై రాసిన వ్యాసం వారి కవితా హృదయాన్ని ఇక్కడి నెటిజెన్స్‌ కు తేటతెల్లంగా తెలియపరిచింది.

కవి మనసును కవితలతోను, పరిణితిని సంకలనాలతోనూ కొలవచ్చు అని అనుకుంటే శ్రీ ముకుంద రామారావు గారి మనసు, పరిణితి కవిత నుండి కవితకు, సంకలనం నుండి సంకలనానికి అభివృద్ధి చెందుతూ ఉందనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ పురోగమనం లో భాగంగా మరో మజిలీని చేరుకున్న రామారావు గారు ‘ఎవరున్నా లేకున్నా’ అన్న తత్త్వ చింతనతో ‘నా మనసులోని నదికి అలలు కవిత్వం ’ అన్న నిశ్చయ జ్ఞానానికి వచ్చిన రీతి అవశ్య పఠనీయం .

వ్యక్తికి అనేక పార్శ్వాలు. స్త్రీకి కూతురిగా, భార్యగా, తల్లిగా……పురుషునికి కొడుకుగా, భర్తగా, తండ్రిగా….ఇలా వివిధాలైన పాత్రలు ఏక కాలంలో పోషింపబడతాయి. కవులు కూడా ఈ బంధాలకు, వాటి భావాలకు, భయాలకు అతీతులేమీ కారు. ఇలాంటి పార్శ్వాలను మనసులో దాచుకుని మర్చిపోయే ప్రయత్నం చేసే వారు ఉన్నట్టే పదాలలో వాటిని ప్రకటించే వారూ ఉంటారు. అందులో రామారావు గారు ఒక్కరు.

మీద పడుతున్న వయసు, రెక్కలొచ్చిన పిల్లల దూర తీర ప్రయాణాలు, కొన్ని పదుల సంవత్సరాల దాంపత్యం , వీడ్కోలు చెబుతున్న మిత్రులు, ఖండాంతరాలలో స్థిరపడిపోయిన తన పూర్వీకులు, తోటి కుటుంబీకులు…..ఇలా ‘కాదేదీ కవితకర్హం ’ అని రామారావు గారి ‘ఎవరున్నా లేకున్నా’ కవితా సంకలనం సాగిపోతుంది.

ఈ సంకలనం లోని 30 కవితల్లో 6 కవితలు రావు గారి కుటుంబ సభ్యుల గురించి రాసినవి. తమ తండ్రి గారి మరణానంతరం రాసిన ‘దారి బత్తెం ’ కవితలోని కొన్ని వాక్యాలు:

అవసరానికి చిల్లర పైసలు
అర్ధరాత్రో అపరాత్రో
ఎక్కడా కొనుక్కోలేని
ఎంత వెదికినా కొనుక్కోలేని
అనుభవమో

ఆఖరి దారిబత్తెం గా
నాన్న వదిలిన పైసలు
మేము

వంద సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికాకు వలస వెళ్ళిపోయిన తమ పూర్వీకుల గురించి రావు గారి ఆర్ద్రత ఏవిధంగా ఉన్నదంటే:

అక్కడే అలా
ఇంకిపోవటం , ఆరిపోవటంలోనే
ఆనందముందేమో

అవునా తాతయ్యా !

తొలిసారి తమను వదిలి విదేశాలకు వెళుతున్న కొడుకు గురించి ఒక తండ్రి పడ్డ వ్యథను ఒక కవిగా రామారావు గారు ఇలా ఆవిష్కరిస్తారు:

అత్తారింటికి పంపుతున్న అమ్మాయికి
అన్ని సముద్రాలావలకు
పంపుతున్న అబ్బాయికి
తేడా ఏమిటో తెలీదు

ఇవి కేవలం రామారావు గారి వ్యక్తిగత భావాలుగా కాకుండా వాటిని చదువుతుంటే చదువరికి కూడా అన్వయిస్తున్నట్టు అనిపించడం విశేషం .

తాత్త్వికుడు కాని మనిషి బ్రతుకుకు సార్థక్యం లేదని శాస్త్ర వచనం . అలాగే నిరంతరాన్వేషి కాని కవి సామర్థ్యం వృధా . బాహ్య ప్రపంచం లోని వాతావరణ మార్పులను గమనించకపోతే కవిత కూపస్థ మండూకమయ్యే ప్రమాదముంది. వస్తు వైవిధ్యతను పెంపొందించుకోలేని నాడు కవి కూడా అంధకార బిలం లాంటి భావాలకు గబ్బిలం లా వేలాడుతాడు. ‘ఎవరున్నా లేకున్నా’ సంకలనం లో ‘ఒకానొక న్యూ యార్క్‌ రాత్రి’ , ‘ఎండా నీడ’, ‘ఆమె చేతి వేళ్ళు’, ‘వెన్నంటి’, ‘పూచే పూలు పూస్తూనే ఉంటాయి’ వంటి కవితల్లో ఆవిష్కరింపబడ్డ పదచిత్రాలలో రామారావు గారు చూపిన వస్తు వైవిధ్యం పాఠకుల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది.

ఆద్యంత ప్రాసల ఢమఢమల్లో, అవార్డులే సంకలనాల అంతిమ లక్ష్యంగా, భయం గొలిపే వింత ప్రయోగాలతో దిక్కూ తెన్నూ కానకుండా పోతున్న తెలుగు వచన కవితకు నిశ్శబ్ద సౌందర్యాన్ని తెచ్చి పెట్టినది శ్రీ ఇస్మాయిల్‌ గారు. రామారావు గారు ఇస్మాయిల్‌ గారి ఏకలవ్య శిష్యులని ఆయన రాసిన ‘ఇస్మాయిల్‌ ’ కవిత చెబుతోంది.

‘కవిత వల్ల కవి’ అన్న సిద్ధాంతాన్ని రామారావు గారు త్రికరణశుద్ధిగా నమ్ముతారని ఈ సంకలనం చెబుతోంది. ‘బెంగాలులో పుట్టి పెరగడాన్ని, తెలుగు ఎనిమిది వరకు చదువుకోవడాన్ని, నాకు తెలిసిన కొద్దిపాటి పదజాలం తో నేను రాస్తున్నది కవిత్వమవునో కాదో తెలీదు’ అని ముందు మాటలో చెప్పుకోవడమే రామారావు గారి సిద్ధాంత శుద్ధికి నిదర్శనం . తమ సంకలన పుస్తకాల ముందు, వెనుక అట్టల పై అవార్డుల వివరాలను, మొదటి కొన్ని పుటల్లో లబ్ధ ప్రతిష్టుల లెటర్‌ హెడ్ల పై రాయబడ్డ అప్రస్తుత స్తుతుల మధ్య ఇలా తన గురించి, తన కవిత్వం గురించి సవినయంగా, సులలితంగా, నిష్కర్షగా చెప్పుకోవడం అరుదు. బహుశా ఈ వినయమే రామారావు గారి కవితలకు సహజత్వాన్ని ఇస్తున్నదని నా అభిప్రాయం .

ఈ సంకలనం లో కొన్ని అద్భుతమైన వాక్యాలున్నాయి. వాటిని పాఠకులతో పంచుకుని ఈ వ్యాసాన్ని ముగిస్తాను:

‘చీకటిని వెలుగుతో తుడుచుకుంటూ నిద్ర లేవడమే ఉదయం ’

‘వేధించి వేధించి రూపుదిద్దుకున్న వాటి కంటే
ఎంత బాధించినా బయటకు రాలేకపోయిన మంచి పద్యాలెన్నో’

‘పగలు కూడా వెలుగుతున్న వీధి దీపం
ఏ దాపరికమూ లేని అద్దం – ముసలి మొహం ’

‘మనిషికి మరో మనిషి అద్దం ’

‘అవసరం తీరిన అద్దం లో
పగిలిన శిల్పం – మనిషి’

‘ఎండలకెండి వానకు తడిసి
నిలదొక్కుకున్న మొక్కలు
ఎక్కడైనా వికసిస్తూనే ఉంటాయి’

‘ఎవరున్నా లేకున్నా
పూచే పూలు పూస్తూనే ఉంటాయి’

================================================================
ప్రతులు దొరికే చిరునామా:

నిషిత పబ్లికేషన్స్‌
1-7-23/1, వీధి నెం : 8,
హబ్సిగూడా, హైదరాబాద్‌ – 7

రామారావు గారి ఈమైల్‌ : mukundaramarao@hotmail.com

You Might Also Like

2 Comments

  1. పుస్తకం » Blog Archive » మరో మజిలీకి ముందు

    […] వ్యాసాలు: 'ఎవరున్నా, లేకున్నా' పై ఇక్కడ, మరియు 'నిశబ్దం నీడల్లో' పై ఇక్కడ. – […]

Leave a Reply