Mohanaswamy: Vasundhendra Chanda

వసుధేంద్ర రాసిన “యుగాది” కథల సంపుటిలో “బ్రహ్మసృష్టి” అని ఒక చిట్టి కథ ఉంటుంది. ఇందులో నాయకుడికి పుట్టినప్పటినుంచి ఆకుపచ్చ రంగు ఎర్రగా, ఎరుపు రంగు ఆకుపచ్చగాను కనిపిస్తుంటుంది. ఆ విషయం అతడి తల్లిదండ్రులూ గమనించలేకపోతారు. ఈ మనిషి తన జీవితాన్ని అందరిలానే సాఫీగా కొనసాగిస్తాడు. ట్రాఫిక్ లైట్ల దగ్గర అతడికి ఆకుపచ్చ కనబడగానే (అంటే మనకి ఎరుపు) ఆగిపోతాడు. సిగ్నల్ ఎర్రగా (మనకి పచ్చ) మారగానే ముందుకెళ్తాడు.  అతడికి రైల్వే గార్డుగా ఉద్యోగం! ఎప్పుడూ ఒక తప్పు కూడా చేయడు. అతడికి మసీదుపై ఎర్ర జెండాలు, గుడిపై ఆకుపచ్చ రంగు జెండాలు కనిపిస్తాయి. (ప్రస్తుతం దేశం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటిదేదో జరిగితే తప్ప సమతా-మమతలు కనిపించే అవకాశాలు లేవు.) అందరిలానే పెళ్ళి-పిల్లలు-వాళ్ళ పెళ్ళిళ్ళు-వాళ్ళ పిల్లలు లాంటి భవసాగారాలన్నీ ఈదుతాడు, ఆకుపచ్చని ఎర్రగా, ఎరుపుని ఆకుపచ్చగా చూస్తూనే. అలా చూస్తూ చూస్తూనే పోతాడు.

వసుధేంద్ర రాసిన మోహనస్వామి చదువుతున్నంత సేపూ నాకు ఈ కథే మదిలో కదలాడుతూ ఉంది. మోహనస్వామి నవలే కాదు, రచయిత జీవితాన్నంతా క్రోడీకరించి నాలుగు ముక్కల్లో చెప్పాలంటే పై కథలాంటిదేదో తయారవుతుంది. అయితే పై కథలో, అతడికి లోపం ఉన్నట్టు ప్రపంచం పసిగట్టలేదు. అతడికి కనిపించేది ఎరుపైనా దాన్ని “ఆకుపచ్చ రంగు”గా పిలిస్తే ప్రపంచానికి ఏ ఫిర్యాదులూ ఉండవు. అలా కాకుండా, తాను చూస్తున్నది ఎరుపని, అది ఆకుపచ్చకాదని అతడు చెప్పాల్సి వస్తే మాత్రం పెద్ద తగాదా అవుతుంది. జీవితకాలం నడిచే తగాదా. తనవాళ్ళకి దూరమైయ్యేంత తగాదా. తనని తాను అసహ్యించుకునేంత తగాదా. బ్రహ్మసృష్టిని ఈసడించుకునే మనుషుల మధ్య మసలలేక, అలా అని బ్రహ్మసృష్టికే ఎదురుతిరగలేక, క్షణక్షణం చిత్రవధతో కూడిన తగాదా!

సమాజం తన సౌకర్యార్థం ఏవో కొన్ని నియమనిబంధనలు విధించుకుంటుంది. అందరూ దానికి లోబడి ఉండాలని ఆశిస్తుంది. అప్పుడే మానవాళి సుఖశాంతులతో వర్థిల్లుతుందని నమ్మిస్తుంది. అందుకే మనుషులని ఆడా, మగా అంటూ విడదీసింది. బైనరీ సంఖ్యలు రెండే – ఒకటీ, సున్నా. ఆడకి సున్నా, మగకి ఒకటి వాల్యూ ఇచ్చేసింది. ఆడ, మగ కూడచ్చు – మళ్ళీ అందులో కూడా బోలెడన్ని నిబంధనలు, కానీ వాళ్ళ కలయికే “సహజం” అని నొక్కి వక్కాణించింది. కానీ బ్రహ్మసృష్టి అది కాదాయే! సున్నాకి, ఒకటికి మధ్య ఎన్నో కాంబినేషన్సు. వాళ్ళంతా ఏమైపోయారు? ఏ అగాధంలోకి పడిపోయారు? ఇప్పటికైనా వసుధేంద్ర గొంతు చించుకొని అరకపోయుంటే వాళ్ళంతా ఉన్నారని మనం ఎప్పటికి గుర్తించేవాళ్ళం?

ఈ పుస్తకం ప్రస్తావన రాగానే “వివాదాస్పదం” అన్న పదం మాత్రం తప్పక తగులుతుంది. కనీసం ఒక్కసారైనా. ఎలా వివాదాస్పదం కాకుండా ఉండగలదు ఈ పుస్తకం? ఏం, ఎరుపు చూపించి ఆకుపచ్చంటే ఊరుకుంటారా మీరు? వాదులాడరు? అది ఎరుపే అని నిరూపించడానికి ప్రయత్నించరూ? ఎంతకీ వినకుంటే ఒక పది మందిని పోగుచేసుకొని వచ్చి, అందరి చేతా ఎరుపు అనిపించి, “మెజారిటి విన్స్!” అని విజయం ప్రకటించుకోరూ?

ఈ రచనా అంతే! ఎన్ని సినిమాల్లో అందమైన పాటల్లో దాంపత్యపు సాంగత్యం గురించి వర్ణనలు వినలేదు. ఒక ఎస్పీ.బీ – ఒక సుశీల. ఒక శోభన్ బాబు – ఒక జయప్రద. ఏం? అదే, ఒక ఎస్పీ.బి – ఒక రామకృష్ణ అయితే? ఒక శోభన్ బాబు – ఒక కృష్ణ అయితే?

అయితే?

అయినా కూడా అంతే అందంగా ఉంటుంది, అంతే నిండుగా ఉంటుందని చూపించే రచన ఇది. ఇందులో స్వలింగ సంపర్కులు సమాజంలో ఎదుర్కునే సమస్యలు, తమ అవస్థను కుటుంబాలకి విడమరచి చెప్పలేని వివశత, అసలు తమ అవస్థ ఎందుకో, ఏమిటో అర్థం కాక కొట్టుమిట్టాడే సందర్భాలు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతాన, కర్ణాటక రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో పెరిగి పెద్దై, మరో మగవాడిని మాత్రమే కోరుకునే మగాళ్ళ కథలున్నాయి. వీళ్ళకి ఏ సహాయమూ లేదు – ఆఖరికి భాష కూడా అక్కరకు రాదు. మగాడిని కోరుకునే మగాడిని ఏమంటారన్నదే, అసలు ఏమన్నా అంటారా అన్న దగ్గరనుండే దినదిన గండం మొదలవుతుంది. అసలు ఏమంటారో తెలీదు గానీ, “మగ వేశ్య”, “ఆడ పులి” లాంటి కొసరు పేర్లకేం లోటులేదు.

అలా భాషే దాగుడుమూతులు ఆడుతుంటే, అందుల్లోంచే రచయిత ఒక కొత్త వ్యాకరణం పుట్టించాడు. కోరుకున్న మగవాడి సాంగత్యంలో మరో మగవాడు పొందే ఆనందం, నిండుదనం పసుపుకుంకుమలతో కళకళలాడే ముత్తైదువులానే, చంటాడిని ఒక చేత పట్టుకొని నిండు కూరగాయల సంచితో వచ్చే ఇంటి యజమానిలానే ఉంటుందని ఈ రచన చేసి నిరూపించాడు. చట్టాన్ని అడ్డంబెట్టుకొని ఇన్నాళ్ళూ వాళ్ళు చెట్టాపట్టాలేసుకొని తిరిగే వీలులేకుండా చేసినా, అవగాహానా లోపంతో “అలాంటి వార”ందరిని ఈసడించుకొని అనరాని మాటలూ అన్నా, భయంభయంగా నక్కినక్కి దాక్కున మూలల్లోనే వాళ్ళు పొందిన సాంగత్యపు మధురిమలు మనం సాహిత్యంలోనూ, సినిమాల్లోనూ లౌడ్ స్పీకర్లలో అరచి చెప్పుకున్నవాటిలానే బాగుంటుందని చూపించే రచన ఇది.

రచయిత పదాలకోసం తడబడలేదు. ఊగుతున్న రెండు పెద్ద పూల వెనుక తన పాత్రలచేత  ముద్దుపెట్టించలేదు. ఇద్దరు కౌగిలించుకోగానే కట్ చేసి పాట వేయలేదు. ఉన్నది ఉన్నట్టు, అక్కడ జరగడానికి అవకాశమున్నదానిని జరుగుతున్నట్టే రాశాడు. ఇదేమో ఆయన కథే అంటారు, కొందరు. ఇది ఆటోఫిక్షనా? ఆటోబ్రయోగ్రాఫికల్ ఫిక్షనా? అన్నది తర్వాత ప్రశ్న. మన సాహిత్యానికి అలవాటులేని కొత్త వ్యక్తీకరణ ఇది. అయినా సాహిత్యమంతా దాదాపుగా మగవాళ్ల సొత్తేగా – అందులో శరీర వర్ణన అంటే అధికశాతం కమలనయనాలు, శంకంలాంటి మెడ, భారీగా ఉండే వక్షస్థలాలు, పిడికెడు నడుము వగైరాలే కదా! వాటి ప్రస్తావనే అవసరంపడని అరుదైన రచన కూడా ఇది. 😉  

“At times, I wished that my genitals were prosthetic, something I could slip out of. They were a constant drone of stimulation; their requests hummed aloud throughout my life like a never-ending soundtrack.” అని వాపోతుంది ఎలెస్సా నెట్టింగ్ రాసిన “తంపా” నవలలోని ముఖ్యపాత్ర. ఆ సౌండుట్రాకుని నిసిగ్గుగా రాసి వినిపించినవాళ్ళందరిని లోకం “జుగుప్స”, “అశ్లీలం”, “అభ్యంతరకరం”, “వివాదాస్పదం” అన్న పేరులతోనే సత్కరిస్తుంది. లోకం ఏమంటుంది అన్నది కాదు సమస్య ఇక్కడ, ఒక మనిషిగా మనిషిగా మనం ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నామన్నదే సమస్య. అలా అర్థం చేసుకోడానికి మన సాహిత్యాన్ని, మన భాషని, మన కళలని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నామన్నదే మన ముందున్న సమస్య.

మోహనస్వామి వినిపించే రాగాలూ సమ్మోహనంగా ఉన్నాయి. వినండి. బ్రహ్మసృష్టిలోని అందం మరింతగా అవగతమవుతుంది.

గమనిక:

ఈ రచన ఇప్పుడు తెలుగు అనువాదంలో కూడా లభ్యం.

తెలుగు అనువాదంలోని కొంత భాగాన్ని వేంపల్లె షరీఫ్ ఇక్కడ చదివి వినిపించారు.

 

You Might Also Like

One Comment

  1. సౌమ్య

    Very well written!

Leave a Reply