ఏడు కథల నవల – బ్రూస్టర్ ప్లేస్ స్త్రీలు (The Women of Brewster Place)
ఏ బీచ్‌లో నడుస్తున్నప్పుడో మనకాలికి తగిలిన రాయిని యథాలాపంగా చేతిలోకి తీసుకొని ఇంటికి పట్టుకెళ్ళాక పరీక్షగా చూస్తే అది ధగద్ధగాయమానంగా ప్రకాశించే అపురూప రత్నమని తెలిసిన అనుభవం ఈ వారం నాకు కలిగింది. ఆర్కే నారాయణ్ నవలలను తెచ్చుకొందామని లైబ్రరీకి వెళితే, లైబ్రేరియన్లు ఎంపికచేసి పెట్టే పుస్తకాల అరలలో గ్లోరియా నేలర్ వ్రాసిన ‘ద ఉమెన్ ఆఫ్ బ్రూస్టర్ ప్లేస్’ అనే నవల కనిపించింది. రెండు దశాబ్దాల క్రితం బ్రూస్టర్ ప్లేస్ అని ABC నెట్వర్క్‌లో ఒక సిరీస్ కొంతకాలం నడిచిందని గుర్తుంది కానీ నేనెప్పుడూ చూడలేదు. పరిచయమైన పేరు, ఒకసారి చూద్దాం అని తీసుకున్నాను. వస్తుపరంగా, రచనాపరంగా నన్ను ఇంతగా కదిలించిన పుస్తకం ఇటీవలికాలంలో లేదు.
ఈ నవల నన్ను గట్టిగా పట్టుకొని కుదిపేసింది. మనసులో విపరీతమైన భారం నింపి కళ్ళు చెమరించింది. నన్ను నేను ప్రశ్నించుకొనేట్టు చేసింది. ఈ ఉద్వేగమే చాలా కాలం తర్వాత నాతో హడావిడిగా ఈ పరిచయాన్ని రాయించింది.
ఒక పెద్ద నగరంలో చాలా ఏళ్ళ క్రితం ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టటానికి పర్మిట్ కోసం ప్రయత్నిస్తున్న ఒక కంట్రాక్టర్, పేదవాళ్ళు చౌకగా ఉండగల కొన్ని ఇళ్ళు కట్టటానికి ఒప్పుకుంటాడు. అలా పుట్టిన కాలనీ పేరే బ్రూస్టర్ ప్లేస్. కాలనీ కట్టిన మొదట్లో అందులో ఐరిష్ వాళ్ళు ఉండేవారు. వాళ్ళ పిల్లలు ఆ కాలనీలో కాకుండా వేరే చోట్ల స్థిరపడ్డారు. ఆ తర్వాత అక్కడ ఇటలీనుంచి వచ్చినవారు స్థిరపడ్డారు. ఈలోగా కాలనీ పక్కన పెద్ద రోడ్డు రావటంతో కాలనీకి రోడ్డుకూ మధ్య ఒక పెద్ద గోడ కట్టేశారు. దాంతో ఆ కాలనీ ప్రధాన జీవన స్రవంతికి దూరం అయ్యింది. నెమ్మదిగా ఆ కాలనీలోకి నల్లవారు రావడం, తెల్లవారు వెళ్లిపోవడం మొదలై కథాకాలానికి కాలనీ నిండా నల్లవారు ఉంటున్నారు. ఆ కాలనీలో ఉన్న ఏడుగురు స్త్రీల కథలు ఈ పుస్తకం.
“శిథిలమౌతున్న భవనాల మధ్య పట్టుదలగా తిరుగుతూ, తమ గూటిని నిర్మించుకోవాటనికి ప్రయత్నించే తన రంగుజాతి పుత్రికలంటే బ్రూస్టర్ ప్లేస్‌కు మురిపెం… పైకి కాఠిన్యం, లోపల మృదుత్వం; పరమ గయ్యాళితనం, చిన్నదానికే సంతృప్తిపడటం ఈ బ్రూస్టర్ ప్లేస్ స్త్రీల లక్షణాలు. ఇక్కడికి వస్తూ, వెళ్ళిపోతూ, మళ్ళీ వస్తూ, ఇక్కడే తమ వయస్సుని మించిన వార్ధక్యాన్ని పొందే ఈ ప్రతి కారునల్లని ఫీనిక్స్ పక్షికీ తనదైన ఒక కథ ఉంది.”
(#Begin Spoiler Alert # ఈ పుస్తకం చదివే ఉద్దేశం ఉంటే, మీరు ఈ పరిచయం చివరి భాగాలకి వెళ్ళిపోవటం మంచిది. లేకపోతే ఈ కథలు ఎలా నడుస్తాయో మీకు ఇప్పుడే తెలిసిపోతుంది).
మాట్టీ (Mattie) మైకేల్ టెన్నెసీలో ఒక మారు మూల గ్రామంలో తల్లితండ్రుల చాటు అల్లారుముద్దుగా పెరిగిన పిల్ల. ఒక మగవాడి ఆకర్షణలో పడి గర్భవతి అయ్యింది. తండ్రి కోపించాడు. ఆమె ఇల్లు విడిచి తన స్నేహితురాలి సాయంతో ఈ నగరానికి వచ్చింది. ఒక మగ బిడ్డ పుడితే, బేసిల్ అని పేరు పెట్టి ప్రాణంగా పెంచుకుంది. ఆ బిడ్డ పెంపకానికి ఇబ్బంది పడుతుంటే, ఈవా టర్నర్ అనే తెల్ల పెద్దావిడ మాట్టీకి నీడ ఇస్తుంది. తన బిడ్డే జీవంగా బతుకుతున్న మాట్టీ, ఉద్యోగం చేస్తూ డబ్బు దాచుకొంటూ, ఈవా చనిపోయాక ఆ డబ్బుతో ఈవా ఇంటిని కొనుక్కొని అక్కడే ఉంటుంది. అల్లారుముద్దుగా పెరిగిన బేసిల్ బార్‌లో పోట్లాటలో ఎవర్నో చంపేసి అరెస్టు ఔతాడు. ఇల్లు తాకట్టుగా అతనికి జామీను కట్టి బైటకు తెస్తే, విచారణ సమయానికి అతను పత్తా లేకుండా పోతాడు. స్వంత ఇంటిని కోల్పోయిన మాట్టీ బ్రూస్టర్ ప్లేస్‌లో అద్దెకి చేరుతుంది.
మాట్టీకి మొదట్లో నగరంలో ఆదరణ ఇచ్చిన ఎట్టా మే జాన్సన్ ఒక స్వేచ్ఛా జీవి. జీవితాన్ని పూర్తిగా అనుభవించటానికి ప్రయత్నించే ఎట్టా చాలామంది మగవారితో అనేక నగరాలలో జీవించింది. ఎక్కడా సంతృప్తి కలగని, స్థిరపడలేని ఎట్టా మళ్ళీ ఈ నగరానికే తిరిగి వచ్చి బూస్టర్ ప్లేస్ చేరింది. సమాజంలో గౌరవ మర్యాదలతో బతుకుతున్న ఒక మతాచార్యుణ్ణి పెళ్ళి చేసుకుందామని ఆశపడింది. కానీ అతనికి కావల్సింది ఆమెతో ఒక అనుభవం మాత్రమే.
ఆ నగరంలోనే మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కిస్వానా బ్రౌన్ అసలు పేరు మెలనీ. కాలేజీలో చదువుకునే రోజుల్లో నల్లజాతి అభివృద్ధికోసం పనిచేస్తున్న తీవ్రవాదుల్లో కలసిన మెలనీ తన ఇంటిని, పేరును, కాలేజీని వదిలేసి కిస్వానా అనే ఆఫ్రికన్ పేరు పెట్టుకొని, బ్రూస్టర్ ప్లేస్ చేరింది. తనతోపాటు పనిచేసిన వారందరూ ఉద్యమాన్ని వదిలేసి జీవితంతో రాజీ పడిపోయారు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన ప్రేమికుడు అబ్షూతో కలసి నల్లవారి అభ్యుదయంకోసం తాను చేయగల ఉద్యమాల గురించి కలలు కంటూ ఉంటుంది. ఒకరోజు తనను చూడటానికి వచ్చిన తల్లితో ఘర్షణ పడ్డాక ఆశయాల కలల ప్రపంచం లోంచి బయటకు వస్తుంది. కాలనీ వాళ్ళని సంఘటితపరచి, కాలనీ పరిస్థితుల్ని మెరుగుపరచటానికి ప్రయత్నిస్తుంది.
సీల్ (లుసిల్లా లూయిస్ టర్నర్) యూజీన్‌ను ప్రేమిస్తుంది. మొదటి బిడ్డ సెలీన్ పుట్టాక ఆమెను వదిలేసి కొంతకాలం దూరంగా ఉన్న యూజీన్ సీల్ దగ్గరకు తిరిగివచ్చినప్పుడు, అతనికి అసహనమూ, స్వార్థమూ ఎక్కువని తెలిసినా మళ్ళీ స్వీకరిస్తుంది. ఆమె రెండోసారి గర్భవతి అవటం, యూజీన్‌కి ఇష్టం లేకపోవటంతో, అతన్ని నిలబెట్టుకోటం కోసం, ఇష్టం లేకున్నా గర్భస్రావం చేయించుకొంటుంది. ఐనా ఆమెను విడచివెళ్ళటానికి యూజీన్ నిశ్చయించుకొంటాడు. యూజీన్ ప్రేమని కలకాలం తాను పొందలేను అన్న సత్యం సీల్ గ్రహించుకొనే సమయంలోనే ప్రమాదవశాత్తు సెలీన్ చనిపోతుంది. అతిలోతైన మనోమాంద్యం (డిప్రెషన్) లోకి కుంచించుకుపోయిన సీల్‌ను మాట్టీ ప్రేమ బయటకు తెస్తుంది.
కోరా లీకి చిన్నప్పట్నుంచి చక్కటి చంటిపాప బొమ్మలతో ఆడుకోవడం ఇష్టం. ప్రతి క్రిస్టమస్‌కి తను కోరుకొనే బహుమతి ఒక్కటే – కొత్త బేబీ డాల్. కోరా వయసు పెరుగుతుంది, ఇంకా చిన్నపిల్లల బొమ్మలెందుకని తండ్రి ఖరీదైన బార్బీ బొమ్మల్ని తీసుకువస్తే వాటిని ముక్కలు చేసి పడేస్తుంది. ఈ ఒక్క వింత పోకడ తప్పించి మిగతా విషయాలన్నిట్లోనూ బాగానే ఉంటుంది. కొద్దిగా వయసు వచ్చాక నిజం పిల్లలు ఎలా వస్తారో తెలుస్తుంది. అప్పటినుంచీ పిల్లల్ని కనేస్తూ ఉంటుంది. చంటిపిల్లలతో ఆడుకుంటూ వారిని పెంచుకోవటంలో చాలా ఆనందం పొందుతూంటుంది. ఐతే, చంటి పిల్లలు పెరిగి పోతారు. వాళ్ళు అల్లరి చేస్తూంటారు. స్కూలుకి వెళ్ళాలి. చదువుకోవాలి. ఆటలాడుకోవాలి. ఖర్చులుంటాయి. వాళ్ళను సరిగా చూసుకోవటానికి సమయం కావాలి. కోరా పిల్లల తండ్రులు పిల్లలపట్ల బాధ్యత తీసుకోరు. ఇందరు పిల్లలను సాకటానికి తీరిక, ఓపిక లేని కోరా బాధ్యతారహితమైన తల్లిగా అందరి మాటలు పడటం తప్ప మరేం చేస్తుంది? ఆ పరిస్థితుల్లో కోరాకు కిస్వానా పరిచయమౌతుంది.
బ్రూస్టర్ ప్లేస్ కి కొత్తగా వచ్చిన ఇద్దరు అందమైన అమ్మాయిలు లొరెయిన్, థెరెసాలు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా ఉంటూంటారు. ఐతే వారిద్దరూ స్వలింగ ప్రేమికులన్న అనుమానం చుట్టుపక్కలవారికి వస్తుంది. లొరెయిన్ చిన్నపిల్లల స్కూల్‌లో పంతులమ్మగా పని చేస్తూ ఉంటుంది. అందరితోనూ కలివిడిగా ఉండాలని ప్రయత్నిస్తుంది. సమాజమంటే భయపడుతుంది. థెరెసాది వ్యతిరేక స్వభావం. ఏమన్నా లెక్కలేదు. లొరెయిన్ మెతకతనం పట్ల కొద్దిగా చిరాకు పడుతుంటుంది. కాలనీవాసుల మీటింగ్‌లో పాల్గొనడానికి వెళ్ళిన లొరెయిన్ తీవ్రంగా అవమానింపబడుతుంది. ఆ సమయంలో అక్కడి బిల్డింగ్ రిపేర్లు చూసే తాగుబోతు బెన్ ఆమెకు తోడుగా నిలుస్తాడు.
తాగుబోతు బెన్‌ది మరొక కథ. భార్య గయ్యాళితనానికి, ఆశపోతుతనానికి, కన్నకూతురుని కోల్పోయి తాగుడిని ఆసరాగా చేసుకుని జీవితాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు లొరెయిన్‌కి బాసటను స్వాంతనను ఇవ్వగల మిత్రుడయ్యాడు. ఆ సంఘటన తర్వాత లొరెయిన్ స్వభావంలో మార్పు వస్తుంది. కానీ, కాలనీలో ఉండే కొందరు గూండాల చేతిలో అత్యాచారానికి గురవుతుంది లొరెయిన్. ఆ దాడి ఫలితంగా లొరెయిన్, బెన్ చనిపోతారు.
లొరెయిన్ మరణించిన కొన్నాళ్ళకు, కాలనీవాసుల సంఘానికి నిధులకోసం కిస్వానా (మెలనీ) ఒక పిక్నిక్ ఏర్పాటు చేసింది. వారం రోజుల ముసురు తర్వాత మొదటిసారిగా ఆ రోజు ఫెళ్ళున ఎండ వచ్చింది.
(End Spoiler Alert)
నిజానికి ఇవి ఏడు విడివిడి కథలు. దేనికదే స్వతంత్రంగా మనగల బలమైన గొప్ప కథలు. ఐనా ఈ ఏడు కథలనూ కలిపే అంతస్సూత్రాలు కొన్ని ఉండటంతో ఇది మంచి నవల అయ్యింది. ఈ కథల నాయికలందరూ ఒక్క చోట నివసించటమే ఈ కథల మధ్య ఉన్న సామ్యం కాదు. ఈ కథలన్నీ ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబపరంగా బలహీనులైన పతితుల, భ్రష్టుల వ్యధార్త జీవిత యదార్థ దృశ్యాలు. ఈ కథల్నీ పాత్రల్నీ రచయిత్రి నెమ్మదిగా కలుపుకుని వస్తూ, ఇవి విడి కథలు కావనీ, ఒక్కటే నవల అని మనల్ని తేలిగ్గానే ఒప్పిస్తుంది.
ఈ నవలలోని పాత్రలన్నీ జవసత్వాలున్న పాత్రలు, జీవం నిండిన పాత్రలు, గుర్తుండిపోయే పాత్రలు. ఈ స్త్రీల ప్రవర్తన, వారి జీవితాలు అసహజమనీ అసంగతమనీ ఎక్కడా అనిపించవు. వారి ప్రేమలు నిజం. వారి బలహీనతలు నిజం. కష్టాలను తట్టుకుని నిలబడ్డ వారి మనోధైర్యం నిజం. కష్టాలకు కుంగిపోయిన వారి మానసిక స్థితి నిజం. వారి గెలుపులూ, ఓటములూ అన్నీనిజం అనే అనిపిస్తాయి. ముఖ్యపాత్రలనే కాదు, వారి చుట్టూ ఉన్న చిన్న పాత్రలనీ మరచిపోవటం కష్టమే. ఈ రచయిత్రికి ఉన్న బహు పార్శ్వాల సామాజిక అవగాహన మెచ్చుకోదగ్గది. ఆ అవగాహనే ఈ పాత్రల్నీ, సంఘటనల్నీ బలంగా తీర్చిదిద్దింది.
వీటన్నిటంత, గట్టిగా మాట్లాడితే వీటన్నిటికన్నా, ముఖ్యమయింది ఈ రచయిత్రి శైలి. పాత్రల చిత్రణ గురించి, సంఘటనల గురించి ముందే చెప్పాను. కథా నిర్మాణంలో (structure), కథనంలో (narration), కథనవేగంలో (tempo), భాష ఉపయోగంలో అబ్బురమనిపించే ప్రతిభను చూపించింది గ్లోరియా నేలర్. ఎక్కడ ఎన్ని మాటలు ఎలా వాడాలో తెలిసిన రచయిత్రి. చాలాసార్లు చదివిన వాక్యాలనీ, పేరాలనీ భలే రాసిందే అనుకుని, మళ్ళీ వెనక్కు వెళ్ళి చదువుకున్న సందర్భాలు ఎన్నో ఈ చిన్న పుస్తకంలో. మాట్టీ కొడుకు మాయమైనప్పుడు, సీల్ దాచుకొన్న దుఖం ఒక్కసారిగా వెల్లుబికినప్పుడు, కిస్వానా తల్లి కిస్వానా ఆలోచనల డొల్లతనాన్ని బయటపెట్టినప్పుడు, బెన్ కుమార్తె కథ చెప్పినప్పుడు, అనేక ఇతర కీలక సన్నివేశాల్లో ఈ రచయిత్రి కౌశల్యం ఆ సన్నివేశాల్ని మరింత ఎత్తుకు తీసుకు వెళ్తుంది; గుండెల్ని సూటిగా బలంగా వాడిగా తాకుతుంది. ఒక్క కాలనీ పిక్నిక్ అధ్యాయంలో మాత్రం రచయిత్రి కొంత తొట్రుపడింది అనిపించింది.
రచయిత్రి గ్లోరియా నేలర్ (1950-2016) న్యూయార్క్‌లో హార్లెమ్ లో పెరిగింది. తల్లితండ్రులు మిేస్సిస్సిపీ రాష్ట్రం నుంచి వలసవచ్చిన కౌలురైతులు. ఆమె తల్లి పెద్దగా చదువుకోకపోయినా గ్లోరియాలో చదువు పట్ల తృష్ణని పెంచటానికి కృషి చేసింది. సహజంగా సిగ్గరి ఐన గ్లోరియాకు ఒక డయిరీ కొని ఇచ్చి తన అనుభూతులను అందులో రాసుకొమ్మని చెప్పిందట. అప్పట్నుంచీ గ్లోరియా ఆపకుండా రాయటం మొదలు పెట్టింది. స్కూల్లోనూ, కాలేజీలోనూ విపరీతంగా సాహిత్యాన్ని చదువుకొంది. ఆమె కథలను చదివిన కొంతమంది సంపాదకుల ప్రోద్బలంతో, ఆ కథలను ఒక చోట చేరుస్తూ. ఈ ఉమెన్ ఆఫ్ బ్రూస్టర్ ప్లేస్ నవలను రాసింది. ఈ పుస్తకానికి 1983లో ‘మొదటి నవల’ విభాగంలో నేషనల్ బుక్ అవార్డ్ వచ్చింది (ఆ సంవత్సరం, యాలీస్ వాకర్ రాసిన ద కలర్ పర్పుల్ కు నవల విభాగంలో నేషనల్ బుక్ అవార్డ్ వచ్చింది). తర్వాత గ్లోరియా నేలర్ ఇంకో ఐదు నవలలు రాసింది.
1989లో ఓప్రా విన్‌ఫ్రే ఉమెన్ ఆఫ్ బ్రూస్టర్ ప్లేస్ ను టీవీ సీరియల్ గా నిర్మించటమే కాక స్వయంగా మాట్టీ మైకేల్ పాత్రను పోషించింది.
కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో గ్లోరియా నేలర్ నాలుగు నవలలు రాయాలనీ, వాటిలో ఒక్కటైనా తన తర్వాత నిలచి ఉండాలనీ, నిశ్చయించుకొందట. అనుకొన్నది నిజంగానే సాధించింది.
—
The Women of Brewster Place: A Novel in Seven Stories
Gloria Naylor
First Published: 1982
192 pages.
varaprasad.k
మన తెలుగు దర్శక రచయితల కాపీ జ్ఞానానికి ముచ్చట వేస్తుంది, మామూలుగా మన ప్రేక్షకులు వాళ్ళ అభిమాన నాయకుడి పాటలు పైటింగులు డైలాగులు బావుంటే చాలు ఇక మిగతావి ఏమీ పట్టించుకోరు, ఓ ప్రముఖ నటుని చిత్రంలో ఇదే సన్నివేశం, పూరి గుడిసెలు పీకి ఇల్లు కట్టించడం, అందుకు ప్రతిగా కొంత స్దలం ఆయన కమర్షియల్ ప్లాట్స్ వేసుకొని అమ్ముకోటం,, ఆ తరువాత ఆవిషయం ఆగిపోయింది. సినిమా చూసిన ఇంతకాలానికి ఈ రివ్యూ చదువు తుంటే అదంతా గుర్తు వచ్చింది.
2018లో నా పుస్తకాలు | పుస్తకం
[…] The Women of Brewster Place – Gloria Naylor; liked it. […]