కొన్ని ప్రేమలు , యెన్నో వెతలు – కాసిన్ని కథలు : వొక లోచూపు

వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్

(పలమనేరు బాలాజీ ‘ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు’ – కథల సంపుటికి ముందుమాట. పుస్తకావిష్కరణ డిసెంబర్ 23న జరుగనుంది.)
*******************

‘ఆమె భాష వేరైంది. అతడి భాష వేరైంది. ఇద్దరూ అప్పుడప్పుడూ అయినా – మాట్లాడుకుంటున్నా , ఏమీ వినపడని, వినిపించుకోని స్థితిలోకి వాళ్ళు వెళ్లిపోయాకా ఇక వాళ్ళు జీవితంలో చెయ్యడానికి ఏమీ లేకపోయింది. బహుశా జీవించడానికి ఏమీ లేకపోయింది.’
– సూపర్ మార్కెట్

పలమనేరు బాలాజీ ‘సూపర్ మార్కెట్’ కథలోని యీ రెండు మూడు వాక్యాలు చదివాకా వొక వూపిరాడని తనం, వొక నిస్సత్తువ, అమూల్యమైనది యేదో కోల్పోతామన్న భయంతో కూడిన వొక అపరాధ భావన హఠాత్తుగా నన్నలుముకొన్నాయి. మనుషులలోకి మార్కెట్ ప్రవేశించాకా మనుషుల మధ్య చోటుచేసుకోవాల్సిన సహజాతాలు విప్పుకోవాల్సిన మాటల మూటలు పెనవేసుకోవాల్సిన బంధాలు మార్కెట్ విలువగా మారాకా మనిషి స్వయంగా అంగడి సరుకయ్యాకా మనిషిలోపలి మనిషి అదృశ్యం కాక తప్పదనే జీవన తాత్త్వికతని అందిస్తున్న బాలాజీ సాహిత్య ప్రయాణం నా కళ్ళముందు నిలిచింది. కవిత్వం – కథ – వ్యాసం ప్రక్రియ యేదైనా మనుషుల్లోపల-మధ్య యేర్పడుతోన్న ఖాళీల గురించి బెంగపడుతూ వాటిని పూరించుకొనే దారుల గురించి నిరంతరం అన్వేషిస్తున్న కవిగా రచయితగా సాంస్కృతికోద్యమ కార్యకర్తగా అతను నిర్దేశించుకొన్న గమ్యాలు గమనంలోకి వచ్చాయి. నిర్విరామంగా చేస్తున్న ప్రస్థానంలో ఇద్దరి మధ్య … మాటల్లేని వేళ … అతన్ని సలుపుతోన్న ఆలోచనల్ని తన రచనలద్వారా మనతో పంచుకొంటున్నాడు. ఆ క్రమంలో అతనిలో చెలరేగే యెన్నో ప్రశ్నలు తక్షణం సమాధానాల్ని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని ప్రతిపాదనలు యెద తలుపులు తట్టి లోపలికి చూసుకోనేలా చేస్తున్నాయి.

మానవ సంబంధాలు యింతగా పెలుసుబారిపోడానికీ మనిషి వికృతంగా గిడసబారిపోడానికీ మనసులు స్పందనా రాహిత్యంతో మొద్దుబారిపోడానికీ కారణాల్ని విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ కవిత్వంలో బలపడిన బాలాజీ గొంతు కథలో సైతం స్థిరమౌతోందని చెప్పడానికి అతను యింతకుముందు తెచ్చిన గదిలోపలి గోడ(2009), చిగురించే మనుషులు(2014) నిండైన సాక్ష్యంగా నిలిచాయి. దానికి కొనసాగింపే యిప్పుడు యీ కొత్త కథల సంపుటి ‘ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు’.

మనిషి పట్ల మనిషి జీవిస్తున్న జీవితం పట్ల సమాజం పట్ల అపరిమితమైన ఆర్తి ప్రేమ నిబద్ధత వున్న రచయితగా బాలాజీ యీ కథల్లో దర్శనమిస్తాడు. మనిషిని తన రచనకి కేంద్రంగా చేసుకొన్నాడు. కవిత్వంలో అనుభూతమయ్యే ఆర్ద్రతనీ సాంద్రతనీ కథల్లోకి సైతం అతను అలవోకగా వొంపుతున్నాడు. తన చుట్టూ రక్త మాంసాలతో కదలాడే వ్యక్తుల వేదనాభరితమైన బతుకుల్లో కనిపించని హింసని కథల్లోకి తర్జుమా చేస్తున్నాడు. ఇంటా బయటా యాంత్రికమైపోయిన ఆధునిక జీవితాల్లో విచ్ఛిన్నమౌతున్న బంధాల్నీ మృగ్యమౌతోన్న సున్నితత్వాల్నీ అందుకు కారణమౌతోన్న దృశ్యాదృశ్య శక్తుల్నీ వొడిసిపట్టుకొని మానవీయమైన అంతశ్చేతనని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలో తనను తాను పుటం పెట్టుకుంటున్నాడు. మకిలిపట్టిన మంది ఆత్మల్ని ప్రక్షాళన చేయడానికి పూనుకుంటున్నాడు. అనేక కారణాలుగా గడ్డకట్టిన సామాజిక కౌటుంబిక విలువల్ని ప్రశ్నిస్తున్నాడు. స్త్రీ పురుషుల మధ్య నెలకొనాల్సిన అవ్యాజ ప్రేమల గురించి తీరని తపనతో మాట్లాడుతున్నాడు.

అందుకే పితృస్వామ్యం మగవాళ్ళకిచ్చిన అధికార చట్రం నుంచి బయటపడటానికి పెనుగులాడే స్త్రీలతోబాటు – స్త్రీల పట్ల తమ ఆచరణలో రావాల్సిన మార్పు గురించి ఆగి ఆలోచించే పురుషులు యీ కథల్లో కనిపిస్తారు. ‘కొన్ని ప్రేమలు కాసిన్ని దుఃఖాలు’, ‘ఏమవుతుంది’, ‘ఖాళీ కప్పులు’, ‘ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు’ కథల్లో పాత్రలు మనకు తెలిసినవే. మన కళ్ళ ముందు కదలాడేవే. మొదటి రెండు కథలూ కుటుంబ నియంత్రణలో నలిగే స్త్రీలపరంగా రాసినవి. తర్వాతి రెండూ పితృస్వామ్య సమాజం తయారుచేసిన యింటి పెద్ద పాత్రల్లో యిమిడిపోయిన పురుషుల వైపునుంచి రాసినవి. ప్రతిపాదించాల్సిన అంశానికి వున్న భిన్న పార్శ్వాల్ని తడమడానికి రచయిత భిన్న కంఠస్వరాల్ని యెన్నుకొన్న తీరు, రూపొందించుకొన్న విలక్షణ శిల్పం గమనార్హాలు.

‘కొన్ని ప్రేమలు …’ కథలో జయ కుటుంబ చట్రంలో తనకు తానే బందీ. ఆమె చెప్పుకోడానికి యిష్టపడని అనారోగ్యాలు అనుభవించే అసంతృప్తులు యెదుర్కొనే అవహేళనలు సవాలక్ష సందేహాలు సమస్తం ఆమె వరకే గోప్యం. అన్నీ కుటుంబ బాధ్యతల మాటున దాక్కుంటాయి. నోరు దాటి బయటకి రావు. కష్టాల్ని యెవరికీ పంచకుండా కన్నీళ్ళని ప్రేమల మాటున దాచుకుంటూ సంసారాన్ని యీదుతుంది. కుటుంబంలో స్త్రీలకు బాధ్యతలే కాదు ప్రేమలూ మమతానురాగాలు సైతం స్థిరీకృత విలువలకే లోబడి వుంటాయి అని చెప్పడానికి జయ పెద్ద వుదాహరణ. తల్లిగా భార్యగా తన ఆరోగ్యాన్ని సైతం లెక్కజేయకుండా కీ యివ్వనవసరం లేని వొక అలారం గడియారంలా అందరి ఆలనా పాలనా చూసుకునే ఆమెకి ప్రేమ కూడా భారమే. గృహిణిగా వుద్యోగినిగా యింట్లో ఆఫీసులో పనిలో తలమునకలై తన కోసం సొంత సమయాలు కోల్పోయిన ‘పురాతన మహిళ’ ఆమె. అందుకు భిన్నంగా జీవితంలో కుటుంబంలో తమ సొంత స్పేస్ ని నిర్మించుకొనే ధైర్యం చాతుర్యం వున్న ఆధునిక యువతులు ఆమె కూతుళ్ళు. అందునా రెండో అమ్మాయి చేతనకి వున్న తెలివీ చొరవ స్వతంత్ర ఆలోచనలు అంటే జయకి వొక రకమైన ఇన్స్పిరేషన్. కానీ కథ చివరికి వచ్చేసరికి కుటుంబ సంబంధాల్నీ ప్రేమల్నీ కాపాడుకోమనే పిల్లలకి చెబుతుంది. ‘ఏమవుతుంది’ లో గ్రీష్మది కూడా దాదాపు అదే పరిస్థితి. కానీ ఆమె బస్సులో లేడీ కండక్టర్ స్ఫూర్తితో వొక అడుగు ముందుకు వేసి తను వొక్కతే ఆదికూర్మంలా మోసే బరువు బాధ్యతల్ని కుటుంబ సభ్యులకి పంచాలని నిర్ణయించుకుంటుంది. రెండు భిన్నమైన ముగింపుల్లోనూ కుటుంబాల్లో ఆధిపత్యాలు నశించి ప్రేమలు నెలకొనాలనే రచయిత కోరుకుంటున్నాడు.

రచయితగా బాలాజీ బాధిత స్త్రీల మనోభావాల్ని వాళ్ళ ఆత్మల్లోకి తొంగి చూసి రాయడం వొక యెత్తయితే టీ తాగిన ఖాళీ కప్పుల్ని తీసి సింకులో వేసే పని కూడా జీవితంలో యెన్నడూ చేయని ‘నేను’(ఖాళీ కప్పులు)గురించి, యింటి పనుల నిర్వహణ అంతా భార్య మీదకి నెట్టేసి తన యింటికే తను పరాయి అయిన యింకో ‘నేను’ (ఒక సాయంత్రం త్వరగా …) గురించి రాయడం మరో యెత్తు. ఈ కథల్లో సమాజం పురుషులకిచ్చిన బలాన్ని బలహీనతగా చిత్రించడంలో అతను సఫలమయ్యాడు. సంస్కరణ యెక్కడ మొదలవ్వాలో తెలియజెప్పాడు. అంతేకాదు; కుటుంబంలోనైనా సమాజంలోనైనా ఆధిపత్య ధోరణితో వ్యవహరించేవాళ్ళు కోల్పోయే సున్నితత్వాల గురించి సంతోషాల గురించి పరోక్షంగా హెచ్చరించాడు. ఆధిపత్యాలెప్పుడూ మనుషులమధ్య గోడలే నిర్మిస్తాయి; అవి జీవన మాధుర్యాన్ని పంచుకోడానికి ఆటంకమే అవుతాయని నిరూపించాడు. నా అన్నవాళ్లకి దూరమై మానసికంగా భౌతికంగా పరాయీకరణకి గురయ్యే వ్యక్తులు తమ అంతరంగాల్ని తరచి లోపలికి చూసుకోడానికి తోడ్పడే కథనాలివి. ‘ఏమైందో ఏమిటో’, ‘వీళ్ళెవరో మీకు తెలుసా’, ‘మీరేమంటారు’ కూడా అటువంటి కథలే. కాకుంటే మొత్తం సమాజమే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అనివార్యతని అవి తెలియజేస్తాయి. మానవీయ స్పందనల్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని సున్నితంగా గుర్తు చేస్తాయి.

మనుషులమధ్య వెల్లివిరియాల్సిన మానసిక సాన్నిహిత్యం గురించి ప్రేమ దయ వంటి వుదాత్త సంస్కారాల గురించి చెప్పే సందర్భాల్లో బాలాజీ వచనంలో యెక్కడా కాఠిన్యం కనిపించదు. పాత్రల మధ్య బాహ్య సంఘర్షణ కన్నా అంతరంగ చిత్రణకే అతను యెక్కువ ప్రాధాన్యం యిస్తాడు. అయితే అందుకు బాహ్య పరిస్థితులు యెంత వరకు కారణమౌతాయో విశ్లేషిస్తాడు.

‘ఇంట్లోపలికి వెళ్ళేముందు’ కథ చూడండి. మనుషులు పైకి కనిపించేది వొకటి లోపల మరొకటీ. వ్యక్తులు కొందరు చేతల్లో ప్రదర్శించే కాఠిన్యం మాటల్లోకి తెచ్చుకొనే మృదుత్వం వాళ్ళ నిజ స్వభావం కాకపోవచ్చు. వసంతం వస్తే కానీ కాకినీ కోకిలనీ విడదీయలేం. సరైన సందర్భంలోనే అసలు రూపాలు బహిర్గతమౌతాయి. మనం మనతోనే సంభాషించుకోగల్గినప్పుడే మనం మనలా కాకుండా మరోలా బతకడానికి కారణమైన పరిస్థితుల్ని విశ్లేషించి చూసుకోగలిగినప్పుడే స్వీయ అస్తిత్వాల్ని కాపాడుకోగలం అన్న తాత్త్విక చింతనని అందించిన కథ యిది.
అయితే యిప్పుడు లోపలి సంభాషణలకి గానీ బయటి సంభాషణలకి గానీ యెవరికీ సమయంలేదు. యంత్ర భూతం మింగేసింది. సుదూర ప్రాంతాల్ని దగ్గరగా చేసి ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చిన సాంకేతికత మనుషులు యెవరి మానసిక ప్రపంచాలు వాళ్ళవిగా విడిపోడానికే దోహదం చేసింది. ద్రవాధునికతలో ప్రేమతో సహా యేదీ శాశ్వతం కాదు. ఇప్పుడు ప్రపంచమే కాదు యిల్లు కూడా వొక ‘సూపర్ మార్కెట్’ అని యీ రచయిత ప్రతిపాదిస్తున్నాడు.

ఒకప్పుడు రచ్చబండల దగ్గరా యిళ్ళ అరుగుల పైనా యేటి వొడ్డునా పొలం గట్టునా పెరటి గోడల మీదుగా మనుషులు కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్ళు. విరామ సమయాలన్నీ సమూహాల మధ్య మాటల వినిమయంలోనే గడిచిపోయేవి. మనిషి మనిషితోనే కాదు చెట్టుతో పిట్టతో సైతం మాట్లాడే కాలం వొకటుండేది. కానీ యిప్పుడు వొకే కప్పు కింద కాపురం చేసే వాళ్ళ మధ్య మాటల్ని మాయం చేసే మంత్రదండమేదో ప్రవేశించింది. ఇంట్లోనే యినప తెరలు. ఆయన డ్రాయింగ్ రూం లో – ఆమె వంట గదిలో. లేదా యిద్దరూ వొకే గదిలో. కానీ యిద్దరికీ మధ్య యోజనాల దూరం. ఇంట్లో మనుషుల మధ్య సెల్ టవర్లు లేచాయి. వై ఫై కంచెలు మొలిచాయి. స్నేహాలు రోమాన్సులు ముద్దులు ముచ్చట్లు గొడవలు క్షమాపణలు అన్నీ యేదో వస్తువుని కొనుక్కున్నట్టు ఆన్ లైన్ లోనే పొందాలి. ఆధునికత తెచ్చే మార్పులు సహజమే అని యెవరైనా అనొచ్చు; కానీ వ్యక్తుల్ని సమూహాల నుంచి వేరుచేసే దుర్మార్గం, సమస్త వుద్వేగాల్నీ మార్కెట్ చేసే పెట్టుబడుల కుట్ర దీని వెనక దాగి వున్నాయేమో ఆలోచించాలి. తోటి మనిషిని గాలోకొదిలేసి యెవరికి వారే సొంత గూళ్ళలోకి ముడుచుకుపోయే వొక వ్యూహాన్ని గ్లోబలీకరణ అమలు పరుస్తోంది. అది సృష్టించే మానవ సంబంధాల విధ్వంసాన్ని, అందులోని బీభత్సాన్ని అర్థం చేసుకోవాల్సిన విపత్కర రాజకీయ సందర్భాన్ని ‘సూపర్ మార్కెట్’ కథ ఆవిష్కరిస్తుంది.

సంపుటిలోని పెద్దోళ్ళు, మంచిరోజులు పూరా రాజకీయ కథలే. అభివృద్ధి ఫలితాల్ని సొంతం చేసుకొని కింది కులాల వాడలకి రక్షిత నీటి సరఫరా అందకుండా చేసే కుల రాజకీయ దౌష్ట్యాన్నీ అందుకు కారణమైన పరువు ప్రేమ వ్యవహారాన్నీ పల్లెని కేంద్రం చేసుకొని ‘పెద్దోళ్ళు’ కథ చిత్రిస్తే , దేశమంతటినీ బ్యాంకులముందు క్యూ కట్టేలా చేసిన డి-మానిటైజేషన్ లోగుట్టుని ‘మంచిరోజులు’ బలంగా బహిరంగ పరచింది. డి-మానిటైజేషన్ డి-హ్యూమనైజేషన్ కి పర్యాయపదమైంది. బ్లాక్ మనీ రద్దుచేసి దేశ ఆర్ధిక వ్యవస్థని చక్కదిద్ది ‘అచ్చేదిన్’ తెస్తామనీ – దొంగనోట్ల చెలామణీ నివారించి వుగ్ర వాదులకు ఫండింగ్ రాకుండా చేసి దేశాన్ని శాంతి వైపు నడిపిస్తామనీ చెప్పిన డిమానిటైజేషన్ నిజానికి గ్లోబల్ మార్కెట్ కి అనుకూలంగా అమలు చేసిన డిజిటలైజేషన్ మాత్రమేనన్నది స్పష్టం. అదొక పెద్ద ఫార్సు కాదు; అతి పెద్ద ఫ్రాడ్. డి-మానిటైజేషన్ కారణంగా వుత్పత్తి రంగం కుదేలైంది. పరిశ్రమలు మూతబడ్డాయి. అసంఘటిత కార్మిక రంగం ఛిన్నాభిన్నమైంది. చిన్నా చితకా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కోటీశ్వరులు బాగుపడ్డారు. కోట్లాది జనం వుపాధి కోల్పోయారు. కుటుంబాలు బజారు పాలయ్యాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ తలకిందులైంది. స్థూల అభివృద్ధి రేటు కుంటుబడింది. చీమలు పెట్టిన బ్యాంకు పుట్టలు కార్పోరేట్ పాముల పాలయ్యాయి. సంపన్నుల సామాజిక స్మగ్లర్ల నల్ల ధనమంతా తెల్లనైంది. అందుకు వాళ్ళు అనుసరించిన మార్గాలు అమానవీయంగా తయారయ్యాయనీ అచ్చేదిన్ యెందరి పాలిటో చచ్చేదిన్ గా మారిందనీ ప్రత్యక్షంగా వర్ణించిన కథ మంచిరోజులు. ఒక ప్రభుత్వోద్యోగిగా యెన్నో పరిమితులకి లోబడినప్పటికీ యీ కథ రాయడంలో రచయిత యెక్కడా తడబడలేదు. రచయితగా బాలాజీ యెటువైపు నిలబడ్డాడో అతని రాజకీయ దృక్పథమేమిటో మంచిరోజులు స్పష్టం చేస్తుంది. కథకి శీర్షిక పెట్టడం దగ్గర్నుంచీ కథనం నిర్వహణ ముగింపు వరకూ చాలా పకడ్బందీగా రాసిన యీ కథ సంభాషణల్లో వాడిన స్థానీయ భాష బాలాజీకి రాయలసీమ గ్రామీణ మాండలికం మీద వున్న అధికారాన్ని కమాండ్ ని తెలియజేస్తుంది. కథ గ్రామీణ మూలాలకు దూరమౌతున్న సందర్భంలో యిటువంటి రచనల ద్వారా బాలాజీ తెలుగు కథకి గొప్ప భవిష్యత్తుని వాగ్దానం చేస్తున్నాడు. అతని యీ ప్రయాణం మరింత లోతట్టులకు వ్యాపించాలని కోరుకోవడం అత్యాశ కాదేమో !
ఇంతకీ బాలాజీ తాను చేసిన ప్రయాణాలూ ఆ దారుల్లో చవి చూసిన ప్రేమలూ యెదుర్కొన్న పరివేదనలూ పరికించిన కష్టాలూ అనుభవించిన వుద్వేగాలూ అన్నిటినీ కథీకరించలేదు. ఇవి వాటిలో కొన్నే. కొన్ని పార్శ్వాలు మాత్రమే. బాలాజీ గీయాల్సిన జీవిత చిత్రాలు – చెప్పాల్సిన కథలెన్నో యింకా మిగిలే వున్నాయి. స్పృశించాల్సిన యెన్నో గుండె లోతుల్ని అతను అడుగు తలం వరకూ యింకా తడమలేదు. అడగాల్సిన ప్రశ్నలూ పూర్తవ్వలేదు. కడగాల్సిన మురికీ వదల్లేదు. అందుకే చాలా కథలు అసంపూర్ణంగా ప్రశ్నలుగానే ముగుస్తాయి (ఏమైందో ఏమిటో, మీరేమంటారు, ఏమవుతుంది, వీళ్ళెవరో … అన్నీ ప్రశ్నలే!). అవన్నీ మమ్మల్ని యేం చేస్తావని సమాధానం యేమిటని అతని వైపు చూస్తూనే వున్నాయి. మనం కూడా మిగిలిన కథలెప్పుడు బాలాజీ అని అతని వైపు చూస్తూనే వుందాం. అతనితో యీ సాహిత్య సంభాషణ కొనసాగిస్తూనే వుందాం.

ఒక సాయంత్రం మీరు కూడా త్వరగా యిల్లు చేరితే, మీకు తెలీకుండా మీలో యేర్పడ్డ ఖాళీల్ని గుర్తించి పూరించుకోవాలనుకుంటే, మానవ దూరాల్ని అధిగమించే మాటల వంతెనలు నిర్మించాలనుకొంటే, మనుషుల మధ్య మమతల మాలలల్లే సూత్రాల్ని పట్టుకోవాలంటే – రచయిత బాలాజీని అనుసరించండి. నేనైతే అదే పనిలో వుండి యీ నాలుగు మాటలూ మీతో పంచుకున్నా. ఎన్నో ప్రేమల గురించి మరెన్నో తీరని వెతల గురించి యీ కాసిన్ని మంచి కథలు అందించినందుకు సాహిత్యజీవి బాలాజీని మనసారా అభినందిస్తూ …
సెలవ్.

హైదరాబాద్ ఎ. కె. ప్రభాకర్.
31.10.2017

You Might Also Like

Leave a Reply