కోతి కొమ్మచ్చి – కొని తెచ్చి.. చదివిచ్చి..!!
వ్యాసం రాసి పంపినవారు: అరిపిరాల సత్యప్రసాద్
“మై గాడ్ బయింగ్ బుక్స్! బార్బేరియస్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్!..” అన్నాడు గిరీశం. పుస్తకానికి ఖోపం వచ్చేసింది. పుస్తకాలతల్లి సరస్వతమ్మకి (అంటే సరస్వతిగారి అమ్మగారు కాదు – సరస్వతిగారే అమ్మగారు) ఇంకా చాలా ఖొపం వచ్చేసింది. హాం ఫట్ అనగానే ముళ్ళపూడి వెంకట రమణ పుట్టాడు.
“అమ్మా ఒక పది కాణీలు వుంటే అప్పిస్తావా?” అన్నాడు పుట్టగానే.
“నీకు అప్పులిచ్చేవాళ్ళని తిప్పలిచ్చేవాళ్ళని మా ఆయన పుట్టిస్తున్నాడు గానీ నువ్వు నాకొక పని చేసి పెట్టాలి” అన్నది.
“ఓస్ అంతే కదా.. ఏమిటో చెప్పు” అన్నాడు రవణ
“ఈ టెలుగుస్ వున్నారే వీళ్ళకి పుస్తకం విలువ, చదువుల విలువ, అక్షరం విలువ అట్టే తెలిసినట్టు లేదు.. నువ్వెళ్ళి అలాంటి వాళ్ళందరిచేత పుస్తకం కొనేట్టు చెయ్యాలి..”
“హమ్మబాబోయ్.. అంత పని నా వల్ల కాదు నాకు ఎవరైనా తోడు కావాలి..”
“తోడుకేం తక్కువోయ్ – ఇదుగో బొమ్మల బాపు, అంత్యప్రాసల ఆరుద్ర, “పొగల”సెగల శ్రీశ్రీ, నండూరి నీకు ఫ్రెండూరి.. అందాల రాముడు అక్కినేని, దుక్కిపాటి, భానుమతి..”
“ఇంకా ఇంకా..!!”
“కష్టాలు కన్నీళ్ళు.. ఇబ్బందులు సొబ్బందులు..”
“విల విల లాడించే సంతోషాలు, పక పకలాడించే కష్టాలు..”
“హన్నా..”
“హ హ… ఇంకా చెప్తాను చూడు.. బుడుగు, సీగానపెసునాంబ, రెండు జెళ్ళ సీత, గోపాలం, అప్పుల అప్పారావు, జనతా ఎక్స్‌ప్రెస్ జనాలు.. వీళ్ళు నేను పుట్టించిన మనుషులు.. మీ ఆయన పుట్టించిన మనుషులకి నకలు డిటోకి కాపి స్ఫూర్తి..”
“ఏమిటా కోతివేషాలు..”
“అమ్మా ఇదేదో బాగుందే.. కోతి వేషాలు, కోతి గెంతులు… కోతి కొమ్మచ్చులు”
“తథాస్తు”
“మరి నువ్వు రావా అమ్మా..?”
“పిచ్చినాయనా.. నిన్ను చూసుకోడానికి నేనెందుకూ? నా బదులుగా తొమ్మిదిమంది అమ్మల్ని ఇస్తాను సరేనా?”
“సరే”
***
పుస్తక సమీక్ష అనుకుంటే ఈ సొంత పైత్య పరీక్ష ఏమిటనుకుంటున్నారా.. ఇది నా స్థాయిలో కోతి కొమ్మచ్చి. చెట్టు మీదనుంచి చెట్టుకు కాకపోయినా ఒక పూల కుండీ మీద నుంచి మరో పూల కుండీ మీదకి.
స్వాతి వార పత్రికలో ముళ్ళపూడి వెంకట రమణగారు ఆడిన కోతి కొమ్మచ్చులన్నీ కుదురుగా కూర్చి పెట్టిన పుస్తకమిది. ఈ పుస్తకం తిసుకోని ఎక్కడినించి మొదలు పెట్టినా ఎటువైపు చదువుకుంటూ వెళ్ళినా ఎక్కడా ఆగదు. ఆప బుద్ధెయ్యదు. మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే-కోతిపిల్ల తల్లికోతిని కరుచుకున్నట్లు రమణగారిని కరుచుకుంటే చాలు – ఎన్ని జీవితాల చెట్లు, ఎన్ని అనుభవాల కొమ్మలు, ఎన్ని సంతోషాల పూలు, ఎన్నెన్ని కన్నీళ్ళ పేళ్ళు.. అన్నింటినీ దాటిస్తూ దూకిస్తూ సాగుతుందీ ఆత్మ కథ. కథలో నించి కథలోకి, పిట్టకథలోకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయామో అర్థంకాక వెనక్కి రావడం తెలియక – అభిమన్యుడిలా ఎన్నిసార్లు ఇరుక్కుపోయినా ఈ పద్మవ్యుహాల పుస్తకం చదువుతుంటే ఆహ్లాదంగానే వుంటుంది. అదో కొత్త సొగసుగా వుంటుంది.
మనం చిన్నప్పుడు చదువుకున్న తెలుగు వాచకంలో పది పేజీల ప్రోజు మొత్తం అయిపోయాక చివర కథా సారాంశం (సమ్మరీ) అంటూ ఒక్క పేరాగ్రాఫులో కథ వివరం మొత్తం ఇచ్చేవాళ్ళు. ఆ ఒక్క పేరగ్రాఫు చదువుకుంటే మొత్తం కథ చదివిన పుణ్యం..!! అలాగే ముళ్ళపుడిగారు వ్రాసిన పది వాక్యాలకి ఒక్క గీతతో తిలకం పెట్టేస్తారు బాపు గారు – ఒకోసారి నామం కూడా అనుకొండి. ఆ బొమ్మలు ఇందాక చెప్పిన సారాంశానికి రెండాకులు ఎక్కువ. ఎందుకంటే ఇవి కథ సంగ్రహంగా చెప్పడమే కాదు ఆ కథలో ఆత్మని మన ముందు నిలబెట్టేస్తాయి. చాలా సార్లు ఈ బొమ్మలు రమణగారికి చెప్పిన కథకి కొత్త అర్థాన్ని సరికొత్త రూపాన్ని ఇస్తాయి. ఆ రకంగా ఆయన అక్షరాలతో బొమ్మలేస్తుంటే ఈయన బొమ్మలతో కథలు చెప్పేస్తుంటాడు. అందుకే ఈ పుస్తకం ముళ్ళపూడి పుస్తకం అనటంకన్నా బాపూరమణీయం అనటమే సబబు.
“అయితే ఇందులో కథేమిట్రా అబ్బాయ్” అని ఎవరైనా అమాయకులు అడిగితే చెప్పడానికి కొంచెం కష్టమే – ఇదేమైన సినిమా రీలా? “లలిత శివ జ్యోతి కంబైన్స్ – లవకుశ” అంటూ మొదలెట్టి శుభం కార్డుదాకా చెప్పడానికి? ఇది మన తాతయ్య దగ్గర కుర్చోని ఆయన జ్ఞాపకాల తుట్టెను కదిపితే – ఒకదానికొకటి అల్లుకోని వున్న అనుభవాలన్ని తియ్యటి తేనెలాగా కారినట్టు వుంటుంది, మనసులో ఊరినట్టౌతుంది..
ధవళేశ్వరంలో బ్రతికి చెడ్డ కుటుంబంలో పుట్టి – ఇంతింతై ఖాళీ పర్సంతై, ఎమ్టీ పాకెటంతై, జేబుకు చిల్లంతై – కష్టాలు, కన్నీళ్ళు, బాధలను చిరునవ్వులతో చెరిపేస్తూ – ఆత్మ విశ్వాసంతో (కొన్ని భాషల్లో దీన్నే పొగరంటారు) ఎదిగి – అప్పులుపడి, అకలిపడి, తిప్పలుపడి స్నేహాలతో కడుపు నింపుకొని, సంగీతంతో దాహం తీర్చుకొని, సాహిత్యంతో సరసమాడుకొని ఈ రమణ అనే వ్యక్తి ఎక్కిన మెట్లు, దూకిన చెట్లు, పడిన తిట్లు అన్నీ వున్నాయి. అక్కడికి ఇదేదో విశాల విషాద గాథ అనుకునేరు. ఇవి కాకుండా నడుమ్మీద చేతులు వేసుకున్న సంధర్భాలు, కాలరూ ముక్కు రెండూ ఎగరేసిన పొగరులు, మెచ్చుకోళ్ళు, మంచి మాటలు, చప్పట్లు, సన్మానపు దుప్పట్లు కూడా వున్నాయి.
మొత్తం మీద ఇది జివన సారం, సరదా ముసుగుతో వైరాగ్య విహారం.. చిరునవ్వులతో కళ్ళు చెమర్చే కథా సాగరం.
పుస్తకం నిండా ముళ్ళపూడి మార్కు పదవిన్యాసాలు – మచ్చుకి –
“కుళ్ళిపాయల కూర”
“ఎర్రటి ఎండలో 56 పేజీలు నడిచాను”
“పొగరెట్ కథలు” (పొగ గురించి, పొగరు గురించి)
“పక్కింటి బంతి పూల రథం”
“ఫిలిం ప్రొడ్యూస్రూ పేపర్ ప్రొప్రయిటర్లూ చిలకా గోయంకల్లా, విస్కీ సోడాల్లా, పెసరట్ వుప్మాల్లా, బుగ్గాముద్దులా..”
“(వద్దంటే పెళ్ళి సినిమా) నిడివి: మూడు మైళ్ళ 5 ఫరలాంగుల 9 గజా 6 అడుగుల 9 అంగుళాలు..”
“ఇందులో (సినిమాలో) కథానాయిక ‘పన్నా’గా జమున అభినయించింది. సిపాయి పాత్రను గుమ్మడి భరించాడు. రాజుగా నాగయ్య, దుష్ట సేనానిగా రాజనాల నటించారు, కైకాల సత్యనారాయణను యువరాజు పాత్ర ధరించింది..”
ఇంకా ఎన్నో మరెన్నో.
మొత్తం మీద “కొని” చదవాల్సిన పుస్తకం. చదివిన తరువాత పదిలంగా పెట్టుకోవాల్సిన పుస్తకం.
***
కోతి కొమ్మచ్చి విడుదలైంది. రవీంద్రభారతిలో భారతికి అక్షరాభిషేకం జరిగింది. కని విని ఎరుగని రీతిలో మొదటి ప్రచురణ వారం రోజులకే ఖాళీ అయిపొయినట్లు ప్రకటించారు హాసం వారు.
రవింద్ర భారతిలో భారతి –
“నాయనా మొత్తానికి బార్బేరియస్ అన్నవాళ్ళే తెలుగు పుస్తకాన్ని కొనేట్టు చేశావు.. చాలా సంతోషంగా వుంది”
“అప్పుడే ఏమైందమ్మా? కోతికొమ్మచ్చి రెండొవ భాగం రాబోతోంది.” నవ్వాడు రమణ. ఆ వెనకే బాపూ కూడా.
పుస్తకం వివరాలు:
కోతి కొమ్మచ్చి
రచన: ముళ్ళపూడి వెంకటరమణ
తొలి ముద్రణ: 2009
వెల: రూ. 150
కాపీలకు: అన్ని ప్రముఖ పుస్తక షాపులు
పబ్లిషర్లు: హాసం ప్రచురణలు
Vasu
ఫూర్ణిమ గారి మాటే నాదీనూ.
చదవని వాళ్ళకి పుస్తకం వెంటనే చదవాలి అనిపించేంత బావుంది సమీక్ష
gksraja
ఆలస్యం… అమృతం అంతే — అక్కడే ఆగాలి. నేను మీ సమీక్ష ఆలస్యంగా చదివినా చద్దెన్నం అంత అమృతం లాగే వుంది. అందులో మాగాయ రుచీ మాటిమాటికీ తగిలించారు. ధన్యవాదాలు ప్రసాద్ గారూ!
gksraja.blogspot.com
రాజా.
శ్రీమన్నారాయణ రాళ్ళపల్లి
మనకు పుస్తకం విలువ తెలిసినట్టులేదు అని సెలవిచ్చారు,నిజం మద్రాసులో బస్సు ప్రయాణంలో ప్రతిఒక్కలవద్ద కుముదం, కుంకుం బుక్స్ ఈ రోజులో చూడవచ్చు, నేను చాలాసార్లు బాధపడేవాణ్ణి. తెలుగుపుస్తకం ఉంటె మనకు నామోషీగా అనుభూతి చెందిన తెలుగు జాతి మనది.ప్రసాద్ గారు మీ సమీక్షా అమోఘం.
dvrao
ఇంకోతికోమ్మచ్చి తర్వాత ఆత్మకధ ‘మరింకోతికోమ్మచ్చి ‘ త్వరగా వస్తే బావుణ్ణు!
రాకేశ్ రెడ్డి తమ్మన్నగారి
ప్రసాద్ గారు…. చాలా గొప్పగా రాసారు. అద్భుతమైన పుస్తకానికి మహాద్భుతమైన సమీక్ష. రవణ గారి లానే మరిపించారు…. కథా గమనంలో ఉరికించారు…… ఆయనలా గెంతించారు కూడా. కోతి కొమ్మచ్చి మధురం. మీ వ్యాసమూ మధురమే.
మహానుభావులు ఆయన కథలో మనని కోతుల్ని చేసి ఆడించి ఎవరికీ దొరక్కుండా వెళ్ళిపోయారు… కోతి కొమ్మచ్చి ఉన్నంత కాలం, ఆయన కథ చదువుతూ కోతుల్లా ఆడిన ఈ జనం ఉన్నంత కాలం ఆయనకీ మరణం లేదు.
విష్ణుభొట్ల లక్ష్మన్న
మార్చ్ 6 నుంచి ఒక వారం రోజుల కోసం ఆంధ్రా వస్తున్నాను. ఈ పుస్తకం తప్పకుండా కొనాలని ఉంది. ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు. అలాగే ఇంకా మిగిలిన మంచి పుస్తకాలు ఎవరైనా చెపితే సంతోషిస్తాను. Lark_Vishnubhotla@yahoo.com నా ఈమైల్ అడ్రస్. ఉండేది వారమే కదా! ఒక్కడినే జర్మనీలో ఉంటున్న నాకు మంచి పుస్తకాలే ఇప్పుడు మరీ గొప్ప స్నేహితులు. నాకు ఇప్పుడే తెలిసిన వార్త ముళ్ళపూడి వారి హటాత్మరణం. ముళ్ళపూడివారి అస్తమయం సాహిత్యాభిమానులకు తీరని లోటే!
వారికి నా శ్రద్దాంజలి. బాపుగారికి ఇది తీరని లోటే!
విష్ణుభొట్ల లక్ష్మన్న
raj
Simply Superb Mastaru!
వాసుదేవ్
ప్రసాద్ గారూ, అభినందనీయులు. పైన చెప్పిన చాలామంది వాళ్ళలాగా మంచిపుస్తకాన్ని చదివించడం మీకు తెల్సినట్లుగా మరెవరికీ తెలియదేమో, అందుకే ఆ పుస్తకం కొన్న మెదటి వాళ్ళలో నేనూ ఒకణ్ణి అయినా మళ్ళీ చదివాను….
“అయితే ఇందులో కథేమిట్రా అబ్బాయ్” అని ఎవరైనా అమాయకులు అడిగితే చెప్పడానికి కొంచెం కష్టమే – ఇది మన తాతయ్య దగ్గర కుర్చోని ఆయన జ్ఞాపకాల తుట్టెను కదిపితే – ఒకదానికొకటి అల్లుకోని వున్న అనుభవాలన్ని తియ్యటి తేనెలాగా కారినట్టు వుంటుంది, మనసులో ఊరినట్టౌతుంది..”
ముఖ్యంగా ఈ లైన్లు మరీ ఆకట్టుకున్నాయి. ఈ పేరా చదివాక ఇంక మిగిలిన సమీక్ష చదవకుండానే పరుగెత్తికెళ్ళి పుస్తకం కొననైవాళ్ళు కూడా కొనేవిధంగా ఉంది. వాసుదేవ్
శివరామప్రసాద్ కప్పగంతు
అరిపిరాల సత్యప్రసాద్ గారూ అద్భుతమైన సమీక్ష. మీ సమీక్షలో, మీరు వ్రాసినదేదో, ముళ్ళపూడివారు వ్రాసినదేదో తెలియటంలేదు.
ఇంతకంటే ఈ పుస్తకాని మరింకెవరూ పరిచయం చెయ్యలేరు.
మీకు గౌరవ సూచకంగా కండువా ఎత్తి మళ్ళి వేసుకున్నాను (అదేలెండి ఇంగ్లీషువాడి హాట్స్ ఆఫ్)
Tweets that mention పుస్తకం » Blog Archive » కోతి కొమ్మచ్చి – కొని తెచ్చి.. చదివిచ్చి..!! -- Topsy.com
[…] This post was mentioned on Twitter by Shiva, D.Raviteja and pavan, Sivakumar Surampudi. Sivakumar Surampudi said: #Telugu Kothi Kommacchi Book Review ~ http://me.lt/8HsV […]
santhi
గోపాలం కాదు మహాప్రభూ గోపాళం..గోపాళం
kiran
Ratriputa subbaranga perugannam pappu charu vesukuni shustuga tini methati parupu pina talagada pettukuni ea pustakam chadivina niddarostundi okka kooti kommachi tappa.
గిరీష్ కె.
ఘాటైన పుస్తకానికి ధీటైన సమీక్ష. రమణ గారి మాటల్లో చెప్పాలంటే,చెట్నీ కూడా ఇడ్లీ లాగే రుచిగా ఉంది! కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి…. ముక్కోతి కొమ్మచ్చి ఎప్పుడూ….?
ఈ సమీక్షను ఇన్నాళ్ళూ ఎలా మిస్సాయ్యానో…?
bhanu prakash
i am also want to know the telugu books shop in banglore, coming ot the point mee vyaasam achchu kothi kommachchi chaduvutunnatte undi, pustakam.net ku manchi writersey dorikaaru, go a head and aall the best
పుస్తకం » Blog Archive » కోతి కొమ్మచ్చి కోరి చదివొచ్చి..
[…] గురించి వచ్చిన ఇతర వ్యాసాలు ఇక్కడ మరియు […]
సౌమ్య
Nice article!
పుస్తకం చదివాక గానీ వ్యాఖ్య రాయకూదదు అని ఆగాను…
చాలా మంచి వ్యాసం…
ఈ మధ్య చదివిన పుస్తకాలు « నా ప్రస్థానం
[…] గురించి మరిన్ని వివరాలు ఇక్కడ, ఇక్కడ, […]
కొత్తపాళీ
fantastic.
a fitting tribute.
పుస్తకం » Blog Archive » చదువు చదివించూ.. లైఫ్ / 2 అందించు..
[…] చప్పరించి ఊరుకున్నానన్నమాట. మొన్న అరిపిరాల వారు మరికాస్త రుచి చూపించేసరికి, […]
రానారె
వహ్వా! అరిపిరాల మహానుభావా!! మొగాంబో ఖుష్ హువా!!!
లలిత
బాపు రమణల పాండిత్యం అందరూ ఎరిగిందే. మీ సమీక్ష చదువుతుంటే మీరే రమణగారేమో అని అనిమానం వచ్చేస్తుంది అంతబావుంది . స్వాతిలో అప్పుడప్పుడూ చదివాను . మొన్న మా రవిగాడు కనిపించి కోతికొమ్మచ్చి నాదగ్గరుందోచ్చ్….అన్నాడు అప్పటినుంచీ మనసూరుతుంది ఎప్పుడెప్పుడు చదివేస్తానా అని.
భమిడిపాటి ఫణిబాబు
ఏం వ్రాయమంటారు? ప్రతీ రోజూ ఎదో పారాయణం చేసినట్లు ఒక్కసారైనా చదువుతున్నాను.
చిలమకూరు విజయమోహన్
కోతికొమ్మచ్చిపై సమీక్షతో మా మనసును గెంతులు వేయించారు
budugoy
కోతికొమ్మచ్చికి పుస్తకానికి సమీక్షంటే గొప్ప సవాలే. ఈ పుస్తకం మీద వచ్చిన సమీక్షలన్నిట్లోకి భేషైన, సె-భాషైన సమీక్ష. అందుకోండి మా వీరతాళ్ళు.
త్రివిక్రమ్
ముళ్లపూడి వారి పుస్తకానికి దీటైన సమీక్ష. అరిపిరాల వారికి అభినందనలు. ఇంత చక్కటి సమీక్షలో సాక్షాత్తూ పుస్తకాలతల్లి సరస్వతమ్మ నోటే “తొడుకేం తక్కువోయ్” అని పదాలు తప్పుగా పలికించడమొక్కటే బాధ. ఇక లాభం లేదు. పుస్తకం.నెట్ వారు ఒక ఫుల్ టైమ్ ప్రూఫ్ రీడరును పెట్టుకోవాలి.
rayraj
🙂 చాలా చాలా బావుంది (నేనింకా తెలుగువాణ్ణే! పత్రిక నుంచి చింపిన పేజీలే ఫైలు చేశాను(చేయించాను))
ఊరికే చెప్పాను.పుస్తకమే కొంటాన్లెండి. 🙂
Vinay Chakravarthi.Gogineni
చాల బాగా రాసారు……….నాకు పుస్తకం కొని చదివెయ్యాలనే కొరిక కలిగింది..చాల రోజులనుండి అడుగుతున్నాను,ఎవ్వరు సమాధానం చెప్పటంలేదు. బెంగుళూరులో తెలుగు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?
Purnima
ఏం రాసారండీ?! (అంటే ఎంత బా రాసారో అనే లెండి) 🙂
ఈ సమీక్ష కాని సమీక్ష చదివిన దగ్గరనుండీ.. ఈ పుస్తకం లేక, ముళ్ళపూడి వారి సాహిత్యంలో మునకలేస్తున్న..