జైత్రయాత్ర – శివారెడ్డి

సమీక్షకులు: ఆరి సీతారామయ్య
[2003 జూన్ 22 వ తేదీన DTLC (Detroit Telugu Literary Club, USA) లో శివారెడ్డి కవితా సంకలనం జైత్రయాత్ర మీద జరిగిన చర్చ సందర్భంగా రాసిన సమీక్ష, చర్చ సారాంశం]
****************************************************************
jaitrayatraశివారెడ్డి పుట్టిపెరిగింది గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, కారుమూరివారిపాలెంలో. తెనాలిలో బియ్యే, వాల్తేరులో ఎం.ఎ. చదివి, 1967 లో హైదరాబాదులో వివేకవర్ధని కాలేజీలో ఇంగ్లీషు లెక్చరరుగా చేరి, 1999 లో అదే కాలేజీ నుంచి ప్రిన్సిపల్‌గా రిటైర్ అయ్యాడు. ఉద్యోగ విరమణ సందర్భంగా, ముఫై సంవత్సరాల శివారెడ్డి కవిత్వంలోంచి కొన్ని కవితలను మిత్రులు జైత్రయాత్ర అనే టైటిల్‌తో ప్రచురించారు. ఈ పుస్తకంలో మనకు శివారెడ్డితోనూ, శివారెడ్డి కవిత్వంతోనూ పరిచయం అవుతుంది. సరళమైన భాష, భావోద్రేకం, ప్రజావిప్లవాల మీద నమ్మకం, పల్లెటూరిమీద ప్రేమ, స్త్రీలమీద గౌరవం, జాతి పురోగమనం మీద దృఢవిశ్వాసం, దౌర్జన్య జీవులమీద ద్వేషం – శివారెడ్డి కవిత్వానికి గుర్తులు. జైత్రయాత్రలో మనల్ని తాకేవి మట్టివాసన, పైర్లవాసన, చమటవాసన, కన్నీటితడి, కుడితిలో ఈగలు, చేతులు కలిపి నడుస్తున్న మనుషులు.

నగరంలో నిద్రపోయిన కవికి పల్లెటూరులో తెల్లవారుతుంది. లలితంగా, కొంచెం తడిగా, కొంచెం ఇష్టంగా, కొంచెం అయిష్టంగా, జారిపోతున్న ముసుగులా చీకటి తొలగిపోతుంది. నాయనమ్మ పక్కలోంచి కొద్దిగా దుప్పటి ఒత్తిగించి సూర్యుడు ఉదయిస్తాడు. నీటిమీద ఆవిర్లతో పల్లెటూరి చెరువు ఆవిరికుడుంలా ఉంటుంది. చెరువుకట్ట మీద గుడి దండ కడియంలో పిచ్చిరాయిలా కన్పిస్తుంది. ఈరవయ్యైదు సంవత్సరాలు నగరంలో బతికిన కవి ఇంకా నగరవాసానికి అలవాటు పడలేదు. జీవన లాలిత్యానికీ, మృదుత్వానికీ, ముందుకు సాగిపోవటానికీ ఆ పల్లెటూరితో ఉన్న సంబంధమే కారణం అంటాడు శివారెడ్డి. మనిషి పల్లెటూరు వదలినా, పల్లెటూరు మనిషిని వదలదంటారు. దీనికి శివారెడ్డి మంచి నిదర్శనం.

పల్లెటూరి రూపకాలు జైత్రయాత్రలో చాలా చోట్ల కన్పిస్తాయి. ఉదాహరణకు,
“నాటండి” లో,
“నాటండి – మాటలో పాటలో బాటలో చేతలో కళ్ళో కాళ్ళో
నాటండి – శ్రీశ్రీలు నాటండి, శివసాగర్‌లు నాటండి, నదీనదాలు
నాటండి, సముద్రాల్ నాటండి
అడవి నాటండి, అడవి అంతర్‌వాహిన్ని నాటండి, అంతర్‌వాహిన్ని
నాటండి – కలకలం నాటండి,
కన్నీళ్ళ కల్లోలం నాటండి
సంచలనం నాటండి, అనంత సంకల్పబలాల
తిరుగుబాటుల్ని నాటండి –
వేళ్ళలో వేళ్ళు నాటండి
రాత్రిలో పగలు నాటండి
తూర్పులో శిరసుల్ని నాటండి
నేను వేళ్ళతో వేళ్ళు నాటమంటున్నాను
నీ నాలుక కత్తుల్ని నాటు – కామ్రెడ్స్ చేతుల్లో
చిగురిస్తున్న తుపాకుల్ని నాటు – చెట్టుకుకట్టి కాల్చేయబడ్డ
వీరుల రక్త బిందువుల సింహస్వప్నాల్ని నాటు
ఆకల్తో చచ్చిపోతున్న పల్లెటూరి రైతాంగం క్షుద్భాధాగ్నిని నాటు
పట్టెడు కూడులేక అలమటిస్తున్నరైతు కూలీ చంకనున్న
పసిదాని ఆర్తనాదం అంటుకొన్న కొంపల్ని నాటు –
శ్రమ శ్రమ శ్రమ తప్ప ఏమీ మిగలని ఏ సుఖమూ లేని
కార్మికుల గుండెల్లో అల్లుకొంటున్న బడబాగ్నిని నాటు
కూరగాయలమ్మేవాడి నాలుగు చక్రాల బండికింద జోలెలో
నిదురించే పసిపాప భావిస్వప్నాల పంటపొలాల్ని నాటు –
గానుగచుట్టూ తిరిగే గొడ్డుమోతు తనాన్నీ బద్దలు కొట్టే
ఒకగొప్ప విసుగుదలని నాటు –
ఇచ్చటంతా క్షేమమనుకునే సంప్రదాయ భ్రమల్ని
తవ్విపోసే పలుగూ పారల్ని నాటు -“

“అల” లో,
“ఆశ నెవడు దున్నమన్నాడు
కలల్ని ఎవడు ఎదబెట్టమన్నాడు”

“చర్య” లో,
“ఇన్నాళ్ళనుంచీ చావిట్లోనే ఉంది
పుట్టిన దగ్గరనుంచీ మేకుకు కట్టేయబడే ఉంది –
కోడెదూడ – బయట ముఖం చూళ్ళేదు!

బయట కట్టేద్దామని – అవును
బయటకూడా కట్టేద్దామనే – తీసుకొస్తుంటే
ఒక గుద్దు గుద్ది – ఎత్తిపడేసి
దేశాలమీద పడ్డది –
స్వేచ్చలో – స్వేచ్చగా – స్వేచ్చకై –

కట్టేయటమంటే – తెంచుకుపొమ్మనే
మేకునుగూడా పెళ్ళగించుకుపొమ్మనే –
అణచిపెట్టటమంటే – ఎదురుతిరగమనే –
జన్మతః అణువుల్లో నిగూఢమైన
అసంకల్పిత ప్రతీకార చర్య ఇది.”

అంటాడు. బలవంతులు అణచిపెట్టటానికి ఎంత ప్రయత్నించినా తిరుగుబాట్లు తప్పవని బలంగా నమ్ముతాడు శివారెడ్డి. కష్టం చేసుకుని బతికేవాళ్ళకి ప్రతీకగా నిలుస్తూ,

“ఇన్ని యుగాల్నుంచి
మట్టిలో పుట్టిన నేను
మట్టిలో పాతిపెట్టబడి –
నా కాళ్ళు చేతులు భూమిలోంచి ఎదుగుతూ –
నా బాహువుల మధ్య మేడలు మిద్దెలు
ఓట్లు, ఎలక్షన్లు, అధికారాలు –
నా చేతుల చెట్లు నరకబడుతూ పిలకలేస్తూ –
మట్టి పిసుక్కు తింటున్న నేను
భూమి పొరలకింద సారవంతంగా
జలప్రవాహంలా, బొగ్గుపొరల్లా
అయిల్‌సరసుల్లా, అమూల్య ఖనిజాల్లా
నేను మట్టికింద పాతిపెట్టబడి
మొలుస్తున్న చేతుల కాళ్ళవాణ్ణి.”

అంటాడు.

ఈ మట్టి మనుషుల రోజులు తప్పకుండా మారతాయని గట్టి నమ్మకం శివారెడ్డికి.

“కంజిర” లో,

నేను నిజం – నా బాధ నిజం – నా ఉనికి నిజం – నా గొంతు నిజం
అందరం చాలా ఓర్పుగానే ఎదురుచూస్తాం
అందరం చాలా ఆశతోనే బాధల్ని అనుభవిస్తాం –
అలా ఆకాశం మీద మబ్బుపట్టి నీళ్ళుచిలకటం ఎంత తథ్యమో
రోజు మారటం అంతే తథ్యం
బతుకు మారటం అంతే తథ్యం
మార్పు శాశ్వతంగాబట్టి
మార్పులో నమ్మకం ఉందిగాబట్టి
మార్చే శక్తి చేతుల్లో ఉందిగాబట్టి,”

అంటాడు.

“ఎటు నిలబడతావోచెప్పు” లో,

“చెప్పు
ఎటు నిలబడతావో చెప్పు
నత్తిమాటలక్కరలేదు నిశ్శబద్దం గురగురలక్కరలేదు
నిగూఢ స్వార్థరక్షణా కవచాలక్కరలేదు
పెదవితో పలికే ఉద్యమ యోగక్షేమాలక్కరలేదు, ఆదివారం
సభా హాజరులక్కరలేదు.
దుఃఖాంతరంగ మధనాలక్కరలేదు
కత్తినిపదును పెట్టుకుంటున్నట్టు నటించటాలక్కరలేదు
కామ్రెడ్ శీర్షికలూ కవిత్వం తిరగమోతలూ
క్షామ శాంతి కాముకత్వాలూ స్వయంక్షేమ విప్లవ కవిత్వాలూ
అక్కరలేదు
చెప్పు
నువ్వు ఎటు నిలబడతావో చెప్పు
చెప్పు నిజంగా నిర్మొహమాటంగా చెప్పు
నువ్వు ఎవర్ని ప్రేమిస్తావో చెప్పు మరెవర్ని ద్వేషిస్తావో చెప్పు
మధ్యే మార్గాల ముండమోపి ముసుగులక్కరలేదు
గోడమీది పిల్లి వాటం సిద్ధాంత అన్వయాలూ అక్కరలేదు
చెప్పు
నువ్వెవరితో కల్సిపోదల్చుకున్నావో చెప్పు
నువ్వెవరి కనుసన్నల్లో ఆడదల్చుకున్నావో వేటాడదల్చుకున్నావో చెప్పు
ఇక్కడ రెండే మార్గాలు, రెండే పక్షాలు
జనమున్నారు జన కంటకులున్నారు
ప్రజలున్నారు ప్రజల్ని హింసించే ప్రభుత్వమూ ఉంది
గడ్డం పెంచుకుని బొట్టుపెట్టుకుని ప్రభుత్వ జపమాల తిప్పుతావా
జనంలో కలిసిపోయి జన యుద్ధాన్ని ఎక్కు పెడతావా”

అని నిలదీస్తాడు.

వర్గపోరాటాలు ధ్వంసానికి కారణం అని వాదించేవారికి శివారెడ్డి జవాబు,

“ధ్వంసం” లో,

“దేన్నీ ధ్వంసం చెయ్యకుండా
దేన్ని నిర్మిస్తావు?
ధ్వంసం చేయదగిందేదీ లేకపోతే నీకీలోకంలో
నువ్వు తప్పకుండా ధ్వంసంచేయతగిన వ్యక్తివి.”

విప్లవం, వర్గపోరాటం, శ్రామికులకు న్యాయం చేకూర్చటంలో నిప్పులు చిమ్మే శివారెడ్డి మానవ సంబంధాల విషయంలో నిట్టూర్పులిడుస్తాడు, కన్నీళ్ళు కారుస్తాడు.

స్త్రీపురుషుల మధ్య పెరిగే దూరాల గురించి, “ముళ్ళు” లో,

“మనిద్దరి మధ్యా
ముళ్ళు మొలుస్తున్నాయి కదూ –
పూలతో మొదలయింది కదూ
కథ మనిద్దరి మధ్య –

ప్రస్తుతపు ఈ పరిస్థితిలో
ముళ్ళుతప్ప ఇంకేమీ మొలవ్వనీ
వ్యవస్తాగతజాడ్యాల మధ్య
ఆర్థిక అసమానతల మధ్య
ముళ్ళుతప్ప ఇంకేమీ మొలవ్వనీ
నీకు తెలియదా?

మనిద్దరి మధ్యే కాదు
ఏ ఇద్దరి మధ్యైనా ఇంతే
ముళ్ళు తప్ప ఇంకేమీ బతకవు”

అంటాడు.

“నాకు రెండు టేబుళ్ళ అవతల” లో,

“నాకు రెండు టేబుళ్ళ అవతల ఇద్దరు – ఆడా మగా
నేను కాఫీ కప్పుల్లోంచి తలెత్తి చూసే సరికి
అతను నల్లగా, ఎత్తుగా, బొద్దుగా, దాష్ఠీకంగా
కాస్త అరిగిపోయి అలిసిపోయినట్టూ
ఆమె ఎర్రగా సన్నగా ముదరబారకుండానే మధ్యలో రాలిన ఆకులా –
వంచిన తల ఎత్తకుండా తెచ్చిన టిఫిన్ కెలుకుతూ;
ఆమెకే వినబడేట్టు, ఆమె చెవిదగ్గర
అతి క్రూర నిశ్శబద్దంగా మాట్టాడుతూ అతను
అతను కోపంగా ఉన్నాడనీ
ఆమె అనంత విచారంగా ఉందనీ, కళ్ళల్లో నీళ్ళుబుకుతున్నాయనీ
మనం సునాయాసంగా గ్రహించవచ్చు
ఏ విషయం మీద అతను ఆమెను నిలదీస్తున్నాడో
దేన్నిగురించి గద్దించి అడుగుతున్నాడో మనకు తెలియదు
మొత్తానికి ఒక విధ్వంస వాతావరణం

నేనూహిస్తున్నా
వాళ్ళిద్దరూ కలిసిన తొలిరోజుల్లో ఎలా వుండేవాళ్ళో
ఎంత అద్భుతంగా అర్థవంతంగా బతికేవాళ్ళో
సమస్త సౌందర్యం వాళ్ళదేనన్నట్టు, సర్వ సుఖాలు వాళ్ళవేనన్నట్టు
ప్రకృతిలో ప్రతిదీ వాళ్ళకోసమేనన్నట్టు, ప్రపంచంలో వాళ్ళిద్దరేనన్నట్టు
శీతాకాలపు మృదువయిన ఎండ వాళ్ళని ఆవరించి ఉండేది
ఒక నులువెచ్చనికాంతి సన్నని తీగగా వాళ్ళలో మోగి వుంటుంది

ఎన్నాళ్ళయిందో వాళ్ళు కలిసి, ఎంతమంది పిల్లలు, ఏం ఇబ్బందులు
తప్పకుండా
ఏదో ఒక పాము వాళ్ళమధ్యన చేరి ఉంటుంది
కనపడని చలిసూది వాళ్ళగుండెల్లో దిగి ఉంటుంది
నిత్యం సలుపుతూ నిద్రలేకుండా చేసి ఉంటుంది
ఒక భూకంప భూఖండ దృశ్యంగానో
వర్షరాహిత్య పీఠభూమిగానో వాళ్ళు
వాళ్ళిద్దరూ పక్కపక్కనే
కానీ వాళ్ళిద్దరి మధ్యా తగలడుతున్న వాసన
పాలుపొంగి ఆఖరికి అడుగంటిన వాసన
శవాల్ని మోసుకొస్తున్న గాలి వాళ్ళదగ్గిరే మొదలయినట్టు
ఆమె కళ్ళ నుంచి రెండు కన్నీటిబొట్లు రాలి ప్లేటులో పడ్డాయి
అతను చెదిరిపోతున్నట్టు, నిర్వీర్య క్రోధంతో అసహాయంగానూ
ఆత్మన్యూనతగానూ మారిపోతున్నట్టు
అంత దుర్మార్గంగా కన్పడ్డవాడు
అంతలోనే చితికిపోయి, అనంత ఆర్తనాదమయిపోయి –
గుక్కెడు గుక్కెడుగా నీళ్ళు మింగుతూ చనిపోతున్నట్టు
చేతులూ, కాళ్ళూ లేని ఒక నిస్సహాయతలో ఊరుకో అన్నట్టు –

ఆమె కళ్ళు తుడుచుకుంది
క్షణికోద్రేకాలూ, పరితాపాలూ, దాడీ, ఎదురుదాడులూ
చేతకానితనాలూ, అసలు సూత్రం అర్థంకానితనాలూ
అంతుపట్టనితనాలూ –
అన్నీ
మెలమెల్లగా కరిగి వాళ్ళచుట్టూ ఒక చిలకసరస్సు
సముద్రానికానుకుని ఒక సముద్రం – మధ్యలో ఒక రాతిమందిరం
ఎక్కడో నాలోనూ ఎదో విరిగింది
పుటుక్కున వానతీగె తెగింది
పాతముల్లు కెలికింది
కలతలేని కలకలేని కమురుకంపు మిగలని
మానవుడు ఎవడిక్కడ
కాఫీ ఆరిపోయింది
ఒక అవ్యక్త దుఃఖమేదో కాఫీకప్పుమీద
పరుచుకున్నట్టు, గోధుమరంగు మబ్బుపొర

ఏది చనిపోయిందో వాళ్ళ మధ్య
దాన్ని వాళ్ళు మళ్ళా బతికించుకోగలరా
ఇప్పుడది సాధ్యం కాదని
వాళ్ళకి లోలోపల బహుశా తడుతూనే ఉంటుంది
అయినా
జీవితాన్ని బతికించుకోవాలనే ప్రయత్నం
వాళ్ళు నాలా నిరంతరం చేస్తూనే
దుమ్ముకొట్టుకుపోయిన పాత ఫొటోల అద్దం ముక్కల ముఖాలు
ఇంకా ఎవరికీ అంతుపట్టని బంధం వెంటాడుతుందా
అది తెగదా
చూసే వాళ్ళకి అసహ్యమేసినా అది తెగదేమో
రోతే
రోతలో నడుస్తున్నప్పుడు
సమస్తం రోతగా మారుతున్నప్పుడు
రోతరోతగా ఉండదేమో”

రోజంతా తలమీద గుడ్డ లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, పేడతట్ట మోసే చిన్నపిల్ల, జీవితాంతం మరోమార్గం లేని, భవిష్యత్తు లేని అమ్మాయి గురించి, ఎంతో ఆర్ద్రతతో ఇలా రాశాడు శివారెడ్డి, “నా కలల నది అంచున” లో,

“నా కలల నది అంచున ఎవరో నడిచి వెళుతున్నారు
పాదాలు మాత్రమే, పాదాలు మాత్రమే కనబడుతున్నాయి
నీటి అంచున బరువుగా బహు మృదువుగానే పడుతున్నాయి
నిశ్శబ్దం ఒక జీవి
పాదాల వెంట నీరు వెడుతుందో, నీటి వెంట పాదాలు వెడుతున్నాయో తెలియదు
అంచున, అలా అంచునే, తడి అంచునే పేడతట్టనెత్తుకొని
అంత బరువైన పేడతట్టనెత్తుకొని వెడుతున్న ఆ చిన్న పిల్ల పళ్ళ బిగువులో
ఎంత నాగరికత ధ్వంసమయ్యింది
ఎంత సంస్కారం సర్వనాశనమయ్యింది
పేడతట్టకి ఆ పక్కన సూర్యుడుదయించి ఈ పక్కన అస్తమిస్తున్నాడు
కలల అరికాళ్ళకు రక్తమంటింది
ఎవడో కవి అన్నట్టు అన్నీ మాటలే – ఉదయం, సాయంత్రం
పొలం, పార, చావిడి, చాకిరి, కూలి, జీతం, జీవితం, సుఖం, దుఃఖం –
అన్నీ మాటలే
మాటల్లో మరణించిన అర్థాల గురించే ఇప్పుడు రగడంతా,
మండూరు రేవు నుంచి రెండు మైళ్ళ ఇంటికి ఏనుగంత పచ్చగడ్డి మోపు మోసి,
మెడలు విరిగిపోయి, కళ్ళు కాలవలయి, బాల్యం శవమయి
ఎదురు ఎవ్వరూ రారు బరువు దించరు
అప్పుడెత్తుకున్న బరువు ఇంకా దిగలేదు
మార్పులెన్నయినా బరువు పెరిగిందే గాని తరగలేదు
కోరికల తీరం వెంట నడుస్తున్న బరువుతట్ట పసిదాన్ని
నెత్తిమీద గుడ్డలేని, కాళ్ళకు చెప్పులులేని
మంచినీళ్ళందని పెదాల గొడ్లెంట తిరుగుతూ
పేడకళ్ళుపోగుచేసుకుంటున్న ఎండాకాలాల చిన్నదాన్ని,

మనిషి బువ్వ తింటానికి ఎన్ని యుగాలు పట్టింది
తన బువ్వ తను తింటానికి ఇంకెన్ని యుగాలు పడుతుంది
ఇంకెంత దూరం నడవాలి
ఏటి అంచే కాదు ఏరంతా నా అరి కాళ్ళ రక్తంతో తడిసిపోయింది
ఒడ్డులేని ఏటి చుట్టూ పరిభ్రమిస్తున్న
సూర్యుడు పేడకడిని నా తట్టలో వేసుకుని పరిగెడుతున్నా –
నా వెంట రండి – పిడకలు చేసి గోడకు కొడతా
రేప్పొద్దున తగలడిపోదురు
నా చేతుల్లోనో మా అమ్మ చేతుల్లోనో.”

తర తరాలుగా ఈ దీన మయిన పరిస్థితి మారటం లేదన్న నిజాన్ని “నా చేతుల్లోనో మా అమ్మ చేతుల్లోనో” అన్న ముగింపుతో చూపిస్తాడు శివారెడ్డి.

“అమ్మా అమ్మా” అన్న కవితలో స్త్రీల గురించి ఇలా రాస్తాడు,

“ఆమెకందరూ ఉన్నారు, తల్లిదండ్రులూ, బంధుకోటి, భర్తాపిల్లలూ –
ఎందరున్నా ఏకాకిగా మిగిలిపోతున్న ఈ దేశం ఆడది ఆమె
అందరి జన్మలకూ అభివృధికీ కారణభూతమైన ఆమె ఆమెగానే మిగిలిపోతుంది
అందరి అవసరాలూ తీర్చుతూ ఎవ్వరికీ చెందని ఆదిమతల్లి
యుగయుగాల పవిత్రదాసి –
లోతు తెలియని శారీరకశ్రమల మానసిక సంక్షోభాల సంకీర్ణ మహాటవీ!”

శివారెడ్డి కవిత్వం వ్యక్తుల గురించి కాదు. ఏ ఒక్కడి కష్ఠసుఖాల గురించి కాదు. “నా కలల నది అంచున”, “నాకు రెండు టేబుళ్ళ అవతల” వ్యక్తుల గురించేలా వున్నా, ఆవ్యక్తుల జీవితాలు మామూలు ప్రజల జీవితాలకు ప్రతీకలు. శివారెడ్డి కవితలు, ప్రతి ఒక్కటీ, జనసమూహాలగురించి, జాతి గురించి, మనకులేని నాగరికతి గురించి, మనకు అబ్బని సంస్కారం గురించీ.

వెనుక అట్టమీద “నేను పాటలు కట్టే వాణ్ణి” అంటాడు శివారెడ్డి. శివారెడ్డి రాసేవి పాటలూ పద్యాలూ కావని, వచన కవితలు అని నా అభిప్రాయం.

“ఆగష్టు 6” అన్న కవితలో “మనేదే కవిత” అంటాడు శివారెడ్డి. మనేది అంటే నాలుగు కాలాలపాటు ఉండేది అని నాకు తెలిసిన అర్ధం. దీన్ని కొంచెం వివరంగా రాస్తూ, ముందు మాటలో, “నా జీవితం నుంచి నన్ను విడదీసి, నా సమాజం నుంచి నన్ను విడదీసి, నా కాలాన్నుంచి నన్ను విడదీస్తే, నాకవిత్వమేమీ మిగలదు,” అంటాడు.

అంటే, చిన్న పిల్ల తలమీద పేడతట్ట బరువు ఉన్నంత కాలం, నాగరికతా,సంస్కారం మనదాకా చేరనంతకాలం, శివారెడ్డి కవితలకు తెలుగువారు కొందరైనా స్పందిస్తూ ఉంటారు అని నా అభిప్రాయం.
——————-***———————

ఈ రిపోర్ట్ చదివింతర్వాత జరిగిన చర్చలో వెలువడిన అభిప్రాయాలు కొన్ని ఇక్కడ జతపరుస్తున్నాను.

1 శివారెడ్డిమీద పల్లెటూరి ప్రభావం చాలా వుంది. జైత్రయాత్రలో పల్లెటూరి దృశ్యాలూ, వాతావరణం, అక్కడి మనుషుల మధ్య సంబంధాలు చాలాచోట్ల కళ్ళకు కట్టినట్లు కన్పిస్తాయి. శివారెడ్డి మీద ఇతర రచయితల, ఉద్యమకారుల ప్రభావం ఉందో లేదో మనకు తెలియకపోయినా, అతని శైలిలో ప్రత్యేకత కన్పిస్తుంది.

2 పేడతట్ట మోసుకు వెళుతున్న అమ్మాయిలను మనం ఎంతమందిని చూళ్ళేదు. ఎప్పుడైనా వాళ్ళ జీవితాల గురించి, భవిష్యత్తు గురించీ, దాన్ని మార్చగలిగే మార్గాల గురించీ అంత దీర్ఘంగా ఆలోచించామా? కాని, ఆ బాధలు తను పడకుండానే, ఆర్థికంగా బాగానే ఉన్నవాడు, మంచి హాస్పిటల్ కు పోగలవాడు, పిల్లల్ని బాగానే చదివించుకోగలవాడు తను పడని బాధల గురించి రాయవచ్చా? ఆ పరిస్థితుల్లో బతికిన వారికే అవి అర్థమవుతాయనుకోవటం పొరపాటు. శ్రమ పడుతున్నవాడితో మమేకం చెంది తన అనుభూతి గురించి రాయగలిగితే అది గొప్ప విషయం. మా అమ్మ కొబ్బరిచెట్టును చూస్తూ, “ఎందుకమ్మా, అన్ని కాయలు కాస్తావు. వాటిని మోస్తూ మోస్తూ నీ నడుం విరిగి పోదూ?” అనేది. కవిత్వం అంటే అదీ. ఎవరి బాధనో చూసి, ఆ బాధను అనుభవించి, దాన్ని గురించి మనం బాధపడేలా రాయగలిగిన వాడు కవి.

3 శివారెడ్డినిగానీ, మరో కవినిగాని విమర్శించే అర్హత మనకు లేదు. అతని కవితకు స్పందించగలం. దానిమీద అభిప్రాయాలు వ్యక్తం చెయ్యగలం. కాని విమర్శ చెయ్యలేం. విమర్శ అనేది పాశ్చాత్య సాహిత్య ప్రక్రియ. భారతీయ సాహిత్యం లో ఆ ఆచారం లేదు. ఒక రచనలో, కవితలో అంతర్గతమైన అవకతవకలు ఏమన్నా ఉన్నాయా అని
చూడగలగటాన్ని విమర్శ అనవచ్చు. కాని మనకు అవకతవకగా కన్పించేది ఆ కవితకు ముఖ్యమైన భాగమైతే అందులో తప్పులేదు.

4 శివారెడ్డికి బీదల మీద దయ ఎక్కువగా ఉందా, డబ్బున్నవాళ్ళ మీద ద్వేషం ఎక్కువగా ఉందా అని చూస్తే, ద్వేషమే ఎక్కువగా ఉందనిపిస్తుంది. ఈ పుస్తకంలో ఏ లైన్ చూసినా, వీళ్ళకు లేదని కాదుగాని, వాళ్ళకు ఉందని కోపం కన్పిస్తుంది. “అల” లో ధనికులను గురించి రాస్తూ, “వ్యభిచరించటాలు” అన్నాడాయన. అంటే ఏమిటి? అది ఆయనకు వాళ్ళ మీద ఉన్న కోపమే. క్వాలిటీ సర్వీసెస్ ఉండాలి గదా? క్లీన్‌గా ఉండటం తప్పు లేదు కదా? బాగున్నవాణ్ణి ధ్వంసం చేస్తే బీదవాడికి మంచి జరుగుతుందని అతని
అభిప్రాయం. కాదు, శివారెడ్డి ద్వేషం వ్యక్తుల మీద కాదు. వ్యవస్థతో. ఆ వ్యవస్థ వెనుక ఉన్న చలన సూత్రాలతో. వాటి వెనుక ఉన్న వర్గంతో. ఎవడైతే శ్రమదోపిడి చేస్తాడో, కమ్యూనిష్టుగాని, కాపిటలిష్టుగాని వాళ్ళను నరకమంటాడు శివారెడ్డి. ఎక్స్ట్రీం సొల్యూషనే. అదీ ఆయన అంది. కాపిటలిష్టుల్ని మాత్రమేగాదు. అధికారం మీద తిరుగుబాటు ఆయనది. వ్యక్తులమీద కాదు. శివారెడ్డి వామపక్ష వాదుల్ని వదిలెయ్యలేదు. ముఖ్యంగా నకిలీ వామపక్ష వాదుల్ని. “ఎటు నిలబడతావో చెప్పు” లో ఆయన చురకలేసింది ఎవర్ని?

5 శివారెడ్డి కవితలు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నాయి. ఎప్పుడైనా శివారెడ్డిని జైల్లో వేశారేమో? కాని శివారెడ్డి కవిత్వం అంతా విప్లవం గురించి కాదు. అతని కవిత్వం లో చాలా వస్తువైవిధ్యం ఉంది.

6 “జైత్రయాత్ర” లో రెండు వర్గాల గుణాలు, అలవాట్లు, వాటి తేడాలు అంత వివరంగా కన్పించవు. “జైత్రయాత్ర” అసలెవరి గురించి? అందులో వర్గ శత్రువులెవరు? ఎవర్ని చంపుతాం అంటున్నాడు శివారెడ్డి? జైత్రయాత్ర లో కొన్ని కవితలు అర్థం కాలేదు. వాటిలో శివారెడ్డి ఏం చెప్పదల్చుకున్నాడో అర్థం కాలేదు. శబ్దాలు మాటలు పదాలు వాడ వలసి వాడుతున్నాడేమో అతడు. భాషకందని భావాలు కవివి. కప్పి చెపితే కవిత్వం, విప్పి చెపితే విమర్శ అన్నారు. ఒక కవిత పదిసార్లు చదివినా అర్థం కాలేదనుకోండి. అయితే ఏం? దాని తీవ్రత మీకు అనుభవం అయింది కదా? అది చాలు. కవిత్వం అనుభవించలేకపోతే అర్థం కాకపోవచ్చు. మాటలు అన్నీ తెలిసినా, భావం అర్థం కాకపోతే, భావం అనుభవించలేకపోతే, భావం తో ఏకీభవించలేకపోతే కవిత్వం అర్థం కాకపోవచ్చు. ఇష్టం లేక పోవచ్చు.

7 ఆయన అభిప్రాయాలెలావున్నా, కవిత్వం ద్వారా ఆ అభిప్రాయాల్ని మనసుని తాకేలా చెప్పగలిగాడా లేదా అన్న విషయం గురించి మాట్లాడుకుందాం.

8 “మేం రాస్తూ వుంటాం” లో ఒరవడి చాలా బాగుంది.
“నీటి మీదా
నీటిని మోసుకుపోయే నదులమీదా
నదుల చేతివేళ్ళు పంటకాలవల మీదా – పంటపొలాల మీదా
చేలమీదా – చేల మట్టి మీదా
మట్టిలో జీవిస్తున్న చేతుల శ్రమమీదా
మేం రాస్తూ వుంటాం – విప్లవం వర్ధిల్లాలని”

* “మంచు” చాలా బాగుంది. “ఎప్పుడైనా అందవిహీనమైన ఆడదాన్ని చూశావా? అందగత్తెకాని ఆడదెక్కడుంది ప్రపంచం లో” తో మొదలయిన ఈ కవితలో నాయనమ్మ గురించిన పాదాలు చాలా బాగున్నాయి.

“ఎనభై యేళ్ళొచ్చినా నడుం వంగిపోయినా
పండిన దబ్బ పండు లాంటి శరీర శోభతో
నిరంతరం శ్రమించే మా నాయనమ్మ ఎంత సౌందర్యవతి
ఎంతటి కాంతిమతి
చేత్తో ఒక్క సారి వీపు నిమిరితే చెడు గాలులన్నీ
పాడు జ్వరాలన్నీ మటుమాయమయ్యేవి
ఎంత ప్రేమ, ఎంత దయ కళ్ళ కింద పచ్చని గుబురు చెట్ల నీడ ఒక చలివేంద్రం
ఆ ప్రేమా దయ లోంచి ఆమె అందంగా కనపడేదో
ఆమె అందం లోంచి ప్రేమా దయ అందంగా కనపడేవో ఇప్పటికీ నాకు తెలియదు”.

* “మంచు” లో నాయనమ్మ గురించి రాస్తూ –
తెల్లారగట్ట సౌందర్యాలు, కోళ్ళ పక్షుల పశువుల కూజితాల
శబ్దాల సంగీత సారస్వతాలు నేర్పిందెవరు – ఆమే
లోకాన్ని హాయిగా శుభ్రంగా నేర్పుగా
కొత్తగా చూడటం నేర్పిందామే
ఆమె నా కవిత్వానికి తొలి గురువు.”
అంటాడు.

* “వృద్ధాప్యం” చదివి కన్నీళ్ళు రాకుండా ఎవరైనా ఉండగలరా? ఒక మనిషి మరొక మనిషి బాధను గుండెల్లో పెట్టుకొని పైకి ఇలాగా ఎక్స్‌ప్రెస్ చెయ్యగలగటాన్ని ఏమనాలి! సీసాలు సీసాలుగా సీసాలు రాస్తే దాన్ని కవిత్వం అంటాం. ఇలా హృదయం పొంగొచ్చేట్టు చెయ్యగలగటం – ఇదీ కవిత్వం అంటే.

“వృద్ధాప్యం ” చదివినప్పుడు అటువంటి పరిస్థితికెళ్తాం అంటే భయం వేస్తుంది.

“తలెత్తితే వాకిట్లోంచి కన్పించే బూజురుముక్క – ఆకాశం” చాలా గొప్ప లైను.

* “ఒకానొక వృక్షం” లో “గాలి పిల్లాణ్ణి వళ్ళో వేసుకుని ఉయ్యాలలూపుతుంది” అంటాడు. గాలి చెట్టును ఊపుతుందని అందరూ రాస్తారు. చెట్టు గాలి పిల్లాణ్ణి ఉయ్యాలలూపుతుందని ఊహించటం చాలా బాగుంది.

* శ్రమజీవుల జీవితాలు తర తరాలుగా మారటంలేదని చెప్పటానికి, “నా కలల నది అంచున” లో “నా వెంట రాండి – పిడకలు చేసి గోడకు కొడతా రేప్పొద్దున తగలడిపోదురు
నా చేతుల్లోనో మా అమ్మ చేతుల్లోనో” అంటాడు, చివరి పాదం లో కొసమెరుపుతో.

9 ఇతను కేవలం కవి కాడు. తాత్వికుడు కూడా. “మంచు” చివర అంకితం లో “ఆ నలుగురు స్త్రీలకీ” అంటాడు. “ఆ…” అనటం లో తన అనుభవాలనుంచి తనను తాను దూరం చేసుకో గలిగాడు. ఇది గొప్ప విషయం.

10 “జైత్రయాత్ర” అన్న కవిత చివర ఫుల్ స్టాప్ కాకుండా, ఈ యాత్ర సాగుతూ పోతున్నట్లు నాలుగైదు బిందువులు పెడితే బాగుండేది.
——————-***———————
-ఇవీ మా చర్చలో వెలువడిన కొన్ని అభిప్రాయాలు. రెండు మాటల్లో చెప్పాలంటే ప్రారంభంలో శివారెడ్డి రాజకీయాలమీదా విప్లవం మీదా ఉద్రేకంతో జరిగిన చర్చ చివరికి మానసంబంధాల మీద శివారెడ్డి కవితల్లోని ఆర్ద్రతలో చల్లబడింది. ఎవరికి నచ్చిన కవిత వారు చదవటంతో ముగిసింది.

****************************************************************
పుస్తకం వివరాలు:
జైత్రయాత్ర
రచన: కె.శివారెడ్డి
పేజీలు: 153
ప్రచురణ: 1999
వెల, ప్రచురణకర్తల వివరాలు ఇప్పటికి తెలీవు…
ఈ వ్యాసం కాపీరైట్లు DTLC వారివి.
****************************************************************

You Might Also Like

2 Comments

  1. రవికిరణ్ తిమ్మిరెడ్డి

    సీతారామయ్య గారు,

    ముందర మీ డెట్రాయిటులిటరరీ క్లబ్బుకి అభినందనలు. శివా రెడ్డిని అమెరికా ఆంధ్రుల మనసుకెక్కిచ్చటానికి మీరు చేసిన ప్రయత్నానికి మరొక సారి అభినందనలు. చర్చలో వెలువడిన అభిప్రాయాల్ని చదివేక నాకు శివా రెడ్డి జైత్రయాత్ర కవిత గుర్తుకొచ్చింది.

    “దాచుకో
    నిన్ను నువ్వు దాచుకో
    కళ్ళ కింద
    కన్నీళ్ళకింద
    రెప్పలకిందా కదలాడే నల్లని నీదలకింద
    ……………”

    మనవేవీ అమెరికాలో పుట్టీ అమెరికాలో పెరగలేదు. తెలుగు దేశంలో పుట్టి, పెరిగి అమెరికాకొచ్చిన వాళ్ళవే. తెలుగు దేశాన్ని ఒక ఊపు ఊపిన, ఇంకా కాస్తో కూస్తో ఊపుతున్న, శివారెడ్డి కవితల్లోంచి ఫెల్లుబుకుతున్న ఆ రాజకీయల గురించి కనీస అవగాహన కూడా మెజారిటీ అభిప్రాయాల్లో కనబడలేదు. ఇవి మనకు కొత్తా, ఇవి మన దేశంలో మనం పెరుగుతున్నపుడు మనవెప్పుడూ వినని, మనకు తెలియని విషయాలా. కాదని మనకు తెలుసు, కానీ వాటిని మనం దాచేసుకున్నాం. అమెరికాలో మన డాలరు పరుగుల వెనక దాచేసుకున్నాం, మన బావి చుట్టూ మనం కట్టుకున్న గోడలవెనుక దాచేసుకున్నాం. మనం మనకోసం నిర్మించుకున్న ఈ పచ్చ పచ్చని లోకంలో మనకి తెలియకుండా మనల్ని మనం దాచేసుకున్నాం.

    ఉదయాస్తమయాల గురించి, ఆకుల గురించి, పువ్వుల గురించి, చెప్పిందే చెప్పరా అనిచెప్పే కవిత్వాన్ని మన ఈ పత్రికల్లో చదివేసి, శివారెడ్డిలో కూడా దానికోసం వెతుకులాట మీ చర్చలో కనపడుతుంది.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

Leave a Reply