ఏకరూపులు

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

**********

మనిషి జీవితమంతా అధ్యయనమే. అలాగని జీవితాంతం ఏ బడిలోనో చదవనక్కరలేదు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మించిన పాఠశాల లేదు. జీవితం పొడవునా ఎదురయ్యే అనుభవాలను మించిన పాఠాలూ లేవు. చదివిన చదువుకు అనుభవసారం తోడైతే ఆలోచనాపరుడైన వ్యక్తికి జీవితంలోని అన్ని పార్శ్వాలూ అలవోకగా అర్థమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, నైతిక మార్పుల్ని, వాటి వెనుకనున్న కారణాల్ని సమతూకంతో అవగాహన చేసుకోగల నేర్పును ఇస్తాయి. అటువంటివారి నుంచి వెలువడే రచనలు పాఠకుడి ఆలోచనాశక్తిని విశాలం చేస్తాయి.

ఇవాల్టి మన పుస్తకం పదహారు కథల్ని, ఒక నవలికను ఇముడ్చుకున్న ఏకరూపులు. రచయిత ఎలక్ట్రాన్ కలంపేరుతో ఐదారు దశాబ్దాలుగా కథలను రాస్తున్న పింగళి వెంకట రమణారావు గారు. నాలుగైదు కథా సంపుటాలు వీరివి ఇప్పటికే ప్రచురించబడ్డాయి. జనారణ్యం కథా సంపుటి జనాభా పెరుగుదల గురించి రాసిన ఆసక్తి కరమైన పుస్తకం. ఇది ఆంగ్లంలో సైలెంట్ ఎక్స్ప్లోజన్ పేరుతో వచ్చింది.

ఈ సంపుటిలోని కథలన్నీ వివిధ పత్రికలలో అచ్చైనవే. కొన్ని బహుమతులను పొందాయి. వీటి గురించి చెప్పుకుందాం. 

నిరాకారుడు కథలో గిరిబాబు కాలేజీలో భౌతిక విజ్ఞానాన్ని బోధిస్తాడు. వీలున్నప్పుడు విద్యార్థులకు హేతువాదాన్ని గురించి చెపుతుంటాడు. తాను దేవుణ్ణి నమ్మకపోయినా భార్య పూజలకు మాత్రం అడ్డుచెప్పడు. భార్యాభర్తలకి ఇలాటి సర్దుబాట్లు తప్పవంటూ మిత్రుల దగ్గర తనను తాను సమర్థించుకుంటాడు.

ఉన్నట్టుండి కాలేజీలో మతపరమైన గొడవలు మొదలవుతాయి. యాజమాన్యం అనుమానపడినా చక్కగా పాఠాలు చెప్పే గిరిబాబుని ఏమీ అనలేక పోతుంది. విద్యార్థుల గొడవల్లో గిరిబాబుకి దెబ్బలు తగులుతాయి. దెబ్బలు మాని కాలేజీకి వచ్చిన గిరిబాబుని పరీక్షల ముందు సిలబస్ పూర్తి చేసేందుకు దేవుడిలా వచ్చారని విద్యార్థులు ఆనందంతో ఆహ్వానిస్తారు. భగవంతుణ్ణి మనిషే సృష్టించినా నిజమైన ఆరాధనారూపం కృతజ్ఞత నిండిన మనస్సుల్లోంచి వస్తుందని గ్రహిస్తాడు గిరిబాబు. కథలో కాస్త ఎక్కువగానే కనిపించిన శాస్త్ర విజ్ఞాన సంగతులు సాధారణ పాఠకుడిని అంతగా ఆకర్షించవు.

పరిష్కందులు పిల్లలు లేని ఒక జంట కథ. సమస్య ఎక్కడుందన్న తల్లి సంశయాన్ని తనదే లోపమంటూ భార్యను అత్తపోరు నుంచి, లోకం పోరు నుంచి బయటపడేస్తాడు కొడుకు. అనాధను దత్తత తెచ్చుకుందామంటూ బయలుదేరదీసిన విజ్ఞత కలిగిన తల్లి అందమైన పిల్లల్ని కాక వైకల్యం ఉన్న పిల్లల్ని దత్తు తీసుకుని వారికి, తమకి కూడా గౌరవాన్ని తెచ్చుకుందామంటుంది. కథలో అనాధ శరణాలయాల పట్ల ప్రభుత్వం కానీ, పిల్లలు లేని జంటలు కానీ దృష్టి సారించక కృత్రిమ పద్ధతులవైపు మొగ్గుతూ సంతాన సాఫల్య కేంద్రాలను పెంచుతున్నారంటారు రచయిత. సీరియస్ గా ఆలోచించవలసిన అంశమిది.

ఓం నమఃశివాయ వంశానుగతంగా తండ్రి చేస్తున్న అర్చకత్వాన్ని ఇష్టపడని విద్యాధికుడైన ఒక యువకుడు చదువుకు తగిన ఉద్యోగ ప్రయత్నం చేస్తాడు. అదంత సులువు కాదని అర్థమై ట్యూషన్లు చెపుతూ మంచిపేరు తెచ్చుకుని తనలాటి మరొక యువకుడిని కలుపుకుని ఊరికి ఆదర్శవంతమైన బడిని ఏర్పాటుచేస్తాడు. అది విజయవంతమయ్యేందుకు తండ్రి నమ్మిన ఆస్తికత్వం కూడా పనిచేసిందన్నది తెలుసుకుని తండ్రి నమ్మిన దారి పట్ల గౌరవం ఏర్పరచుకుంటాడు. దేవాలయ మాన్యాలు, ధర్మకర్తల సంఘాలు, అర్చకుల ఆర్థిక పరిస్థితులు, మారుతున్న యుగ లక్షణాలు గురించి వివరంగా చెపుతుందీ కథ.

ఇది వివక్ష కాదు దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశార్హత గురించిన చర్చలు, దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు ఈ కథ ప్రస్తావించింది. హక్కుల ఆందోళనకు దిగిన ఒక మహిళ హైందవ సంప్రదాయాలను నిలబెడుతున్న ఆయా ప్రాంతీయ, గ్రామీణ సమాజ రీతులను, ఆచారాల్ని నాగరిక సమాజం అర్థం చేసుకోవలసిన అవసరం ఉందన్నది ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకుంటుంది. స్త్రీ పురుషుల హక్కుల విషయంలో సమానత్వం కోరుకున్నా కొన్ని కొన్ని సంప్రదాయాలు సమాజహితం కోసమే ఏర్పరచి ఉండవచ్చనుకుంటుంది.

నిచ్చెన మెట్లు కథానాయకుడు శ్రీపతి ఒక సంస్థలో అధికారి. తాను కూర్చున్న కుర్చీ, హోదా మినహా తన కింద పని చేసేవాళ్లకి స్ఫూర్తినివ్వగలిగే ఆలోచన, లక్షణం లేని స్వార్థపరుడు. అహ్మదాబాద్ లో బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ లో నెలరోజుల ప్రత్యేక శిక్షణ కోసం ఎంపికై, అక్కడ తన సంస్థకి తానెంత ముఖ్యుడో అందరి దృష్టిలో పడేలా నాటకీయంగా ప్రవర్తిస్తుంటాడు. శిక్షణ పూర్తై, పరీక్ష నిర్వహించినపుడు తాను ఊహించినట్టే మొదటి ర్యాంకు తెచ్చుకున్నందుకు శ్రీపతి గర్వ పడతాడు. శిక్షణ ముగింపు సందర్భంగా ఏర్పాటైన ఉపన్యాస వేదిక పైన అక్కడి విద్యార్థిని ఒకరు నాయకత్వ లక్షణాల గురించి చెపుతూ తన బృందంలోని వారిలో ఆత్మవిశ్వాసాన్ని, స్ఫూర్తిని పెంచి, మరింతమంది నాయకుల్ని తయారు చెయ్యటమే నాయకుడి ముఖ్య లక్షణమంటుంది. అహ్మదాబాద్ బిజినెస్ స్కూల్ శ్రీపతి పనిచేసే సంస్థకి పంపిన రహస్య నివేదిక అతణ్ణి ప్రమోషన్ కి అనర్హుడిని చేస్తుంది.  

మన జీవితం మనది కాదు ఒక బడిపంతులు ఐదుగురు సంతానంలో మొదటివాడు ఈ కథకి నాయకుడు. కావాలనుకున్న చదువుకి తండ్రి ఆర్థిక స్థోమత అడ్డంకి కావటంతో తండ్రి చెప్పినట్టు బడిపంతులు ఉద్యోగంలో కుదురుకుంటాడు. తన పెళ్ళి చేసి కట్నం తీసుకుని చెల్లెళ్ళ పెళ్ళి చేయాలన్న తండ్రి ఆలోచన అతన్ని ఇబ్బంది పెడుతుంది. తల్లి పుట్టింటి నుంచి అరణంగా తెచ్చుకున్న భూమీ తండ్రి బాధ్యతల బరువుకి కరిగిపోతుంది. ఆర్థిక అవసరాల కోసం మెరుగైన ఉద్యోగం కోసం మతాన్ని వదులుకుంటాడు. కట్నం వేటలో తండ్రి వ్యవహారం చూసి పెళ్ళి పట్ల విముఖత పెంచుకుంటాడు. జీవితం తనదే అయినా దాన్ని శాసించే అంశాలు సమాజమంతా ఉంటాయన్న వాస్తవాన్ని కథానాయకుడు జీర్ణం చేసుకుంటాడు.

బొగ్గు ఆంజనేయులు ఆంజనేయులు తల్లిలేని పిల్లవాడు. సవతితల్లి తండ్రి చాటున చేస్తున్న పని సరైనది కాదని గ్రహిస్తాడు. ఎవరు తప్పు చేసినా అందరి దృష్టికి తీసుకురావటం సరైనదన్న అభిప్రాయానికి చిన్ననాడే వస్తాడు. మేనమామ ఇంట్లో చదువుకుందుకు పంపితే బడిలో జరుగుతున్న అవకతవకల గురించి బడి గోడల మీద బొగ్గుతో రాసి కింద సంతకం చేస్తాడు. మేనమామ కోపానికి గురై హాస్టల్ కి పంపబడతాడు. అక్కడ జరిగే అవినీతి, ఆనక విశ్వవిద్యాలయ చదువులప్పుడు, ఉద్యోగ ప్రదేశంలోనూ వాస్తవాల్ని బొగ్గుతో గోడకెక్కించి ఇబ్బందుల పాలవుతాడు. బదిలీ మీద మన్యం వెళ్తాడు. ధ్యాస మళ్ళేందుకు పెళ్ళి చేసుకోమన్న తండ్రితో తనకు భార్యగా వచ్చినవారెవరూ సుఖపడరని బొగ్గు ఆంజనేయులు గా మిగిలిపోతాడు.

శతమొండి ఘటాలు సుందరం తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. ఆడింది ఆటగా పాడింది పాటగా పెరుగుతాడు. అన్నింటా తానే ఆధిక్యంలో ఉండాలనుకుంటాడు. స్వయం ప్రతిభకు తోడు అందివచ్చిన అవకాశాలతో అహంకారాన్ని పెంచుకుంటాడు. క్యాంపస్ ఉద్యోగాల సమయంలో మనవడు అతిశయంతో ప్రవర్తిస్తున్నాడన్న విషయాన్ని గ్రహించిన తాత హితవచనాలు చెప్పినా పట్టించుకోడు. ఉద్యోగ జీవితంలో సుందరం తెలివితేటల్ని బాస్ నళిని గమనిస్తుంది. తనకంటే చిన్నవాడైన సుందరానికి ప్రొపోజ్ చేస్తూ కంపెనీలో పెద్ద హోదా ఖాయమంటుంది. మనవడికి తగిన జోడీ దొరికినందుకు సంతోషిస్తూ అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి వ్యత్యాసాన్ని గ్రహించి మసులుకోమని తాత ఆశీర్వదిస్తాడు.

సుధాప్రద గుడి యశోదమ్మ మనవడి బారసాలకి అన్ని ఏర్పాట్లనూ చేసి శుభకార్యం జరిపించాల్సిన బ్రాహ్మణుడి రాకకోసం చూస్తుంటుంది. ఒప్పుకున్న సమయానికి రాకపోగా ఒక సినీతార కట్టిన గుడిలో మరో వర్ధమాన తార జరపబోయే పాలాభిషేకం, పూజల కోసం వెళ్ళాడని తెలుస్తుంది. ఉపాయంతో తన మనవడి బారసాలను అనుకున్న సమయానికి అదే బ్రాహ్మణుడి చేతి మీదుగా మరింత మంది ఆహూతుల ముందు ఘనంగా జరిపించేస్తుంది.

దర్జీ సిద్ధాంతి తాంత్రిక పూజలు, మూఢ నమ్మకాలు గురించి ఇప్పటికీ మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఎక్కడో మారుమూల పల్లెల్లో జరుగుతున్న చేతబడులు, వాటి వలన జరిగే ప్రాణ నష్టాలను గురించి, ఆయా క్షుద్రవిద్యల్ని ప్రదర్శించే వ్యక్తులపై దాడుల్ని గురించి కూడా వింటున్నాం. శాస్త్ర విజ్ఞానం ఇంతగా పెరిగినా అవిద్య, మూఢనమ్మకాలు సమాజమంతా ఇంకా విస్తరించి ఉన్నాయన్నది వాస్తవం. ఒక సస్పెన్స్ సినిమాని చూస్తున్నట్టుంది ఈ కథ చదువుతుంటే. ఇందులోని నిజానిజాల మాటెలాఉన్నా కథ ఆసక్తిగా చదివిస్తుంది. 

ఉద్యోగధర్మం ఉన్నత చదువులకి, ఉద్యోగాలకి స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా అవకాశాలు దొరుకుతుండటం వల్ల లింగవివక్ష కొంతవరకు సమసిపోయి సమానత్వానికి దారితీస్తోంది. చదువు నిమిత్తమో, ఉద్యోగనిమిత్తమో బయటి ప్రపంచంలోకెళ్ళే ఆడపిల్లకి ఎంతవరకు రక్షణ ఉంటోందన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ఆమాటకొస్తే ఇంట్లోనూ రక్షణ లేదు. ఆడపిల్లని ఎక్కడా వెంటాడి వేధించే మనస్తత్వాల్ని నిత్యం చూస్తున్నాం. విలువలు మారుతున్నాయి. పెళ్ళైన ఆడపిల్ల పట్ల సభ్యత పాటించే ఆనవాయితీ కూడా కంటి ముందే మాయమైంది. తనకంటే పెద్దదైన వివాహితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఒక యువకుడి కథ ఇది. 

సవ్యాజ మానవులు ఒక పెళ్ళింట పెళ్ళికొడుకును, పెళ్ళికూతురును పోలిన మరొక జంట పెళ్లిజంటగా ఎదురైనపుడు జరిగిన హడావుడి, అయోమయం ఈ కథలో చూస్తాం. ఎనభయ్యో దశకంలో వచ్చిన అంగూర్ హిందీ సినిమా (సంజీవ్ కుమార్, మౌసమీ), అందులో మనిషిని పోలిన మనుషులు ఉండటంతో ఏర్పడ్డ సరదా సన్నివేశాలు జ్ఞాపకం వచ్చేస్తాయి. రచయితకు ఇష్టమైన శాస్త్ర విజ్ఞాన సంబంధమైన సంగతుల ప్రస్తావన ఇక్కడా చూస్తాం.

సగినాల శకు తెలవారి ఊరువెళ్ళేందుకు ప్రయాణమైన వీరాసామి అనుకోకుండా ఎదురైన ఆరేళ్ళ శకుంతల కారణంగానే ఏళ్ళతరబడి విసిగించిన ఆస్తి తగాదా తనకు సానుకూలంగా మారిందని సంబరపడతాడు. ఇది ప్రచారంగా మారి, ఇలాటి మరిన్ని సంఘటనలు ఊళ్ళో జనానికి శకుంతల శకునం మీద పూర్తి నమ్మకం ఏర్పడేలా చేస్తాయి. అయితే ఆ తర్వాత ఏమైందో కథలో ఆసక్తికరమైన మలుపును చదివి తెలుసుకోవలసిందే.

ఏకరూపులు ఈ పెద్ద కథ పేరునే కథా సంపుటికి పెట్టారు. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్న విషయాన్ని వింటూంటాం. అందులో సత్యాసత్యాలెలా ఉన్నా కథలో ముఖ్య పాత్ర సూర్యారావు తనను పోలిన వ్యక్తిని చూసినట్టుగా మిత్రులు చెప్పటంతో ఆశ్చర్యపోతాడు. మొదట ఒకటి రెండుసార్లు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. అతని కొలీగ్స్, మిత్రులతో చేసిన ప్రయాణాల్లో అనేక సందర్భాల్లో తనలాటి వ్యక్తిని చూసామన్న వారి మాటలను నమ్మలేకపోతాడు. క్రమంగా అది అతనికీ అనుభవంలోకి వస్తుంది. 

కథా గమనంలో అహ్మదాబాద్, చండీఘడ్, హ్యూస్టన్, తేలప్రోలు, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, కొలనుపాక జైన దేవాలయం, గుజరాత్ లోని ద్వారక, తిరువణ్ణామలై లను చుట్టివస్తాం. తిరువణ్ణామలై లో కలిసిన శారదా చతుర్వేది, ఋషికేశ్ లో ఉన్న శారదా చతుర్వేది బాబాయ్ నారాయణ చతుర్వేదిల సంకల్పం ద్వారా వివిధ ప్రాంతాల్లో ఒకే రూపంలో ఉన్నట్టు చెపుతున్న వ్యక్తులందరూ ప్రత్యక్షంగా కలుసుకోవటం జరుగుతుంది. 

 ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయా ప్రాంతాల గురించిన అనేక వివరాలు తెలుసుకుంటాం. ముఖ్యంగా హ్యూస్టన్ నగరంలోని ప్రత్యేకతలు, ద్వారకా పట్టణ చారిత్రక, రాజకీయ వివరాలు, జైన మతంలోని అనేక వాస్తవాలు, తిరువణ్ణామలై గిరిప్రదక్షిణలో ఎదురయ్యే అనేక గుడులకున్న ప్రత్యేకతలు, రమణ మహర్షి జీవితానికి సంబంధించిన వివరాలు, ఋషికేష్ ప్రాంతపు వర్ణనలు చదువుతున్న మనల్ని ఆయా ప్రాంతాలతో, ఆయా సన్నివేశాలతో మమేకం చేస్తాయి. ప్రపంచం లోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విషయాల పట్ల, అనుక్షణం కొత్త విషయాల్ని కనిపెడుతున్న శాస్త్ర విజ్ఞానం పట్ల రచయితకున్న ఆసక్తి, పట్టు ప్రతి చోటా ప్రతిఫలిస్తాయి. 

ఏ విషయాన్ని చెప్పినా శాస్త్రపరమైన చూపుతోనే పరిచయం చెయ్యటం చూస్తాం. కథలో కులమతాల గురించి చర్చ జరిగినా, మతం గురించి చెప్పినా ఎంతో సంయమనంతోనే విషయాలను అందించటం అభినందించదగ్గది. ఏ విషయాన్నైనా విపులంగా, సులభంగా అందుకోగలిగే ఈ గూగుల్ రోజుల్లో కథలో కొన్ని చోట్ల ఇచ్చిన వివరాలు సాధారణ పాఠకుడికి కాస్త సాగతీతలా అనిపించే అవకాశం ఉంది.

నమ్మకం అన్నది ఆత్మవిశ్వాసానికి అంకురార్పణ అని, అది మూఢంగా మారినపుడే ఇబ్బందులెదురవుతాయని చెపుతూ, హిందువులకు మతం, మత గ్రంథం లేవని, భగవద్గీత హైందవ జీవన విధానాన్ని చూపుతుందే కానీ నియమాల్ని సూచించదంటారు శారదా చతుర్వేది. మతాన్ని మనిషికి అనేక విధాలుగా అంటగట్టినా, మనసు లేదా ఆత్మకు మతం లేదని, చెరుకుగడ లోని తీపికి రూపం లేనట్టే ఆత్మకూ రూపం లేదని చెప్పే ఆయన మాటల్లోని వివేకం ఆలోచింపచేస్తుంది. ఫలితం కోసం చూడకుండా విధిని నిర్వహించమన్న గీతా వాక్యం ఇక్కడ చెపుతారు. 

కథా గమనంలో అనేక వాస్తవ సంగతులను అందించిన రచయిత స్నేక్ ఎక్స్ పర్ట్ కలకత్తా వాసి దీపక్ మిత్రా వంటివారినీ పరిచయం చేస్తారు.

ఆఖరుగా, 

ఏకరూపులైనా, అనేక రూపులైనా సమస్త చరాచర జీవుల్లోనూ ఉన్న ఆత్మకి రూపు లేదు. అయితే ప్రాపంచిక వాసనలు చరజీవుల్లో ఆత్మకి ‘నేను’ అన్న అహాన్ని కలిగిస్తాయి. దాన్ని దూరం చేసుకుంటే విశ్వశాంతికి అందరూ దోహదం చేసినవారవుతారంటూ శారదా చతుర్వేది రమణుడి వాణిని వినిపిస్తారు. 

కథల్లోని చర్చలూ, సంగతులు రచయిత విద్యాధికుడు, ప్రపంచాన్ని చుట్టివచ్చిన అనుభవశాలి అన్నది స్పష్టంగా చెపుతాయి. వారికి అభినందనలు.

జనవరి 2024 లో స్వర్గస్థులైన వారి శ్రీమతి అన్నపూర్ణకు పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. 

పుస్తకం ధర అమూల్యం.

ప్రచురణః సెప్టెంబరు, 2024, వాహిని బుక్స్, హైదరాబాదు.

You Might Also Like

Leave a Reply