2016 నా పుస్తక పఠనం

జంపాల చౌదరి గారి పోస్టు చూసి ఆ స్ఫూర్తి తో రాస్తున్న పోస్టు ఇది. గత ఏడాది నాకు అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఫాకల్టీగా చేరడంతో మొదలైంది. అందువల్ల చాలా మట్టుకు నా పఠనం క్లాసుల్లో పాఠాలకూ, పరిశోధనకూ సంబంధించినదే. దీనివల్ల ఇక్కడ రెండు పెద్ద పబ్లిక్ లైబ్రరీలకి access ఉన్నప్పటికీ నేను 2016 లో నేను చదివింది చాలా తక్కువ, ఇంతోటి దానికి మళ్ళీ దాన్ని గురించి రాసుకోడం కూడానా? అని ఓ పక్క అనిపిస్తున్నా, ఉండబట్టలేక రాస్తున్నా.

కథలు
* ది బెస్ట్ ఆఫ్ యండమూరి వీరేంద్రనాథ్
* రాజకీయ కథలు – ఓల్గా
– అనేక కారణాల వల్ల నేనసలు తెలుగు పుస్తకాలు చదవలేదు ఈ ఏడాది. చదవక చదవక క్రిస్మస్ సెలవుల్లో ఈ రెండూ చదివాను. విపరీతంగా నిరాశ పరిచాయి. కాలదోషం పట్టిందనుకోవాలో.. నాకు కథలు నచ్చడం లేదనుకోవాలో … ఒకప్పుడు ఈ కథలు కూడా జనం మెచ్చుకున్నారు అనుకోవాలో అర్థం కాలేదు. ఒక్కటంటే ఒక్క కథ కూడా ఆకట్టుకోలేదు. రెంటిలో రాజకీయ కథలు కొంత నయం అనిపించింది.

* The elephant vanishes – Haruki Murakami
* After the quake – Haruki Murakami
* The strange library – Haruki Murakami
-After the quake తో మొదలుపెట్టి, ఆసక్తికరంగా అనిపించి తక్కిన కథలూ చదివాను (Ames public library వారి పుణ్యం). కథలన్నీ చాలా ఆసక్తికరంగా అనిపించాయి. ఒక్కోచోట అసలేం చెప్పదల్చుకున్నాడు? అన్నది అర్థం కాలేదు కానీ, అలాగని పుస్తకం పక్కన పెట్టేయబుద్ధి కాలేదు. The strange library ఒక పెద్ద కథ/చిన్న నవల. మిగితా రెండు కథల సంకలనాలు. సగానికి పైగా కథలు రెండు మూడు సార్లు చదివాను. కథంటే ఓ మొదలు, ఓ చివర, ఓ conflict – resolution ఇలా ఒక known templateలో ఉండాలంటే ఇవి కథలు కావేమో. కానీ, చదివించేది, విభిన్నమైన అనుభూతులు కలిగించేదీ కథ అని అనుకునే బాపతు వాళ్ళకి ఈ కథలు నచ్చుతాయి. నేను కాస్త వీలు ఉన్నప్పుడు ఈ రచయిత రాసిన నవల ఏదన్నా చదవాలి అనుకుంటున్నాను.

నవలలు
* Life of Pi – Yann Martel
-చాలా సార్లు కెనడా వెళ్ళాల్సి రావడంతో కెనడియన్ కదా అని చదివాను (అవును, ఇదే మొదటిసారి). నాకు చాలా నచ్చింది నవల. బాగా లీనమయ్యి చదివానని చెప్పాలి.

* Ghachar Gochar – Vivek Shanbhag
చిన్న నవల. ఆపకుండా చదివించింది. ముగింపు నాకంతగా నచ్చలేదు కానీ, కథ పరిసరాలు అదీ …. అలాంటి నేపథ్యం ఉన్న కథలు చదివి చాలా కాలం అవడం వల్లనేమో, నచ్చింది నాకు.

నార్వే కి చెందిన రచయిత Jo Nesbø రాసిన Harry Hole సిరీస్ లోని రెండు రెండు క్రైమ్ నవలలు:
* The Police
* The Leopard Jo Nesbø

స్వీడెన్ కు చెందిన రచయిత Hennig Mankell రాసిన Kurt Wallander సిరీస్ క్రైమ్ నవలల్లో మొదటి ఐదు:
* Faceless Killers
* The dogs of Riga
* The White lioness
* Sidetracked
* The man who smiled
– Mankell నవలలు రెండు మూడు చదివాక బోరు కొట్టాయి. నెస్బో నవలలు రెండూ చివరి దాకా ఆసక్తికరంగా చదివించాయి. రెంటిలోనూ ఊరికే కథ మీద మాత్రమే కాక, కథాకాలం నాటి పరిస్థితులు, పరిసరాలు, ప్రజలు వీటి గురించి కూడా వివరంగా వర్ణించినందువల్ల ఏమో గానీ, నాకు సాధారణంగా ఇదివరలో నేను చదివిన డిటెక్టివ్ నవలల్తో పోలిస్తే భిన్నంగా అనిపించాయి. వీటి గురించి ప్రస్తావిస్తూ నేను పుస్తకం.నెట్లో రాసిన వ్యాసం ఇక్కడ.

గ్రాఫిక్ కథలు/నవలలు
* Will Eisner Reader: Seven Graphic Stories by a Comics Master – Will Eisner
* Family Matters – Will Eisner
* A Life force – Will Eisner
– Eisner గొప్పాయన. అంతే. ఒక్కోటీ రెండు మూడు సార్లు చదివి, ఆ బొమ్మలు గీసిన తీరుని నాలుగైదు సార్లు గమనించుకున్నాను. ఈఏడాదీ మళ్ళీ ఆయన రాతలు-గీతలూ వెదుక్కుంటాను. ఇవన్నీ మా యూనివర్సిటీ లైబ్రరీ పుణ్యం. వీటి గురించి పుస్తకం.నెట్లో రాసిన వ్యాసం ఇక్కడ.

* Religion : A Discovery in Comics – Margareet de Heer
-ఇదివరలో ఈ రచయిత్రి/చిత్రకారిణి రాసిన రెండు పుస్తకాలు చదివి, అవి చాలా నచ్చి ఈ మూడో పుస్తకం కనబడగానే కొన్నాము. బాగుంది ఇది కూడా. క్లిష్టమైన అంశమే అయినా, బొమ్మలు, బొమ్మల్తో పాటు ఉన్న టెక్స్ట్ రెంటి విషయంలోనూ రచయిత్రి విజయవంతమైంది అనిపించింది.

* Can’t we talk about something more pleasant? – Roz Chast
ఇది రచయిత్రి తన తల్లిదండ్రుల చివరి రోజుల గురించి, వాళ్ళ ఆలోచనా విధానాన్ని గురించీ చర్చిస్తూ రాసిన గ్రాఫిక్ ఆత్మకథ. ఇందులోని కథాంశం పెద్దవారవుతున్న తల్లిదండ్రులు ఉన్న అందరినీ స్పృశించేది. చూడ్డానికి హాస్యం లా అనిపించినా నిజానికి నవరసాలూ ఉన్నాయిందులో. బొమ్మలకంటే ఇందులో డైలాగులే నన్ను ఆకట్టుకున్నాయి. చివ్వర్లో తల్లి చివరిరోజులంటూ వేసిన బొమ్మలు మట్టుకు కదిలించాయి. ఈ పుస్తకం పేరుకి గ్రాఫిక్ నవలైనా నన్ను ఆకట్టుకున్న బొమ్మలు మాత్రం అవే. చాలా texty graphic book.

ఆత్మకథలు, జీవితచరిత్రలు
* Half Lion – Vinay Sitapati
– మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి. పుస్తకం కాస్త పెద్దదయినా చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అలాగే రచయిత మరీ అతిగా పొగడ్డం, తిట్టడం చేయకుండా అంశాన్ని బట్టి అనాలిసిస్ చేయడం నాకు నచ్చింది. పీవీ BASIC, COBOL నేర్చుకున్నారనీ, Unix వాడుక కూడా నేర్చుకున్నారనీ తెలిసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలాంటివి ఇంకా బోలెడున్నాయనుకోండి పుస్తకంలో. ఇది నా మనసులో ఉండిపోయింది. అలాగే ఆయన ప్రధానిగా ఉన్నపుడు రకరకాల అంశాలమీద తీసుకున్న నిర్ణయాలు, ఆయన అప్పటి ఆలోచనావిధానం వీటి గురించి బాగా విశ్లేషించినట్లు అనిపించింది.

* Kushwantnama – The lessons of my life – Kushwant Singh
– కుశ్వంత్ సింగ్ తన జీవితం గురించి అనుభవాల గురించి రాసిన వ్యాసాలు. చదవడానికి తేలిగ్గా ఉన్నాయి. వ్యాసాలకి ఎంచుకున్న వస్తువులు చాలా వైవిధ్యభరితంగా ఉన్నాయి. కొన్ని వ్యాసాలు బాగున్నాయి. కొన్ని చదవడానికి తేలిగ్గా ఉన్నా లోతుగా ఆలోచిస్తే కానీ అలా రాయలేరు అనిపించేలా ఉన్నాయి. కొన్ని ఎవరో random blogger తన బ్లాగులో ఊసుపోక రాసుకున్న కబుర్లలా ఉన్నాయి. అలా – పుస్తకంలో అన్ని రకాల వ్యాసాలూ ఉన్నాయి. ఎటొచ్చీ అలా బోలెడు జీవితానుభవం ఉన్నవాళ్ళు ఏం రాసినా ఏదో కొత్త విషయం ఉంటుంది కనుక నాకు నచ్చింది.

* Azhar – Harsha Bhogle
– ఒక స్నేహితురాలికోసం ఈ పుస్తకం ఇక్కడ ఒక లైబ్రరీ నుండి inter library loan లో తెప్పించుకున్నాను. చాలా మంచి బయోగ్రఫీ. ఒకప్పటి అజరుద్దీన్… స్టార్ అవకముందూ, అయింతరువాత, ఇంకా మాచ్ ఫిక్సింగ్ అభియోగాలు ఎదుర్కోక ముందు నాటి అజరుద్దీన్ కథ. భోగ్లే రచనా శైలిలో ఈ కథంతా చదవడం గొప్ప అనుభవం. మరి ఈ పుస్తకం ఇప్పుడు మార్కెట్లో దొరక్కపోడం దురదృష్టమే.

సాంకేతికం
* Weapons of Math Destruction (WMD) – Cathy O’Neil
ఇది కంప్యూటర్ల యుగం. మనకి తెలీకుండానే చాలా అంశాలని మనుషులు కాక మషీన్లు నిర్ణయిస్తున్న కాలం. ఈ mathematical models ని మనిషి మేధస్సు తాలూకా విజయాలుగా చూస్తున్న రోజులు ఇవి. ఈ నేపథ్యంలో ఈ పుస్తకం ఇలాంటి కొన్ని models తీసుకుని వాటి పనితీరుని విశ్లేషిస్తూ వాటిలోని లొసుగుల గురించి రాసిన వ్యాసాల సంకలనం. ఇవి సాంకేతిక నేపథ్యం లేని వాళ్ళ కోసం రాసిన వ్యాసాలు కనుక వీలైనంత వివరంగా రాస్తూనే ఎక్కువ సాంకేతికంగా వెళ్ళకుండా రచయిత్రి బాగా రాసినట్లు అనిపించింది. అయితే విపరీతమైన నెగటివ్ గా అనిపించింది నాకు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కంప్యూటర్ మాడళ్ళు మన జీవితాల్ని నిర్దేశిస్తున్న విషయం నిజమే అయినా, వాటిలోని మంచి గురించి కూడా స్పృశించి ఉండవచ్చని అనిపించింది. అయితే, 2015 చివర్లో ఒక పుస్తకం చదివా – “The Master Algorithm: How the Quest for the Ultimate Learning Machine Will Remake Our World” అని. ఒక కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రాసిన పాపులర్ సైన్స్ పుస్తకం అది. దానిలోని విపరీతమైన evangelism ని గుర్తుతెచ్చుకుని, బహుశా ఈ WMD పుస్తకంలోని పెస్సిమిస్టీక్ కోణం మనకి ఆవసరమేమో అనిపించింది చివరకి వచ్చేసరికి. తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

* Machines of Loving Grace: The Quest for Common Ground Between Humans and Robots – John Markoff
ఒక జాబ్ ఇంటర్వ్యూలో నన్ను ఇంటర్వ్యూ చేసినాయనతో జరిగిన సంభాషణలో నాకు ఈ పుస్తకం గురించి తెలిసింది. ఈ పుస్తకం కృత్రిమ మేధ, మనుషులకి – కంప్యూటర్లకి మధ్య సంబంధాలు (human computer interaction), మనిషి కోసం కృత్రిమ మేధస్సా? మనిషి బదులు కృత్రిమ మేధస్సా (Artificial intelligence vs intelligence Augmentation – AI vs IA) – ఈ అంశాల గురించి, ఈ ఆలోచనల/ప్రశ్నల వెనుక ఉన్న చరిత్రని చెబుతూ, ఈ నేఫథ్యంలో ప్రస్తుత సాంకేతిక పురోగమనాన్ని, సమాజంపై దాని ప్రభావాన్ని విశ్లేషిస్తుంది. ఏడాది మొత్తం మీద చదివిన ఒక్క గొప్ప పుస్తకాన్ని ఎంచుకోవాలనుకుంటే – నామట్టుకు నాకు అది ఇదే. చాలా విషయాలు తెలిశాయి. మీరు AI లేదా దానికి సంబంధించిన ఏదన్నా అంశాల్లో పని చేస్తూ ఉంటే, లేదా ఈ సాంకేతిక పురోగతి ప్రభావం మన సమాజం మీదా, మన ఉద్యోగాల మీద ఎలా ఉండబోతోందో? అన్న ఆలోచన మీద ఆసక్తి ఉంటే, ఇది తప్పకుండా చదవాల్సిన పుస్తకం. దీన్ని గురించి వివరంగా ఈ ఏడాదన్నా రాయడానికి ప్రయత్నించాలి (మరోసారి చదివి!)

ఇతర నాన్ ఫిక్షన్
Where I’m reading from – Tim Parks – దీన్ని గురించి ఈమధ్యే రాశాను పుస్తకం.నెట్ లో. మంచి పుస్తకం.

* How to Be a Literary Sensation: A Quick Guide to Exploiting Friends, Family and Facebook for Artistic Gain – Krishnasastri Devulapalli
– పుస్తకం సరదాగా మంచి ఆరోగ్యకరమైన వ్యంగ్యంతో ఉంది. చాలా వ్యాసాలకి గట్టిగా నవ్వుకున్నాను. తెలుగు సాహితీ గుంపుల్నించి బైటకొచ్చేసి రెండేళ్ళు దాటింది కనుక ఇప్పటి పరిస్థితులు నాకు తెలీవు గానీ, ఇవన్నీ చదువుతుంటే గతంలో నేను విన్నవీ, చదివినవీ అనుభవాలు గుర్తువచ్చాయి.

* Lean In: Women, Work, and the Will to Lead: Sheryl Sandberg
– కెరీర్ లో విజయవంతమై leadership roles లో ఉండాలనుకునే స్త్రీలకి అని ఒక్కటే చాలామంది నాకు రికమెండ్ చేశారు గత ఏడాదిన్నర కాలంలో. అందుకని చదివాను. పుస్తకం బాగుంది. ఉపయోగకరమైనదే కానీ, ఆవిడ రాసిన అనుభవాలు, సలహాలు చాలా మటుకు ఒక previleged population కి బాగా నప్పుతాయి. మామూలు మహిళలకి ఉండే సమస్యల గురించి సలహాలకి ఈ పుస్తకం పనికిరాదు అనిపించింది. రచయిత్రి తప్పులేదు. ఆవిడకి తెలిసిన ప్రపంచం లో ఆవిడ అనుభవాలు ఆవిడ బాగా రాసింది. ఇలాంటి పుస్తకాలు ఇప్పటి ప్రపంచంలో చాలా అవసరం కూడానూ.

* The End of Karma: Hope and Fury Among India’s Young: Somini Sengupta
-ఏదో టైటిల్ చూసి కుతూహలం కొద్దీ చదివాను. ఆలోచన బాగుంది కానీ, రాసిన జర్నలిస్టిక్ కథనాలు మాత్రం biopic లాగ కాక biographical drama పద్ధతిలో సాగాయి. అయితే, రచయిత్రి ఎంచుకున్న జీవితకథలు మట్టుకు ఆసక్తికరమైనవే అని ఒప్పుకోక తప్పదు.

* The Professor Is In: The Essential Guide To Turning Your Ph.D. Into a Job – Karen Kelsky
-రచయిత్రి బ్లాగుని నేను తరుచూ చదివేదాన్ని. అందువల్ల కొన్నానీ పుస్తకాన్ని. కొంతమేరకు ఉపయోగకరమైన సమాచారం ఉంది కానీ, మరీ prescriptive గా అనిపించింది.

You Might Also Like

Leave a Reply