పుస్తకం
All about booksపుస్తకభాష

July 20, 2016

నాలుగు Will Eisner పుస్తకాలు

More articles by »
Written by: సౌమ్య
Tags: , ,

రెండేళ్ళ క్రితం అనుకుంటాను Will Eisner గీసి, రాసిన A Contract with God and Other stories అన్న నాలుగు గ్రాఫిక్ కథల సంకలనం చదివాను. తరువాత ఆ టైటిల్ కథ గురించి చాలా సార్లు అనుకున్నాను, రెండు మూడు సార్లు అదొక్క కథని మట్టుకు చదివాను మళ్ళీ. పుస్తకం నామీద చాలా ప్రభావాన్ని చూపించింది. ఆ బొమ్మలని, అవి చెప్పిన కథలని చాలా సార్లు మరీ మరీ తల్చుకున్నాను. ఈ మధ్య కాలం లో మా లైబ్రరీలో ఆయన గ్రాఫిక్ నవలలు హార్డ్ కాపీలు కనబడ్డంతో మరో మూడు పుస్తకాలు చదివాను. ఒకటి కథలు, ఇంకొకటి నవలిక లాంటిది. ఈ కథలు, వాటిలోని చిత్రాలు, నన్ను చాలా ఆకట్టుకున్నాయి. వీటి గురించి కూడా చదివి రెండు నెలలు అవుతున్నా దాదాపుగా రోజూ తల్చుకుంటూనే ఉన్నా ఇంకా. అందువల్ల ఈ పుస్తకాల గురించి, వీటిల్లో నాకు నచ్చిన కథల గురించి, నాకు తోచిన నాలుగు ముక్కలు రాసుకుందామని ఈ వ్యాసం.

* A contract with God and other tenement stories:

ఇందులో నాలుగు కథలు. – A Contract with God, The Street Singer, The Super, Cookalein. అన్నీ న్యూయార్క్ లో ఉన్న tenements అనబడే బీద అపార్ట్మెంట్ కాంప్లెక్సులలో ఉండే (ప్రధానంగా యూదు) కుటుంబాలలో 1930 ప్రాంతాల్లో జరిగిన కథలు. “A Contract with God” ఇందులో నాకు నచ్చిన కథ. మరీ చిన్నతనంలోకాక, పెద్దాయక నేను చదివిన కాసిని కథల్లో నాకు బాగా నచ్చిన కథల్లో కూడా ఒకటి ఇది. Hersh అనే ఓ పేద పెద్దాయన యవ్వనంలో ఉన్నపుడు దేవుడితో contract రాసుకుంటాడు. దాని ప్రకారం తాను మంచిగా ఉండి మంచి పనులు చేస్తూ ఉంటే తనకి మంచే జరుగుతుందని. అయితే, తదనంతర కాలంలో ఆయన కూతురు అనుకోకుండా మరణిస్తుంది. దేవుడిపై “you cannot break the contract like this” అని విరుచుకుపడ్డాక అతనిలో చాలా మార్పు వస్తుంది. బాగా aggressiveగా డబ్బు సంపాదిస్తాడు. తానేదో కాంట్రాక్టులో పొరపాటు చేసి ఉంటా అనుకుని వాళ్ళ మతాధికారుల వద్దకి వెళ్ళి మంచి కాంట్రాక్టు తయారు చేయమని అడుగుతాడు. తరువాత ఆ కాంట్రాక్టు fool proof గా ఉందని నిర్థారించుకున్నాక మళ్ళీ మంచివాడిగా మారదాం అనుకుంటాడు. తరువాత ఏమైంది, అసలు ఆ కాంట్రాక్టు ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారు కథ చదవండి. ఈ కథా, కథలోని బొమ్మలూ, సవివర వ్యాఖ్యానం – అన్నీ నచ్చాయి నాకు. ఆ దేవుడిని నిలదీసే దృశ్యాలు, వాటి తరువాత అతనికి దేవుడితో ఒక foolproof contract తయారుచేసుకోవాలి అన్న ఆలోచన కలగడం దగ్గరి బొమ్మలు – ఈ కథలో నాకు ప్రత్యేకంగా నచ్చినవి. కథ జరిగే Dropsie Avenue అన్న ప్రాంతాన్ని చాలా వివరంగా చిత్రించారు బొమ్మల్లో, కళ్ళకి కట్టినట్లు.

“The Street Singer” వీథుల్లో పాటలు పాడుతూ ఉపాధి కోసం తిరిగే ఒక యువకుడి కథ. ఇంట్లో పెళ్ళాం పిల్లలూ, అప్పులూ, తాగుడూ గట్రా నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఒకరోజు ఓ పాతతరం గాయని ఇతగాడి పాట విని, ఇతన్ని వాడుకుని మళ్ళీ సంగీత ప్రపంచంలోకి వద్దామని అనుకుని ఇతన్ని ఇంటికి ఆహ్వానిస్తుంది. ఇతగాడికి మంచి బట్టలూ అవీ కొనుక్కోమని డబ్బులిస్తుంది. అతనూ సరే, మంచి అవకాశం అనుకుంటాడు. మరి అవకాశం ఎలా ఉపయోగించుకున్నాడు? అన్నది ట్విస్టు 🙂 నేనైతే సరిగ్గా అలా ముగుస్తుందని ఊహించలేదు కనుక, ముగింపు చదివాక నవ్వొచ్చింది. ఇందులో కూడా బొమ్మలు చాలా బాగున్నాయి. The Super ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో అందరిని భయపెట్టే ఒక అతని కథ. ఓ చిన్న పిల్ల అతన్ని మోసం చేస్తే, అతను ఆమెని పట్టుకుని నిలదీస్తూండగా చూసిన అపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసారు,తరువాత అతను ఏం చేసాడు? అన్నది కథ. నాకు అయితే కథా, బొమ్మలూ షరా మామూలుగా నచ్చాయి. ఈ కథలో ఇదివరకటి రెండు కథల్లో ఉన్నన్ని డైలాగులు లేవు.. కానీ బొమ్మల్లో చాలా కథ చెప్పినట్లు అనిపించింది. కథ మొదట్నుంచీ కర్కశంగా చూపించినా చివరికి వచ్చేసరికి అతని మీద జాలేసింది. Cookalein – ఎందుకో ఈ నాలుగో కథ మాత్రం నాకాట్టే నచ్చలేదు. ఈ కథలన్నీ జరిగిన ఆ కాంప్లెక్సులోనే ఒక కుటుంబం వాళ్ళ తాలూకా ఇతర వ్యక్తుల కథ. Cookalein అన్నది ఒక వెకేషన్ హోం తరహా స్థలం. వీళ్ళు వెకేషన్ కి వెళ్ళడం, రావడం, వాళ్ళ ప్రేమలూ, ద్వేషాలూ, మోసాలూ – అవీ కథలోని అంశాలు. బొమ్మలు ఇందులో కూడా అద్భుతంగా అనిపించినప్పటికీ కథ చాలా సాగతీసినట్లు అనిపించింది. దానితో అంత ఆకట్టుకోలేదు.

కానీ, చిన్న చిన్న విషయాలు మినహాయిస్తే పుస్తకం నచ్చింది నాకు. గ్రాఫిక నవలలు అవీ ఎప్పుడూ చదవని వారైతే ఇది తప్పక చదవమని సలహా ఇస్తాను. Graphic Novel అన్న పదాన్ని పాపులర్ చేసిన వాళ్ళలో Eisner అగ్రగణ్యుడు అంటారు కనుక ఈ తరహా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారికి ప్రత్యేకం చెప్పక్కర్లేదు. బహుశా ఈపాటికే చదివి ఉంటారు.

* 7 graphic stories by a comic master
ఇందులో ఏడు కథలు – A sunset in the sunshine city, The telephone, Detective story, The Long Hit, Winning, The Appeal, Humans.

A sunset in the sunshine city” కథ రిటైర్ అవుతున్న ఒక పెద్దాయన గురించి. ఆయన అప్పటి దాకా ఉన్న ఊరు వదిలేసి ఇంకో ఊరిలో ఒంటరిగా ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. దానికి ఆయన పిల్లల స్పందన, ఆ ఊళ్ళో ఆయన జీవితంలో చోటు చేసుకున్న మార్పుల గురించి కథ. ఆ ముగింపు నేను ఊహించలేదు కనుక, కథ నాకు నచ్చిందని చెప్పాలి. ఈ కథ మొదట్లో ఆయన ఊరొదిలేసే ముందు ఆ ఊరితో తన అనుబంధాన్ని తల్చుకునే చోట వేసిన బొమ్మలు నాకు ఈ కథతో పాటు నచ్చిన అంశం. తరువాత వచ్చినది ఒక కథ కాదు. The telephone పేరుతో, రకరకాల ఫోన్ కాల్స్ ని థీం గా గీసిన సింగిల్ పేజీ కథలు. వీటిలో కొన్నింటిలో మాటలు కూడా లేవు (ఒక ఉదాహరణ కింద చూడొచ్చు).

WE-Telephone

ఇలా రాయాలన్న ఆలోచన చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. ఇలా వచ్చిన ఐదారు సింగిల్ పేజీల్లో రెండు మూడు నాకు నచ్చాయి. “Detective story or Necromancy in the Bronx” ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అతనికి తప్ప మరెవరికీ కనబడని ఓ విచిత్ర వ్యక్తి సాయంతో 1933-34 లో పెద్ద నేరస్థులని పట్టుకుంటాడు కథలో. పెద్దగా కథేమీ లేదు కానీ, ఆ కథలోని వింత పాత్రల వల్ల నాకు నచ్చింది. కథకి వేరే ఏదన్నా లోతైన అర్థం ఉందేమో మరి నాకు తెలీదు. “The long hit” ఒక కాంట్రాక్ట్ కిల్లర్ కథ. అతను యవ్వనంలో తీసుకున్న ఓ కాంట్రాక్టు లో అతని లెక్క తప్పి పొరపాట్న ఇంకో మనిషిని చంపేస్తాడు కిల్లర్. దానితో “కాంట్రాక్ట్ ని పూర్తి చేసే దాకా నీ మొహం నాకు చూపించకు” అంటాడు బాస్. తరువాత ఏళ్ళు గడుస్తాయి. కిల్లర్ కి 80 దాటుతుంది. ఎక్కడో ఓ చోట అనుకోకుండా అప్పుడు చంపి ఉండాల్సిన మనిషి పరిచయం అవుతాడు మళ్ళీ… తరువాత ఏం జరిగింది? అన్నది కథ. ఈ సంకలనంలో నాకు అన్నింటికంటే నచ్చిన కథ ఇది. “Winning” అన్నది మేరథాన్ లో పాల్గొంటున్న ఒక పెద్దాయన ప్రేమ కథ. కథ ముగింపు అదీ సినిమాటిగ్గా ఉంది కానీ, కథలో సెంటిమెంటు కంటే బొమ్మల లోని డీటిఎయిలింగ్ ఇందులో నన్ను ఆకట్టుకున్న అంశం. “The Appeal” కాఫ్కా కథ “The Trial” ఆధారంగా రాసిన-గీసిన కథ. ఆ కాఫ్కా కథ ఇదివరలో నేను చదివాను. చాలా ఆసక్తికరంగా ఉంది ఈ interpretation. రెండు మూడు సార్లు చదువుకున్నా ఆసక్తికరంగా అనిపించి. ఈ Eisner కథని చదివాక కాఫ్కా అభిమానుల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది నాకు. ఇక చివరగా “the humans” అన్నది నీతి కథ లాంటిది. తక్కిన కథలతో పోలిస్తే నాకు పాఠంలా అనిపించింది కానీ, కథ వెనుక ఆలోచన మట్టుకు నచ్చింది.

ఇది ఏడు కథల పుస్తకం. మొదట రాసిన పుస్తకంతో పోలిస్తే ఇందులో కథలు చిన్నవి కావడం వల్ల తొందరగా చదివేశాను. కానీ, దానితో పోలిస్తే ఇందులో వస్తు వైవిధ్యం ఎక్కువ. అన్నీ ఒక ఆరంభం – ఓ ముగింపూ ఇలా ఉండే కథలు కావు కానీ, ఆ కారణం వల్లనే పుస్తకం నన్ను ఆకట్టుకుంది అనుకుంటాను.

* A family matter
ఒక పెద్దాయన తాలూకా కొడుకులూ కూతుళ్ళూ అందరూ ఆయన 90వ పుట్టినరోజు సందర్భంగా కలుస్తారు. వాళ్ళలో వాళ్ళకేమీ గొప్ప ప్రేమాభిమానాలూ, అభిమానాలు ఉన్నట్లు కనబడదు, ఏదో పలకరించుకోడాలు తప్ప. ఆ కలిసినరోజు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలూ, వాదోపవాదాలు, వీటి మధ్య ఆ మాట్లాడే స్థితిలో లేని 90 ఏళ్ళ ముసలాయన పరిస్థితి – ఇది ఈ పుస్తకంలో కథా వస్తువు. “Families are really physically indistinguishable from each other. They wear no badges. They are after all tribal units to which their members belong by virtue of a biological event. And they are held together by a magnetic core that sometimes seems to be neither love nor loyalty” అన్న ఒక అజ్ఞాత వ్యక్తి కోట్ తో మొదలవుతుంది కథ.ఈ కుటుంబం కథ చదివేకొద్దీ ఆ కోట్ చాలా నిజం అనిపించింది. కథ చివర్లో ఆయన మరణిస్తాడు కానీ, ఎలా మరణించాడు? అన్నది చదువుతున్నప్పుడు అవాక్కయ్యాను. అందరూ ఆయనేదో మాత్రలు మింగి మరణించాడు అనుకుంటారు. “Keep it private, it is a family matter” అనుకుని ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ ఉండగా కథ అయిపోతుంది. కథ పూర్తిగా వచనంలో చదివుంటే ఎలా ఉండేదో కానీ, ఆ బొమ్మలు బలమైన ప్రభావం చూపించాయి అనిపించింది. నాకు అన్నింటికంటే నచ్చిన చోటు: పక్క గదిలో పిల్లలు వాదోపవాదాల్లో ఉన్నపుడు తండ్రి మనసులో జరుగుతున్న ఆలోచనలు. కథా గమనంలో ఈ దృశ్యం దగ్గర రెండు పేజిలు కింద చూడవచ్చు. మొత్తానికి కథా, ముగింపూ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందులో బొమ్మల పాత్ర బాగా ఉంది.

WE-FamilyMatter

* A life force
ఈ పుస్తకం నేను అన్నింటికంటే ఆఖర్న చదివాను ఈ నాల్గింటిలో. కానీ, కాలక్రమంలోనూ, నేపథ్యం పరంగానూ ఇది “Contract with God” పుస్తకానికి కొనసాగింపు వంటిది. ఇది కూడా ఆ పుస్తకంలో లాగానే 55, Dropsie Avenue లో నివసించే ఓ కుటుంబం గురించి. కాకపోతే కథల్లా కాకుండా నవల తరహాలో సాగుతుంది, అంతే. జాకబ్ అనే వృద్ధ వడ్రంగి చేతిలో ఉన్న కాంట్రాక్టులు అయిపోయి పని వెదుక్కుంటూ ఉంటాడు. అతను అతని కుటుంబ సభ్యులు, వాళ్ళ జీవితాల్లోని సంఘటనలు ఈ నవల కథాంశం. మిగితా పుస్తకాలతో పోలిస్తే ఇందులో పాత్రలకి నిడివి ఎక్కువ. అందువల్ల కొంచెం కథ కూడా కొంచెం కామాలూ, సెమీ కోలన్లూ, మలుపులూ అవీ ఉండి, ఆసక్తికరంగా సాగింది. ఇందులో జర్మనీ నుంచి వలస వచ్చే జాకబ్ పాత స్నేహితురాలి కథా, మధ్యలో ఓ స్మగ్లింగ్ ముఠా, ఒక హత్యా, ఇలా రకరకాల sub-plots ఉన్నాయి.. దానితో ఆపకుండా చదివించింది. కథతో పాటు అక్కడక్కడా పాత్రలపై వ్యాఖ్యానం కూడా నాకు నచ్చింది. ఉదాహరణకి: జాకబ్ కొడుకు ఆ dropsie avenue నుండి బయటపడి డాక్టరవుతాడు. అక్కడ రచయిత వాక్యం ఒకటి: “Daniel had escaped into the mainstream”. చివరగా, కథలో రెండు ప్రధాన పాత్రల సందిగ్ధావస్థలను చిత్రీకరించిన విధానం కూడా నాకు నచ్చింది. ఉదాహరణకి రెండు పేజీలు ఈ కింద చూడవచ్చు.

WE-LifeForce

WE-LifeForce2

అన్ని పుస్తకాల్లో కథలు చాలామట్టుకు దిగువ మధ్యతరగతి యూదు కుటుంబాల చుట్టూనే తిరగడం వల్లా, Eisner చాలా వివరంగా చిత్రించడం, వర్ణించడం వల్లా, వీటి నుండి చాలా జనరల్ నాలెడ్జి కూడా వచ్చింది నాకు.. ఏవో కొత్త కొత్త సంప్రదాయాల (వాళ్ళకి పాత, నాకు కొత్త) గురించి తెలుసుకున్నాను. ఇదివరలో గ్రాఫిక్ పుస్తకాలంటే గ్రాఫిక్ నవలలే చదివాను… బహుశా కథలుగా చదివినవి (పిల్లల కోసం రాసినవి వదిలేస్తే) Jason పుస్తకాలే. అయితే, ఆతని గ్రాఫిక్ పుస్తకాల్లో మాటా, గీతల్లోని వివరాలూ – రెండూ మహా పొదుపు. కొన్ని చోట్ల పేజీల తరబడి ఒక్క వాక్యమూ ఉండదు..ఒక్క డైలాగూ ఉండదు. అతగాడితో పోలిస్తే, Eisner చాలా వివరాలు గీస్తాడని, రాస్తాడనీ అనిపించింది. బొమ్మల్లోని డీటెయిలింగ్ నాకు చాలా నచ్చిన అంశం Eisner పుస్తకాల్లో. ఖచ్చితంగా ఈయనవి మరికొన్ని కథలు చదువుతాను రాబోయే రోజుల్లో.About the Author(s)

సౌమ్య0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

మూడు గ్రాఫిక్ పుస్తకాలు

ఈ వ్యాసం ఇటీవలి కాలంలో చదివిన మూడు గ్రాఫిక్ పుస్తకాల గురించి. మొదటి రెండు పుస్తకాలక...
by సౌమ్య
0

 
 

Fun Home – A Family Tragicomic

Fun Home – A Family Tragiocomic అన్నది ఒక గ్రాఫిక్ ఆత్మకథ. రచయిత్రి – Alison Bechdel. ఈవిడ అమెరికాకు చెందిన ప్ర...
by సౌమ్య
0

 
 

Science and Philosophy: Discoveries in Comics

మే నెలలో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ క్యాంపస్ సందర్శించినపుడు అక్కడ ఉన్న Barnes and Noble ప...
by అసూర్యంపశ్య
1

 

 

American Born Chinese – గ్రాఫిక్ నవల

పుస్తకం: American Born Chinese by Gene Luen Yang నేపథ్యం: ఆ మధ్య కోర్స్ ఎరా (కోర్సుల ఎర అనమాట) వెబ్సైటులో “Comic Book...
by సౌమ్య
1

 
 

Stupid Guy Goes to India – Yukichi Yamamatsu

కొన్నాళ్ళ క్రితం ఒక బ్లాగులో ఈ పుస్తకం గురించి చదివి, గ్రాఫిక్ నవలల పై నాకున్న ఆసక్త...
by సౌమ్య
3

 
 

Addicted to war – చర్చా పరిచయం

‘Addicted to war’ అన్నది అమెరికా దేశం విదేశాల్లో నడిపిన యుద్ధాల గురించి ప్రాథమిక అవగాహన క...
by సౌమ్య
7