Professor Martens’ Departure – ఇస్టోనియన్ నవల
Jaan Kross ఇస్టోనియా దేశానికి చెందిన ఓ ప్రముఖ రచయిత. నోబెల్ సాహిత్య బహుమతికి తగినవాడని అంటారు. నాకు సరిగ్గా ఎప్పుడు, ఎలా ఈయన రచనల గురించి తెలిసిందో గుర్తు లేదు కానీ, జూన్-జులై ప్రాంతంలో ఈయన గురించిన వికీపీడియా పేజి చదివాక ఇక తప్పనిసరిగా ఈయన నవల ఒక్కటైనా చదవాలి అనుకుంటూండగా Professor Martens’ Departure కనబడ్డది అమేజాన్ వెబ్సైటులో. ఆ విధంగా నవల హార్డ్-బౌండ్ కాపీలో నా చేతిలో పడ్డా, దాన్ని నేను ట్రెయిన్లలోనూ, ఫ్లయిట్లలోనూ మట్టుకే చదువుతున్నందువల్ల ఇన్నాళ్ళు పట్టింది పూర్తి చేసేందుకు. ఈ నవల గురించి, పరిచయం అనలేను కానీ, నా అభిప్రాయం అనుకోవచ్చు:
నవల ఆత్మకథలా సాగుతుంది. రష్యన్ ప్రభుత్వంలో దౌత్యవేత్తగా ఉన్నతస్థానాల్లో పనిచేసిన Professor Martens అన్నాయన ట్రెయిన్లో ప్రయాణం చేస్తూ తన జీవితంలోని వివిధ అనుభవాలను నెమరవేసుకుంటూంటాడు – ఇదీ నవల సాగే తీరు. ఈ Martens అన్న వ్యక్తి యదార్థంగా జీవించిన మనిషి. అతని జీవితంలో నిజంగా జరిగిన సంఘటనలు కొన్ని కూడా నవలలో కనిపిస్తాయి (అతని జీవితం గురించి నీకెలా తెలుసనకండి. చారిత్రక నవల కదా అని ఆ వ్యక్తి గురించి వికీపీడియాలో చదివి తెలుసుకున్నాను). కనుక ఈ నవల ని చారిత్రక నవలగా పరిగణించవచ్చు అనుకుంటాను.
అనేక విషయాలు, 1700ల నుండి 1900ల మధ్య కాలం, అనేక పాత్రలు – వీళ్ళలో కొందరు ప్రముఖులు, కొందరు నాకు తెలియకపోయినా ఆయా దేశ రాజకీయాల్లో ప్రముఖులు: ఇలా, చాలా అంశాలు, విపరీతమైన స్పష్టమైన వర్ణనలతో ముందుకు వస్తూ, పోతూ ఉంటాయి. కొన్ని పాత్రలు క్రమంగా మసకబారితే, కొన్ని అలా ఉన్నట్లుండి ఫ్లాష్ లా వస్తూ పోతూంటాయి.
నవల శైలి నాకు Ingmar Bergman తీసిన స్వీడిష్ సినిమా Wild Strawberries ని గుర్తుతెచ్చింది. ప్రధాన పాత్రల చిత్రణలో రెంటికీ పోలికలున్నా, ఈ నవల పరిధి ఆ సినిమా పాత్ర కంటే చాలా విస్తృతమైనది. నవలలోని నాయకుడి పాత్ర జాతీయ-అంతర్జాతీయ వ్యవహారాల్లో ముఖ్య పాత్ర వహించిన పాత్ర కనుక అనేక ఆసక్తికరమైన చారిత్రక, రాజకీయాంశాలు ఎక్కడికక్కడ కనబడతాయి. ప్రతిదాన్నీ రచయిత గొప్ప సునిశిత దృష్టితో వర్ణించాడు. ఒక్కోచోట ఇన్ని వివరాలు information overload అనిపించినా, మరికొన్ని చోట్ల ఈ వివరాలతో కూడిన విశ్లేషణలు చాలా ఆసక్తిగా చదివాను నేను. ఉదాహరణకు, నోబెల్ బహుమతుల వెనుక ఉండే మతలబుల గురించి రచయిత ఒక చోట చర్చిస్తాడు. తొలి దశాబ్దపు నోబెల్ బహుమతుల గురించి రాసిందే అయినా, ఈ ఏటి బహుమతుల దాకా ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయేమో అనిపించింది నాకు. అలాగే కొన్ని చోట్ల అంతర్జాతీయ రాజకీయాల గురించి, 1900లలో ఐరోపా ఖండాన్ని దృష్టిలో ఉంచుకునే వ్యాఖ్యానించినా కూడా ఇప్పటికీ వర్తిస్తాయేమో అనిపించాయి ఆ అభిప్రాయాలు.
మొత్తానికి నా మట్టుకు నాకు అయితే ఈ నవల చాలా నచ్చింది. అయితే, చదవడానికి కొంచెం క్లిష్టంగా అనిపించిందన్నమాట వాస్తవం. చారిత్రక కథాంశాలు, పాత్రల గురించి ఆసక్తి ఉంటే, 1900ల నాటి రష్యన్ సామ్రాజ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల జీవితాల గురించి, పనితీరు గురించి ఏకాస్తైనా కుతూహలం ఉంటే మట్టుకు తప్పకుండా చదవండి. మామూలుగా కథలంటే ఇష్టముండి, ఓపిక ఉంటే కూడా నవల నచ్చే అవకాశాలు మెండు. కాస్త నాకు ఆ దేశాల గురించి, వాటి రాజకీయాల గురించి ఎక్కువ తెలిసి ఉంటే నాకు క్లిష్టంగా అనిపించక పోవునేమో!
అన్నట్లు, ఈ ఇస్టోనియాకు చెందిన రచయితల గురించి, రచనల గురించిన వికీ పేజీలను ఆంగ్ల వికీలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారని నా అభిప్రాయం. నేను ఇప్పటిదాకా చూసిన పేజిలన్నీ మంచి సమాచారాన్ని, పద్ధతిగా అందించాయి అని నేను అనుకుంటున్నాను. మన వాళ్ళు తెలుగు రచయితల గురించి ఆంగ్ల పేజీలు సృష్టిస్తున్నప్పుడు ఈపేజిల వైపు ఓసారి దృష్టి సారిస్తే మంచి ఉదాహరణగా ఉంటుందేమో. ఈ భాషలోని సమకాలీన సాహిత్యం గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ఈ వెబ్సైటు మీకు ఉపయోగపడవచ్చు. ప్రస్తుతానికైతే Jaan Kross రాసిన మరో నవల, Czar’s Madman చదవాలనుకుంటున్నాను నేను.
The Czar’s Madman | పుస్తకం
[…] Kross అన్న ఇస్టోనియన్ రచయిత Professor Marten’s Departure అన్న నవల చదివాక ఆయన రచనలు వేరేవి […]
2014లో నా పుస్తక పఠనం | పుస్తకం
[…] Professor Martens’ Departure – Jaan […]
ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్ 2014 – నా అనుభవం | పుస్తకం
[…] తీసుకొచ్చాను. ఆరోజు నేను ట్రెయిన్లో ఒక ఇస్టోనియన్ నవల చదువుతూ వచ్చాను అని చెప్పగానే […]