బాపుతో మేము

వ్యాసకర్త: శంకర్ (సత్తిరాజు శంకరనారాయణ)
(డిసెంబర్ 15, బాపు గారి పుట్టినరోజు సందర్భంగా, ఆయన సోదరుడు శంకర్ రాసిన వ్యాసం. ఈ వ్యాసం మొదట ఆంధ్రప్రదేశ్ పత్రికలో వచ్చింది. వ్యాసం మాకు అందించిన అను ముళ్ళపూడి గారికి ధన్యవాదాలు. – పుస్తకం.నెట్)
****
మేం అయిదుగురం!
మా నాన్న సత్తిరాజు వేణుగోపాలరావు గారికి మా అక్కయ్య అంటే ఎక్కువ ఇష్టం. మా పెద్దన్నయ్య అతి సౌమ్యుడు, చాలా నెమ్మదస్తుడు. బొమ్మలు కూడా వేసేవాడు. అతని అక్షరాలు ముత్యాల్లాగా ఉండేవి. 18,19 ఏండ్ల ప్రాయంలో పోయాడు. బాపు నల్లగా, బొద్దుగా వుండి చాలా అల్లరిచేసేవాడని, అల్లరి భరించలేక వరండాలో స్తంభానికి కట్టేసి పని చేసుకునేదాన్నని మా అమ్మ సూర్యకాంతమ్మ చెప్పేది. ఏదైనా అడిగింది ఇవ్వకపోతే గోడమీంచి దూకుతానని బెదిరించేవాడు.

నాకు బాగా గుర్తు. మా నాన్నగారికి కోపం వచ్చి బాపుని మెట్లమీంచి తోసేసారు. దేవుడి దయవల్ల దెబ్బలు ఆట్టే తగలలేదు.వెంటనే వెళ్ళి వాడిని ఓదార్చారు. నేనంటారా – ఎప్పుడూ వెనక బెంచీ వాడినే. ధైర్యం తక్కువ. పిరికితనం, మొహమాటం ఎక్కువ. అందరికీ కావాల్సినవి అందజేయడమే నా పని.

మా నాన్నగారికి, అమ్మగారికి మహాత్మాగాంధీ గారంటే ఇష్టం వల్ల అన్నయ్యని ‘బాపు’ అని పిలిచేవారు. బాపు, నేను మా అన్నగారిలా భావించే రమణగారు, చాలా సంవత్సరాలు కలిసి ఉండడం వల్ల వాళ్ళంటే నాకు ఎంతో గౌరవం. మా నాన్నగారు బొమ్మలు వేసేవారు. వీథి వరండాలో కూర్చుని అక్కడ తిరుగుతూ ఉండే లంబాడీల బొమ్మలు వేసేవారు. మా చిన్నాన్న ‘బుచ్చిబాబు’ గారు, పెదనాన్న గారు కూడా బొమ్మలు వేసేవారు. బాపుకి చిన్నప్పటినుంచే బొమ్మలు వేయడం ఇష్టం. చేతిలో పుస్తకం, పెన్సిలు ఎప్పుడూ ఉండేవి. కనబడిన కాగితాల మీద బొమ్మలు వేసేవాడు. అది చూసి నాన్నగారు వాడ్ని బాగా కోప్పడేవారు.

“చదువు నిర్లక్ష్యం చేసి బొమ్మలు గీసుకుంటే జీవితంలో ఎప్పటికి పైకొస్తావ్?” అని తిట్టేవారు. వాడు లేనప్పుడు మాత్రం ఆ బొమ్మలు అందరికీ చూపించి గర్వపడేవారు, సంతోషించేవారు.

రమణ, ఇతర స్నేహితులతో కలిసి బాపు రోజూ బీచ్ కి వెళ్ళేవాడు. అయితే వాళ్ళతో ఆడుకోకుండా వివిధ రకాలుగా కూర్చున్న మనుషుల్ని, బళ్ళని, పక్షుల్ని చూసి బొమ్మలు వేసేవాడు. అందువల్లేనేమో వాడి బొమ్మల్లో మనకి అంతా సహజత్వం, ప్రత్యేకత కనిపిస్తుంది. ఏడవ తరగతిలో ఉండగానే రమణతో ఆలిండియా రేడియో – శ్రీ న్యాపతి రాఘవరావు, శ్రీమతి కామేశ్వరి (రేడియో అన్నయ్య, అక్కయ్య) గార్లతో పరిచయం అయ్యి, పిల్లల కార్యక్రమాల్లో పాల్గొంటూ, వారు ప్రచురించే ‘బాల’ పత్రికలో బాపు బొమ్మలు వేయడం, రమణ రచనలు చేయడం మొదలైంది. వాళ్ళు పిల్లల కార్యక్రమంలో పాల్గొనడానికి వెళితే నేను కార్యక్రమం అయిపోగానే ఇచ్చే టిఫిన్ తినడానికి వెళ్ళేవాడిని. బాపు కొంచెం పెద్దయిన తర్వాత కూడా రేడియో నాటకాల్లో పాల్గొనేవాడు. ఆ తరవాత మానాన్నగారు, అమ్మగారు కూడా రేడియోలో చాలా ప్రసంగాలిచ్చారు. నాకు మాత్రం రేడియోలో పనిచేసే అదృష్టం వచ్చింది.

నాకూ చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఇష్టమే. స్కూల్లో, కాలేజీలో కూడా మితృలకు రికార్డులు వేసి పెట్టేవాడిని. కాలేజీ మేగజైన్లో బాపు, నేను కూడా ప్రొఫెసర్ల బొమ్మలు వేసేవాళ్ళం.

మా నాన్నగారికి బాపు ‘లా’ చదివి తాను చేసిన లాయర్ పని చేయాలని ఉండేది. కానీ, బాపుకి బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదవాలని ఉండేది. “ముందర నువ్వు డిగ్రీ పూర్తి చేయి, ఆ తరువాత చూద్దాం” అనేవారు.

బాపు లా చదువుతున్న సమయంలో నాన్నగారు 10 సంవత్సరాల పాటు ఆస్త్మాతో బాధపడ్తూ, 1953లో తన 49వ ఏట పరమపదించారు. బాపు ఆయన మాటకి గౌరవం ఇచ్చి లా పూర్తి చేసి అడ్వకేట్ గా సభ్యత్వం తీసుకున్నారు. కాని కోర్టుకి మాత్రం వెళ్ళలేదు. బొమ్మలకీ, ఆ తరువాత సినిమాలకీ పరిమితమై పూర్తి సమయం వాటిమీదే శ్రద్ధ చూపించి, చివరిరోజు వరకు రమణగారి సాన్నిహిత్యంలో ఎవ్వరూ సాధించలేనివి ఎన్నోసాధించి ప్రపంచ ఖ్యాతి తెచ్చుకున్నారు.

నేను ఆనర్స్ పూర్తిచేసిన తరువాత ఆరు సంవత్సరాల పాటు ఉద్యోగం దొరకలేదు. ఆ సమయం పూర్తిగా బాపు దగ్గరే ఉంటూ, వాడు బొమ్మలు వేయడం చూస్తూ చూస్తూ నాకు మళ్ళీ బొమ్మలు వేయాలన్న ఆశ పుట్టి, వారి స్ఫూర్తితో బొమ్మలు వేయడం మొదలుపెట్టాను. బాపు బొమ్మలేస్తూంటే చూడాలి -వేళ్ళు పరిగెడతాయి. అతి సునాయాసంగా, అతి తక్కువ రేఖలతో బొమ్మలు వేసేవాడు.

తక్కువ గీతలతో ఎక్కువ భావం అన్నది బాపు ప్రత్యేకత.

కథలకి బొమ్మలు వేయడంలో, ముఖచిత్రాలు వేయడంలో వాడికి వాడే సాటి. చదివి, అవసరమైన ముఖ్యమైన అంశం దొరకగానే ఆ కథ పూర్తి సారాంశం వచ్చేవిధంగా బొమ్మలు వేసేవాడు. రచయితలకు ఆశ్చర్యం వేసే విధంగా. బాపు చేత బొమ్మ వేయించుకోవాలని కోరుకోని రచయితలు, ప్రచురణకర్తలు ఎవరూ వుండరేమో అనడంలో అతిశయోక్తి లేదు.

బాపు రాష్ట్రేతర, విదేశీ ఆర్టిస్టుల గురించి చదివి, బొమ్మలు చూసి, వాటిలోని గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ఉండేవారు. నచ్చినవాటిని మన సాంప్రదాయానికి తగ్గట్టుగా మలచుకుని తన శైలిలో చిత్రించేవాడు. అందుకే ప్రతి ఆర్టిస్టు ‘నా గురువే’ అనేవాడు. ప్రముఖ తమిళ కార్టూనిస్టు గోపులు గారంటే బాపుకి గౌరవం. ఆయన్ని గురువంటాడు.

నిజానికి బాపు ఏ ఆర్ట్‌స్కూల్ లోను, ఏ గురువు దగ్గరా చిత్రకళ నేర్చుకోలేదు. గోపులు గారిని కొన్నిరోజుల క్రితమే నేను కలుసుకున్నప్పుడు “బాపు లాంటి ఆర్టిస్ట్ ఎక్కడా వుండరు. ఆయన బొమ్మల్ని జాగ్రత్త పరచి ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టే బాధ్యత తీసుకోవాలి” అని పిల్లలకి చెప్పారు. ఆయనకి 90 సంవత్సరాలు.

బాపు రమణలు సినిమాలవైపు వెళ్తున్నారని తెలిసి మా అమ్మగారు చాలా భయపడ్డారు. “నాకు తిండికి ఏలోటూ రాకుండా చూసుకోడానికి బొమ్మలు వేసుకునే శక్తి ఉంది” అని ధైర్యం చెప్పాడు. వాడికెప్పుడూ బొమ్మలే ముఖ్యం – ఆ తరువాతే సినిమాలు. బొమ్మ ఒక్కటైనా వేయని రోజు లేదు. నిరంతర కృషీ, ఇంకా ఏదో కొత్తగా వేయాలనే కోరికా అతనికి ఎప్పుడూ ఉండేది. నేను ఈమాత్రం బొమ్మలు (potraits) వేయగల్గుతున్నానంటే అదంతా బాపు రమణల ప్రోత్సాహమే.

బాపు మంచి ఫొటోగ్రాఫర్ అని చాలామందికి తెలియదు. ఫోర్డు ఫౌండేషన్ కి చెందిన ఐసెంబర్గ్ అనే ఆయన బాపుని తన వెంట ఆరునెలలపాటు మన దేశమంతా తిప్పి ఫొటోలు తీయించారు. ఆ అనుభవం కూడా బాపుకి సినిమాలు తీయడంలో సహకరించి ఉంటుంది. సంగీతం అంటే చాలా ఇష్టం. మౌత్ ఆర్గాన్ వాయించి కాలేజీ రోజుల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. బడే గులాంఅలీఖాన్, మెహిదీ హసన్ గార్ల సంగీతం ప్రాణం. వాళ్ళ సంగీతం వింటూ బొమ్మలు వేసుకునేవాడు. తనకున్న సంగీత జ్ఞానాన్ని ఏదో ఒకరకంగా తన సినిమాల్లో ఉపయోగించేవాడు.

బాపు కొంత కోపిష్టి కానీ చాలా మంచి హృదయం. మిత భాషి. ఏమడిగినా చిరునవ్వే సమాధానం. “నాకు ‘జనగండం’ ఉంది. అందుకే ఎక్కడా మాట్లాడలేను” అని తనమీద జోక్స్ వేసుకునేవాడు. రమణ కొన్నిమాటలైనా మాట్లాడేవాడు. బాపుని ఎప్పుడూ పక్కనే ఉంటూ చూసుకునేవాడు. బాపు రమణలు ‘గీతరచనలూ. మన తెలుగుజాతి, సాంప్రదాయం, శైలి, భాష, చిత్రకళా వున్నంతకాలం వాళ్ళిద్దరూ ఉంటారు – నిస్సందేహంగా!

You Might Also Like

Leave a Reply