The Good Life Elsewhere
“The Good Life Elsewhere” అన్నది Vladimir Lorchenkov రాసిన నవల. మొల్డోవా దేశానికి చెందిన ఈ రచయిత నవలను రష్యన్ లో రాయగా Ross Ufberg దాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఒక రెండు నెలల క్రితం ఈ ఆంగ్లానువాదం ప్రచురించిన వారి వెబ్సైటులో ఈ నవల గురించి చదివాక కుతూహలం కలిగింది. వెంటనే కొని కిండిల్ లోకి దిగుమతి చేసుకున్నాను. తరువాత రెండు మూడు వారాలకేమో ఒకరోజు చదివేశాను మొత్తానికి. తరువాత గత మూడు నాలుగు వారాల్లో చాలాసార్లు ఈ నవలని తల్చుకున్నాను. ముఖ్యంగా ఎలక్షన్ హవా మొదలైనాక దాదాపు రోజూ తల్చుకున్నాను – కొన్ని కొన్ని భాగాలు మళ్ళీ మళ్ళీ చదివాను. ఇక్కడ చాలామందికి దాని గురించి చెప్పాను. ఇంక తప్పట్లేదు పుస్తకం.నెట్లో రాయడం కూడా – నా ఆరాటం నాది 🙂
కథ గురించి చెప్పాలంటే – ఈ నవల మొల్డోవా దేశంలోని లార్గా అన్న పట్టణంలో జరుగుతుంది ప్రధానంగా. ఆ ఊరిలోని మనుషులే కాక, ఆ దేశ అధ్యక్షుడు, ఇతర అధికారులూ వాళ్ళూ కూడా కథలోని పాత్రలే. యూరోపు దేశాల్లో అతి పేద దేశం మొల్డోవా. “నా దేశంలోని పరిస్థితి ఇదీ” అని చెప్పడానికి ఈ నవలా రచయిత ఎంచుకున్న మార్గం – డార్క్ హ్యూమర్ (నా అభిప్రాయంలో). లార్గా చిత్రమైన ఊరు. అక్కడ చాలామంది ఏకైక లక్ష్యం ఏమిటి అంటే – ఇటలీకి వలస వెళ్ళిపోవడం. వాళ్ళ దృష్టిలో ఇటలీ భూతల స్వర్గం. అక్కడికెళ్ళి ఏ చిన్న కూలిపని చేసినా తమ దేశంలో కంటే దర్జాగా బతకొచ్చని వాళ్ళ అభిప్రాయం. కానీ, మొల్డోవా వాళ్ళకి ఇటలీ వెళ్ళాలంటే, దేశ సరిహద్దు దాటాలంటే వీసా సమస్యలు. దానితో, చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో ఇటలీ వెళ్ళాలనుకుంటూంటారు. వీళ్ళలో కొంతమందికైతే ఓ పట్టాన భవిష్యత్తుపైన, ఇటలీపైన ఆశ చావదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఓ పక్క నవ్వూ, ఓ పక్క జాలీ తెప్పించే ట్రాజీకామిక్ పరిణామాలు సంభవిస్తూంటాయి ప్రతి ప్రయత్నానికీ. వివిధ వ్యక్తులు సమాంతరంగా చేసే ఈ ప్రయత్నాలను కలుపుతూ సాగుతుంది ఈ నవల. ఆఖరుకి, దేశాధ్యక్షుడు కూడా ఇలా ఏదో ఒకలా ఇటలీ చేరుకోవాలి అన్న desperationలో ఉంటాడు. ఎలాగైనా ఇటలీ వెళ్ళిపోయి, ఏదో ఒకరోజు తను కూడా ఓ పిజ్జా కొట్టు తెరవాలని అతని కోరిక!! మరి చివరికేమైంది? మొత్తానికి ఆఊరినుండి ఎవరన్నా అసలుకి ఇటలీ చేరుకున్నారా? చేరుకున్నాక ఏమైంది? – అన్నది కథ.
కథలోని పాత్రల చిత్రీకరణ, సన్నివేశాల వర్ణన చూస్తూంటే రచయితకు చాలా ఊహాశక్తి ఉన్నట్లు అనిపించింది నాకు. నవల నాకంతగా నచ్చడానికి కారణం ఇదే. అయితే, అదే సందర్భంలో, ఆ దేశపరిస్థితులను తల్చుకుంటే భయం వేసింది. దేశంలో అవకాశాలు లేక ఎలాగైనా బైటపడాలి అన్న తాపత్రేయం ఒకవైపు, వెళ్ళలేని నిస్సహాయత ఒకవైపు ఉంటే -ఇలాంటి సృజనాత్మక రచనలు పుట్టుకొస్తాయి కాబోలు ఆ కడుపుమంటలోంచి. ఈమధ్య కాలంలో రెండు వేర్వేరు దేశాలవాళ్ళు -బాగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నవారు- తమ దేశాల గురించి చేసిన వ్యాఖ్యలు ఈ contextలో ఈ నవల చదువుతూంటే పదే పదే గుర్తొచ్చాయి. ఇటలీ కి చెందిన నా స్నేహితుడు ఒకతను తనకి తిరిగి తన దేశం వెళ్ళాలని లేదని చెబుతూ – “It is a dying country” అన్నాడు. ఇక, మరొక స్నేహితుడు- “ఇండియా మునిగిపోతున్న నావ లాంటిది. మునిగేలోగా మనం బైటపడిపోవాలి” అంటూ, పట్టువదలక దేశం దాటేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వీళ్ళెవరినీ తప్పు పట్టలేము – పట్టాలసిన అవసరం లేదు. కానీ, కొన్ని దేశాల ప్రజల్లో ఇలాంటి అసంతృప్తి ఎక్కువగా ఉందన్నది నా అనుభవంలో అనిపించిన విషయం. ఆ అసంతృప్తిని, నిస్సహాయతనీ, అయోమయాన్నీ – గొప్ప హాస్యం, ఊహాశక్తి జోడించి ఈ నవలలో అద్భుతంగా చూపించారని అనిపించింది నాకు. పాత్రలని ప్రవేశపెట్టే విధానం కూడా వాటి ప్రస్థానాల గురించి ఉత్కంఠని రేపి చివరిదాకా చదివించేలా ఉంది.
ఈ నవల గురించి మాట్లాడుకుంటున్నప్పుడే ఆసక్తికరమైన దృక్కోణాలు తెలుసుకోగలిగాను. ఈనవలలో ప్రజలు “సోవియట్ రోజులే నయం, తినడానికి తిండన్నా దొరికేది” అనుకుంటూంటారు అక్కడక్కాడా. ఆ విషయం సోవియట్ యూనియన్లో, ఆ తరువాత రష్యాలో పెరిగిన ఒక స్నేహితురాలికి చెబుతూంటే, “పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఆఖరుకి వాళ్లకి సోవియట్ రోజులు కూడా నయం అనిపిస్తున్నాయి” అని నిట్టూర్చింది. తాతల తండ్రుల పేర్లు చెప్పుకుని జనాన్ని మోసపుచ్చే నాయకులు, కోట్లకి కోట్లు స్కాములు చేసిన నాయకులని కూడా – “పోనీ, తింటే తిన్నాడు, మనకింత పెడితే చాలు” అనే స్థితికి చేరుకున్న ప్రజానీకం (ఇది నేను నిజంగా విన్న వ్యాఖ్య. కల్పితం కాదు) ఉన్న మనదేశంలోనూ రచయితల కల-కలాలు మన వాస్తవాలని ప్రతిబింబించేలా ఉండాలనీ, ఇలాంటి కథలు తరుచుగా సృష్టించాలని కోరుకుంటున్నాను.
మొత్తానికైతే నవల నన్ను చాలా ఆకట్టుకుంది. అక్కడక్కడా coherence లోపించినట్లు తోచినా, ఈ రచయిత తదుపరి రచనల కోసం మట్టుకు నేను ఎదురుచూస్తాను.
ఈ పుస్తకం అనువాదం చేయడం గురించి అనువాదకుడు Ross Ufberg రాసిన వ్యాసం Words Without Borders వెబ్సైటులో చూడవచ్చు. నవల లోని మొదటి రెండు ఛాప్టర్లు ప్రచురణకర్తల వెబ్సైటులో చూడవచ్చు. పుస్తకం కొనాలనుకుంటే అమేజాన్ వంటి వెబ్సైట్లతో పాటు ప్రచురణకర్తల వెబ్సైటులో కూడా లభ్యం.
Fiction, Novel
New Vessel Press
201
2014లో నా పుస్తక పఠనం | పుస్తకం
[…] నవలలు: * The Good life elsewhere by Vladimir Lorchenkov (Tr: Ross Ufberg) […]
మంజరి లక్ష్మి
“వలస తప్పూ ఒప్పూ అని ఎవరు చెప్పగలరు?” అవును ఉన్న కాస్త భూములు, నీరు లేకో ఇంక దేనివల్లో పండక, సేద్యం గిట్టుబాటు కాక, జీవనాధారంగా ఇతరమైన వృత్తులు, ఉద్యోగాలు చేసుకోవటానికనువైన పరిస్థితులు లేక(ప్రభుత్వాలు కల్పించక) వలస వెళ్ళే వాళ్లుంటారు. ఉన్న చోటకన్నా ఇంకా గొప్ప ఉద్యోగాలు, డబ్బు సంపాయించే అవకాశాలు దొరికితే వలస వెళ్ళేవాళ్ళూంటారు. పెట్టుబడిదారులైతే చౌకగా ముడి పదార్ధాలు, చౌకగా శ్రామికులు దొరికే చోట ఎక్కువెక్కువ లాభాలు వస్తాయనీ వెళుతుంటారు. వీలైతే వాళ్ళ రాజకీయ రంగాన్ని తామే ఏలితే తమకనువైన నిర్ణయాలు జరిగే వీలుంటుంది కాబట్టి దాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పెట్టుబడి దారులు ఇలా వెళ్ళటాన్ని వలసల క్రిందచెపుతారో లేదో తెలీదు.
మైథిలి అబ్బరాజు
బావుందండీ మీ పరిచయం.వెతికితేఇప్పుడే కిండిల్ ఎడిషన్ దొరికింది అమెజాన్ ఇండియా లో. ప్రెసిడెంట్ వలసపోవాలనుకోవటమనే అబ్సర్డిటీ లోంచి నవల కొంచెం తెలుస్తోంది 🙂 నిజమే, వలస తప్పూ ఒప్పూ అని ఎవరు చెప్పగలరు? అది ప్రాధాన్యతలను గురించిన విషయమని నాకు అనిపిస్తుంది.
మంజరి లక్ష్మి
ప్రెసిడెంట్ కూడా వలస పోవటం గురించి నేను `వ్యంగ్యం’ అనే పదం వాడకుండా మీరు వాడిన అబ్సర్డిటీ కానీ, సౌమ్య గారు వాడిన exaggeration అనే పదం కానీ వాడుండాల్సింది. అప్పుడు కొంచెం సరిగా చెప్పినట్లుండేది.
మంజరి లక్ష్మి
నవలైనా మన లాజిక్ కు కాస్త దగ్గరగా, కొంత నాటకీయతున్నా, కొంతైనా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లనిపించాలి కదా! మీరు అందుకనే కదా అలా వెళ్లిపోవాలనుకున్న వాళ్ళు వాస్తవంలో కూడా ఉన్నారు అని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అలా జరుగుతుంది, జరగొచ్చు అనే కదా దాని అర్ధం. మరీ మిథికల్, జానపద కధలనైతే అడగం కానీ, మిగతావి, నిజానికి కొంత వాస్తవానికి దగ్గరగా అనిపించిన వాటిని గురించి (నిజానికి ఈ నవలలో ఆ టైప్ వాస్తవికత కొంత ఉంది) కొంత లాజిక్ గా ఆలోచిస్తాము కదా! అందుకే అలా అన్నాను. అయితే మీరు చెప్పినదాన్ని బట్టి వెళ్లిపోవలనుకోవటానికి కారణమైన అక్కడి ఆర్ధిక, చారిత్రక పరిస్తితుల్నివేటినీ ఆధారంగా తీసుకోకుండానే ఈ పుస్తకం రాసి ఉంటారేమో. లేక పోతే వాటిని గురించి వివరణ కూడా ఉండేది కదా(ఉంటే మీరు దాన్ని కూడా చెప్పేవారు కదా!).
సౌమ్య
మంజరి గారికి: నాకు అర్థమైనంతలో అదొక రచనా పద్ధతి (హాస్యం, వ్యంగ్యం, exaggeration, ఫాంటసీ వంటి ఎలిమెంట్స్ ఉపయోగిస్తూ వాస్తవ జీవితంలోని సమస్యలని చిత్రించడం). ఆర్థిక, సామాజిక చరిత్ర గురించి ఎక్కువ రాయలేదు ఇందులో (నేనూ ఆశించలేదు, నవల కనుక)- చారిత్రక నేపథ్యాన్ని, ఆర్థిక పరిస్థితులనూ మట్టుకు ప్రస్తావించారు (పాత్రల మాటల ద్వారా). ఇంతకు మించి ఈ విషయమై నా వద్ద చెప్పేందుకేమీ లేదు. మీకు ఆసక్తి ఉంటే నవలను చదవగలరు.
మద్దిరాల శ్రీనివాసులు
ఇది చదివాకనైనా మన ప్రజలలో మార్పు వస్తే బాగుంటుందని అనిపిస్తుంది.
Madhu
టుడే.ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికలు అటువంటి పరిస్తినినే చూచిస్తున్నాయి . అందరు ఎన్నికల ఫలితాల గురించి ఆలోచన చేయుచున్నారు. దోపిడీ దారులు గెలిస్తే ఆంధ్ర ప్రదేశ్ ఉంటె భవిషత్తు ఉంటుందా అని.
ఎక్కడకైన వెళ్లి పోతే బాగుంటుందని తలచుచున్నారు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేరు వారు చాల మంది వోటు వెయ్య లేదని చెప్పుచున్నారు. రేపు మే 7 న ఆంధ్రప్రదేశ్ లో యువత వోటు వేసి వారి భవిషత్తు కొరకు ప్రతి ఒక్కరు వోటు వెయ్యాలి. ఈ నవల లోనిపరిస్థితులను తెచ్చు కోకుడదని నా మనవి
మంజరి లక్ష్మి
ఈ కథ చాలా కొత్తగా ఉందండీ. ఆఖరికి ప్రెసిడెంట్ కూడా ఇటలీ వెళ్లిపోవాలనుకోవటం ఏమిటీ? భలే తమాషాగా ఉంది. ఇటలీలో పిజ్జా కొట్టు పెట్టుకొంటే వచ్చే ఆదాయం కూడా ఇక్కడ అతనికి లేదా? ఎక్కడైనా భూమనేది ఉంటే దాని మీద ఏదో ఒక పని చేసుకు బతుకుతారు కదా! లేదా వాళ్ళందరి శ్రమని దోచి, వాళ్ళకు తిండి కూడా లేకుండా చేసే వాళ్ళుంటే, ఏదైనా పరాయి దేశపు పరిపాలన నడుస్తూ ఉంటే, కనీసం వాళ్లైన అక్కడే ఉండాలనుకుంటారు కదా, ఇంగ్లీషు వాళ్ళు భారతదేశాన్ని వదలాలనుకోనట్లు. కనీసం ప్రెసిడెంట్ అయినా ఆ వర్గంలో వాడయ్యుంటాడు కదా! అతను కూడా వెళ్లి పోవాలనుకోవటం ఏమిటీ? వ్యంగ్యం కోసం అలా రాసారేమో!
సౌమ్య
మంజరి గారికి: ఇది ఒక నవల. మనం దాన్ని చరిత్ర పుస్తకం లాగా కాక నవలగానే చూద్దాం. 🙂
pavan santhosh surampudi
చాలా మంచి పరిచయం. ఎవరైనా “ఇండియా నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి” అంటున్నారంటే వాళ్ళ దేశభక్తిని శంకించక్కరలేదు. ఆ స్థితికి తెచ్చిన వ్యవస్థలను, మనస్తత్వాలను అనుకోవాలి ఏం అన్నా గానీ.