Lava – Javed Akhtar

అగర్ పలక్ పె హై యె మోతి తొ కాఫీ నహీ
హునర్ భీ ఛాహియె అల్ఫాజ్ మె ఫిరోనె కా – జావేద్ అఖ్తర్
(రెప్పలపై ముత్యాలుంటే చాలదు
వాటిని మాటల దండగా గుచ్చే నేర్పూ ఉండాలి. )
ఏడవడం ఎవడికి రాదు? వీలున్నంతవరకూ మన ఏడుపు, అప్పుడప్పుడూ పరులకుందని మరో ఏడుపూ. మరీ ఎక్కువైతే, అవతలివాళ్ళదీ మనదేననుకొని ఏడుపు. అందరం ఏడుస్తూనే ఉంటాం. నవ్వేది కూడా ఏడ్వలేకే కదా?
కానీ ఈ కవులున్నారే.. వాళ్ళు చక్కగా, పద్ధతిగా, ఒక మీటరు ప్రకారం ఏడుస్తారు కదా? అందుకని వీళ్ళవి మనబోటి సామాన్యుల చీముడు కారే ముక్కులు, మేకప్పులు చెదిరిపోయే కన్నీళ్ళు ఉండవు. కవులనే కాదు, కళాకారులందరూ అంతే!
ఓ ఏడు,ఎనిమిదేళ్ళ కిందట పుస్తకాలు చదవటం మళ్ళీ మొదలెట్టాలనుకున్నప్పుడు, సమన్యాయం చేయడం కోసం ఇంగ్లీషు, తెలుగులతో పాటు హింది పుస్తకాలూ కొనడానికి పూనుకున్నప్పుడు, నేను మొదట తీసుకున్న పుస్తకం జావేద్ అఖ్తర్ “Quiver”. అందులో కవితలు హింది, ఇంగ్లీషు భాషల్లో ఉండడంతో, అప్పటికి, ఇప్పటికి రెంటిలో below poverty line ఉన్న నేను చదువుకోడానికి వీలుగా అనిపించింది. అందులో చాలా మంచి కవితలెన్నో ఉన్నా, ఒక కవిత నాకు ఎప్పటికి గుర్తుండిపోయేది ఒకటుంది. అంగడిలో కన్నీళ్ళు అమ్ముడుపోవడం గురించి ఉంటుంది.
Sorrows are sold
in the market.
The price of sorrows is high.
If the shop of sweet tones is successful,
The customers of emotion
Will buy the toys of sorrow, large or small,
For any price that is asked
I’ve always
sold my sorrows for a good price
But
the sorrow I’ve today
I couldn’t display it on any counter
For the first time, I’m ashamed;
this sorrow I shall not be able to sell.
– Javed Akhtar
Quiver 1995లో వచ్చిన ఈ కవితా సంపుటి తర్వాత, మళ్ళీ ఓ రెండు మూడేళ్ళ వరకూ అఖ్తర్‍గారిది కవితల సంపుటేం రాలేదు. “లావా” విడుదలైన రోజునుండి దాని గురించి వింటూనే ఉన్నా, దాని గురించి చదువుతూనే ఉన్నా, పోయినవారం వరకూ దాన్ని కొనడం కుదర్లేదు.
చిన్నప్పటినుండి వివిధ్ భారతి వింటూ పెరిగిన నాకు సంగీత దర్శకులకన్నా, గాయకులకన్నా గేయరచయితలమీదే ధ్యాస ఉండేది. హస్రత్ జయ్‍పురి, ఆనంద్ భక్షీ, జావేద్ అఖ్తర్ వీళ్ళంతా చిన్ననాటి నుండి పరిచయం ఉన్నవాళ్ళు. ఎప్పుడో, ఎక్కడో గుల్జార్ వీళ్ళందరికన్నా ఆత్మీయులైపోవటం వీళ్ళంతా eclipsed అయిపోయారు అంతే! అయినా, అఖ్తర్ కవితలు చదవడం ఒక అరుదైన అనుభవం.
నా అనుభవం మేరకు, గుల్జార్ కవిత చదివీ చదవగానే తీక్షణంగా గుచ్చుకుంటుంది. “వాహ్” అన్నా, అనకపోయినా, “ఆహ్” మాత్రం మన ప్రమేయం లేకుండా బయటకొచ్చేస్తుంది. అఖ్తర్ కవితలు అలా కాదు. మెల్లిమెల్లిగా పనిచేస్తాయి. సైలెంట్‍గా ప్రభావం చూపిస్తాయి. “అర్రె.. ఎంత చిన్న విషయం. ఎలా మిస్స్ అయ్యాం?” అని అనిపిస్తుంది. వీటిలో political inclinations etc గురించి నేను మాట్లాడలేను. అవి నాకు ఎటూ అర్థం కావు కాబట్టి. అట్లాంటి సమగ్ర విశ్లేషణ కావాలంటే, ఇది చదువుకోండి.
“లావా”లో అత్యధికంగా ఘజల్స్ ఉన్నాయి. (ఘజల్‍కి, కవితకుగల ప్రధాన బేధాలను వివరిస్తూ ఆయన జైపూర్ లిట్ ఫెస్టివల్‍లో చర్చా కార్యక్రమం చేపట్టారు. అప్పుడు నేను అక్కడే ఉన్నా. ) కొన్ని కవితలూ ఉన్నాయి. ప్రతి కవిత లేక ఘజల్ చివర్న ఒక couplet కూడా ఉంది. నేను చదివిన పుస్తకంలో కవితలన్నీ దేవనాగరి లిపిలో ఉన్నాయి. కష్టమైన ఉర్దూ పదాలకు పక్కనే సరళమైన అర్థాలు ఇవ్వటంతో, అర్థాలకోసం పేజీలు తిరగేయటమో, లేక గూగుల్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఈయన కవితల్లో అసలు ఆంగ్లపదాలు కనపడనే కనపడవు.
కవితలు అన్ని విషయాలకు సంబంధించినవీ ఉన్నాయి. బ్రహ్మాండం మొదలుకొని వీధి చివర చెట్టు వరకూ. తన మామగారైన ఖైఫీ ఆజ్మీ గురించి, భార్య షబానా గురించి ప్రత్యేకించి కవితలు ఉన్నాయి.
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‍లో గుల్జార్ చేతుల మీదుగా ఆవిష్కృతమైన లావా పుస్తక విశేషాలు కొన్ని ఈ వీడియో చూడచ్చు. (వీడియోలో 44వ నిముషం దగ్గర నుండి ఈ పుస్తకం గురించి కబుర్లు మొదలవుతాయి. కానీ వీడియో మొత్తం worth watching!) ఇదే వీడియోలో, జావేద్ 48వ నిముషంలో వినిపించే “యె ఖేల్ క్యా హై” అన్న కవిత నాకు ఇష్టమైన కవితల్లో ఒకటి. దానివెంటనే ఆయన చదివిన ఇంకో కవిత “ఆసూ” మొత్తం సంపుటిలో నాకు ఎక్కువగా నచ్చింది. అనాథ కన్నీళ్ళని నాబోటి వాళ్ళు రాస్తే పైత్యమంటారు. ఈయన ఎంత బాగా చెప్పుకొచ్చారు వాటి గురించి. పరాయి పీడనలు మనవి అయినప్పుడు అనుభవంలోకి వచ్చాక, కన్నీళ్ళు వాళ్ళవా? మనవా? అంటూ ప్రశ్నిస్తుంది ఈ కవిత. అందుకే, ఏడవడం మాత్రమే కాదు, కన్నీటి ముత్యాలను దండగా మలచడం కూడా చేతనవ్వాలి.
ఈయన కవితల్లో విరివిరిగా కనిపించే విషయం: తన ఇంటిని వెతుక్కుంటున్నవాడి మనోగతం. ఇంటినుండి వచ్చేసినందుకు బాధ, ఇక్కడో ఇంట్లో ఉన్నా అది ఇంటిలా అనిపించకపోవటం – ఈ భావనలతో ఆయన రాసినవి కొన్ని బాగా హత్తుకున్నాయి.
హార్డ్ కవర్ పుస్తకంలో చక్కని అక్షరాలతో, దళసరి పేపర్లమీద చక్కగా అచ్చేసిన కవితలివి. రాజ్‍కమల్ ప్రకాషన్ వారు వేశారు. (వీళ్ళు మంటో సంపుటాలు మాత్రం అంత పేలవంగా ఎందుకు అచ్చేశారో నాకు ఇప్పటికీ అర్థంకాదు.) ఏది ఏమైనా వీళ్ళిలా ఉర్దూ కవిత్వాన్ని చదువుకోగల లిపిలో వేసి, నాబోటి వారిని ఉద్దరిస్తున్నారనే చెప్పాలి.
ఈ కవిత్వాన్ని ఆస్వాదించటానికి భాష కొంచెం వరకూ అడ్డుపడినా, కొంచెం శ్రమపడి శ్రద్ధగా చదువుకుంటే అంతకన్నా బ్రహ్మాండం ఉండదు. ఎప్పుడో, ఇవి ఆడియో రూపేణ కూడా విడుదలయ్యే అవకాశముంటే పండుగే!
హింది వచ్చినా రాకపోయినా, నాలా, హింది పాటలను చెవులప్పగించుకొని ఇష్టంగా వినేవాళ్ళంతా తప్పక ప్రయత్నించాల్సిన పుస్తకమిది.
Poetry
RajKamal Prakashan
Feb, 2012
Hard Cover
147
Leave a Reply