ఉదాత్త చరితుడు గిడుగు

[ఆగస్టు 29 – గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి. ఈ సందర్భంగా, గిడుగు రామ్మూర్తి పంతులు గారి జీవిత చరిత్ర గురించిన వ్యాసం ఇది]

ఖాళీ కాబోతున్న ఇంట్లో తచ్చాడుతూ ఉంటే, సామాన్ల మధ్య ఈ పుస్తకం కనిపించింది. వ్యావహారిక భాష కోసం గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారు ఉద్యమించారన్న విషయం తప్పితే ఇంకేమీ తెలియని నాకు ఈ పుస్తకం చూడగానే ఆయనేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. చదివేకొద్దీ అది గౌరవంగా మారి, పుస్తకం ముగిసేసరికి అప్పుడే ముగిసిందే అన్న నిరాశను కలిగించింది.

దీన్ని రాసింది గిడుగు వారి మనవడు, కథా రచయితా అయిన గిడుగు రాజేశ్వరరావు గారు. ఈ జీవితచరిత్రతో పాటు ఎవరివద్దో లభ్యమైన 1932నాటి ఆయన డైరీని, ఇతర ఫొటోలను కూడా పొందుపరిచారు ఈ పుస్తకంలో. డైరీ రాత అంత చదవదగ్గదిగా లేకపోయినా, చారిత్రక దృష్టితో చూస్తే ఇదో విలువైన పుస్తకమనే చెప్పాలి.

గిడుగు రామమూర్తి పంతులు గారి కథ చదువుతూ ఉంటే వారిపై చాలా గౌరవం కలిగింది. ‘సవరా భాషను నేర్చుకుని, సవరలకు అందులోనే చదువు చెప్పి, సవర నిఘంటువులు, సంకలనాలు తయారు చేయడమేకాక ఇంగ్లీషువారికి కూడా ఆ భాష నేర్పిన విధానమూ, కొన్ని ప్రాచీన లిపుల గురించి వారు చేసిన పరిశోధనా, వ్యావహారికాన్ని ప్రచారం చేయడానికి వారు పడ్డ అవస్థలు, చరిత్రలో వారికున్న ఆసక్తీ, ఉపాధ్యాయుడిగా వారి ప్రవర్తనా, ఎన్ని ఒడిదుడుకులెదురైనా చెరగని ధృడ వ్యక్తిత్వమూ – వీటన్నింటి గురించి చదువుతూ ఉంటే, వారిపై గౌరవం కలగడమే కాదు, వారొక ఆదర్శమూర్తిగా కనిపించారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.

ఈపుస్తకాన్ని చాలా పద్ధతిగా విభజించారు. పూర్వీకులు, గిడుగువారి బాల్యం, వారు లిపుల గురించి చేసిన అధ్యయనం, వ్యావహారిక భాషోద్యమం, సవర భాషలో కృషి, వారి కుటుంబ జీవితం – ఇలా విభజించి రాయడంతో అర్థం చేసుకోవడం సుళువైంది. అయితే, కథ త్వరగా ముగిసిపోయిందేమో అనిపించింది. ఆయన పదవీవిరమణ చేసిన తరువాతి జీవితం గురించి మరింత వివరంగా రాసి ఉండాల్సింది అనిపించింది – ఆయన ఆ తరువాత దాదాపు 30 సంవత్సరాలు వివిధ భాషా సంబంధ పరిశోధనలు చేశారు మరి! ఈ పుస్తకం గిడుగు వారి గురించి తెలుసుకోడానికే కాదు, ఆనాటి సమాజం గురించి తెలుసుకోడానికి కూడా చాలా ఉపకరిస్తుంది. అలాగే, విద్యావిధానం లోని మార్పుల గురించి కూడా అక్కడక్కడా ప్రస్తావన ఉంది. అప్పటి పండితులు, ప్రముఖులూ, వారితో గిడుగు వారికున్న సంబంధాల గురించి వివరంగా రాసారు.

మొత్తానికి తెలుగును “మానవ” తెలుగులా ఇప్పుడు పుస్తకాల్లోనూ వాటిలోనూ రాస్తున్నారంటే దానికి కారకుల్లో ఒకరైన మనిషి జీవిత చరిత్ర చదవడం ప్రతి తెలుగువాడికీ అవసరం అనిపించింది. మార్పు కోసం పాటుపడాలి అనుకునేవారికి (అదేతరహా మార్పు అయినా) ఈ పుస్తకం అలా పాటుపడి విజయం సాధించిన వ్యక్తి కథగా చక్కని ప్రోత్సాహం అందించగలదు.

పుస్తకం వివరాలు:
ఉదాత్త చరితుడు గిడుగు (జీవిత చరిత్ర, డైరీతో సహా)
గిడుగు రాజేశ్వర రావు
ప్రధమ ముద్రణ: జూన్ 2006
వెల: 120 రూపాయలు
నవోదయ, విశాలాంద్ర బ్రాంచీలలో దొరుకుతుంది

(ముందే చెప్పినట్లు, ఖాళీ ఔతున్న ఇంటికి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ ఉంటే కనిపిస్తేనూ, చదివాను. కనుక, పుస్తకం వివరాలు, కవర్ పేజీ ఫోటో – వంటివి తీస్కోడం కుదరలేదు…)

You Might Also Like

2 Comments

  1. satish

    గిడుగు రామమూర్తి పంతులు గారు

Leave a Reply