సలాం హైదరాబాద్
సమీక్షకులు: మద్దిపాటి కృష్ణారావు, ఆరి సీతారామయ్య
నవంబర్ 2008 లో జరిగిన డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పుస్తక చర్చా సమీక్ష
పుస్తకం వివరాలు:
సలాం హైద్రాబాద్ (తెలంగాణ నవల)
రచయిత: లోకేశ్వర్
గాంధి ప్రచురణలు, హైద్రాబాద్ (2005)
ఈ నవల గురించి రచయిత తన ముందు మాటగా చెప్పుకున్న వివరాల ప్రకారం, ఈ నవలాకాలం 1578 నుండి జూలై 10, 1970 వరకు. ఇందులోని ముఖ్య వస్తువులు హైద్రాబాద్ చరిత్ర, నగరంలో నడిచిన ఉద్యమాలు, స్వామి అనే ఒక పి. యు. సి. విద్యార్ధి ఆత్మకథ. ఈ మూడు వస్తువుల్నీ కలిపి జడలాగా ఈ నవలను అల్లినట్టు రచయిత చెప్పుకున్నారు. హైద్రాబాద్ లో పుట్టి పెరిగిన ఈ నవలా రచయితకు తన ఊరిమీద ఉన్న వీరాభిమానం ప్రతీ వాక్యంలోనూ కనపడుతుంది. ఉత్తర దక్షిణ భారతాలకు (ఆ మాటకొస్తే తూర్పు పడమటి ప్రాంతాలక్కూడా), సహజమైన కూడలి స్థలంగా రూపొందిన ఈ నగరంలో అన్ని భాషా, మత సంస్కృతులూ కలబోసిన చారిత్రక నగరంగా రచయిత చక్కగా వర్ణించారు. అలాగే 1969 – 70 లో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, ముఖ్యంగా హైద్రాబాద్ నగరంలో జరిగిన ఉద్యమాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు. ఇదే సమయంలో హైద్రాబాద్ లో నివశిస్తున్న స్వామి అనే ఒక సిటీ కాలేజి విద్యార్ధి ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో పాల్గొనడంతో, అతని కథ ఉద్యమ చరిత్రలో ఒక అంతర్భాగంగా నడుస్తుంది. ఐతే, హైద్రాబాద్ నగరాన్ని ఇంత చక్కగా వర్ణించినా, అది ఆ నగరంతో పరిచయమున్నవారికే తప్ప మిగిలిన వారికి అర్ధం కావడం కష్టం. హైద్రాబాద్ నగరం గురించి అంతగా తెలియని పాఠకుల కోసం నగర భౌగోళిక స్థితిగతులు వివరించే ఒక పటాన్ని కూడా పుస్తకంలో చేర్చి ఉంటే సహాయకారిగా ఉండేదనిపించింది.
హైద్రాబాద్ చరిత్రను ఒక నవలగా వ్రాయదలుచుకున్న రచయిత ఉద్దేశం మాత్రం నెరవేరలేదనే చెప్పాలి. హైద్రాబాద్ చరిత్రను చెప్పే ఉద్దేశంతో నగర చరిత్రలోని కొన్ని ఘట్టాలను తీసుకుని నవలలో ఇరికించినట్టుగా ఉందేగానీ, కథలో అంతర్భాగం కాలేకపోయింది. అంతమాత్రాన నగర చరిత్రను గురించిన విషయాలు గాని, నగర వీధుల వర్ణన గాని సరిగా లేదని కాదు. ఈ వర్ణనంతా కథా సంవిధానంలో ఇమడలేదని. చరిత్ర గురించి ఓ వంద విషయాలు ఒక లిష్టుగా రాసేసుకుని వాటిని ఎక్కడ వీలైతే అక్కడ ఇరికించినట్టుందే గానీ, కథతో నిమిత్తంలేదు. దానికి తోడు వివిధ ప్రదేశాల, భవంతుల వర్ణనలు చారిత్రాత్మక కాలంలో చేస్తూ, అకస్మాత్తుగా రచయిత ప్రత్యక్షమైపోయి వర్తమాన కాలానికి సంబంధించిన వ్యాఖ్యలు చెయ్యడం అసంబద్ధంగా అనిపిస్తాయి. రచయిత తన పుస్తక కాలాన్ని స్పష్టంగా జూలై 10, 1970 కి పరిమితం చేసి, 2005 లోనో అంతకు ఒకటి రెండు సంవత్సరాల ముందో జరిగిన మార్పులతో పోల్చి వ్యాఖ్యానించడం అనవసరమే కాదు, విసుగును కూడా కలిగిస్తాయి.
చరిత్ర రచనకు నిర్దిష్టత, ఆధారం చాలా ముఖ్యం. కర్ణాకర్ణిగా విన్న విషయాలను చరిత్రగా వ్రాస్తే, రచయితమీద నమ్మకం పోయి, చెప్పిన నిజాలను కూడా అనుమానించే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు, టర్కీ పాత పేరు తుర్క్‌మెనిస్తాన్ అని వివరించారు రచయిత (పేజి: 29). టర్కీకి తుర్క్‌మెనిస్తాన్ అన్న పేరు ఎప్పుడూ లేదు. మంగోలియా ప్రాంతం నుండి శతాబ్దాల క్రితం వలస వెళ్ళిన వారిలో కొందరు ఈనాటి టర్కీలోను, మరి కొందరు ఈనాటి తుర్క్‌మెనిస్తాన్ లోనూ స్థిరపడ్డారు. అలాగే, గోల్కొండ వజ్రాల గనులకు ప్రసిద్ధి అని, ముత్యాల్నీ, రత్నాల్నీ రాసులుగా పోసి కూరగాయల వలె అమ్మారనీ వ్రాశారు (పేజి. 24). వజ్రాల గనులున్నది అప్పట్లో కుతుబ్‌షాహీల రాజ్యంలో భాగమైన రాయలసీమలో గాని, గోల్కొండలో కాదు. ముత్యాలు, రత్నాలు కూరగాయల్లా అమ్మారని అనుకోవడానికి బాగానే ఉంటుందేగాని, అది ఎంతవరకూ నిజమన్నది అనుమానాస్పదమే. పుక్కిటి పురాణాల్ని చారిత్రక సత్యాలుగా ప్రచారం చేసే అసంబద్ధమైన కథల్లో అసఫ్ జాహి వంశం ఏడు తరాలు మాత్రమే పరిపాలించడానికి గల కారణం వెనుక కథ కూడా ఒకటి (పేజి: 116). తెలియని విషయాలను తెలిసినట్లుగా వ్రాస్తే పాఠకుడికి రచయిత మీద గౌరవం పోతుంది. దానితో రచయిత వ్రాసిన ప్రతీవిషయమూ అనుమానాస్పదమౌతుంది.
హిందూ మతంల అగ్రవర్ణాల వాళ్ళందరూ చనిపోయినవారికి దహన సంస్కారాలు చేస్తరు. ముస్లింలు, దళితులు, వెనుకుబడిన కులాల వారు మాత్రం ఖననం చేస్తరు. పంచభూతాలల్ల ఒకటైన మట్టిల కలపడమే సరైన పద్ధతేమో! (పేజి. 131). అగ్ని మాత్రం పంచభూతాల్లో ఒకటి కాదా? గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి పంచభూతాలు. వీటిలో ఏ ఒక్కటికి మరొక దానికంటే ప్రత్యేకత లేదు. పైగా, ఖననం చేసినా, దహనం చేసినా శరీరం ఖనిజలవణాల రూపంలో కలిసేది మట్టిలోనే కదా. మరి ఖననం చెయ్యడం ‘మంచి ‘ పద్ధతి ఎలాగయ్యింది? అంటే, పంచభూతాలపై రచయితకు సరైన అవగాహన లేకపోయి ఉండాలి, లేకపోతే అగ్ర వర్ణాలు ఏంచేసినా అది తప్పు అనే భావనైనా అయ్యుండాలి. అంతకు ముందు పేజీల్లో చావు గురించి చర్చిస్తూ వివిధ మతాల, కులాల, ప్రాంతాల అచారాల్ని వివరిస్తూ విమర్శించే తీరులో కూడా రచయిత అవగాహనాలోపం బయటపడుతుంది. ఇదే పద్ధతి మిగిలిన విషయాల్లో కూడా కొనసాగింది. పసిపిల్లలకు రంగుల మధ్య తేడాలు అంతగా తెలియవు. అది గమనించకుండా, తల్లి చీరకొంగు మొహమ్మీద పడితే దాన్ని తొలిగించలేని వయసు పిల్లవాడి గురించి వ్రాస్తూ వాడికి కనిపించిన రంగుల గురించి వర్ణిస్తారు రచయిత (పేజి: 16). ఇలాంటివి ఈ పుస్తకం నిండా కోకొల్లలు.
తన ముందు మాటలో, ఈ నవలలో నేను మాట్లాడే హైద్రాబాద్ యాస బాసలు వాడినాను అని చెప్పుకున్నారు రచయిత. ఇది సంభాషణల వరకే పరిమితమైతే, ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఫలానావారు అలాగే మాట్లాడతారు అనుకోవడంలో తప్పులేదు. ఐతే కథనంలోను, వ్యాఖ్యానంలోను వాడిన భాష వైభవోజ్వల కాలానికి సంబంధించిన మెరుపుల మరకలు నుండి మొహల్లాల చక్కర్లు కొట్టుడు వరకూ అయోమయంలో సాగింది. డు, ము, వు, లు అతికిస్తే సంస్కృత పదాలు తెలుగువైనట్లు, వాక్యం చివరి దీర్ఘాన్ని కుదిస్తే (ఉదా: కొనుక్కున్నడు, చెప్పెటోడు, అందమిస్తది, ఎక్కాలె) అది తెలంగాణా మాండలికమైపోతుందన్న అపోహేదో ఈ రచయితకున్నట్టుంది. లేకపోతే, నిష్క్రియాపరంగా, నిరాసక్తంగ, గడుపుతున్నడు వంటి ప్రయోగాలతో పుస్తకం మొదటి నుండి చివరి వరకూ మనల్ని విసిగించేవారు కాదు. పుస్తకంలోని భాషంతా కవితా శైలిలోనే నడిచిందని చెప్పవచ్చు. ఈ మిశ్రమ ప్రయోగాలు ఆ కవితా శైలిలో ఇమడ్చడానికి ప్రయత్నం చేసినట్లు కనిపించినా, ప్రతీవాక్యంలోనూ తెలంగాణా మాండలికాన్ని ఒకటి రెండు మాటలతో బలవంతంగా అతికించినట్లుందేగాని సహజత్వం రాలేదు. దీనికి తోడు, వాడిన పదాలు చాలా చోట్ల చాలా బరువుగా ఉన్నాయి కదా అని వాడినట్లుందేగాని, రచయితకు ఆ పదాలపై అవగాహన ఉన్నట్టు లేదు. పైన చెప్పిన పంచభూతాల ప్రస్థావన ఒక ఉదాహరణ. అలాగే, చదువు సరిగా చెప్పని సర్కారీ స్కూల్లో పరీక్ష పాస్ కానేమోనన్న స్వామి భయాన్ని ఇంఫీరియారిటీ కాంప్లెక్సు గా వర్ణించడం (పేజి: 52). బరువు కోసం వాడిన అసందర్భ ప్రయోగాలు కూడా అనేకమే (ఉదా: పేజి: 23, వృత్తి, ప్రవృత్తి; పేజి: 134, నైరూప్య రూపం).
ఈ పుస్తకం పేరుకు రచయిత తగిలించిన tag line, తెలంగాణ నవల అని. పుస్తకం ఆసాంతం చదివినా హైద్రాబాద్ నగరం గురించి తప్ప తెలంగాణా చరిత్ర గురించి గాని, సంస్కృతి గురించి గాని ప్రస్తావన ఇంచుమించు శూన్యమనే చెప్పాలి. తెలంగాణా అంటే హైద్రాబాద్ మాత్రమే కాదు కదా. ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ఉద్యమ ప్రస్తావన ఉంది కాబట్టి తెలంగాణ నవల అన్నారనుకుందామంటే, ఇది కేవలం నగరంలో జరిగిన ఉద్యమ చరిత్ర మాత్రమే. అప్పుడు కూడా, అది ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నవల అవుతుంది కానీ, మొత్తం తెలంగాణా చరిత్రకు, సంస్కృతికి సంబంధించిన నవల కాజాలదు. తెలంగాణ నవల అనడం చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం క్రిందికి వస్తుందే కానీ మరొకటి కాదు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని రాజకీయ నాయకులు పదవులకోసం పక్కదారి పట్టించారని నిందించిన రచయితే, ఇలా తెలంగాణా పేరును వ్యాపార ప్రయోజనాలకు వాడుకోవడం బాధాకరం.
హైద్రాబాద్ లో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించడంలో రచయిత సఫలమయ్యారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఐతే, దేశ విదేశాల ప్రజలు వట్టి చేతులతో హైద్రాబాద్ వచ్చి ఎలా బాగు పడిందీ మెచ్చుకోలుగా వ్రాస్తూనే, తెలంగాణా ఉద్యమ ప్రస్తావనల్లో కోస్తా ప్రాంతపు తెలుగు వారిపై కారాలు మిరియాలు నూరడం హాస్యాస్పదంగా ఉంది. పొట్టకూటికోసం వచ్చి బాగా సంపాదించి బాగుపడ్డ మరాఠీలు, తమిళులు, రాజస్థానీలు, సిక్కులు, మార్వాడీలు, మిత్రులయ్యారు. అదే పొట్టకూటికోసం కోస్తా ప్రాంతం నుండి వెళ్ళిన తెలుగు వారు మాత్రం రచయిత దృష్టిలో శత్రువులయ్యారు. ఆఖరికి, క్రమపద్ధతిలో దండెత్తి వచ్చి స్థానిక ప్రజలను, వారి సంస్కృతినీ ధ్వసం చేసిన పర్షియన్ షాలు, నవాబులు కూడా రచయిత దృష్టిలో మహోన్నతులే, ఒక్క కోస్తాంధ్ర ప్రజలు తప్ప! కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్టు, తెలంగాణా ప్రాంతపు సమస్యలకు కూడా కారణాలనేకం. కేవలం కోస్తాంధ్ర ప్రజలపై రచయిత చేసిన వీరంగం ప్రస్తుతపు తెలంగాణా సెంటిమెంటును వాడుకునే హిపోక్రసీ తప్ప మరొకటిగాదు. లేకపోతే తెలంగాణా సమస్యలను క్షుణ్ణంగా చారిత్రక నేపధ్యంలో చర్చించి తన కోపానికి కారణాలను వివరించి ఈ పుస్తకాన్ని నిజంగానే తెలంగాణ నవల చేసేవారు. విరసం, దిగంబర కవుల ప్రస్థావనలతో తనను తాను అభ్యుదయవాదిగా చూపించుకోదల్చుకున్న రచయితకు నవాబులు నిర్మించిన ఆకాశ హర్మ్యాలే కనిపించాయి గాని, వారి పాలనలో నిరంకుశత్వం ఎక్కడా కనిపించక పోవడం విశేషం. నవాబ్ మీర్ ఆలం ఒక స్త్రీని బలవంతంగా వశం చేసుకోవడాన్ని ఆమెను కన్నెరికం చెర నుండి విముక్తి చేసినాడు అని అభివర్ణించడం రచయిత
హిపోక్రసీకి పరాకాష్ట.
ఈ పుస్తకం మొదట ప్రచురించింది జూలై 2005 లో. నాలుగు నెలలు తిరక్క ముందే వెయ్యి కాపీలు అమ్ముడుబోయి, నవంబరు 2005 లో రెండవ ముద్రణకు రావడం ఈ నవలకు కలిగిన ఆదరణను ఋజువు చేస్తుంది. పాఠకులను ఇంతగా ఆకర్షించిన నవల కావడం చేత సహజంగానే మా లిటరరీ క్లబ్ దృష్టికి వచ్చింది. పుస్తకంపై జరిగిన చర్చలో బయటకు వచ్చిన లోపాలన్నిటిని ఏకరువు పెట్టాలంటే ఇంకా ఇంత వ్రాసినా సరిపోదు. మొదటి ముద్రణకు, రెండవ ముద్రణకు మధ్యకాలంలో వచ్చిన పాఠకుల, విమర్శకుల అభిప్రాయాలు రెండవ ముద్రణలో ప్రచురించారు. ఈ అభిప్రాయాలు వ్రాసిన వారెవరూ మాలాంటి సాధారణ పాఠకులు కారు. కానీ సద్విమర్శకు తావు లేకుండా కేవలం పొగడ్తలకే పరిమితమైన ఈ అభిప్రాయాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అన్ని అభిప్రాయాలనూ ఇక్కడ ప్రస్థావించనవసరం లేదుగాని, మచ్చుకి ఒకటి. అనిశెట్టి రజిత గారు ఈ నవలను ఈ శతాబ్దపు అద్భుతమైన చారిత్రక నవల గా అభివర్ణిస్తూ, ఏ యుద్ధం ఎందుకు జరిగెనో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో, తారీఖులు దస్తావేజులు మతలబ్‌లూ కైఫీయత్‌లూ కాకుండా మనకోసం ఒక మహోజ్జ్వల చరిత్ర నిధిని వెలికి తీసిన మనవాడు రచయిత పి. లోకేశ్వర్ అన్నారు. వీరు ఈ పుస్తకమే చదివారో, లేక వేరే ఏ పుస్తకం గురించైనా కలగని వ్రాశారో అర్ధం కాదు. ఈ పుస్తకంలో మహోజ్జ్వల చరిత్ర ఎక్కడా కనబడదు. ఉన్నవన్నీ మతలబులే. కనీసం కొట్టొచ్చినట్టు కనిపించే తప్పుల్నైనా రచయిత రెండవ ముద్రణలో సవరించుకోవడానికి విమర్శకులు సహాయపడక పోవడం విచారకరం.
**************************************************
గమనిక :ఈ వ్యాసం కాపీరైట్లు DTLC వారివి.
పుస్తకం » Blog Archive » సలాం హైదరాబాద్ కథలోని వ్యథ
[…] గురించి పుస్తకం.నెట్ లో మరో సమీక్ష ఇక్కడ. (No Ratings Yet) Loading […]
పుస్తకం » Blog Archive » నేనూ తయారుచేశానొక జాబితా….
[…] మొత్తంగా ఈ ట్రైలజీ నాకిష్టం. సలాం హైద్రాబాద్ – హైదరాబాదు కథ కనుక, ఇదంటే నాకిష్టం. […]
పుస్తకం » Blog Archive » 2009 – పుస్తక నామ సంవత్సరం
[…] వెనుక కథ‘ ఆకట్టుకున్నాయి. ‘సలాం హైద్రాబాద్’ లోకేశ్వర్ రాసిన ‘తెలంగాణ […]
సుజాత
ఒక బ్లాగులో ఈ పుస్తకం గురించిన రివ్యూ చదివి కొన్నాను ఈ పుస్తకాన్ని! (ఆ తర్వాత, అన్ని రివ్యూలూ ఆధారపడదగినవి కాదని తెలిసిందనుకోండి)ఈ రివ్యూ చాలా సమంజసంగా అనిపించింది. పుస్తకం చదవడం మొదలైతే పూర్తి చేశాకే కింద పెట్టే నాకు ఈ పుస్తకం పూర్తి కావడానికి కనీసం ఇరవై రోజులు పట్టింది.
పుస్తకం త్వర త్వరగా అమ్ముడుపోవడానికి పుస్తకం పేరు కూడా దోహదం చేస్తుందేమో అనిపిస్తోంది ఈ సందర్భంలో!
నిజమే! This is the best riview I have ever read in pustakam.net. సమగ్రమైన రివ్యూ! ఎంతకంటే బాగా ఎవరూ రివ్యూ చేయలేరేమో ఇక! బ్యూటిఫుల్!
కె.మహేష్ కుమార్
నిజమే..ఈ నవల హైద్రాబాదీ నవల. తెలంగాణా నవల కాదు.
chavakiran
This is the best review till date I read on pustakam.net
I hope this helps book author in his next writings.
అరుణ పప్పు
ఇంత నిష్కర్షగా ఏ పుస్తకాన్నయినా విమర్శించే రోజు తెలుగు నేలన ఎప్పుడు వస్తుందో!